తెర మీద లాభాలు, తెర వెనక మోసాలు: విశాఖ లైబ్రేరియన్ నుంచి రూ. 52 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు...

సాల్టోరో ఇన్, సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్, విశాఖపట్నం, సైబర్ మోసం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ సలహాలు.. నకిలీ ట్రేడింగ్ యాప్‌లో కల్పిత లాభాలు.. చివరకు రూ.52 లక్షలకు పైగా మోసం. విశాఖలో వెలుగుచూసిన ఈ సైబర్ మోసం వెనుక దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో బాధితులు విశాఖవాసులు కాగా, నెట్‌వర్క్‌ను హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తూ, దుబాయ్ నుంచి నడిపించారు.

దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాకు బ్యాంక్ ఖాతాలు అందించిన నేరంపై ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

ఈ కేసులో 'మ్యూల్' బ్యాంక్ ఖాతా (మోసపూరిత సొమ్మును తరలించేందుకు ఉపయోగించే మధ్యంతర ఖాతా)లు కీలక పాత్ర పోషించినట్లు విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బీబీసీకి తెలిపారు.

పోలీసుల దర్యాప్తులో బయటపడిన అంశాలు చూస్తే, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు ఎంత ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయో తెలుస్తోంది. ఈ వివరాలను ఈ కేసును చేధించిన సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ బీబీసీకి వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సాల్టోరో ఇన్, సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్, విశాఖపట్నం, సైబర్ మోసం

ఫొటో సోర్స్, Visakhapatnam City Police

ఫొటో క్యాప్షన్, సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్

కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?

సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం, విశాఖలోని ఓ విద్యాసంస్థలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని నిందితులు వాట్సాప్ ద్వారా సంప్రదించారు.

తాము అమెరికా స్టాక్ మార్కెట్ నిపుణులమని పరిచయం చేసుకుని, 'సాల్టోరో ఇన్' (SALTORO IN) పేరుతో ఉన్న ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.

ప్రారంభంలో చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టించారు. యాప్‌లో భారీ లాభాలు వచ్చినట్లు చూపించారు. ఆ లాభాలను చూసిన బాధితుడు నమ్మి, దఫదఫాలుగా రూ.52 లక్షల వరకు పెట్టుబడి పెట్టాక నిందితులు మోసగించారు.

సాల్టోరో ఇన్, సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్, విశాఖపట్నం, సైబర్ మోసం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మోసం ఎలా చేస్తారంటే..

సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని వారికి ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్‌ గురించి చెప్పి, దాంట్లో బాధితుడు చిన్న చిన్న మొత్తాలు అంటే.. రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు పెట్టుబడి పెట్టిస్తారు.

దానికి కొన్ని రోజుల్లోనే 20 నుంచి 30 లేదా అంతకంటే ఎక్కువ రెట్లు లాభం వచ్చినట్లు చూపిస్తారు. కొన్నిసార్లు చిన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశమూ ఇస్తారు. దీంతో బాధితుడికి యాప్‌పై నమ్మకం పెరుగుతుంది.

ఆ తర్వాత 'ఇప్పుడు మంచి ఐపీవో వచ్చింది', 'ఈ షేర్ త్వరలో భారీగా పెరుగుతుంది,' వీఐపీ ప్లాన్‌లో చేరితే ఎక్కువ లాభం వస్తుంది' అంటూ లక్షలు పెట్టుబడి పెట్టేలా ఒప్పిస్తారు.

బాధితుడు డబ్బు పంపిన ప్రతిసారీ యాప్‌లో పెట్టుబడి విలువ, లాభాలు, పోర్ట్‌ఫోలియో పెరుగుతున్నట్లే కనిపిస్తాయి. కానీ, ఇవన్నీ యాప్‌లో కృత్రిమంగా సృష్టించిన అంకెలు మాత్రమే. వాస్తవంగా స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి షేర్లను కొనుగోలు చేయరు.

