తాజ్‌‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్‌ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?

తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ మహల్, మొఘల్ సామ్రాజ్యం, రాజు-రాణి, ఆగ్రా, చరిత్ర, సమాధి, జహంగీర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, విలేఖరి, పరిశోధకులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

అది 1631 జూన్ 17వ తేదీ. దక్కన్‌‌లోని మొఘల్ సామ్రాజ్య ప్రధాన కేంద్రం బుర్హాన్‌పూర్‌‌లో మండుటెండ నిప్పులు చిమ్ముతోంది. అదే పట్టణంలో ఐదో మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు ప్రియాతి ప్రియమైన రాణి ముంతాజ్ మహల్ పద్నాలుగోసారి ప్రసవ వేదనను అనుభవిస్తోంది.

19 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆ రాజదంపతులకు అప్పటికే 13సార్లు సంతానం కలిగింది. వీరిలో ఏడుగురు చిన్న వయసులోనే మరణించారు.

బతికి ఉన్న ఆరుగురు పిల్లల్లో జహనారా పెద్దది. అప్పటికి ఆమె వయస్సు 17 సంవత్సరాలు. తల్లి ప్రసవం సమయంలో ఆమె అక్కడే ఉన్నారు.

రాజవైద్యులు, మంత్రసానులు కూడా అక్కడే ఉన్నారు. 17 ఏళ్ల జహనారా అంతకుముందు కూడా తన తల్లి ప్రసవాలప్పుడు పక్కనే ఉన్నారు.

అయితే పద్నాలుగో సంతానం పుట్టే సమయంలో ఏదో తప్పు జరిగింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రసిద్ధ గ్రీకు వైద్యుడు గాలెన్ సిద్ధాంతాల ప్రభావంతో మొఘల్ వైద్యులు మానవ శరీరాన్ని నాలుగు రకాల ద్రవాలు లేదా మూలకాల సమ్మేళనంగా భావించేవారు. వాటి మధ్య సమతుల్యతే ఆరోగ్యానికి ఆధారమని వారు విశ్వసించేవారని సుప్రియా గాంధీ తన 'ది ఎంపరర్ హూ నెవర్ వాజ్: దారా షికో ఇన్ మొఘల్ ఇండియా' పుస్తకంలో పేర్కొన్నారు.

ఈ ప్రకారం ముంతాజ్ మహల్ శరీరంలోని ఆ సమతుల్యత వేగంగా దెబ్బతింటోంది.

దాదాపు 30 గంటల పురిటి నొప్పుల తర్వాత ముంతాజ్ మహల్ ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు. అయితే తర్వాత ఆమెకు తీవ్రమైన రక్తస్రావం మొదలై ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించింది.

ఆధునిక వైద్యశాస్త్రంలో 'పోస్ట్‌పార్టమ్ హెమరేజ్'గా పిలిచే ‘ప్రసవానంతర అధిక రక్తస్రావం’ అనే సమస్యకు ఆమె గురై ఉండవచ్చని భావిస్తున్నారు.

తీవ్ర నొప్పులతో బాధపడుతున్న ముంతాజ్ మహల్, ‘మీ నాన్నను పిలువు’ అని జహనారాను కోరారు.

విషాదంలో మునిగిపోయిన షాజహాన్ వెంటనే వచ్చి ఆమె పడక పక్కన కూర్చున్నారు. ఇతర పిల్లలు ఆమె దగ్గరకు వెళ్లలేకపోయారు. ‘ పిల్లలను, మీ తల్లిని మీరే చూసుకోవాలి’ చక్రవర్తిని కోరారు ముంతాజ్ మహల్. 38 ఏళ్ల వయసులో ఆమె మరణించారు.

తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ మహల్, మొఘల్ సామ్రాజ్యం, రాజు-రాణి, ఆగ్రా, చరిత్ర, సమాధి, జహంగీర్

ఫొటో సోర్స్, Getty Images

షాజహాన్, ముంతాజ్ మహల్‌ల వివాహం 1612లో జరిగింది. అప్పటికి షాజహాన్ అసలు పేరు యువరాజు ఖుర్రం కాగా, ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జుమంద్ బాను బేగం.

