‘‘నీకేమైనా తిక్కా, అవకాడో సాగు చేస్తున్నావు అన్నారు..కానీ, ప్రధాని మోదీ నోటి నుంచి నా పేరు రావడం మరిచిపోలేనిది’’

వరదారెడ్డి
ఫొటో క్యాప్షన్, అవకాడో సాగులో నాలుగేళ్ల తరువాత విజయం సాధించానని రైతు వరదా రెడ్డి చెప్పారు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

'ఆలిండియా రేడియో వాళ్లు ఫోన్ చేసి రేడియోలో ప్రధానమంత్రి మీ పేరు చెబుతారు అంటే నమ్మలేదు నేను. మోదీ నోటినుంచీ నా పేరు రావడం నా కుటుంబం మరిచిపోలేనిది' అన్నారు అవకాడో రైతు వరదా రెడ్డి.

'ఈ మధ్య అవకాడో చాలా ట్రెండ్‌లో ఉంది. మన రైతులకు కూడా ఇది చాలా సాయపడుతోంది’’ అంటూ తన ప్రసంగంలో అవకాడో సాగు గురించి మాట్లాడిన ప్రధాని..అందుకు ఉదాహరణగా పేర్కొన్న రైతుల పేర్లలో వరదారెడ్డి పేరు కూడా చెప్పారు

వరదా రెడ్డిది ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వెదర్ల గ్రామం.

ఆగస్ట్ 30న 137వ ఎడిషన్ మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ప్రసిద్ధి చెందుతున్న అవకాడో గురించి మాట్లాడారు.

‘‘ఈ మధ్య ఆవకాడో చాలా ట్రెండ్‌లో ఉంది. దాని గురించి మొదట పెద్దగా ఎవరికీ తెలీదు.. దాని వాల్యూ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అది డైనింగ్ టేబుల్ మీద ఎక్కువగా కనిపిస్తోంది’’ అన్నారు మోదీ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘మన రైతు సోదర సోదరీమణులకు కూడా ఇది చాలా సాయం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కడపకు చెందిన వరద రాజ్ దానికి ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలంలో టమాటా, అరటి సాగు చేసేవారు. అవకాడో గురించి తెలుసుకుని సాగు చేశారు. ఇప్పటివరకూ ఆయన సుమారు 4 టన్నుల అవకాడో ఉత్పత్తి చేశారు’’ అని మోదీ చెప్పారు.

‘‘మీ పేరు మన్‌ కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించనున్నారని ఆలిండియా రేడియో నుంచి నాకు ఫోన్ వచ్చింది. ప్రధాని అవకాడో సాగు గురించి చెబుతూ కడపకు చెందిన వరద రాజ్ అని చెప్పింది నా గురించే’’ అని వరదా రెడ్డి బీబీసీకి చెప్పారు.

'ఆయన్ను ప్రోత్సహించాం. కడప జిల్లాలో నలుగురు అవకాడో రైతులు ఉన్నప్పటికీ పంట చేతికి వచ్చింది మాత్రం వరదా రెడ్డిదే'' అని కడప జిల్లా హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ రవిచంద్ర బాబు బీబీసీతో చెప్పారు.

ఆవకాడో సాగు
ఫొటో క్యాప్షన్, స్థానిక వాతావరణానికి తగిన అవకాడో రకాన్ని ఎంచుకోవాలని రైతు వరదారెడ్డి చెప్పారు

ఎవరీ వరదారెడ్డి

కడపజిల్లా లింగాల మండలం వెదర్ల గ్రామానికి చెందిన వరదారెడ్డి కొత్త పంటల కోసం యూట్యూబ్‌లో వెతికి, కర్ణాటకలో అవకాడో పండిస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూశానని, ఆ తర్వాత తాను కూడా పండించాలని నిర్ణయం తీసుకున్నానని వరదారెడ్డి చెప్పారు.

కడపజిల్లా లింగాల నుంచి అనంతపురం జిల్లా బత్తలపల్లికి వెళ్లే దారిలో ఉంటుంది వరదా రెడ్డి అవకాడో తోట.

కరవు ప్రాంతమైన రాయలసీమలో వరదారెడ్డి అవకాడో ఎలా పండిస్తున్నారో తెలుసుకోడానికి బీబీసీ నేరుగా ఆయనతోనే మాట్లాడింది.

తన పొలంలో 2022 డిసెంబర్‌లో అవకాడో సాగు ప్రారంభించారు వరదారెడ్డి. కర్ణాటకలోని ఐఏహెచ్ఆర్, మడికేరి కూర్గు ప్రాంతంలో అగ్రికల్చర్ విభాగం అభివృద్ధి చేసిన మొక్కలను తీసుకొచ్చి నాటానని చెప్పారు.

వ్యవసాయ శాఖ సలహాతో ధైర్యం చేసి పంట పెట్టానని ఇప్పుడు మంచి దిగుబడి సాధిస్తున్నానని చెప్పారు.

