నోరుజారి 42 ఏళ్ల కిందట చేసిన హత్య రహస్యాన్ని అండర్ కవర్ ఆఫీసర్‌కు చెప్పిన సోదరులు, జీవితఖైదు విధించిన కోర్టు

ఫొటో సోర్స్, Metropolitan Police
- రచయిత, గై లిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
(గమనిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు, వివక్ష పూరిత భాష కొందరిని కలవరపెట్టవచ్చు)
అది 1984 మే 1 అర్ధరాత్రి. బ్రిటన్‌లోని ఈస్ట్ ఫించ్లీ స్టేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగి ఆంథోనీ లిట్లర్ (45) రైలు దిగి, ఇంటి వైపు వెళ్లే ఒక చీకటి సందులోకి నడిచారు.
రెండు నిమిషాల తర్వాత, ఆంథోనీ ప్రాణాపాయ స్థితిలో నేలపై పడి ఉన్నారు. ఒంటరిగా ఉంటూ, రియల్ ఏల్ (ఒక రకమైన మద్యం) తాగడానికి ఇష్టపడే ఆంథోనీని స్నేహితులు "జెంటల్ జెయింట్" (మృదు స్వభావి) అని అనేవారు.
ఆయన తలపై దుండగులు రెండుసార్లు బలంగా కొట్టారు. ఏ వస్తువులూ దొంగతనం జరగలేదు. ప్రత్యక్ష సాక్షులు లేరు, ఫోరెన్సిక్ ఆధారాలు దొరకలేదు, స్పష్టమైన కారణం కూడా తెలియలేదు.
ఈ ఘటనలో 42 సంవత్సరాల పాటు ఎవరికీ శిక్ష పడలేదు.

2026 జులై 10 నాటిని పరిస్థితి మారిపోయింది. ఈ హత్యకు కారణమైన మైఖేల్ స్టీవర్ట్ (57), ఆంథోనీ స్టీవర్ట్ (60)లకు ఓల్డ్ బెయిలీ కోర్టు వరుసగా కనీసం 10 ఏళ్లు, 15 ఏళ్ల జైలు శిక్షతో కూడిన జీవిత ఖైదు విధించింది. దాడి జరిగిన సమయంలో ఈ సోదరుల వయసు 15, 18 ఏళ్లు.
ఆంథోనీ లిట్లర్ స్వలింగ సంపర్కుడనే దానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, స్టీవర్ట్ సోదరులు దోపిడీ చేయడానికి స్వలింగ సంపర్కులనే లక్ష్యంగా చేసుకున్నారని జడ్జి జస్టిస్ కట్స్ పేర్కొన్నారు. "1984 నాటి కాలం, పరిస్థితులు చాలా భిన్నమైనవి" అన్నారు.
"బాధితుడి కోసం మీ ముఠా మాటు వేసి కూర్చుందని నాకు కచ్చితంగా తెలుసు. మీరు ఒక మంచి, నిజాయితీ గల వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీశారు" అని సీనియర్ జడ్జి జస్టిస్ కట్స్ నిందితులతో అన్నారు.
అండర్‌కవర్ ఆపరేషన్
చాలావరకు పాత నిగూఢ కేసులు సైన్స్ సహాయంతో వీడుతుంటాయి. డీఎన్ఏ, వేలిముద్రలు, పాత ఆధారాలను సరికొత్త సాంకేతికతతో పరీక్షించడం ద్వారా నిందితులను పట్టుకుంటారు.
కానీ, ఈ కేసు భిన్నమైనది. డిటెక్టివ్‌లు ఒక అండర్‌కవర్ ఆపరేషన్‌ను ఎంచుకున్నారు. మైఖేల్ స్టీవర్ట్ ఇల్లు, కారుతోపాటు ఆయన సోదరుడి కారులోనూ నిఘా పరికరాలను అమర్చారు. ఇద్దరు రహస్య అధికారులను మైఖేల్ జీవితంలోకి పంపారు.
గడిచిన సంవత్సరాల్లో మైఖేల్ పదే పదే చేసిన ఒకే ఒక్క పనిని మళ్లీ చేసే వరకు అధికారులు వేచి చూశారు. అదేంటంటే - నోరు విప్పి మాట్లాడటం.
