ట్రిపుల్ జీ: 'బరువు తగ్గించే కొత్త ఔషధం' కోసం ఎగబడుతున్న జనం.. వెల్లువలా పుట్టుకొస్తున్న నకిలీలు

నకిలీ రెటాట్రుటైడ్, బరువు తగ్గించే ఔషధం, అమెరికా, ఎలి లిల్లీ

ఫొటో సోర్స్, Tom Davies/MHRA

ఫొటో క్యాప్షన్, నకిలీ రెటాట్రుటైడ్‌ను సిఫార్సు చేసిన మోతాదుకు ఎనిమిది రెట్లు ఎక్కువ తీసుకోవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందని టామ్‌ చెప్పారు.
    • రచయిత, రూత్ క్లెగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసినప్పుడు, ముఖ్యంగా క్లినికల్ ట్రయల్స్ తొలి దశల్లో మంచి ఫలితాలు కనిపిస్తే, దాన్ని తయారు చేస్తున్నవారు ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు.

కానీ, రెటాట్రుటైడ్ అనే ఈ 'బరువు తగ్గించే కొత్త ఔషధం'.. దాన్ని తయారు చేస్తున్న ఫార్మా సంస్థ ఎలి లిల్లీకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంత్రణ సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది.

మనుషులపై ఈ ఇంజెక్షన్ వినియోగానికి ఇప్పటివరకు ఏ నియంత్రణ సంస్థా ఆమోదం తెలపలేదు. కానీ, ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో రెటాట్రుటైడ్‌కు చెందిన నకిలీ, చట్టవిరుద్ధ ఉత్పత్తులు వెల్లువలా వస్తున్నాయి.

ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న ఒక ఔషధానికి సంబంధించిన కాపీ వెర్షన్లు ఇంత విస్తృతంగా అందుబాటులోకి రావడం తాము చూసిన తొలి సందర్భాల్లో ఒకటని నిపుణులు బీబీసీకి తెలిపారు.

'రెటా' పేరుతో పిలుస్తున్న ఈ డ్రగ్ వయల్స్‌ను యూకేలోని జిమ్‌లు, నెయిల్, బ్యూటీ సెలూన్లు, హెయిర్‌డ్రెస్సర్లు, సోషల్ మీడియాతో పాటు వీధుల్లో పూలు అమ్మేవారు కూడా విక్రయిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ప్రపంచం పిచ్చెక్కిపోయింది" అని 24 హెచ్‌ఆర్ ఫార్మసీ డైరెక్టర్, ఫార్మసిస్ట్ సెహర్ షాహిద్ అన్నారు.

"ప్రజలు చట్టవిరుద్ధమైన మందును శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటూ, అది సురక్షితమని భావిస్తున్నారు. దీన్ని ఎక్కడ కొనాలో, ఏ డీలర్ దగ్గర తీసుకోవాలో ప్రజలు బాహాటంగా మాట్లాడుకుంటూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం చూస్తే ఇది ఎంత సాధారణంగా మారిపోయిందో అర్థమవుతోంది" అని షాహిద్ అన్నారు.

"సోషల్ మీడియాలో ఒక్కసారి చూస్తేనే నిమిషాల్లో రెటాట్రుటైడ్ పేరుతో అమ్ముతున్న ఈ మందును నేను కూడా ఆర్డర్ చేయగలను. అయితే అది దేనితో తయారైంది, దాని ప్రభావాలు ఎలా ఉంటాయి, అది ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు" అన్నారు.

ఈ మందు వాడేవారు తమ టిక్‌టాక్ ఖాతాల్లో 'రెటా' వాడకముందు, వాడిన తర్వాత ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఆహారం మీద తమకున్న కోరికలను ఇది ఎలా తగ్గించిందో, బరువు, శరీర కొలతలు తగ్గడానికి ఎలా సాయపడిందో వివరిస్తున్నారు. కొందరైతే ఇది తమ జీవితాన్నే పూర్తిగా మార్చేసిందని చెబుతున్నారు.

అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. ఇటీవలి క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చినప్పటికీ, అసలైన రెటాట్రుటైడ్ సురక్షితమైనదా, సమర్థవంతంగా పనిచేస్తుందా అనే విషయాలపై ఇంకా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి.

