యునైటెడ్ కింగ్‌డమ్ ముక్కలవుతుందా? విడిపోవాలని స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ చేసుకున్న ఒప్పందం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ డీన్స్, సెమ్లిన్ డేవిస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
యూకే పార్లమెంట్ (వెస్ట్ మిన్‌స్టర్)కు ఇక కాలం చెల్లిందని వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ (ఉత్తర ఐర్లాండ్) దేశాలకు చెందిన ఫస్ట్ మినిస్టర్లు ప్రకటించారు.
ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్ దేశాలను కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు. వాటికి ఉత్తర ఐర్లాండ్ తోడైతే యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)గా పిలుస్తారు.
వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ దేశాలకు పూర్తి సార్వభౌమాధికారం లేదు. చరిత్రలో క్రమంగా యూకేలో భాగమైన ఈ దేశాలు వెస్ట్ మిన్‌స్టర్ కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తున్నాయి.
అయితే ఈ మూడు దేశాల రాజ్యాంగ హోదాలో వ్యత్యాసం ఉంటుంది.
1999లో ఈ దేశాలకు యూకే ప్రభుత్వం పలు అధికారాలను వికేంద్రీకరించింది. ఆ దేశాల ప్రభుత్వాధినేతలను ఫస్ట్ మినిస్టర్ అంటారు.

ఈ నేపథ్యంలో, యూకే నుంచి విడిపోవాలని భావిస్తున్న ప్లాయిడ్ కమ్రే, షిన్ ఫెయిన్, ఎస్ఎన్‌పీ అనే రాజకీయ పార్టీలకు చెందిన జాతీయవాద (నేషనలిస్ట్) లీడర్లు ఇటీవల ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునే హక్కు ఏ వెస్ట్‌మిన్‌స్టర్ ప్రభుత్వానికి లేదని వారు చెప్పారు. ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) చేపట్టాలని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ, ఉత్తర ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్ మిషెల్ ఓ నీల్ సంయుక్తంగా నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు.
వేల్స్ ఫస్ట్ మినిస్టర్ రీన్ అప్ యోర్వెర్త్ మాత్రం తన దేశంలో రిఫండమ్ కోసం నిర్దిష్ట సమయాన్ని ప్రకటించలేదు. అయితే, (వేల్స్‌లో అధికారంలో ఉన్న) ప్లాయిడ్ పార్టీ యూకేను ముక్కలు చేయాలనుకుంటోందని లేబర్, రిఫార్మ్ పార్టీలు ఆరోపించాయి.
నిధులు, అధికారాల్లో 'న్యాయం' కోసం మరో ఒప్పందం..
నిధులు, అధికారాల్లో 'న్యాయం' కోసం యూకే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆ తర్వాత స్విన్నీ, అప్ యోర్వెర్త్ ప్రభుత్వాలు మరో ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాయి.
(1999లో) అధికార వికేంద్రీకరణ మొదలైన తర్వాత.. తొలిసారిగా ఈ మూడు దేశాల్లోనూ (వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్) యూకే నుంచి విడిపోవాలని డిమాండ్ చేసే నేతలే ఫస్ట్ మినిస్టర్‌లుగా ఉన్నారు.
గత సోమవారం జరిగిన సమావేశానికి తమ పార్టీ ప్రతినిధులుగా ఆ ముగ్గురు నేతలు హాజరయ్యారు. వారితో పాటు (ఉత్తర ఐర్లాండ్‌లో అధికారంలో ఉన్న) షిన్ ఫెయిన్ పార్టీ అధ్యక్షురాలు మేరీ లూ మెక్‌డోనల్డ్ కూడా ఉన్నారు.
అవగాహన ఒప్పందంలో పేర్కొన్నదాని ప్రకారం, " వెస్ట్ మిన్‌స్టర్‌కు ఇక కాలం చెల్లింది అనేందుకు ఇంతకన్నా నిదర్శనం లేదు. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకొని, ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు అనే సూత్రాన్ని విస్మరించే హక్కు ఏ వెస్ట్ మిన్‌స్టర్ ప్రభుత్వానికి లేదు"
"మా మూడు పార్టీలకు వేర్వేరు రాజ్యంగపరమైన హోదాలు ఉన్నాయని మాకు తెలుసు. అందుకే ఏ దేశానికి ఆ దేశం తన భవిష్యత్తును సొంత విధానంలో తనకు అనువైన సమయంలో సొంతగా నిర్ణయించుకుంటాయి" అని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు.