వివాహం జరిగిన కొద్ది కాలానికే అర్జుమంద్ బాను బేగంకు 'ముంతాజ్ మహల్' అనే బిరుదు ఇచ్చారు యువరాజు ఖుర్రం. దీనర్థం 'అంతఃపురంలో అత్యంత ప్రియమైన మహిళ' అని.

చరిత్రకారుల ప్రకారం ముంతాజ్ మహల్, షాజహాన్ దాంపత్య జీవితం ప్రేమానురాగాలతో నిండిపోయింది.

సింహాసనాన్ని అధిష్ఠించిన(1628లో) అనంతరం ముంతాజ్ మహల్‌కు 'పాద్‌షా బేగం', 'మాలికా-ఏ-జహాన్' 'మాలికా-ఏ-జమానీ' 'మాలికా-ఏ-హిందుస్తాన్' బిరుదులను ప్రదానం చేశారు షాజహాన్. ఆమెకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు.

అర్జుమంద్ బానుతో వివాహానికి ముందు, తర్వాత షాజహాన్ మరో రెండు వివాహాలు చేసుకున్నారు. అవి రాజకీయ కూటముల కోసం జరిగినవని ఆస్థాన చరిత్రకారులు పేర్కొన్నారు. ఆ వివాహాల ద్వారా ఒక్కో సంతానం కలిగిందని అలిసన్ బ్యాంక్స్ ఫిండ్లీ రచించిన 'నూర్ జహాన్: ఎంప్రెస్ ఆఫ్ మొఘల్ ఇండియా' పుస్తకంలో ఉంది.

అయితే ఇతర రాణుల నివాసాల కంటే 'ఖాస్ మహల్' అత్యంత వైభవంగా ఉండేది. ముంతాజ్ మహల్ అక్కడే షాజహాన్‌తో నివసించారు. బంగారం, విలువైన రత్నాలతో అలంకరించిన ఈ భవనంలో గులాబీ నీళ్ల ఫౌంటెన్లు ఉండేవి.

మొఘల్ చక్రవర్తి భార్యలందరికీ నెలవారీ భత్యం ఉండేది. అందులో అత్యధికంగా సంవత్సరానికి పది లక్షల రూపాయలను ముంతాజ్ మహల్‌కు ఇచ్చారు షాజహాన్. అదనంగా అనేక ఆస్తులను కూడా ఆమెకు పేరిట రాశారు.

పాలన, వ్యక్తిగత విషయాల్లో షాజహాన్‌కు ముంతాజ్ మహల్ అత్యంత సన్నిహితురాలు, విశ్వసనీయమైన సలహాదారుగా వ్యవహరించేవారు.

ముంతాజ్ మహల్ కూడా తన అత్త నూర్ జహాన్ మాదిరిగానే వ్యక్తిగత, బహిరంగ దర్బార్లకు చక్రవర్తితో పాటు హాజరయ్యేవారని పేర్కొన్నారు.

ఆమె తెర వెనుక కూర్చుని ఉండేవారు. ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయం ఉంటే ఎవరికీ కనిపించకుండా రాజు వీపుపై చేయి ఉంచేవారు. ఆమె సిఫారసుపై చక్రవర్తి శత్రువులను క్షమించేవారు లేదా మరణశిక్షలను తగ్గించేవారు.

చరిత్రకారుల ప్రకారం రాజాజ్ఞలను ధ్రువీకరించేందుకు ఉపయోగించే రాజముద్రను కూడా షాజహాన్ ఆమెకు అప్పగించారు. ఆమె అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునేవారు కాదని చెబుతుంటారు.

తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ మహల్, మొఘల్ సామ్రాజ్యం, రాజు-రాణి, ఆగ్రా, చరిత్ర, సమాధి, జహంగీర్

ఫొటో సోర్స్, Getty Images

ముంతాజ్ మహల్ రాజకీయ అధికారాన్ని కోరుకోలేదు. కానీ పేదలు, నిరాశ్రయులకు సహాయం చేయడానికి తన పరపతిని ఉపయోగించేవారు.

చరిత్రకారిణి సుప్రియా గాంధీ ప్రకారం ఖందేశ్‌లోని మరాఠీ మాట్లాడే ఎరండోల్ ప్రాంత అధికారులకు ముంతాజ్ మహల్ జారీ చేసిన ఉత్తర్వు ఇప్పటికీ అందుబాటులో ఉంది.