ఆమోదం ఉందా?

అమెరికాలో ఫేజ్-3 దశలో ఉన్న మందుల్లో కేవలం 50 శాతం ఔషధాలకు మాత్రమే చివరకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం లభిస్తుంటుంది. తొలి దశలో తక్కువ మందిపై ప్రయోగించినప్పుడు మెరుగ్గా పనిచేసిన మందులు, తర్వాత ఎక్కువ మందిపై, భిన్నమైన వ్యక్తులపై ప్రయోగించినప్పుడు అదే స్థాయిలో పనిచేయకపోవడం లేదా ఊహించని దుష్ప్రభావాలు బయటపడటమే ఈ వైఫల్యాలకు ప్రధాన కారణం. కాబట్టి, రెటాట్రుటైడ్ తప్పనిసరిగా మార్కెట్లోకి వస్తుందనే గ్యారెంటీ ఇప్పటికైతే లేదు.

ప్రస్తుతం బయట దొరుకుతున్న నకిలీ మందులకు, సురక్షితమైన ప్రయోగశాలల్లో అభివృద్ధి చేస్తున్న అసలు ఔషధానికి ఎలాంటి పోలికా ఉండకపోవచ్చు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎలి లిల్లీ సంస్థ తమ వెబ్‌సైట్‌లో దీనిపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం రెటాట్రుటైడ్ పేరుతో లభించే ఏ ఉత్పత్తినీ ఎవరూ తీసుకోవద్దని సూచించింది.

"చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్న ఈ రెటాట్రుటైడ్ ఉత్పత్తుల్లో ఏమేం కలిపారో తెలియదు. హానికరమైన కాలుష్య పదార్థాలు, మలినాలు ఉండే ప్రమాదం ఉంది. ఈ నకిలీ మందుల్లో అసలు ఔషధం మోతాదు కంటే చాలా ఎక్కువగానీ, తక్కువగానీ ఉండొచ్చు. లేదా అసలు ఆ మందే కాకుండా పూర్తిగా వేరే పదార్థం ఉండొచ్చు" అని తెలిపింది.

నకిలీ రెటాట్రుటైడ్, బరువు తగ్గించే ఔషధం, అమెరికా, ఎలి లిల్లీ

ఫొటో సోర్స్, MHRA

ఫొటో క్యాప్షన్, గత ఏడాది నార్తాంప్టన్‌లోని ఓ 'బరువు తగ్గింపు మందుల' అక్రమ తయారీ కేంద్రంపై యూకే ఔషధ నియంత్రణ సంస్థ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో ఎలాంటి అనుమతులు లేని 2,000 కు పైగా రెటాట్రుటైడ్ ఇంజెక్షన్లను అధికారులు గుర్తించారు.

నకిలీ 'రెటా'తో తీవ్ర దుష్ప్రభావాలు

ఇన్ని హెచ్చరికలు ఉన్నప్పటికీ, చాలామంది వాడేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది.

"పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే యువకులు వికారం, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కొన్ని కేసుల్లో కిడ్నీ వైఫల్యం కూడా సంభవిస్తోంది" అని ఎండోక్రినాలజిస్ట్ ప్రొఫెసర్ డోనాల్ ఓషీ తెలిపారు.

కొందరు పర్సనల్ ట్రైనర్లు తమ దగ్గరకు వచ్చేవారికి ఈ డ్రగ్ అమ్మడమే కాకుండా, స్వయంగా ఇంజెక్షన్లు ఇస్తున్నారని ఆయన చెప్పారు.

"ఆ మందును ఎంత మోతాదులో తీసుకుంటున్నారో, అసలు శరీరంలోకి ఏం ఎక్కిస్తున్నారో కూడా వారికి తెలియడం లేదు" అని డోనాల్ అన్నారు.

అధిక డోస్.. ఆస్పత్రి పాలైన యువకుడు

రెటాట్రుటైడ్ నకిలీ మందును పొరపాటున ఓవర్‌డోస్ తీసుకోవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందని టామ్ డేవిస్ అనే యువకుడు చెప్పారు. జిమ్‌లో తన స్నేహితులు చెప్పడంతో ఒక చైనా సప్లయర్ నుంచి దీన్ని ఆర్డర్ చేశారు.