వేల్స్‌లో 2030లో సెనెడ్ (అక్కడి పార్లమెంట్) ఎన్నికలకు ముందే స్వాతంత్య్రం కోసం రిఫరెండం చేపట్టనున్నారనే వాదనను ప్లాయిడ్ పార్టీ కొట్టివేసింది.
"వెస్ట్ మిన్‌స్టర్ పనిచేయడం లేదు అనే గుర్తింపు మరింత పెరిగింది. అధికారం ప్రజలకు, కమ్యూనిటీలకు చేరువ చేయాల్సిన అవసరం నిజంగా ఉంది" అని మీడియా సమావేశంలో అప్ యోర్వెర్త్ అన్నారు.
ఈ ఏడాది మే నెలలో జరిగిన సెనెడ్ (వేల్స్ పార్లమెంట్) ఎన్నికలు.. ‘‘వేల్స్‌ను మరింత ఆత్మవిశ్వాసంతో, సమృద్ధిగా, దాని భవిష్యత్తుపై పూర్తి నియంత్రణ సాధించేలా మార్పు చేసేందుకు తన ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు’’ అని ఆయన పేర్కొన్నారు.
"మా ప్రజలకు తగ్గ దేశాన్ని నిర్మించుకునే అధికారం, వనరులు, ఆదరణ మాకు దక్కాలి" అని అప్ యోర్వెర్త్ డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
యూకే రాజ్యంగ ప్రయాణంలో ఒక కీలక ఘట్టం అంటూ (స్కాట్లాండ్‌లో అధికార) ఎస్ఎన్‌పీ నేత స్విన్నీ గత సోమవారం జరిగిన సమావేశం గురించి వ్యాఖ్యానించారు.
"తమ దేశమే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని అనే భావనను బలంగా నమ్మే పరిస్థితిని మేలో జరిగిన ఎన్నికలు చాటి చెప్పాయి." అని ఆయన చెప్పారు.
"స్వీయ నిర్ణయాధికారం అనే సూత్రం.. ఒక విడదీయలేని హక్కు" అని అన్నారు.
యూకేకి ఆండీ బర్నామ్ చివరి ప్రధాని అని స్విన్నీ పేర్కొన్నారు.
ఎందుకంటే, "రిఫరెండం ద్వారా అవకాశం ఇస్తే స్వాతంత్య్రం కావాలనే స్కాట్లాండ్ ప్రజలు కోరుకుంటారు" అని స్విన్నీ అన్నారు.
ఈ సమావేశం 'చరిత్రాత్మకమైనది'గా షిన్ ఫెయిన్ నేత మెక్‌డొనాల్డ్ కూడా అభివర్ణించారు. "మాకు రిఫరెండం పెట్టే హక్కు ఉంది. మా భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉంది. ఆ హక్కు లేదు అని ఏ ప్రధానమంత్రి చెప్పినా మేము అంగీకరించం. సహించం" ఆమె అని అన్నారు.
మూడు దేశాలూ (స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్) 'దేనికవే భిన్నమైనవని', ప్రతీ దేశానికి దానికంటూ సొంత ప్రాధాన్యతలు ఉన్నాయని ఉత్తర ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్ ఓ నీల్ పేర్కొన్నారు.
అయితే ఉమ్మడి సమస్య.. వెస్ట్ మిన్‌స్టర్ తమ ప్రజల బాగోగులు చూడకపోవడమేనని ఆమె అన్నారు.
ఉత్తర ఐర్లాండ్ పాలనా విధానంలో అధికారాన్ని ఫస్ట్ మినిస్టర్, డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ పంచుకుంటారు. ఫస్ట్ మినిస్టర్‌కి, డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్‌కి దాదాపు ఒకే రకమైన (సమాన) అధికారాలు ఉంటాయి.
ఫస్ట్ మినిస్టర్ పదవికి ఉండే అధికారాన్ని ఓ నీల్ (షిన్ ఫెయిన్ పార్టీ) దుర్వినియోగం చేస్తున్నారని డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీకి చెందిన డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ ఎమ్మా లిటిల్ పెంగెల్లీ ఆరోపించారు.
అయితే ఈ అవగాహన ఒప్పందానికి అర్థం, వేల్స్‌లో స్వాతంత్య్రానికి సంబంధించిన రిఫరెండాన్ని వెస్ట్ మిన్‌స్టర్ అడ్డుకోకుండా ఉండటమేనా? అని ప్రశ్నించినప్పుడు.. వేల్స్ భవిష్యత్తును ఆ దేశ ప్రజలే నిర్ణయించుకుంటారని అని అప్ యోర్వెర్త్ బదులిచ్చారు.
