హైవేపై యువతిని వదిలేసిన ఉబెర్ డ్రైవర్.. రూ. 383 కోట్లు చెల్లించాలని కంపెనీకి ఆదేశాలు, అసలేమిటీ కేసు?

ఫొటో సోర్స్, Panish, Shea, Ravipudi
- రచయిత, మాడలిన్ హాల్‌పెర్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
కాలిఫోర్నియా హైవేపై ఓ ఉబెర్ డ్రైవర్ కారును పక్కకు ఆపి 23 ఏళ్ల యువతిని కిందకు దించేయగా.. ఆ తర్వాత మరో వాహనం ఢీకొనడంతో ఆమె మృతిచెందారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 383 కోట్లు) చెల్లించాలని రైడ్‌షేర్ కంపెనీ ఉబెర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
2023 ఆగస్టు 12న ఎమిలీ నార్మాండిన్-పార్కర్ తన స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ బుక్ చేసుకున్నారు.
అయితే, మార్గమధ్యలో ఆమె స్నేహితురాలికి అనారోగ్యంగా అనిపించి కారులో వాంతి చేసుకుందని కోర్టు పత్రాలు చెబుతున్నాయి.
హైవే పక్కన కారు ఆపి మత్తులో ఉన్న ఆ మహిళలను డ్రైవర్ బలవంతంగా కిందకు దించేశాడని, ఆ తర్వాత నార్మాండిన్-పార్కర్‌ను మరో వాహనం ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
ఆ డ్రైవర్ స్వతంత్ర కాంట్రాక్టర్ కావడంతో, అతని చర్యలకు కంపెనీ బాధ్యత వహించదని ఉబెర్ వాదించింది.

'ఆ నమ్మకమే మా కుమార్తెను బలితీసుకుంది'
"ఉబెర్ ప్రయాణికులకు చెప్పే విషయాలన్నీ ఎమిలీ పాటించింది. తను డ్రైవింగ్ చేయకుండా బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. ఆమెను సురక్షితంగా ఇంటికి చేరుస్తుందని ఉబెర్‌ను నమ్మాం. ఆ నమ్మకమే మా కుమార్తె ప్రాణాలను బలితీసుకుంది" అని లాస్ ఏంజెలస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తమ కుమార్తె గురించి తల్లిదండ్రులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఐదు రోజుల ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) ప్రక్రియ తర్వాత, బాధిత కుటుంబానికి ఈ మొత్తాన్ని ఉబెర్ చెల్లించాలని న్యాయమూర్తి రిచర్డ్ స్టోన్ ఆదేశించినట్లు వారి తరపున వాదించిన న్యాయ సంస్థ 'పనీష్, షియా, రవిపూడి' తెలిపింది.
ఆర్బిట్రేషన్ అనేది అర్హత కలిగిన మధ్యవర్తి (ఈ కేసులో ఒక రిటైర్డ్ జడ్జి) ద్వారా కోర్టు బయట వివాదాలను పరిష్కరించుకునే ప్రత్యామ్నాయ పద్ధతి.
ఆ మహిళలను హైవేపై వదిలేసిన తర్వాత డ్రైవర్ వు ట్రాన్ కనీసం సహాయం కోసం కూడా ఎవరికీ ఫోన్ చేయలేదని కుటుంబం తరపు న్యాయవాదులు చెప్పారు. దానికి బదులుగా ఆయన అక్కడినుంచి వెళ్లిపోయి ఉబెర్‌కు కాల్ చేసి, నార్మాండిన్-పార్కర్ నుంచి క్లీనింగ్ ఫీజు వసూలు చేయాలని డిమాండ్ చేశాడని న్యాయవాదులు తెలిపారు.
ప్రయాణికుల కంటే తన కొత్త కారు గురించే డ్రైవర్ ట్రాన్ 'ఎక్కువ ఆందోళన' చూపించాడని న్యాయమూర్తి స్టోన్ అన్నారు. హైవే ఎగ్జిట్ తీసుకుని, ఆ మహిళలను సురక్షితమైన ప్రదేశంలో దించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ఉబెర్ ఏమన్నది?
ఈ ఘటనకు కంపెనీని చట్టపరంగా బాధ్యులను చేస్తూ ఆర్బిట్రేటర్ తీసుకున్న నిర్ణయం తప్పని భావిస్తున్నట్లు ఉబెర్ తెలిపింది.
"కొత్త సాంకేతికత, విధానాలు, భద్రతా నిపుణులు సూచించిన రక్షణ చర్యల ద్వారా గత కొన్నేళ్లుగా భద్రత పట్ల మా విధానాన్ని పటిష్టం చేస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగా, సురక్షితం కాని ప్రదేశాల్లో ప్రయాణికులను దించకూడదంటూ డ్రైవర్లకు అదనపు మార్గదర్శకాలు కూడా ఇస్తున్నాం" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
తల్లిదండ్రులకు 10 మిలియన్ డాలర్లు ఇచ్చేలా, అలాగే ఈ ఘటన గురించి బయట ఎక్కడా మాట్లాడకూడదనే షరతుతో ఉబెర్ తొలుత ఒక సెటిల్‌మెంట్‌ను ప్రతిపాదించిందని, కానీ దాన్ని వారు తిరస్కరించారని బాధితురాలి కుటుంబం తరపు న్యాయవాద సంస్థ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