ఆమె కొత్త దేశ్‌ముఖ్ కనోజీని పదవికి ధ్రువీకరిస్తూ ప్రజల సంక్షేమాన్ని చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు చక్రవర్తిపట్ల కృతజ్ఞతతో ఉండేలా చూడాలని సూచించారు.

ఈ ఉత్తర్వు రాణి జారీ చేసిన అనేక అధికారిక ఆదేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఆమె విశ్వసనీయ సహాయకురాలు సతీ-ఉల్-నిసా రాజముద్ర సంరక్షకురాలిగా పనిచేశారు.

సతీ-ఉల్-నిసా మహిళల వినతులను పరిశీలించి అర్హులైన వారి అభ్యర్థనలను ఎంపిక చేసేవారు. ముంతాజ్ మహల్ వాటిని చక్రవర్తి దృష్టికి తీసుకెళ్లేవారు. మరణశిక్షల కేసుల్లో కూడా ఆమె జోక్యం చేసుకుని అనేక మందికి క్షమాభిక్షలను ఇప్పించారు.

రాజాస్థాన చరిత్రకారులు వారి అనుబంధాన్ని అత్యంత అసాధారణమైనదిగా అభివర్ణించారు. రాజదంపతుల వ్యక్తిగత జీవితానికి సాధారణంగా ఉండే పరిమితులను దాటి వారి భావోద్వేగ, వైవాహిక బంధాన్ని వివరించారు.

షాజహాన్ మొదట్లో చేసిన సైనిక యాత్రలతో మొదలు, తన తండ్రి జహంగీర్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సమయంలోనూ ముంతాజ్ మహల్ ఆయన వెంటే ఉన్నారు.

బుర్హాన్‌పూర్‌లో కూడా తిరుగుబాటును అణచివేసేందుకు చక్రవర్తి ఉన్న ప్రాంతానికి సమీపంలోనే రాణి విలాసవంతమైన గుడారాన్ని ఏర్పాటు చేశారు.

ముంతాజ్‌ మహల్ మరణంతో షాజహాన్ తీవ్రవేదనకు గురయ్యారంటూ ఆస్థాన చరిత్రకారులు ఆయన దుఃఖాన్ని విస్తృతంగా వర్ణించారు.

షాజహాన్ ఆస్థాన చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ 'పాద్‌షా నామా'లో ఇలా రాశారు. "చీకటిని ఎన్నడూ చూడని సూర్యుడిలా ఉన్న చక్రవర్తి హృదయం, నిట్టూర్పుల ఆవిరికి కన్నీటి తేమతో తుప్పుపట్టి మసకబారిపోయింది"

ముంతాజ్ మహల్ మరణానంతరం షాజహాన్ తెల్లని దుస్తులు ధరించారు. యువరాజులు, ఆస్థానికులు, సేవకులు కూడా అలాంటి వస్త్రాలే ధరించారు.

ఒకవారం పాటు షాజహాన్ ప్రజల ముందుకు రాలేదు. రాజకార్యాలను కూడా నిర్వహించలేదు. భార్య మరణానికి ముందు ఆయన తలపై ఇరవై తెల్ల వెంట్రుకలు మాత్రమే ఉండేవని, అనంతరం అవి గణనీయంగా పెరిగాయని చరిత్రకారులు పేర్కొన్నారు. చాలా కాలం పాటు ఆయన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.

అప్పటికి 16 ఏళ్ల వయసున్న దారా షికో, తపతీ నది ఒడ్డున జైనాబాద్ ఉద్యానవనాల్లో జరిగిన తన తల్లి ముంతాజ్‌ అంత్యక్రియలను చూశారు. షాజహాన్ ప్రతి శుక్రవారం ఆ సమాధిని సందర్శించేవారు. దారా షికో, ఆయన సోదరులు కూడా ఆయనతో వెళ్లేవారని భావిస్తున్నారు.