"అది చాలా భయంకరమైన అనుభవం" అని బ్రిటన్‌కు చెందిన ఆ 20 ఏళ్ల యువకుడు తెలిపారు.

"నా శరీరం తీవ్ర ఒత్తిడికి గురైంది. కడుపు ఉబ్బిపోయింది. ఎవరో నా కడుపుపై 20 కిలోల బరువు పెట్టినట్లు అనిపించింది. 72 గంటల పాటు తీవ్రమైన విరేచనాలు, వికారం బాధించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వస్తుందని భయపడ్డాను" అన్నారు.

తీసుకోవాల్సిన దానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువ డోసు తీసుకున్నానని టామ్‌కు ఆ తర్వాతే అర్థమైంది. కొన్న రకం ఉత్పత్తిని బట్టి, ఈ నకిలీ రెటాట్రుటైడ్‌ను కొన్నిసార్లు స్టెరైల్, బ్యాక్టీరియా చేరని నీటితో కలపాల్సి ఉంటుంది. ఇందుకు కచ్చితమైన లెక్కలు, అవగాహన ఉండాలి.

నకిలీ రెటాట్రుటైడ్, బరువు తగ్గించే ఔషధం, అమెరికా, ఎలి లిల్లీ

ఫొటో సోర్స్, Tom

ఫొటో క్యాప్షన్, తాను రోజూ వ్యాయామం చేస్తానని, బరువు తగ్గడం కోసం ఈ మందు వాడలేదని, తీపి పదార్థాలపై కోరికను అదుపు చేసుకునేందుకే వాడినట్లు టామ్ వివరించారు.

ఎలి లిల్లీ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ కోసం చెస్టర్‌కు చెందిన రీసెర్చ్ డాక్టర్ నాస్ ఖట్టక్ పేషెంట్లను పరీక్షిస్తున్నారు. నకిలీ మందులు వాడుతున్నవారు ఎలాంటి వైద్య పర్యవేక్షణ లేకుండా తమపై తామే ప్రయోగాలు చేసుకుంటున్నారని ఆయన హెచ్చరించారు.

"ఆన్‌లైన్‌లో కొని, ఎవరికి వారే డాక్టర్లుగా మారితే పెద్ద ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే" అని నాస్ ఖట్టక్ అన్నారు.

క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనేవారికి అసలైన మందు లేదా డమ్మీ మందు (ప్లేసిబో) ఇవ్వడానికి ముందు, వారు కఠినమైన అర్హత ప్రమాణాలను దాటాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

"ముందుగా వారి ఫ్యామిలీ డాక్టర్ రికార్డులు అడుగుతాం. వారు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారో లేదో నిర్ధరించుకుంటాం. ఆత్మహత్య ఆలోచనలు, తమకు తాము హాని చేసుకునే ప్రవృత్తులు ఏమైనా ఉన్నాయా అన్నది పరీక్షిస్తాం. మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఇవన్నీ వైద్యులే స్వయంగా చేస్తారు. ఆ తర్వాత వారి రక్త పరీక్షల ఫలితాలు, ఇతర అంశాలన్నింటినీ పరిశీలించి, అప్పుడు మాత్రమే వారు ఈ ప్రయోగానికి అర్హులా కాదా అని నిర్ణయిస్తాం" అని డాక్టర్ ఖట్టక్ తెలిపారు.

మందు డోసుల గురించి మరింత సమాచారం తెలుసుకున్న టామ్, గతంలో భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొన్నప్పటికీ, తన దగ్గరున్న నకిలీ రెటాట్రుటైడ్‌ను మరోసారి వాడాలని నిర్ణయించుకున్నారు. తొమ్మిది నెలల పాటు దాన్ని విడతలవారీగా వాడిన తర్వాత, ఇప్పుడు తనకు స్వీట్లు, జంక్ ఫుడ్ తినాలనే కోరికలు తగ్గిపోయాయని టామ్ అన్నారు.

అయితే, నకిలీ 'రెటా' మందు ఒకరికి పనిచేసినంత మాత్రాన, "అది మరొకరికి కూడా అలాగే పనిచేస్తుందనే గ్యారెంటీ లేదు" అని ఫార్మసిస్ట్ షాహిద్ హెచ్చరించారు.