ఆంథోనీ లిట్లర్‌కి రియల్ ఏల్ తాగడం ఇష్టం. తన జీవితంలో చివరి సాయంత్రం, ఆయన లండన్ అవతలి వైపు ఉన్న కార్షాల్టన్‌లోని ఒక పబ్‌కు వెళ్లారు. అక్కడ 'సొసైటీ ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ బీర్స్ ఫ్రమ్ ది వుడ్' సమావేశంలో పాల్గొని, స్నేహితులతో కలిసి మద్యం తాగారు.

ఫొటో సోర్స్, Family photo
పబ్ మూసివేసే సమయంలో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. లండన్ మీదుగా ప్రయాణించి ఈస్ట్ ఫించ్లీ చేరుకున్నారు ఆంథోనీ. ఇంటికి త్వరగా వెళ్లడానికి రైల్వే లైన్ పక్కనే ఉన్న ఇరుకైన సందులోకి తిరిగారు.
అక్కడికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే ఆయనపై దారుణంగా దాడి జరిగింది. ఆయనకు మళ్లీ స్పృహ రాలేదు.
ఆంథోనీ లిట్లర్ ఎదురుదాడి చేసే వ్యక్తి కాదనే విషయమే తనను ఇప్పటికీ వేధిస్తోందని విరాల్‌లోని బెబింగ్టన్‌కు చెందిన పాట్రిసియా అన్నారు.
"ఆయన చిన్నప్పుడు కుక్కపై కనీసం రాయి విసరడానికి కూడా ఇష్టపడేవారు కారు. దయా హృదయంతో ఉండేవారు. అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా అన్యాయం" అన్నారు.

ఈ హత్య కేసుల నిందితుల గురించి ఐటీవీకి చెందిన 'పోలీస్ 5', బీబీసీ వన్‌కి చెందిన 'క్రైమ్‌వాచ్' కార్యక్రమాల్లో చేసిన విజ్ఞప్తుల వల్ల ఎలాంటి ఫలితం లేకపోయింది. దీనితో 1985 జనవరిలోనే ఈ దర్యాప్తును ముగించారు.
1993లో జరిగిన రెండో విచారణ కూడా ముందుకు సాగలేదు. 2012-2015 మధ్య జరిగిన మూడో ప్రయత్నంలోనూ ఎవరిపైనా ఆరోపణలు నమోదు కాలేదు.
‘‘ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయారని, నిందితులు దొరకలేదనే నిజాన్ని నేను అంగీకరించాను’’ అని పాట్రిసియా చెప్పారు.
ఈ కేసు నుంచి తప్పించుకున్నామని హంతకులు 42 సంవత్సరాలపాటు భావించి ఉంటారని ఆమె చెప్పారు. "పోలీసులు ఈ తాజా దర్యాప్తును చేపట్టేంత వరకు, వారు నిజంగానే తప్పించుకు తిరిగారు" అన్నారామె.

ఫొటో సోర్స్, Family photo
చిన్ననాటి కుటుంబ రహస్యం
మెట్రోపాలిటన్ పోలీసులు మొదట్లో దర్యాప్తు ప్రారంభించిన తొలి రోజుల్లోనే, ఆ సందు నుంచి కొన్నివందల గజాల దూరంలో ఉన్న స్టీవర్ట్ కుటుంబం ఇంటి తలుపు తట్టారు. అక్కడ పోలీసులు 15 ఏళ్ల మైఖేల్ స్టీవర్ట్‌తో, వారం తర్వాత ఆయన సోదరుడు ఆంథోనీ స్టీవర్ట్(18)తో మాట్లాడారు.
ఇంటింటికీ వెళ్లి దర్యాప్తు చేశాక, రాసిన వివరాల పత్రాలలో, హత్య జరిగిన రాత్రి ఆ సోదరులిద్దరూ ఇంట్లోనే ఉన్నట్లు నమోదైంది. ఆంథోనీ స్టీవర్ట్‌కి సంబంధించిన పత్రంపై "ఆ సందును ఉపయోగించడు" అనే ఒక నోట్ రాసి ఉంది.
కానీ ఇది నిజం కాదు. ఆ సోదరులకు హింస అంటే ఇష్టమని, సంవత్సరాలుగా పోలీసుల దృష్టిలో పడుతూనే ఉన్నారని కోర్టు విచారణలో తేలింది.
