త్రిషను ఉద్దేశించి ఉదయనిధి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారా? ఏమిటీ వివాదం

ఫొటో సోర్స్, UGC
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం జరిగిన తన ర్యాలీలో ఉదయనిధి తమిళ నటి త్రిషకృష్ణన్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై తమిళగ వెట్రి కజగం (టీవీకే).. పోలీసులు, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఉదయనిధిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెన్నై (దక్షిణ) అడిషనల్ పోలీస్ కమిషనర్ నరేంద్రన్ నాయర్ ధ్రువీకరించారు.
మంగళవారం ఉదయాన్నే ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఇదే సమయంలో ఎం. సుబ్రమణియం, ఈవీ వేలు, ఎన్ఆర్ ఇళంగో, పరంథామన్ సహా పలువురు డీఎంకే నాయకులు, మద్దతుదారులు ఉదయనిధి ఇంటికి చేరుకున్నారు.
ఉదయనిధి ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు గుమిగూడటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

ఫొటో సోర్స్, ANI
అసలేం జరిగింది?
కావేరీ జలాల సమస్యపై టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం తంజావూరులో డీఎంకే నిరసన తెలిపింది.
నిరసన సందర్భంగా, కావేరీ జలాల సమస్యను ముఖ్యమంత్రి విజయ్ పట్టించుకోవడం లేదంటూ ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.
"డీఎంకేపై కేసు పెట్టడమే ఆయన ఏకైక లక్ష్యం" అని ఉదయనిధి అన్నారు.
ఉదయనిధి ప్రసంగిస్తుండగా జనం "త్రిష.. త్రిష" అంటూ నినాదాలు చేశారు.. ఆ నినాదాలకు స్పందన అన్నట్లుగా ఆ సమయంలో ఉదయనిధి చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది.
టీవీకేతో పాటు ఇతర కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కి అవమానంగా పేర్కొంటున్నాయి.
వినయం, ఆత్మనిగ్రహం లేని వ్యక్తి తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఎలా పని చేశారని ఉదయనిధిని ఉద్దేశిస్తూ టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎన్. ఆనంద్ ప్రశ్నించారు. ఉదయనిధి గత డీఎంకే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని ఎన్. ఆనంద్ అన్నారు. అదేవిధంగా, అధవ్ అర్జున, రాజ్‌మోహన్ సహా పలువురు మంత్రులు కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగాన్ని ఖండించారు.
బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ సహా పలువురు నేతలు ఉదయనిధి వ్యాఖ్యలను తప్పు పట్టారు.

ఫొటో సోర్స్, X/Udhayanidhi Stalin
ఉదయనిధి ఏం చెప్పారు?
పోలీసు వాహనంలో తీసుకువెళ్తుండగా ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ "నేను చెప్పని విషయాలను చేర్చి, అతికించి నా మీద తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. ఈరోజు నాపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు" అని అన్నారు.
"నేను దీనికి భయపడను. నేను కలైంగర్ (కరుణానిధి) వారసుడిని, డీఎంకే కుటుంబ సభ్యుడిని, నాయకుడు స్టాలిన్ కుమారుడిని. ఆ నిరసనలో నేను సుమారు 22 నిమిషాలు మాట్లాడాను. ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసింది, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, మేకెదాటు డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా గళం విప్పలేదు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడాలని నేను డిమాండ్ చేశాను" అని ఉదయనిధి అన్నారు.
"ఎంకే స్టాలిన్ రైతులకు అండగా ఉంటారని నేను కూడా చెప్పాను. ఈ సమయంలో టీవీకే దారి మళ్లించే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులందరూ కేవలం రీల్స్ చేసుకోవడంలోనే బతుకుతున్నారు" అని ఉదయనిధి చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
తంజావూరు (ఈస్ట్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఉదయనిధిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీవీకే.. తంజావూరు (ఈస్ట్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
నిరసన సందర్భంగా హాజరైన ప్రజలు చేసిన నినాదాలకు ప్రతిస్పందిస్తున్నామని చెబుతూనే, ఉదయనిధి 'ద్వంద్వార్థం' ఉన్న 'అవమానకరమైన' వ్యాఖ్యలు చేశారని టీవీకే తంజావూరు జిల్లా మహిళా విభాగం కన్వీనర్ భైరవి ఫిర్యాదులో పేర్కొన్నారు.
డిఎంకె ఐటీ విభాగం తమ 'ఎక్స్' అకౌంట్లో ఉదయనిధి ప్రసంగానికి సంబంధించిన 2 నిమిషాల 39 సెకన్ల వీడియోను పోస్ట్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు ఉదయనిధి స్టాలిన్, వీడియోను ప్రచారం చేసిన డీఎంకే ఐటీ విభాగం ఉద్యోగులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
ఉదయనిధిపై వచ్చిన ఆరోపణలను డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు తోసిపుచ్చారు. "ఉదయనిధి ఏ ఒక్క మహిళ గురించి ప్రత్యేకంగా ఏమీ అనలేదు, ఈ మొత్తం విషయాన్ని మీడియాలో తప్పుగా చిత్రీకరిస్తున్నారు" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