మూడు హార్మోన్లపై పనిచేసే 'ట్రిపుల్ జీ'

సెమాగ్లుటైడ్ (వెగోవీ బ్రాండ్), టిర్జెపటైడ్ (మౌంజారో బ్రాండ్) తరహాలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఊబకాయం మందులు కేవలం ఒకటి లేదా రెండు హార్మోన్ రిసెప్టర్లను లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ, ఆమోదం లభిస్తే, మూడు హార్మోన్ రిసెప్టర్లపై పనిచేసే ప్రపంచంలోనే తొలి 'బరువు తగ్గించే ఔషధం'గా రెటాట్రుటైడ్ నిలుస్తుంది. అందుకే దీనికి "ట్రిపుల్ జీ" అనే పేరు కూడా వచ్చింది.

ఆ మూడు హార్మోన్లు ఇవే:

  • జీఎల్‌పీ-1: ఇది జీర్ణాశయం ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఆకలిని తగ్గించేందుకు కడుపు నిండిన భావనను మెదడుకు తెలియజేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సాయపడుతుంది.
  • జీఐపీ: ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతూ, ఇన్సులిన్ పనితీరును (సెన్సిటివిటీ) మెరుగుపరుస్తుంది. శరీరం పోషకాలను ప్రాసెస్ చేసుకోవడంలో సాయపడుతూ, ఆకలిని తగ్గించేందుకు జీఎల్‌పీ-1తో కలిసి పనిచేస్తుంది.
  • గ్లూకాగాన్: రెటాట్రుటైడ్‌లో కొత్తగా పరిచయమైన హార్మోన్ ఇదే. ఇది విశ్రాంతి సమయంలో శరీర శక్తి వినియోగాన్ని పెంచుతుంది. తద్వారా శరీరం ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. కాలేయంలోని కొవ్వును కరిగించడాన్ని ప్రోత్సహిస్తూ, బరువు తగ్గడంలో సాయపడుతుంది.

లిసా కింగ్ అనే మహిళ జులై నుంచి నకిలీ రెటాట్రుటైడ్‌ను వాడుతున్నారు. ఒక దశలో ఆమె జిమ్‌కు వెళ్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వారానికి 3 కిలోల బరువు తగ్గారు.

పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీఎంఓఎస్) లక్షణాలను అదుపులో ఉంచడంలో కూడా ఇది తనకు సహాయపడుతోందని ఆమె భావిస్తున్నారు. జీఎల్‌పీ-1లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. పీఎంఓఎస్‌కు సంబంధించిన కొన్ని సమస్యలను తగ్గించడంలో ఈ 'బరువు తగ్గింపు మందులు' సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

"ఇది రెటా వల్లే జరిగిందో లేదో నాకు కచ్చితంగా తెలియదు గానీ, తీపి పదార్థాలు తినాలనే కోరిక తగ్గింది. నా పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తున్నాయి. నాలో శక్తి కూడా బాగా పెరిగింది" అని లిసా చెప్పారు.

అయితే రెటాట్రుటైడ్ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది కదా.. ఈ విషయం ఆమెను ఏమైనా ఆందోళనకు గురిచేస్తోందా?

"లేదు, అస్సలు లేదు. ఇంకా ఆమోదం పొందనివి చాలానే ఉన్నాయి. నాకు ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే వాడటం మానేస్తాను" అని ఆమె బదులిచ్చారు.

నకిలీ రెటాట్రుటైడ్, బరువు తగ్గించే ఔషధం, అమెరికా, ఎలి లిల్లీ, లిసా కింగ్

ఫొటో సోర్స్, Lisa King

ఫొటో క్యాప్షన్, నకిలీ రెటాట్రుటైడ్ వల్ల దుష్ప్రభావాలు ఎదురైతే వెంటనే మందు వాడటం మానేస్తానని లిసా స్పష్టం చేశారు.