రాజు దుఃఖాన్ని కవి కలీమ్ ఇలా వర్ణించారు. "ఆ సమాధిపై ఆయన నీడ పడగానే ఆయన కన్నీటి చుక్కలు కఫన్‌ను తడిపేసేవి"

అయితే సుప్రియా గాంధీ ప్రకారం ముంతాజ్ మహల్‌కు బుర్హాన్‌పూర్‌ను శాశ్వత సమాధి స్థలంగా షాజహాన్ ఎప్పుడూ భావించలేదు. ఆగ్రాలో యమునా నది తీరంలోని అందమైన ప్రదేశంపై ఆయన దృష్టి ఉండేది.

రాజాధికారాన్ని ఉపయోగించి రాజా జైసింగ్ నుంచి ఆ భూమిని షాజహాన్ స్వాధీనం చేసుకున్నారు. బదులుగా ఆయనకు నాలుగు విలాసవంతమైన భవనాలను అందించారు.

ముంతాజ్ మహల్ మృతదేహాన్ని 1631 డిసెంబర్‌ నెలలో వెలికితీసి ఆగ్రాకు తరలించారు. కుమారుడు షుజా అంత్యయాత్రలో పాల్గొన్నారు. సతీ-ఉల్-నిసా కూడా వారితో వెళ్లారు.

ప్రయాణ మార్గంలో నాణేలు, ఆహారం పంపిణీ చేసినట్లు సుప్రియా గాంధీ పేర్కొన్నారు. ఆగ్రాకు చేరుకున్న తర్వాత సమాధిపై చిన్న గుమ్మటాన్ని నిర్మించారు.

తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ మహల్, మొఘల్ సామ్రాజ్యం, రాజు-రాణి, ఆగ్రా, చరిత్ర, సమాధి, జహంగీర్

ఫొటో సోర్స్, Getty Images

విషాదంలో మునిగిపోయిన షాజహాన్ అనంతరం ఒక గొప్ప సమాధి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దానికి తాజ్ మహల్ అని పేరు పెట్టారు. యవ్వనం నుంచే ఆయనకు వాస్తుశాస్త్రంపై ఆసక్తి ఉండేది.

ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ రాసిన దాని ప్రకారం దీనికోసం 20 వేల మంది కార్మికులు, వెయ్యి ఏనుగులు పనిచేశాయి.

తాజ్ మహల్ నిర్మాణం 22 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ కాలంలో దీని వ్యయం 50 లక్షల రూపాయలకు చేరుకుంది. దీని వల్ల మొఘల్ ఖజానాపై భారీ భారం పడింది.

ఈవా ఫెర్నాండెజ్ డెల్ కాంపో ప్రకారం తాజ్ మహల్ నిర్మాణంలో షాజహాన్ ఎంతగా మునిగిపోయారంటే ఆయన ఇతర రాజ్య వ్యవహారాలను పట్టించుకోవడం మానేశారు.

ఔరంగజేబ్ 1658లో తన తండ్రి నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకుని, తన ముగ్గురు సోదరులను హతమార్చాడు. ఆగ్రా కోటలో షాజహాన్‌ను నిర్బంధించారు. 1666లో మరణించే వరకు ఆయన అక్కడే ఉన్నారు.

తనకోసం కూడా నల్లరాతితో ఒక సమాధిని నిర్మించాలని షాజహాన్ ఆలోచించారని, దానిని ఒక వంతెన ద్వారా తాజ్ మహల్‌తో అనుసంధానించాలని భావించారని చెబుతారు.

ఈ ఆలోచనను 1665లో ఫ్రెంచ్ యాత్రికుడు జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ తన రచనల్లో ప్రస్తావించారు. అయితే ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారుల్లో చాలామంది దీనిని కేవలం ఒక వదంతిగానే పరిగణిస్తున్నారు.

తాజ్ మహల్‌లోని షాజహాన్ సమాధిని ముంతాజ్ మహల్ సమాధిలా మధ్యలో కాకుండా పక్కన నిర్మించారు

ఈ అసమాన అమరిక కారణంగా కొందరు షాజహాన్ సమాధిని వేరే ప్రదేశంలో నిర్మించాలని భావించారని అంటారు.

అయితే, తాజ్‌మహల్ పూర్తిగా ముంతాజ్ మహల్‌కే అంకితం, ఆమె కోసమే నిర్మితమైంది,. షాజహాన్ మరణానంతరం ఆమె పక్కనే ఆయన్ను కూడా అక్కడే ఖననం చేసారు. అందుకే ఆయన సమాధి మధ్యలో ఉండదు.