2013లో ఆ సోదరుల మధ్య తీవ్రమైన వివాదం నడిచింది. ముగ్గురిలో చిన్నవాడైన డేనియల్‌కు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదు, ఆంథోనీ హత్యకు గురైనప్పుడు అతనికి కేవలం 10 ఏళ్లు.
ఆ కుటుంబ వివాదం సమయంలో, మైఖేల్ తన ఇల్లు తగలబెడతానని, తనను చంపేస్తానని బెదిరించినట్లు డేనియల్ పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత డేనియల్ డిటెక్టివ్‌లకు అంతకంటే చాలా తీవ్రమైన ఒక చిన్ననాటి కుటుంబ రహస్యాన్ని వెల్లడించారు.
హత్య జరిగిన కొద్దిరోజుల్లోనే మైఖేల్ స్టీవర్ట్ ఆ ఘోరం గురించి గొప్పగా చెప్పుకున్నాడని ఆయన తెలిపారు. ఆయన సోదరుడు ఆంథోనీ స్టీవర్ట్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషయం గురించి మాట్లాడారు.
స్వలింగ సంపర్కులని భావించిన పురుషులపై దాడులు చేయడానికి తన సోదరులు బయటకు వెళ్లేవారని, దొంగతనం చేసే ప్రయత్నం విఫలం కావడంతో లిట్లర్‌పై దాడి జరిగిందని డేనియల్ పోలీసులకు వివరించారు.
‘‘వారు కేవలం ఆయన్ను దోచుకోవాలనుకున్నారు, కానీ ఆయన చనిపోయారు’’ అని డేనియల్ పోలీసులకు చెప్పారు.
వివరాలు అందించిన వ్యక్తి అతనొక్కడే కాదు. చట్టపరమైన కారణాల వల్ల పేరు వెల్లడించలేని ఆ కుటుంబానికి చెందిన ఒక సన్నిహితుడు గత విషయాలను గుర్తుచేసుకున్నారు.
మైఖేల్ ఒక కారులో వెళ్తూ స్టేషన్ వైపు వేలు చూపిస్తూ, ‘‘మేం ఆయన్ను చంపింది అక్కడే’’ అనే అర్థం వచ్చేలా మాట్లాడినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Family photo
2019లో డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ నీల్ జాన్ మెట్రోపాలిటన్ పోలీస్ స్పెషలిస్ట్ క్రైమ్ విభాగానికి వచ్చినప్పుడు, ఆయనకు అప్పగించిన పాత కేసులలో ఇది కూడా ఒకటి.
"ఆ సమయంలో కేసు పత్రాలు, ఆధారాలు కనిపించకుండా పోయాయి. సీసీటీవీ దృశ్యాలు లేవు, ఫోరెన్సిక్ ఆధారాలూ లేవు. మేం మాట్లాడాలని అనుకున్న ప్రతి సాక్షీ అప్పటికే మరణించారు" అని జాన్ అన్నారు.
దీనితో ఆయన బృందం మిగిలి ఉన్న సమాచారంతోనే ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించింది. ఒక మ్యూజియం క్యూరేటర్ సహాయంతో 1984 నాటి రైలు టైమ్‌టేబుల్ వివరాలను విశ్లేషించారు. ఈస్ట్ ఫించ్లీ పరిసర వీధులు మారిపోవడంతో, బ్రిటీష్ లైబ్రరీ నుంచి నాటి అసలైన ఆర్డ్నెన్స్ సర్వే మ్యాప్‌లను సేకరించారు.
కనిపించకుండా పోయిన ఆధారాలను కనుగొనాలనే ఆశతో ఒక పోలీసు పరిశోధన బృందం మెట్రోపాలిటన్ పోలీస్ స్టోర్ రూమ్‌లో వారం రోజుల పాటు గాలించి, 200కు పైగా పెద్ద పెట్టెలను పరిశీలించింది.
కానీ, వారికి ఏమీ దొరకలేదు.
అయితే పాత పత్రాలు, నాటి సాక్షుల వాంగ్మూలాలు, సోదరులు ఒప్పుకున్నట్లు చెబుతున్న విషయాలు డిటెక్టివ్‌లు ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని చూపించాయి.
ఈ సమాచారమంతటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, రహస్య ఆపరేషన్ నిర్వహించడానికి అవసరమైన బలమైన ఆధారాలు ఈ కేసులో ఉన్నాయని జాన్ విశ్వసించారు. దీనికి అనుమతి లభించడంతో 2023 సెప్టెంబర్‌లో 'ఆపరేషన్ స్నోపిచ్' ప్రారంభమైంది.