‘‘మన నేలకు అనుకూలమైన మొక్కను తెచ్చుకోవాలి. ప్రపంచంలో దాదాపు 372 రకాల అవకాడో మొక్కలు ఉన్నాయని తెలిసింది. అందులో మన వాతావరణానికి ఏది అనుకూలమో దాన్నే ఎంచుకోవాలి. అలా మన వాతావరణానికి తగినట్టుగా వ్యవసాయ శాఖ ఎంపిక చేసిన మొక్కను తెచ్చుకొని సాగు చేశా’’ అని చెప్పారు.

వ్యవసాయం
ఫొటో క్యాప్షన్, అవకాడోకు ఇటీవల డిమాండ్ పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు

తొలుత కష్టాల సాగే..

మొదట్లో అవకాడో సాగులో కష్టాలు ఎదురయ్యాయని తెలిపారు వరదా రెడ్డి.

'వాతావరణం అనుకూలించకపోవడం ఒక్కసారిగా విపరీతమైన ఎండలు, వర్షాలు ఎక్కువ , తక్కువ పడడం, విపరీతమైన గాలులతో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. అంత ఈజీగా అయితే అవకాడో పంట చేతికి రాలేదు. చాలా కష్టపడ్డా' అని ఆయన చెప్పారు.

‘‘ఒక దశలో ఈ పంట మన వల్ల కాదు, చెట్లన్నీ కొట్టేసి, మళ్లీ అరటి వేసుకుందాం అనిపించింది’’ అని వరదా రెడ్డి పేర్కొన్నారు.

‘‘కానీ రెండేళ్లు చూద్దాం అనుకున్నా. తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి’’ ఆయన అన్నారు.

'ఆరు నెలల నుంచి దాదాపు ఏడాదిపాటు కష్టాలు పడ్డా. ఒకసారి 300 మొక్కలు తెస్తే అందులో 100 మొక్కలు చనిపోయాయి. మళ్లీ అక్కడికి వెళ్లి మొక్కలు తెచ్చుకున్నా. ఈసారి 100 మొక్కలు తెస్తే 20 పోయాయి. అయినా ఇంకోసారి అక్కడికి వెళ్లి తెచ్చి వేశాను. ఇప్పుడు సాగు మొదలుపెట్టి నాలుగేళ్లవుతోంది’

2025లో కూడా పూత వచ్చింది. అక్కడక్కడ 150 మొక్కలకు పూత వచ్చింది. ఆ పూతంతా తెలీకుండానే రాలిపోయింది. నీళ్లు పెట్టాను, స్ప్రే చేశాను. కానీ ఎలాంటి ఫలితాలూ లేవు.

‘‘మన వాతావరణానికి ఇది పనికిరాదేమో అని చెప్పి వదిలేశా. ఇక చెట్లు కొట్టేసి, అరటి పెడదాం అనుకున్నా. కానీ ఇంకొన్ని నెలలు చూద్దామనుకున్నా. కానీ నాలుగో సంవత్సరం పూత వచ్చాక సమస్య పరిష్కారమైందనిపించింది. పంటపై ఎటువంటి స్ప్రే చేయలేదు. మంచి ఫలితాలు వచ్చాయి. నాలుగు టన్నుల దిగుబడి వచ్చింది. కిలో వంద రూపాయల చొప్పున తోటలోనే అమ్మేశా' అని ఆయన వివరించారు.

వరదారెడ్డి భార్య ప్రమీల
ఫొటో క్యాప్షన్, వరదారెడ్డి భార్య ప్రమీల

'నువ్వు తిక్కలోడివి అన్నారు'

ప్రస్తుతం అవకాడో హైదరాబాద్ మార్కెట్లో కిలో సుమారు రూ.350, చెన్నైలో కిలో సుమారు రూ.250 పలుకుతోందని వరదారెడ్డి చెప్పారు.

తను తోటలో కిలో రూ.100కే అమ్మడంతో చాలా మంది నేరుగా వచ్చి పండ్లు కొనుక్కెళ్లారని తెలిపారు. లేబర్ ఖర్చు లేకుండా తానే కోసి, తూకం వేసి అమ్మానని చెప్పారు.

'రైతులకు ఊరట కలిగించే విషయం ఏమిటంటే కాయ సిద్ధమైనా కూడా రెండు నెలలు చెట్టు మీదే ఉంచవచ్చు. అవి మాగిపోకుండా ఉంటాయి. ఎప్పుడూ చేసుకునే వ్యవసాయంతో జీవితంలో ముందుకు వెళ్లలేం. అందుకే కొత్తగా ప్రయత్నించాలనుకున్నా’’ అన్నారు వరదా రెడ్డి.

