అమెరికా నీటి సరఫరా వ్యవస్థలను ఇరాన్ హ్యాక్ చేసిందా?

అమెరికా, ఇరాన్, హ్యాకింగ్, నీటి సరఫరా వ్యవస్థలు

ఫొటో సోర్స్, Win McNamee/Getty Images

    • రచయిత, అనా ఫగై
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

గతవారం అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలో 30కి పైగా నీటి సరఫరా వ్యవస్థలు (వాటర్ సిస్టమ్స్) ''సైబర్ దాడుల''ను ఎదుర్కొన్నట్లు వెల్లడించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

కొద్దిరోజుల తర్వాత, ఎఫ్‌బీఐ కూడా ఒక హెచ్చరిక చేసింది. ఏడు రాష్ట్రాల్లో ఇలాంటి సైబర్ దాడులు జరిగాయని, వాటిలో కొన్ని నీటి సరఫరా వ్యవస్థలకు ఆటంకం కలిగించాయని అందులో పేర్కొంది.

అమెరికా మీడియా ప్రకారం, మినెసోటా దాడులకు ఇరాన్‌తో సంబంధంముండే అవకాశం ఉందా? అనే కోణంలో అమెరికా సైబర్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్ఏ) విచారణ జరుపుతున్నట్లు కథనాలొచ్చాయి. అయితే, దీనిపై సీఐఎస్ఏ ఎలాంటి ప్రకటన చేయలేదు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌ను నిందించికపోయినప్పటికీ, ఈ దాడులు తెహ్రాన్ ఆధ్వర్యంలో జరిగి ఉండొచ్చని సైబర్ నిపుణులు బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, అమెరికా, నీళ్లు, యుద్ధం, ఆయుధాలు, హ్యాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

హ్యాకింగ్ వెనుక ఇరాన్ ఉందా?

సాధారణంగా ఇలాంటి దాడులు ఉత్తర కొరియా లేదా ఇరాన్ చేస్తుంటాయని అమెరికా ప్రభుత్వంలో ఉగ్రవాద వ్యతిరేక విభాగంలో మాజీ సలహాదారు మోర్గాన్ రైట్ బీబీసీతో చెప్పారు.

''ప్రస్తుతం మనం ఎవరితో సంఘర్షణలో ఉన్నాం, ఇరాన్‌తో. కాబట్టి, వాళ్లే కావొచ్చు. ఇలాంటి పని చేసే సామర్థ్యం, ఉద్దేశం రెండూ ఉన్న దేశాల జాబితాలో ఇరాన్ అగ్రస్థానంలో ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

అమెరికా దర్యాప్తు అధికారులు మరో కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఒకవేళ హ్యాకర్లు తమను ఇరాన్‌కు చెందిన వారిగా చూపించి ఉండొచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్ తెలిపింది.

ట్రంప్ యంత్రాంగం కూడా స్వయంగా సమాచార యుద్ధంలో భాగమైందని వైట్ హౌస్ మాజీ డిప్యూటీ నేషనల్ సైబర్ డైరెక్టర్ జేక్ బ్రాన్ బీబీసీతో చెప్పారు. అందువల్ల, అమెరికా నీటిసరఫరా వ్యవస్థలోకి ఇరాన్ నిజంగానే చొరబడినట్లు తేలినా ప్రభుత్వం దానిని బహిరంగంగా అంగీకరించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

గత శుక్రవారం(జులై 31) జరిగిన క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ టిమ్ వాజ్ సహా మినెసోటా అధికారులను వాటర్ హ్యాక్‌పై ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఇది అధికారుల అసమర్థతగా ఆరోపించారు.

డెమొక్రాట్ పార్టీకి చెందిన వాల్జ్ దీనిపై స్పందించారు.

ఈ దాడికి ఎవరు బాధ్యులో ట్రంప్‌కు స్పష్టంగా తెలుసని, ఇతర రాష్ట్రాలపై కూడా దాడులు జరిగినట్టు ఆయనకు తెలుసని వాల్జ్ వ్యాఖ్యానించారు.

ఈ ఘటనలపై ఇరాన్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గత కొన్నేళ్లగా నీటిసరఫరా వ్యవస్థలు, అధ్యక్ష ప్రచారాలు, ఆస్పత్రులు, 2014లో లాస్ వెగాస్‌లోని క్యాసినో కంపెనీపై జరిగిన ఇతర సైబర్ దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ పదే పదే చెబుతోంది.

