హైదరాబాద్: మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన హోంగార్డ్, సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్.. ఏం జరిగిందంటే

ఫొటో సోర్స్, UCG
(నోట్: కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
ఓ మహిళపై పోలీసు విచక్షణారహితంగా దాడి చేస్తూ, జుట్టు పట్టుకుని కింద పడేసి లాక్కెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన సెప్టెంబరు 18 రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ దగ్గర జరిగిందని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
మహిళపై దాడి చేసిన వ్యక్తి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో హోంగార్డుగా పనిచేస్తున్న కడిగ ఆనంద్‌గా పోలీసులు చెప్పారు.
నిందితుడిపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబరు 19న ఎఫ్ఐఆర్ నం.1349/2026 నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జయరామ్ బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
ఏం జరిగిందంటే..
ఘటనకు సంబంధించిన వివరాలను మియాపూర్ ఇన్‌స్పెక్టర్ జయరామ్ బీబీసీకి వివరించారు.
ఇన్‌స్పెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి కొందరు చిత్తు కాగితాలు, ఇనుప వ్యర్థాలు ఏరుకునేవారు హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారాలపై ఉన్నట్లు స్టేషన్ మాస్టర్ గుర్తించారు. వారిని అక్కడి నుంచి పంపించివేయాలని ఆర్పీఎఫ్ పోలీసులకు సూచించారు.
ఈ క్రమంలో ఆర్పీఎఫ్ హోంగార్డు ఆనంద్.. వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుండగా, ఓ మహిళ ఆయన్ను బూతులు తిట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇన్‌స్పెక్టర్ జయరామ్ చెప్పారు. ఈ నేపథ్యంలో కోపంతో రగిలిపోయిన ఆనంద్.. మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, cyberabad police
సోషల్ మీడియాలో వైరల్..
మహిళపై లాఠీతో దాడి చేసి, జుట్టు పట్టుకుని కింద పడేసి ఈడ్చుకెళ్తున్నట్లుగా వైరల్ అయిన వీడియోలో ఉంది. ఆ సమయంలో ఓ వ్యక్తి హోంగార్డు ఆనంద్ వెంటపడుతూ ఆమెను విడిపించే ప్రయత్నం చేశారు.
''వదిలేయండి సార్'' అంటూ ప్రాథేయపడుతున్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి.
అలాగే ఆనంద్ కూడా.. ''ప్లాట్‌ఫారం మీద నుంచి వచ్చాక ఏదో అన్నావ్.. ఏదో గలీజు మాటలు అన్నావ్ కదా..'' అని మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంటున్నట్లుగా వీడియోలో ఉంది.
ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. హోంగార్డు ఆనంద్‌ది వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలమని పోలీసులు గుర్తించారు.

ఫొటో సోర్స్, cyberabad police
విధుల నుంచి తొలగించాం: కమిషనర్
సోషల్ మీడియాలో మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వైరల్ కావడంతో సైబరాబాద్ కమిషనర్ రమేశ్ స్పందించారు.
ఆనంద్‌ను అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించినట్లు చెప్పారు.
''ఆనంద్‌ను హోంగార్డు విధుల నుంచి తొలగించాం. తెలంగాణ పోలీసులు ఈ తరహా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు'' అని కమిషనర్ చెప్పారు.
ఇంతకీ ఆ మహిళ ఎవరు?
మరోవైపు, దాడికి గురైన మహిళ వివరాలు తెలియాల్సి ఉందని, మియాపూర్ ఇన్‌స్పెక్టర్ జయరామ్ చెప్పారు.
''ఆ మహిళ ఎవరో తెలియదని స్థానికులు చెప్పారు. వారు చిత్తు కాగితాలు ఏరుకుంటూ సంచార జీవనం గడిపేవారిగా గుర్తించాం. వారు ఎక్కడికి వెళ్లారో తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన రోజే మొదటిసారి అక్కడ ఆ మహిళను చూశామని స్థానికులు చెప్పారు'' అని జయరామ్ బీబీసీతో చెప్పారు.
అలాగే ఆమె వివరాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. ఆమె వివరాలు తెలిశాక, మాట్లాడేందుకు ప్రయత్నిస్తాం.
మరోవైపు, ఆనంద్‌ను పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించడంతో ఆయన మాట్లాడేందుకు అందుబాటులో లేరు. ఆనంద్ కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