‘‘ఒడిదుడుకులు వచ్చాయి. ఇంట్లో వాళ్లు వద్దని చెప్పినా, పరిస్థితులు బాలేవు.. బయట వాళ్ళ మాటలు వినొద్దని వారించినా నేను వినిపించుకోలేదు. కొందరు నువ్వు తిక్కలోడివి అవకాడో పెట్టావు, అరటి పెట్టి ఎంతోమంది డబ్బు సంపాదిస్తున్నారు. అవకాడో ఎందుకు అన్నారు. అలాంటి వాళ్లే ఈరోజు గొప్పగా మాట్లాడుతున్నారు. నా సక్సెస్ వారి కళ్లకు కనిపిస్తోంది’’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

అవకాడో పంట సాగులో తాము ఎలాంటి రసాయనాలు వాడలేదని, సహజంగా పండించామని వరదారెడ్డి భార్య ప్రమీల చెప్పారు.

'వర్షాకాలంలో అయితే చెట్టు బాగా పెరుగుతుంది. తక్కువ మందులు వేశాం. ఎక్కువ రసాయనాలు వాడలేదు. అంతా సహజంగా పండించాం. కాపు అయితే చాలా బాగా వచ్చింది. తరువాత వచ్చే కాపు ఇంకా బాగా వస్తుంది. పశువుల ఎరువు, డీఏపీలాంటివి వాడాం. ఎక్కువ మందులు ఏమి వేయలేదు'' అని ఆమె తెలిపారు.

వరదారెడ్డి అవకాడో సాగును చాలా మంది రైతులు నిరుత్సాహపరిచారని, అయినా ఎంతో సహనంతో పంట పెట్టి విజయం సాధించారని, ఇప్పుడు మిగిలినవారు కూడా ఆసక్తి చూపుతున్నారని స్థానిక రైతు చంద్రశేఖర్ నాయుడు చెప్పారు.

‘‘హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ అవకాడోకు సబ్సీడీ ఇస్తుందని కొత్త పంటలను కూడా ప్రోత్సహిస్తుందని’’ కడప జిల్లా హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ రవిచంద్ర బాబు బీబీసీతో చెప్పారు.

'ఆయన్ను ప్రోత్సహించాం. నలుగురు అవకాడో రైతులు కడప జిల్లాలో ఉన్నప్పటికీ పంట చేతికి వచ్చింది మాత్రం వరదా రెడ్డిదే''అని ఆయన అన్నారు.

చెట్లు
ఫొటో క్యాప్షన్, ఏడాది వయసున్న మొక్కలను నాటితే మంచి ఫలితాలు సాధించవచ్చని గ్రహించానని చెప్పారు వరదా రెడ్డి

ఎలా సాగు చేయాలి

అవకాడో పంట నిర్వహణా తీరుతెన్నులను వరదారెడ్డి వివరించారు.

అవకాడో సాగుకు లేత మొక్కలు కాకుండా ఏడాది వయసున్న మొక్కలను తెచ్చుకోవాలని, వేర్లు బాగా వచ్చిన మొక్కలు ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా తట్టుకుని బతకగలుగుతాయని చెప్పారు.

'వాళ్లు ముందు మనకు ఆరు నెలల మొక్కలు ఇస్తారు. వాటికి కాండం చాలా చిన్నగా ఉంటుంది. అప్పుడుచాలా ఇబ్బంది పడ్డాను. చిన్న సైజు మొక్కలు తెచ్చుకోవడం వల్ల అవి గాలికి, వేడి గాలులకు తట్టుకోలేకపోయాయి. తర్వాత సమస్యేంటో తెలుసుకున్నా. కొంచెం ముదురు మొక్క అయితే బాగుంటుందని సొంతంగా కవర్లో పెట్టి వాటిని పెంచి తర్వాత ప్లాంటేషన్ చేశా.

దీనికి నీళ్లు, కొత్త మట్టి కంటిన్యూగా ఇస్తూ ఉంటే పంట ఏ సమస్యా లేకుండా బతుకుతుంది. కొత్త పంట, కొత్త నేల కాబట్టి ఇంతవరకు వ్యాధులు, పురుగు తినడం లాంటి సమస్యలు ఏమీ కనిపించలేదు. అందులో వెరైటీని బట్టి మొక్క ఎదుగుదల ఉంటుంది. మన నేలకు ఏ వెరైటీ అనుకూలంగా ఉంటుందో ముందు తెలుసుకోవాలి' అని వరదారెడ్డి సూచించారు.

'ఇందులో ప్రధాన సమస్య పండు ఈగ. ఒక నెలలో కాయ కోస్తామనే సమయంలో పండు ఈగ ప్రభావం పడుతుంది. ఇలాంటి సమస్య ప్రతి పంటలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది' అని వివరించారు.

'ఇది ఏడాదికి ఒకసారి మాత్రమే దిగుబడి ఇస్తుంది. అది కూడా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడైనా పూత రావచ్చు. దానికి ముందే సన్నద్ధం అయి ఉండాలి. రైతు దానికి ఎరువులు, నీళ్లు పెట్టుకుంటూ చూసుకోవాలి' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)