న్యూయార్క్‌ నగరం వెలుపల ఉన్న ఓ డ్యామ్‌ను, అమెరికా బ్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్టు 2016లో వచ్చిన ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఇలాంటి ఆరోపణలను అమెరికా నిరూపించాలని డిమాండ్ చేశారు.

''సైబర్ ప్రపంచంలో ప్రమాదకర చర్యలకు సంబంధించి ఇరాన్‌కెప్పుడూ ఎలాంటి అజెండా లేదు. అలాంటి వాటిని సమర్థించబోం'' అని ఇరాన్ ప్రతినిధి హుస్సేన్ జబేరి అన్సారీ ప్రభుత్వ టీవీతో ఆ సమయంలో చెప్పారు.

ఇరాన్, అమెరికా, నీళ్లు, యుద్ధం, ఆయుధాలు, హ్యాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీటిసరఫరా వ్యవస్థల హ్యాకింగ్‌లో ఇరాన్ ప్రమేయంపై ట్రంప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇరాన్ ఇది చేయగలదా?

ఇరాన్‌‌కు గతంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన చరిత్ర ఉందని నిపుణులు బీబీసీతో చెప్పారు.

ఇరాన్‌కు మద్దతుగా ఉండే సంస్థలు దేశం బయట ఉంటూ ఇలాంటి వాటికి పాల్పడి ఉండొచ్చని వారు చెప్పారు.

''దీనికి ఎవరో ఒకరిని బాధ్యలను చేయడం కష్టం. ఇరాన్ వెలుపల ఉంటూ దాడులు జరిగితే వాటిని ఇరాన్‌తో ఎలా ముడిపెడతాం'' అని రైట్ అన్నారు.

దీనివల్ల అసలు నిందితులు తమపై నేరారోపణలు రాకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

''నేరుగా తమ ప్రమేయం కనిపించకుండా అలా చేస్తారు'' అని ఆయనన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్‌పై ఈ ఏడాది ఇరాన్ అనుకూల సైబర్ దాడుల్లో చాలా వాటిని నిర్వహించింది హండాలా అనే గ్రూప్ అని బీబీబీ వెరిఫై గుర్తించింది.

ఆ గ్రూప్‌కు ఇరాన్‌తో సంబంధం ఉందని అమెరికా న్యాయశాఖ తెలిపింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నిఘా, భద్రతా శాఖ తరఫున ఆ సంస్థ పనిచేస్తోందని వెల్లడించింది.

ఇరాన్ యుద్ధం తొలి రోజుల్లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈమెయిల్స్, కొన్ని వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేసినట్టు హండాలాపై గతంలో ఆరోపణలొచ్చాయి.

హండాలా సైబర్ దాడికి పాల్పడిందని జూన్ మధ్యలో అమెరికా చివరగా ఆరోపించినట్టు బీబీసీ వెరిఫై గుర్తించింది. ఇరాన్ నీటి సరఫరా వ్యవస్థ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడికి ప్రతిస్పందనగా, కాలిఫోర్నియా నీటి వ్యవస్థను హ్యాక్ చేసినట్లు హ్యాకర్లు చెప్పుకున్నారు.

ఇరాన్, అమెరికా, నీళ్లు, యుద్ధం, ఆయుధాలు, హ్యాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై గతంలోనూ హ్యాకింగ్ ఆరోపణలొచ్చాయి.

హ్యాకింగ్‌లో ఇరాన్ పేరు ఎప్పుడెప్పుడు వినిపించిందంటే...

  • 2026: ఓ వైద్య సాంకేతిక సంస్థను లక్ష్యంగా చేసుకుని హండాలా చేసిన హ్యాకింగ్ ఆపరేషన్‌ను అమెరికా న్యాయశాఖ అడ్డుకుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యానికి చెందిన వ్యక్తుల సున్నిత సమాచారం కూడా లీకైంది.
  • 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార వ్యవస్థలను హ్యాక్ చేసి దేశంలో విభేదాలు పెంచడం, ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం, అధికారుల గరించి అక్రమంగా సమాచారం సేకరించడం, దాన్ని ఇరాన్‌కు అనుకూలంగా ఉపయోగించడం వంటి చర్యలకు పాల్పడిందని ఇరాన్‌పై ఆరోపణలొచ్చాయి.
  • 2023: ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్‌జీసీ)తో సంబంధమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రూప్‌ అమెరికా వాటర్, డ్రైనేజీ సిస్టమ్స్‌ను 2023, 2024లో హ్యాక్ చేసిందని సీఐఎస్ఏ తెలిపింది. ఆ సమయంలో రెండు పెన్సిల్వేనియా పట్టణాల్లో నీటి ప్రెజర్‌ను నియంత్రించే పరికరాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
  • 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఇద్దరు ఇరాన్ పౌరులపై కేసులు నమోదయ్యాయి. వారు అమెరికా ఓటర్లకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం సేకరించి, ట్రంప్‌కు ఓటేయాలని ప్రజలకు బెదిరింపు సందేశాలు పంపినట్టు ఆరోపణలొచ్చాయి.
  • 2017: ఇరాన్ కేంద్రంగా పనిచేసే హ్యాకర్లు ఏళ్లపాటు ర్యాన్‌సమ్‌వేర్ దాడులు చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి. స్థానిక ప్రభుత్వాలు, పాఠశాలలు, ఆరోగ్యరంగం, ఆర్థిక సంస్థలను వాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలొచ్చాయి. ఆ గ్రూప్ కార్యకలాపాలు ఇరాన్ ప్రభుత్వ అనుమతితో జరిగిఉండకపోవచ్చని సీఐఎస్ఏ తెలిపింది.
ఇరాన్, అమెరికా, నీళ్లు, యుద్ధం, ఆయుధాలు, హ్యాకింగ్