"నా జీవితంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి కేసును చూడలేదు" అని జాన్ చెప్పారు.
"ఇకపై కూడా నా కెరీర్‌లో ఇలాంటి కేసును మళ్లీ చూడలేను" అన్నారు.

ఫొటో సోర్స్, Metropolitan Police
నోరు జారిన నిందితుడు..
'ఆపరేషన్ స్నోపిచ్' పూర్తిగా సహనంతో పూర్తి చేయాల్సింది. మైఖేల్ స్టీవర్ట్ ఫ్లాట్, కారుతో పాటు ఆంథోనీ స్టీవర్ట్ కారులోనూ నిఘా పరికరాలను రహస్యంగా అమర్చారు. అయితే ఈ ఆపరేషన్‌లో అత్యంత కీలకమైన భాగం మరింత వ్యక్తిగతమైంది. జేజే, ఏన్ అనే ఇద్దరు అండర్‌కవర్ అధికారులను మైఖేల్ స్టీవర్ట్ జీవితంలోకి పంపారు.
మొదట జేజే రంగంలోకి దిగారు. మైఖేల్ ఉంటున్న ఫ్లాట్స్ సముదాయంలో పాడైన లిఫ్ట్ గురించి మాటలు కలిపారు. కొద్దిరోజుల్లోనే మైఖేల్‌తో జేజే ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. ఇద్దరూ కలిసి గ్యాంగ్‌స్టర్ సినిమాలు చూడటం, వీడియో గేమ్స్ ఆడటం చేసేవారు. మైఖేల్ చెప్పే కథలను జేజే వినేవారు.
మూడు నెలల కాలంలో జేజేతో మైఖేల్ సంబంధం ఎంత బలపడిందంటే, ఆ తర్వాత హత్య కేసులో మైఖేల్ స్టీవర్ట్‌ను అరెస్ట్ చేసినప్పుడు, తనను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాల్సిందిగా ఆయన జేజేనే కోరారు.
కారులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మైఖేల్ నోరు విప్పారు.
తను మాట్లాడుతున్న మాటలను రికార్డ్ చేస్తున్నారనే విషయం తెలియక, "ఆ పని ఎవరు చేశారో నాకు తెలుసు" అని జేజేతో రహస్యంగా చెప్పారు.
అది తన సోదరుడు, ఆయన ముగ్గురు స్నేహితులని మైఖేల్ తెలిపారు. వారు స్వలింగ సంపర్కులపై దాడులు చేయడానికి బయటకు వెళ్లారని, ఒక సందులో ఒక వ్యక్తిని చుట్టుముట్టి ఆయన తలపై బలంగా కొట్టారని కోర్టు విచారణలో వెల్లడైంది.
అయితే ఆంథోనీ లిట్లర్ స్వలింగ సంపర్కుడనడానికి ఎలాంటి ఆధారాలూ కోర్టు ముందు పెట్టలేదు.

ఫొటో సోర్స్, Ordnance Survey
అయితే, ఈ నెలల కాలంలో మైఖేల్ పదే పదే తన సోదరుడి వైపే వేలు చూపిస్తూ, ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కానీ, రికార్డింగులు ఆయన్ను పట్టుకున్నాయి.
మరో అండర్‌కవర్ అధికారిణి ఏన్.. మైఖేల్‌తో విడిగా పరిచయం పెంచుకున్నారు. 2023 డిసెంబర్‌లో ఒక కేఫ్‌లో రహస్యంగా రికార్డ్ చేసిన సంభాషణలో, నీ మేనల్లుడు ఎవరో ఒకరిని చంపాడట కదా అని ఆమె అడిగారు.
దానికి మైఖేల్ స్పందిస్తూ, "నా మేనల్లుడు ఎవరినీ చంపలేదు. ఆ పని చేసింది నా సోదరుడే" అని చెప్పారు.
ఈ సమయానికి దర్యాప్తు బహిరంగమైంది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు మైఖేల్‌ను అరెస్ట్ చేసి విచారించి, ఆపై విడుదల చేశారు. అయితే మైఖేల్ చుట్టూ అండర్‌కవర్ ఆపరేషన్ నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Metropolitan Police
ఆ తర్వాత 2024 మార్చిలో జరిగిన ఒక పోలీసు విచారణలో, మైఖేల్ నోరు జారి చెప్పిన ఒక విషయం.. ఆయన కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారని నిరూపించడానికి సహాయపడింది.