బాధితుడు లాభాలతో సహా డబ్బు విత్‌డ్రా చేయాలని అడిగితే, ముందుగా పన్ను కట్టాలని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని, ఆర్బీఐ క్లియరెన్స్ లేదా 'సెబీ' చార్జీల పేరుతో మరో మొత్తం పంపాలని, ఖాతా అప్‌గ్రేడ్ చేయాలని చెబుతూ ఉంటారు.

బాధితుడు ఈ మొత్తాలన్నీ చెల్లించినా డబ్బులు రావు. కొంతకాలానికి యాప్ పనిచేయడం ఆగిపోతుంది. వాట్సాప్ నంబర్లు స్విచ్ ఆఫ్ అవుతాయి లేదా గ్రూపుల నుంచి తొలగిస్తారు. ఈ కేసులో కూడా అదే జరిగింది.

ఇదే తరహాలో మరో బాధితుడి నుంచి రూ. 91,500 కాజేసినట్లు విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

సాల్టోరో ఇన్, సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్, విశాఖపట్నం, సైబర్ మోసం

ఫొటో సోర్స్, Visakhapatnam City Police

ఫొటో క్యాప్షన్, నిందితులు జాకీర్ హుస్సేన్, సయ్యద్ అలీ అబ్బాస్ హుస్సేన్ జాఫ్రీ, షేక్ యూసుఫ్

డబ్బు విదేశాలకు ఎలా చేరింది?

అయితే, ఈ కేసులో మోసం చేసిన సొమ్మును దుండగులు విదేశాలకు తరలించారు. దీనికి మ్యూల్ ఖాతాలు కీలకంగా పని చేశాయి. దర్యాప్తులో బాధితుడి ఖాతా నుంచి బదిలీ అయిన సొమ్ము వరుసగా రెండు బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.

దుబాయ్‌లో ఉన్న షైబాజ్, సులేమాన్ వంటి పరారీలో ఉన్న నిందితుల ఆదేశాల మేరకు, వీళ్లు ఈ మ్యూల్ ఖాతాలను అందించారని పోలీసులు తెలిపారు.

విచారణలో భాగంగా బ్యాంక్ లావాదేవీలు, కైవైసీ వివరాలు, మొబైల్ టవర్ లొకేషన్లు, డిజిటల్ ఆధారాలను విశ్లేషించగా తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తుల ప్రమేయం బయటపడింది. వీరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తుల బ్యాంక్ ఖాతాలను సేకరించి మ్యూల్ ఖాతాలుగా సైబర్ నేరగాళ్లకు అందించారని పోలీసులు గుర్తించారు.

ఈ ఖాతాల్లోకి వచ్చిన డబ్బును నగదుగా విత్ డ్రా చేయడం, లేదా యూపీఐ, డిమాండ్ డ్రాఫ్ట్, హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించి కమిషన్ పొందినట్లు సీఐ భవానీ ప్రసాద్ బీబీసీకి తెలిపారు.

'స్క్రీన్‌పైనే లాభాలు'

ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అలీ అబ్బాస్ హుస్సేన్ జాఫ్రీ, షేక్ యూసుఫ్, జాకీర్ హుస్సేన్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు . వీరిపై Cr.No.53/2026 U/s 112(1), 318(4), 319(2) r/w 61(2) BNS, Sec.66-C, 66-D of IT Act కింద కేసు నమోదు చేశారు.

వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో వాట్సాప్ చాట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలు లభించాయని, వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, బాధితులు పెట్టుబడి పెట్టినట్లు భావించిన డబ్బు మొబైల్, కంప్యూటర్ల స్క్రీన్లపై కనిపించడమే కానీ, వాస్తవానికి స్టాక్ మార్కెట్‌లోకి వెళ్లలేదని దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల ప్రకారం, 'సాల్టోరో ఇన్' పేరుతో ఉపయోగించిన ట్రేడింగ్ యాప్‌లో కనిపించిన లాభాలు, షేర్ ధరలు, ఐపీవోలు అలాట్‌మెంట్లు అన్నీ కృత్రిమంగా చూపించినవే. బాధితులు పంపిన డబ్బు నేరుగా మ్యూల్ బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లి, అక్కడి నుంచి ఇతర ఖాతాలు, హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించారు.

