ఫ్రాన్స్ కార్చిచ్చుల్లో పేలుళ్లు, అవి రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబులేనా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఒటిలీ మిషెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతంలో కార్చిచ్చు వల్ల అక్కడి లీ పోర్జ్ గ్రామంలో ఏళ్ల నాటి 400 బాంబులు, పేలుడు పదార్థాల నిల్వ బయటపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
మొదట గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయని భావించామని అయితే, కార్చిచ్చు వేడికి రెండో ప్రపంచ యుద్ధం నాటి మందుగుండు సామాగ్రే పేలి ఉండొచ్చని స్థానిక ఫైర్ కమాండర్ స్థానిక మీడియాతో చెప్పారు.
కార్చిచ్చు చెలరేగిన రెండో రోజు రాత్రి 100కు పైగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, అది యుద్ధ శబ్దాన్ని తలపించిందని ఫ్రెంచ్ వార్తాసంస్థ ఫ్రాన్స్ ఇన్ఫోతో స్థానిక మేయర్ మార్షల్ జానైట్టీ పేర్కొన్నారు.
బాంబు నిర్వీర్య చర్యలు చేపట్టడంతో చాలామంది నివాసితులు ఇప్పుడు తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశంపై ఇప్పటికీ నిషేధం ఉందని మేయర్ తెలిపారు. ఈ కార్చిచ్చులో ఆ ప్రాంతంలోని 180కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
"మా మున్సిపాలిటీ పరిధిలోని భూమిలో మందుగుండు సామగ్రి నిల్వలు పాతిపెట్టి ఉన్నాయి. కానీ, ఆ విషయం మాకు తెలియదు. అవి పేలిపోయాయి" అని జానైట్టీ ఫ్రాన్స్ ఇన్ఫోకు తెలిపారు.
అవి అటూ ఇటూ ఎగిరిపడ్డాయని, 'ఒకటైతే నేరుగా ఒక ఇంటి గుండా దూసుకెళ్లిందని' అన్నారు.
సముద్ర తీరానికి, ఒక క్యాంప్‌సైట్‌కు, లా జెన్నీ గ్రామానికి రాకపోకలపై నిషేధం కొనసాగుతోందని మేయర్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఏ దేశాలకు చెందినవి?
ఆ చారిత్రక ఆయుధాలు జర్మన్, ఫ్రెంచ్ దేశాలకు చెందినవని, వాటిలో మోర్టార్ షెల్స్, యాంటీ ట్యాంక్ షెల్స్ ఉన్నాయని ఫ్రెంచ్ మీడియా రిపోర్ట్ చేసింది.
సుమారు 10 రోజుల పాటు ఉగ్రరూపం దాల్చి, ప్రస్తుతం అదుపులోకి వచ్చిన జిరోండే అడవుల కార్చిచ్చు తగ్గాక ఇవి బయటపడ్డాయి.
సోమవారం లీ పోర్జ్ నుంచి వచ్చిన ఫోటోలలో తగలబడిన ఇళ్ల అవశేషాలను కుటుంబాలు పరిశీలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఫొటో సోర్స్, Reuters
సోమవారం ఫ్రెంచ్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను అగ్నిమాపక సిబ్బంది చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుతూ, "ఈ సంక్షోభాన్ని ఫ్రాన్స్ సమర్థవంతంగా ఎదుర్కొంది" అన్నారు.
జిరోండే ప్రాంతంలో మంటలను అదుపు చేసే ప్రక్రియ చివరి దశకు చేరిందని, సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు
గడిచిన రెండు వారాలుగా ఐరోపా వ్యాప్తంగా ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కార్చిచ్చులు తీవ్రంగా వ్యాపించాయి. అక్కడ 3,30,000 మందికంటే ఎక్కువ మంది ప్రజలను ఖాళీ చేయించారు.
నైరుతి ప్రాంతంలో 42,000 హెక్టార్ల వైశాల్యం తగలబడిపోవడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఫ్రాన్స్ ఒకటిగా నిలిచింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సంభవించిన అతిపెద్ద కార్చిచ్చులలో ఒకటి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