ఫొటో సోర్స్, U.S. Navy via Getty Images

ఫొటో క్యాప్షన్, ఐదు నెలల క్రితం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడిచేశాయి.

నీటి సరఫరాను అడ్డుకోగలదా?

హ్యాకింగ్‌ల వల్ల నీటి సరఫరాకు ఆటంకం కలగడం ప్రమాదం కాదని, తమ నీటి భద్రతపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడం అతిపెద్ద సమస్యని నిపుణులు బీబీసీతో చెప్పారు.

''యుద్ధం విషయంలో దేశం తీవ్రంగా విభజితమై ఉన్న సమయంలో, ప్రజలకు ప్రాథమిక సేవలందించే ప్రభుత్వ సామర్థ్యంపై నమ్మకాన్ని దెబ్బతీయడమే వారి లక్ష్యం'' అని బ్రౌన్ చెప్పారు.

భవిష్యత్తులో ఓ రోజు ఇరాన్ హ్యాకర్లు అమెరికా నీటి సరఫరాను ప్రమాదంలో పడేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని నిపుణులు అంటున్నారు.

ఇలాంటి దురుద్దేశపూర్వకమైన చర్యల వల్ల హానికారక రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉందని, నీటి సరఫరా ఆగిపోవచ్చని, లేదా సామగ్రి పాడైపోవచ్చని రైట్ చెప్పారు.

సైబర్ దాడులు జల వ్యవస్థలకు తీవ్ర ఆందోళనకరమైన ముప్పు అని సీఐఎస్ఏ, అమెరికా పర్యావరణ రక్షణ సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి.

అమెరికాలో లక్ష 52 వేల ప్రభుత్వ తాగునీటి వ్యవస్థలున్నాయి. 16 వేలకు పైగా మురుగునీటి నిర్వహణ వ్యవస్థలున్నాయి.

''ఓ దేశం మెడలు వంచాలంటే రెండింటిని టార్గెట్ చేసుకుంటారు. ఒకటి విద్యుత్, రెండోది నీళ్లు'' అని రైట్ వ్యాఖ్యానించారు.

ఇరాన్, అమెరికా, నీళ్లు, యుద్ధం, ఆయుధాలు, హ్యాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భవిష్యత్తులో అమెరికా నీటి వ్యవస్థను హ్యాకింగ్ చేయగల సామర్థ్యం ఇరాన్‌కు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి దాడులను ఎలా అరికట్టవచ్చు?

తాగునీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థల్లో ఉపయోగించే అనేక పరికరాలు సులభంగా దాడులకు గురవుతున్నాయని రైట్ చెప్పారు. అవి పాత పరికరాలు అయ్యుండడమో లేదా సాంకేతికత పాతది కావడమో దీనికి కారణమని తెలిపారు.

ఈ వ్యవస్థల భద్రతను మెరుగుపరచకపోతే జాతీయ భద్రతా ముప్పును అమెరికా ఎదుర్కొంటూనే ఉంటుందని బీబీసీతో మాట్లుడుతూ నిపుణులు హెచ్చరించారు.

అమెరికాలో మెజారిటీ జల వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మిగిలిన ఇతర కీలక మౌలిక సదుపాయాల తరహాలో అవి ప్రైవేట్ రంగంలో లేవు.

ఇప్పుడు ప్రభుత్వమే ఏదైనా చేయాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.

ఈ ముప్పును నివారించేందుకు సీఐఎస్ఏ అనేక రకాల భద్రతా చర్యలను ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)