తమ దర్యాప్తు ప్రకారం 'సాల్టోరో ఇన్' పేరుతో ఉన్న ట్రేడింగ్ యాప్‌ను ఉపయోగించి బాధితులకు తప్పుడు లాభాలు చూపిస్తూ పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తించామని సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ బీబీసీకి తెలిపారు.

యాప్‌లో కనిపించిన లాభాలు వాస్తవ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా వచ్చినవి కావని దర్యాప్తులో తేలిందని చెప్పారు . స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత యాప్ లేదా బ్రోకర్‌కు అవసరమైన అనుమతులు, నమోదులు ఉన్నాయో లేదో ధ్రువీకరించుకోవాలని, అవసరమైతే ఈ రంగంలోని నిపుణుల సలహా తీసుకోవాలని ఆయన సూచించారు.

సాల్టోరో ఇన్, సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్, విశాఖపట్నం, సైబర్ మోసం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అసలు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే?

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు కేవలం ఒక యాప్ డౌన్‌లోడ్ చేస్తే సరిపోదు. దీనికి అనేక నిబంధనలను ముందుగా సరిచూసుకోవాలని స్టాక్ మార్కెట్ రంగంలో 20 ఏళ్లు అనుభవమున్న లక్ష్మీనారాయణ బీబీసీతో చెప్పారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం, యాప్ ఎక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేస్తున్నారనేది ముందుగా చూసుకోండి. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో ఈ యాప్ ఉందా లేదా చూసుకోండి. కొత్త యాప్‌లు, తక్కువ డౌన్ లోడ్ ఉన్న యాప్‌ల విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. అలాగే ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో ఉండటం మాత్రమే యాప్ సురక్షితమని హామీ కాదని తెలుసుకోండి. ఆ యాప్ 'సెబీ'-రిజిస్టర్డ్ సంస్థదేనా అనేది కూడా తప్పనిసరిగా చెక్ చేయండి. దీనిని 'సెబీ' వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలి.

'సెబీ' వద్ద నమోదైన బ్రోకర్ ద్వారా ట్రేడింగ్ అకౌంట్ తెరవాలి.

ఎన్ఎస్‌డీఎల్ లేదా సీడీఎస్ఎల్‌తో అనుసంధానమైన డీమ్యాట్ అకౌంట్ ఉండాలి.

పాన్, కేవైసీ వంటి ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి.

పెట్టుబడి మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు కాకుండా, అధికారిక బ్రోకరేజ్ బ్యాంక్ ఖాతాకే పంపాలి.

"మోసపూరిత యాప్‌లలో ఈ ప్రక్రియ ఏదీ ఉండదు. ఎందుకంటే అసలు షేర్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ జరగవు. వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపమని అడిగితే దాన్ని మోసంగానే గ్రహించాలి" అని లక్ష్మీనారాయణ తెలిపారు.

భారత్‌లో పెట్టుబడి సలహాలు ఇచ్చే సంస్థలు లేదా వ్యక్తులు 'సెబీ' వద్ద నమోదై ఉండాలి. రిజిస్ట్రేషన్ లేని యాప్‌లు లేదా వ్యక్తులు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో డబ్బు సేకరిస్తే అది చట్టవిరుద్ధం కావచ్చు. అలాగే 'ప్రీ-ఐపీవో', 'ఇన్‌సైడర్ ఐపీవో', 'గ్యారంటీ లాభాలు' వంటి పేర్లతో వచ్చే ప్రకటనల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు అవసరం..

విశాఖలో స్టాక్ మార్కెట్ పేరుతో జరిగిన మోసం సందర్భంగా ప్రజలకు పోలీసులు కొన్ని సూచనలు చేశారు.

"వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దు. 'సెబీ' అనుమతి లేని ట్రేడింగ్ యాప్‌లలో పెట్టుబడులు పెట్టవద్దు. తక్కువ సమయంలో భారీ లాభాలు' అనే ప్రకటనలను నమ్మవద్దు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి."

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)