వైద్యుల ఆందోళన

నకిలీ రెటాట్రుటైడ్ వాడుతున్న ఇతర యూజర్లు మాత్రం మెదడు మొద్దుబారినట్లు అనిపించడం, వికారం, విరేచనాలు, లైంగిక కోరికలు తగ్గడం, సంతోషం లేదా ఆనందాన్ని అనుభవించలేకపోవడం లాంటి పలు రకాల సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

ఈ నకిలీ 'బరువు తగ్గింపు మందులు' వాడుతున్న వారిలో కనిపిస్తున్న దుష్ప్రభావాలను చూసి వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ మార్కెట్ ఉత్పత్తుల గురించి రోగులను అడిగేటప్పుడు వారిని తప్పుబట్టకుండా మాట్లాడాలని బ్రిటిష్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ చైర్‌పర్సన్, జీపీ డాక్టర్ సాహిరా దార్ సూచించారు. అప్పుడే తాము ఏ మందులు వాడామన్నది రోగులు నిర్భయంగా చెబుతారని ఆమె అభిప్రాయపడ్డారు.

నకిలీ మందులపై ఎలి లిల్లీ చర్యలు

ఎలి లిల్లీ సంస్థ దాదాపు 10 ఏళ్లుగా రెటాట్రుటైడ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు తమ ఉత్పత్తిని కాపాడుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చట్టవిరుద్ధమైన అమ్మకాలను అరికట్టడానికి ఆ సంస్థ పోరాడుతోంది.

నకిలీ మందులను తయారు చేస్తున్న, విక్రయిస్తున్న పెప్టైడ్ కంపెనీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, కాంపౌండ్ ఫార్మసీలు, వెల్‌నెస్ క్లినిక్‌లపై ఆ సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఈ మందును చట్టవిరుద్ధంగా మార్కెట్ చేస్తున్న 14,000కు పైగా వెబ్‌సైట్లు, ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు చేసింది.

"బ్లాక్ మార్కెట్ మందులను అరికట్టేందుకు చట్ట అమలు సంస్థలు, నియంత్రణ అధికారులతో కలిసి పనిచేస్తూనే ఉంటాం" అని ఎలి లిల్లీ సంస్థ స్పష్టం చేసింది.

"ఆన్‌లైన్‌లో లభించే రెటాట్రుటైడ్ ఆమోదం పొందనిది, ధ్రువీకరించనిది. దీనికోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏమాత్రం తగదు" అని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు.

యూకేకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ ఎంహెచ్‌ఆర్‌ఏ.. గత ఏడాది కాలంలో పలు దాడులు నిర్వహించి, 'రెటాట్రుటైడ్' పేరుతో విక్రయిస్తున్న ఉత్పత్తులను భారీగా సీజ్ చేసింది.

యూకేలోకి ఈ ఉత్పత్తులు పలు మార్గాల ద్వారా వస్తున్నాయని, "వీటి అక్రమ దిగుమతి, పంపిణీని అడ్డుకునేందుకు" తీవ్రంగా శ్రమిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.

అయినా సరే, వీటి అమ్మకాలు మాత్రం ఆగలేదు.

"బ్లాక్ మార్కెట్ మందుల వల్ల పొంచివున్న ప్రమాదాలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతమాత్రాన ఈ తరహా ఔషధాలన్నింటినీ పనికిరానివిగా కొట్టిపారేయకూడదు" అని ప్రొఫెసర్ ఓషీ స్పష్టం చేశారు.

"ఊబకాయాన్ని నియంత్రించడంలో జీఎల్‌పీ-1 తరహా మందులు ఒక గొప్ప ముందడుగు. మెదడు మన ఆకలిని, ఆహారపు కోరికలను ఎలా నియంత్రిస్తుందన్న దానిపై మన అవగాహనను కూడా ఇవి గణనీయంగా పెంచాయి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం" అని ఆయన అభివర్ణించారు.

ప్రస్తుతానికి, ఈ రెటాట్రుటైడ్‌కు ఎక్కడైనా అధికారిక ఆమోదం లభించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది.

అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కోసం వచ్చే ఏడాది ప్రారంభంలో దరఖాస్తు చేయాలని ఎలి లిల్లీ భావిస్తోంది. దరఖాస్తును పరిశీలించడానికి ఏడాది వరకు సమయం పట్టొచ్చు. అంటే, అమెరికాలో ఈ మందు చట్టబద్ధంగా అందుబాటులోకి రావడానికి 2027 చివరి వరకు అవకాశం ఉండకపోవచ్చు. ఇక యూకేలో ఎంహెచ్‌ఆర్‌ఏ ఆమోదం బట్టి.. 2028 నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)