ఇండియా పిలిచినా బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ఎందుకు రాలేదు, దీనివల్ల ఆ దేశానికి చేజారిన అవకాశాలు ఏమిటి?

తారిక్ రెహమాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్‌కు రెండు ఆహ్వానాలు పంపినట్టు భారత్ తెలిపింది
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

భారత్‌లో గతవారం జరిగిన బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్‌ను భారత్ ఆహ్వానించింది. కానీ ఆయన హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు.

బిమ్‌స్టెక్ అధ్యక్షుడి హోదాలో ఉన్న తారిఖ్ రెహమాన్‌ను బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలని భారత్ ఆహ్వానించిందని దీనిని ద్వైపాక్షిక ఆహ్వానంగా చూడకూడదని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి హుమాయూన్ కబీర్ స్పష్టం చేశారు. బిమ్‌స్టెక్ అంటే బంగాళాఖాత ప్రాంతంలోని ఏడు దేశాలతో ఏర్పడిన ప్రాంతీయ సంస్థ

హుమాయూన్ కబీర్ వాదనపై మంగళవారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందిస్తూ... 'మేం బంగ్లాదేశ్ ప్రధానిని ద్వైపాక్షిక పర్యటనకు కూడా ఆహ్వానించాం. ఆ తర్వాతే ఆయనను బిమ్‌స్టెక్ చైర్మన్‌గా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించాం. ఆయనకు రెండు ఆహ్వానాలు అందాయి. ఒకటి ద్వైపాక్షిక పర్యటన కోసం, మరొకటి బ్రిక్స్ సదస్సు కోసం' అని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాము చేరాలనుకుంటున్న కూటమి సదస్సుకు వెళ్లకపోవడం ద్వారా బంగ్లాదేశ్ సాధించిందేంటి? ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ తనకుతానే నష్టం చేసుకుందా? అనే వాదనలు అక్కడ వినిపిస్తున్నాయి.

'బ్రిక్స్ సదస్సులో ఏదో కొత్తది రూపుదిద్దుకున్నట్టు కనిపిస్తోంది. దాని తుది ఫలితం ఏంటో తెలియదు కానీ, వారు సహకారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే వరుసలో డిజిటల్ కరెన్సీ స్థాయిలో సమన్వయాన్ని పెంచుకోవడంతోపాటు, ప్రతి దేశం తన సొంత కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని అమెరికాలో బంగ్లాదేశ్ మాజీ రాయబారిగా పనిచేసిన హుమాయూన్ కబీర్ బంగ్లాదేశ్ ఇంగ్లిష్ న్యూస్ వెబ్‌సైట్ 'ది బిజినెస్ స్టాండర్డ్'తోఅన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'భారత్‌లో వ్యాపారం చేస్తే భారతీయ కరెన్సీలో, చైనాలో అయితే చైనీస్ కరెన్సీలో లావాదేవీలు జరపొచ్చు. అంటే వారు ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అందరితోనూ సంబంధాలు కలిగి ఉండి, ఈ 11 సభ్య దేశాలతోనూ వాణిజ్య సంబంధాలున్న బంగ్లాదేశ్‌లాంటి దేశానికి ఇది చాలా కీలకం' అని హుమాయూన్ కబీర్ తెలిపారు.

'ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఈ ఆర్థిక నెట్‌వర్క్‌తో అనుసంధానం కాగలిగితే పరిస్థితి మెరుగుపడేది. రష్యా నుంచి అణు విద్యుత్ కేంద్రం తీసుకున్న తర్వాత అమెరికా ఆంక్షలు వస్తాయనే టెన్షన్ ఉండేది కాదు. ఎందుకంటే రష్యాతో బంగ్లా వ్యాపారం 'టాకా' లేదా 'రూబుల్'లో జరిగితే, డాలర్ల ద్వారా విధించే ఆంక్షల ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది' అని ఆయన అన్నారు.

'అక్కడ 11 దేశాల అధినేతలున్నారు. అలాంటి చోట బంగ్లాదేశ్ తన ఉనికి చాటుకుంటే వారితో మాట్లాడటానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి గొప్ప అవకాశం దొరికేది. దీనికి దౌత్యనీతి ప్రాముఖ్యం ఉంది. బంగ్లా వెళ్లకపోవడం వల్ల ఆ అవకాశం కోల్పోయింది. ఆ కోణంలో చూస్తే బ్రిక్స్ సదస్సుకు వెళ్లడమే మంచి నిర్ణయం అయి ఉండేది' అని ఆయన అభిప్రాయపడ్డారు.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (కుడివైపు) 2026 జూన్ 22న బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్‌కు స్వాగతం పలుకుతున్న ఫోటో.