ఆర్.నాథ్ తన వ్యాసంలో తాజ్‌మహల్ 1648లో పూర్తయిందని పేర్కొన్నారు. వేరే ప్రణాళిక గనక ఉండి ఉంటే దానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉండేవని, సమకాలీన పర్షియన్ చరిత్రకారులు కూడా దానిని ప్రస్తావించి ఉండేవారని ఆయన పేర్కొన్నారు.

తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ మహల్, మొఘల్ సామ్రాజ్యం, రాజు-రాణి, ఆగ్రా, చరిత్ర, సమాధి, జహంగీర్

ఫొటో సోర్స్, Getty Images

మద్రాస్ కొరియర్ ‘‘తాజ్ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారనీ, వాస్తవానికి అది తల్లుల ఆరోగ్యం ప్రాధాన్యతను గుర్తు చేసే స్మారకంగా ఉండాలని’’ పేర్కొంది.

ముంతాజ్ మహల్ షాజహాన్‌కు అత్యంత ప్రియమైన భార్య. ఆచరణలో దీనర్థం ఆమె 14 సార్లు గర్భవతి కావాల్సి వచ్చిందని పేర్కొంది. వైవాహిక జీవితంలో దాదాపు ప్రతి ఏడాది ఆమె గర్భం దాల్చారు.

అనంత్ కుమార్ తన 'మాన్యుమెంట్ ఆఫ్ లవ్ అండ్ సింబల్ ఆఫ్ మేటర్నల్ డెత్' అనే వ్యాసంలో, ఆమె తరచూ గర్భం దాల్చడం వలన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది, చివరికి ఆమె మరణానికి దారితీసిందని పేర్కొన్నారు.

మరోవైపు, 17వ శతాబ్దపు స్వీడన్‌లో రాణి ఉల్రికా ఎలియోనోరా ప్రసవ మరణాల సమస్యను తగ్గించేందుకు అప్పట్లో అనేక చర్యలు చేపట్టారు.

ఆమె మొదట మంత్రసానుల పాఠశాలను స్థాపించారు. ప్రతి గ్రామం నుంచి ఒకరు లేదా ఇద్దరు మహిళలకు మంత్రసానిగా శిక్షణ ఇవ్వాలన విధానాన్ని అమలు చేశారు.

స్వీడన్‌లో ఈ విధానం వల్ల 1900 నాటికి మాతృ మరణాల రేటు తగ్గింది. అప్పటికి శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలు, రక్త మార్పిడి, యాంటీబయోటిక్స్ అందరికీ అందుబాటులో లేవు.

17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యంలో ప్రసవానంతర అధిక రక్తస్రావానికి సంబంధించిన కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. అయితే ప్రసవం సమయంలో లేదా అనంతరం మహిళల మరణాల రేటు అత్యంత ఎక్కువగా ఉండేదని వైద్య చరిత్రకారులు అంగీకరిస్తున్నారు.

మొఘల్ కాలంలో సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలు మంచి స్థాయిలో ఉండేవని యూరోపియన్ యాత్రికులు, చరిత్రకారులు కూడా పేర్కొన్నారు.

‘‘భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన స్మారకం షాజహాన్ ప్రేమకు ప్రతీకగా నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేది’’ అని మద్రాస్ కొరియర్ రాసింది.

తాజ్‌మహల్‌పై ఖర్చు చేసిన అపార సంపదలో కొంత భాగమైనా మాతృ, శిశు సంరక్షణ ఆసుపత్రుల నిర్మాణానికి వినియోగించి ఉంటే, అది ప్రేమకు చిహ్నంగా నిలవడమే కాకుండా ప్రసవ సంబంధ సమస్యల కారణంగా శతాబ్దాలుగా ప్రాణాలు కోల్పోతున్న అనేక మంది సాధారణ ముంతాజ్ మహల్‌ల ప్రాణాలను కూడా కాపాడేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అలా గనక జరిగి ఉంటే తాజ్ మహల్ ప్రేమకు మాత్రమే కాకుండా మహిళల జీవితాలకు కూడా ఒక శాశ్వత చిహ్నంగా నిలిచేవారని వారు అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)