"స్వాతంత్య్రం అవసరం అని నమ్మితే, వేల్స్ ప్రజలే రిఫరెండం ఎప్పుడు జరగాలో నిర్ణయిస్తారు. వారిని అందుకు ఒప్పించడమే నా పని" అని అన్నారు.
అలాంటి రిఫరెండం పెట్టే హక్కు వేల్స్ ప్రభుత్వానికి లేదు. అయితే ఆ హక్కును తమకు కట్టబెట్టాలని మీడియా సమావేశంలో అప్ యోర్వెర్త్ కోరారు.
ఆ తర్వాత వేల్స్, స్కాట్లాండ్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంపై సోమవారం నాడు స్విన్నీ, అప్ యోర్వెర్త్ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందానికి చట్టపరమైన గుర్తింపు లేదు. అయితే, "వేల్స్, స్కాట్లాండ్ దేశాలకు యూకే నుంచి వచ్చే నిధుల ఏర్పాట్లలో, భవిష్యత్ రాజ్యంగపరమైన అధికారాలలో న్యాయం కోసం గట్టిగా పోరాడనున్నట్లు" అందులో పేర్కొన్నారు.
చిన్నారుల్లో పేదరికం, ఐరోపా సమాఖ్యతో బంధం ద్వారా ఇరు దేశాల సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడం సహా అనేక అంశాల్లో తమ ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని చెప్పారు.
వేల్స్‌కి ఏ విధంగా నిధులు సమకూర్చాలో చెప్పే బార్నెట్ సూత్రాన్ని సంస్కరించే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడం లేదని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ స్విన్నీ మరో మీడియా సమావేశంలో తెలిపారు.
బార్నెన్ ఫండింగ్ సూత్రం వల్ల వేల్స్‌కి అన్యాయం జరుగుతోందని, దానిని సవరించాలని వేల్స్ మంత్రులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సూత్రం స్కాట్లాండ్‌కి మాత్రం మేలు చేస్తోందని వారు వాదిస్తున్నారు.
ప్రధానమంత్రి కాకముందు ఈ ఫార్ములాని మార్చాలని గట్టిగా వాదించిన ఆండీ బర్నామ్, పదవిలోకి వచ్చాక ఇటీవలే వేల్స్ పర్యటనలో ఆ అవకాశం లేదన్నట్లుగా మాట్లాడారు.
"యూకే వ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టీ ఆర్థిక ఏర్పాట్లలో వ్యత్యాసం ఉంది. ప్రతీ దేశానికి సంబంధించిన అంశాలను, ప్రాధాన్యతలను, దృక్పథాలను (వెస్ట్ మిన్‌స్టర్) ముందుంచాల్సిన అవసరం ఉంది." అని స్విన్నీ చెప్పారు.
"స్కాట్లాండ్‌కి ఉన్న వెసులుబాట్లలో కొన్నయినా వేల్స్‌కి కూడా వర్తింపజేయాలి. అది మాకెంతో ముఖ్యం" అని వేల్స్ ఫస్ట్ మినిస్టర్ అప్ యోర్వెర్త్ అన్నారు.

ఫొటో సోర్స్, Welsh Government
"రిఫరెండం పెట్టేందుకు ఓకే.. కానీ ఓ షరతు.."
స్పష్టమైన ప్రజా మద్దతు ఉంటే స్కాట్లాండ్‌లో రెండోసారి రిఫరెండం పెట్టే అవకాశం ఉందని గత బుధవారం యూకే ప్రధాని ఆండీ బర్నామ్ చెప్పారు.
ఆండీ బర్నామ్ దీనిని ఉత్తర ఐర్లాండ్‌లో (ఆ ప్రాంతం యూకేలో ఉండాలా లేదా యునైటెడ్ ఐర్లాండ్‌లో ఉండాలా అని నిర్ణయించే) సరిహద్దు ఎన్నికలకి అవసరమైన పరిస్థితులతో పోల్చారు.
గుడ్ ఫ్రైడే ఒప్పందం ప్రకారం, ప్రజాభిప్రాయం మారి, దేశంలో స్పష్టమైన ఏకాభిప్రాయానికి వస్తే ఉత్తర ఐర్లాండ్ కార్యదర్శి కచ్చితంగా పోల్‌ని నిర్వహించాల్సి ఉంటుందని ఆండీ బర్నామ్ అన్నారు.
స్కాట్లాండ్‌లో సరిగ్గా అలాంటి పరిస్థితే ఉందని ఆయన చెప్పారు.
అయితే గతంలో మరో రిఫరెండం పెట్టేందుకు వీలులేదన్న ఆండీ బర్నామ్, ప్రస్తుతం తన వైఖరి మార్చుకోవడాన్ని స్విన్నీ స్వాగతించారు.