ఆ రాత్రి తన ఒంటిపై రక్తం అంటిందనే విషయాన్ని తిరస్కరిస్తూ, మైఖేల్ ఒక్కసారిగా "నేను సందు పైభాగంలో నిలబడి కాపలా కాస్తుంటే.. నా ఒంటిపైకి రక్తం ఎలా వస్తుంది? ఆలోచించండి" అన్నారు.
మైఖేల్ కాపలా కాశాడని పోలీసులు కానీ, ఆయన కుటుంబం కానీ లేదా ఏ ఒక్క సాక్షీ ఎప్పుడూ ఆరోపించలేదని ప్రభుత్వ న్యాయవాది జాన్ ప్రైస్ కేసీ జ్యూరీకి చెప్పారు.
ఆ వివరాలు మైఖేల్ సొంత జ్ఞాపకాల్లో తప్ప మరెక్కడా లేవు.
మాటలతో తప్పించుకోవాలని చూసే ప్రయత్నంలో, లిట్లర్‌ను కొట్టి కింద పడేసినప్పుడు తాను ఆ సందు పైభాగంలోనే ఉన్నట్లు ఆయన స్వయంగా ఒప్పుకున్నారు.
1984 నుంచి ఫైళ్లలో పూడుకుపోయిన ఒక రహస్యాన్ని ఇది విప్పింది. దాడి జరిగిన రెండు నిమిషాల తర్వాత, ఒక యువకుడు ఆ సందు పక్కనే ఉన్న ఫోన్ బాక్స్ నుంచి 999 నంబర్‌కు ఫోన్ చేసి, తీవ్రంగా రక్తస్రావమవుతున్న ఒక వ్యక్తి కోసం అంబులెన్స్ కావాలని కోరాడు. ఆ తర్వాత తన పేరు చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు.
అక్కడ ఆధారాలేవీ దొరక్కపోవడంతో, ఆ ఫోన్ కాల్‌ను ఒక తప్పుడు సమాచారంగా భావించి వదిలేశారు. అక్కడ ఉన్న వ్యక్తికి మాత్రమే అంత త్వరగా ఆ విషయం తెలిసే అవకాశం ఉందని ప్రైస్ చెప్పారు.
ఆ ఫోన్ చేసిన వ్యక్తి 15 ఏళ్ల మైఖేల్ స్టీవర్టేనని జ్యూరీకి ప్రాసిక్యూషన్ తెలిపింది. కాపలా కాసిన అతడే మొదట అక్కడి నుంచి పారిపోయాడని, తన ముఠా ప్రాణాపాయ స్థితిలో వదిలేసి వెళ్లిన వ్యక్తిని కాపాడటానికి ఫోన్ చేశాడని వివరించింది.

ఫొటో సోర్స్, Metropolitan Police
'మా కజిన్ జీవితాన్ని నాశనం చేశారు'
కజిన్‌ను చంపిన వ్యక్తులకు ఎట్టకేలకు శిక్ష పడిందనే వార్త పాట్రిసియాలో తీవ్ర భావోద్వేగాన్ని నింపింది.
"మీకు ఎంత ధైర్యం? మీరు నా కజిన్ జీవితాన్ని నాశనం చేశారు, మీరేమో హాయిగా జీవించారు. వారు 42 సంవత్సరాల పాటు స్వేచ్ఛను అనుభవించారు, కానీ నా కజిన్ మాత్రం ఈ 42 ఏళ్లుగా జీవితాన్ని కోల్పోయారు. ఆయనకు పెళ్లి చేసుకుని, ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకునే అవకాశం కూడా దక్కకుండా పోయింది. ఎట్టకేలకు న్యాయం జరిగిందనే విషయం ఒక ఉపశమనాన్ని ఇస్తోంది. ఈ తీర్పు జరిగిన బాధను దూరం చేయలేదు, ఆయన్ను తిరిగి తీసుకురాలేదు. కానీ, ఇప్పటికైనా ఆయనకు న్యాయం దక్కింది. ఆ దుర్మార్గులను ఎట్టకేలకు పట్టుకున్నారు" అని పాట్రిసియా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