బంగ్లాదేశ్ ఎందుకలా చేసింది?

బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్‌తో బేరసారాలు జరుపుతున్నారని థింక్ ట్యాంక్ 'సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్' సీనియర్ ఫెలో కాన్‌స్టాంటినో జెవియర్ అభిప్రాయ పడ్డారు.

'వారు ఒక పెద్ద ద్వైపాక్షిక ఒప్పందం కోసం, అలాగే ప్రత్యేకంగా దిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు ఎదురుచూస్తున్నారు. బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక భావాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఈ టైంలో దిల్లీలో జరిగే బహుపాక్షిక సమావేశానికి హాజరైతే వచ్చే ఫొటోలు, అక్కడి రాజకీయ సందేశం ప్రధానికి, బీఎన్‌పీ పార్టీకి రాజకీయంగా భారీ నష్టం కలిగించే అవకాశం ఉంది' అని జెవియర్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

'బంగ్లాదేశ్ భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక అంశానికి, బిమ్‌స్టెక్ ఛైర్మన్‌గా తనకున్న బాధ్యతల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. దీని ప్రభావం ఇతర సభ్య దేశాల ప్రయోజనాలపై కూడా పడింది. కనీసం బంగ్లాదేశ్ తరఫున ఒక మంత్రినో లేదా ఇతర సీనియర్ ప్రతినిధినో ఆ సదస్సుకు పంపి ఉండాల్సింది' అని ఆయన అభిప్రాయపడ్డారు.

బంగ్లాదేశ్‌, జహంగీర్‌నగర్ యూనివర్సిటీ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్' మాజీ ప్రొఫెసర్, హెడ్, డాక్టర్ దిలారా చౌదరి
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లోని జహంగీర్‌నగర్ యూనివర్సిటీ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్' మాజీ ప్రొఫెసర్ డాక్టర్ దిలారా చౌదరి

'భారత్ ఎలా కారణమవుతుంది?'

'బ్రిక్స్ సదస్సుకు దూరంగా ఉండటానికి భారత్ ఎలా కారణమవుతుంది? ఇది ఎలాంటి ద్వైపాక్షిక అంశం కాదు, భారత్‌తో ఉన్న వివాదమూ కాదు. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా భారత్‌లో జరిగే ద్వైపాక్షిక పర్యటనను తిరస్కరించడం వేరు, కానీ బ్రిక్స్ ఓ భిన్నమైన విషయం. అదొక బహుపాక్షిక సంస్థ. బంగ్లాదేశ్ కచ్చితంగా ఇందులో భాగం అయ్యుండాల్సింది' అని బంగ్లాదేశ్‌లోని జహంగీర్‌నగర్ యూనివర్సిటీ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్' మాజీ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ దిలారా చౌదరి 'ది బిజినెస్ స్టాండర్డ్'తో చెప్పారు.

'బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధి పూర్తిగా వాణిజ్యం, పెట్టుబడులపై ఆధారపడి ఉంది. ఇలాంటి అవకాశాలు పొందాలంటే బహుపాక్షిక అంతర్జాతీయ వేదికలు కీలకం. అలాంటప్పుడు మనం అక్కడికి ఎందుకు వెళ్లలేదు? భారత్‌తో ఉన్న ఉద్రిక్తతల కారణంగానే దీనికి దూరంగా ఉండడం అన్నది ఎంతవరకు కరెక్ట్' అని ఆమె అన్నారు.

భారత్-బంగ్లా సంబంధాల ప్రాముఖ్యత

సుమారు 18 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్ భారత్‌కు కీలకమైన పొరుగు దేశం. భారత్‌తో బంగ్లా 4,096 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు పంచుకుంటోంది. 1975లో షేక్ ముజీబుర్ రెహమాన్, ఆయన కుటుంబ సభ్యుల హత్యతో ప్రారంభమైన దీని చరిత్ర రాజకీయ అస్థిరతతో కూడుకుని ఉంది. ఈ నేపథ్యంలో, ఈశాన్య భారత్‌తో అనుసంధానినికి బంగ్లాదేశ్ చాలాకీలకం. అందువల్ల భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఇరుదేశాలకు కీలకం.

తుర్కియే, విదేశాంగ మంత్రి, హాకాన్ ఫిదాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుర్కియే విదేశాంగ మంత్రి హాకాన్ ఫిదాన్ (ఎడమవైపు) 2026 జూన్ 6న ఢాకా పర్యటనకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్.

తారిక్ రెహమాన్‌ను ఆపింది ఎవరు?