స్కాట్లాండ్‌లో 2014 సెప్టెంబర్‌లో స్వాతంత్య్రం కోసం పెట్టిన రిఫరెండంలో మెజారిటీ (55 శాతం) ప్రజలు యూకేలోనే ఉంటామని ఓటు వేశారు.
కానీ, స్కాట్లాండ్‌తో పోలిస్తే వేల్స్ పరిస్థితులు వేరు.
‘‘అప్పుడే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లం.. కానీ..’’
వేల్స్‌లో లేబర్ పార్టీకి చెందని తొలి ఫస్ట్ మినిస్టర్ అప్ యోర్వెర్త్. వేల్స్ స్వాతంత్య్రం కోసం తన ప్రభుత్వ మొదటి విడతలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లబోమని ఆయన తేల్చిచెప్పారు.
వేల్స్ స్వాతంత్య్రం భవిష్యత్ ప్రణాళికల కోసం పునాదులు వేసేందుకు ఓ జాతీయ కమిషన్‌ని ఏర్పాటు చేసే ఉద్దేశంలో తన ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు.
అయితే అప్పటివరకు, వేల్స్‌కి పోలీసు, యూత్ జస్టిస్ సహా పలు అదనపు అధికారాల కోసం ఆ దేశ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆలోచన పట్ల సుముఖంగా ఉన్నట్లు బర్నామ్ తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
"ఆ తేడా ప్రధాని తెలుసుకోవాలి"
ఇంగ్లండ్‌లోని ఏదైనా నగరం లేదా ప్రాంతానికి అధికారాలను వికేంద్రీకరించడం, ఓ దేశానికి అధికారాలను వికేంద్రీకరించడానికి మధ్య ఉన్న తేడాను ఆండీ బర్నామ్ తెలుసుకోవాలని వేల్స్ ఫస్ట్ మినిస్టర్ అప్ యోర్వెర్త్ అన్నారు.
"నాకు ఆయన (ఆండీ బర్నామ్)తో మంచి సంబంధాలు కొనసాగించాలని ఉంది. ఆయనకూ అలాగే ఉందని అనుకుంటున్నా" అని అప్ యోర్వెర్త్ చెప్పారు.
ఈ వ్యవహారంపై స్పందించిన యూకే ప్రభుత్వం, "నాలుగు దేశాల్లోనూ మార్పులు తెచ్చేందుకు ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారు. ఆయనకు యూనియన్‌లో అమితమైన విశ్వాసం ఉంది" అని చెప్పింది.
వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌కి చెందిన ఈ నేతలు వచ్చే నెలలో ప్రధానమంత్రిని కలవనున్నారు.
"స్వాతంత్య్రం కాదు.. ముందు దేశంలో పరిస్థితులపై దృష్టి పెట్టండి" అని లేబర్ పార్టీ నేత కెన్ స్కేట్స్ అన్నారు. ఎన్నికలు జరిగిన నాటినుంచి వేల్స్‌లో అధికార ప్లాయిడ్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదని స్కేట్స్ విమర్శించారు.
"బ్రిటన్‌ని విడదీయడం కోసం వారు తమ అధికారాన్ని వినియోగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వేల్స్‌ని బలహీనపరిచి, వారు తమ రాజకీయ నేతలకు మరిన్ని అధికారాలను కట్టబెట్టాలని చూస్తున్నారు." అని స్కేట్స్ ఆరోపించారు.
"స్వాతంత్య్రం కోసం అతిగా ఆలోచించడం మానేసి, వేల్స్‌లో అంతకంతకూ పడిపోతున్న విద్యా, వైద్యం నాణ్యతపై ఫస్ట్ మినిస్టర్ దృష్టి పెట్టాలి" అని వేల్స్ కన్జర్వేటివ్ సెనెడ్ నేత డారెన్ మిల్లర్ అన్నారు.
"నేషనల్ హెల్త్ సర్వీస్ వెయిటింగ్ లిస్ట్ గురించి గానీ, మన విద్యా వ్యవస్థ దుస్థితి గురించి గానీ మన ఫస్ట్ మినిస్టర్ అవగాహన చేసుకోలేకపోతున్నారు. కానీ ఆయనకు యూకేని విడగొట్టాలని ఉందని, మనకు ఇదివరకే తెలిసిన విషయాన్ని చెప్పే సమయం మాత్రం ఉంది" అని రీఫార్మ్ యూకే నేత డాన్ థామస్ పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