'బంగ్లాదేశ్‌లోని భారత్ వ్యతిరేక లాబీ మాట నెగ్గిందని, వారే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు వెళ్లకుండా తారిక్ రెహమాన్‌ను అడ్డుకున్నారనుకుంటున్నా" అని భారత ప్రధాన ఆంగ్ల దినపత్రిక 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో సెప్టెంబర్ 17న జరిపిన సంభాషణలో బంగ్లాదేశ్‌లో భారత మాజీ హై కమిషనర్ పినాక్ రంజన్ చక్రవర్తి అన్నారు.

'బంగ్లాదేశ్ భారత్‌ను విస్మరించలేదు, అలాగే నాగరికతకు సంబంధించిన ఉమ్మడి వారసత్వం కారణంగా భారత్ స్థానాన్ని వేరే ఏ దేశం భర్తీ చేయలేదు. లక్షలమంది బంగ్లాదేశీయులు వైద్యం కోసం భారత్‌కు వస్తారు. రెండు దేశాల మధ్య భారీ స్థాయిలో వాణిజ్యం, కనెక్టివిటీ ఉన్నాయి. ఈ బంధాన్ని విస్మరిస్తే అది బంగ్లాదేశ్ తనంతట తానుగా కొనితెచ్చుకునే ముప్పే అవుతుంది.

భారత్ వైపు నుంచి తగినంత చొరవ చూపించారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బంగ్లానే. ఈ బంధాన్ని పరిమిత స్థాయిలోనే ఉంచుతామని వారు అనవచ్చు, అందులో ఎలాంటి సమస్యా లేదు. ఇలాంటి వైఖరిని గతంలో కూడా చూశాం. భారత్ ప్రధానంగా రెండు దేశాల సంబంధాలకు మూలస్తంభాలైన అంశాలపైనే దృష్టి పెడుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్థికపరమైందే.

తారిక్ రెహమాన్‌కు చెందిన బీఎన్‌పీ వివిధ ప్రయోజనాలున్న సమూహాల కలయిక. ఇందులో వ్యాపార వర్గాలు, పాకిస్తాన్ అనుకూల లాబీ, జమాత్-ఎ-ఇస్లామీ లాబీ ఉన్నాయి. ఇందులో భారత్‌తో మంచి సంబంధాలు కోరుకునే వారు కూడా ఉన్నారు, కానీ వారిని నోరెత్తనివ్వడం లేదు. భారత్-బంగ్లా మధ్య 54 ఉమ్మడి నదులు ఉన్నాయి. కానీ కేవలం ఒకే ఒక్క గంగా జల ఒప్పందం మాత్రమే ఉంది. కానీ అది కూడా డిసెంబర్‌లో ముగియనుంది.. పశ్చిమ బెంగాల్ వ్యతిరేకించడం వల్ల తీస్తా ఒప్పందం కుదరలేదు' అని పినాక్ రంజన్ చక్రవర్తి వివరించారు.

బంగ్లాకు చేజారిన అవకాశం

తారిక్ రెహమాన్ బ్రిక్స్ సదస్సుకు హాజరుకాకపోవడాన్ని చేజారిన అవకాశం' అని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'డైలీ సన్' పేర్కొంది.

'ఈ మొత్తం పరిణామంపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న వ్యూహాత్మక ఆలోచనా విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ విధానాన్ని కేవలం రాచరికపు అవమానాలు, ప్రొటోకాల్ వివాదాలు లేదా ఆహ్వానంలోని పదాల సంకుచిత వ్యాఖ్యల ఆధారంగా నడిపించలేం. దీనికి దూరదృష్టి, సృజనాత్మకత, భవిష్యత్తును ముందుగానే ఊహించగల సామర్థ్యం చాలా అవసరం.

చిన్న చిన్న కారణాలు చూపించి ఈ అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది తప్ప, బ్రిక్స్ సంస్థేమీ బంగ్లాకు తలుపులు మూయలేదు. కానీ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మాత్రం హాజరుకాకుండా.. ఆహ్వాన పత్రికలో ఏ పదాలు వాడారనే దానిపై అనవసరమైన చర్చలు పెట్టుకుందని డైలీ సన్ రాసింది.

దౌత్యపరమైన అవకాశాలు అరుదుగా మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. పరిస్థితులు, వ్యక్తులు, మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాల వల్ల ఇవి ఏర్పడతాయి. అంతే వేగంగా కనుమరుగవుతుంటాయి. పరిణితి చెందిన విదేశాంగ విధానం ఇలాంటి సువర్ణావకాశాలను గుర్తించి, వెంటనే స్పందిస్తుంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కూడా అలాంటిదే, కాబట్టి బంగ్లాదేశ్ అక్కడ కచ్చితంగా ఉండి ఉండాల్సింది' అని ఆ పత్రికా కథనంలో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)