గట్టుమీదపల్లె: 60 ఉమ్మడి కుటుంబాలు, సుమారు 500 జనాభాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు ఖాళీగా మిగిలింది

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు
ఫొటో క్యాప్షన్, అమ్మన్యమ్మ
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

వీధుల్లో పెద్దవాళ్ల ముచ్చట్లు, పిల్లల ఆటపాటలతో ఒకప్పుడు సందడిగా కనిపించిన ఆంధ్రప్రదేశ్‌లోని ఆ ఊరిలో ఇప్పుడు పక్షుల అరుపులు, కొండగాలి వీస్తున్న శబ్దం తప్ప ఎలాంటి అలికిడి కనిపించడం లేదు.

ఒకప్పుడు కష్టపడి కట్టుకున్న బండ్ల మిద్దెలు ఇప్పుడు చూసుకునే దిక్కులేక మెల్లమెల్లగా శిథిలమవుతున్నాయి.

ఊరంతా అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చిచెట్లు అడవిని తలపిస్తున్నాయి.

అన్నమయ్య జిల్లాలో మదనపల్లె నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబళ్లపల్లె మండలంలోని కోసువారిపల్లె గ్రామ పంచాయతీ గట్టుమీదపల్లె కథ ఇది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

గట్టుమీదపల్లె... పేరు వెనుక కథ ఇదీ..

తిరుమల కొండపై మలుపులు తిరిగినట్లు ఒక ఆరేడు మలుపులు తిరిగి ఒక గుట్టపైకి చేరితే వచ్చే పల్లె కాబట్టే దీనికి గట్టుమీదపల్లె అనే పేరు వచ్చింది.

ఊరు మొదట్లో నాలుగైదు పూరిళ్లు కనిపిస్తాయి.

ఆ తర్వాత లోపలికి వెళ్లేకొద్దీ 50, 60 ఏళ్ల క్రితం భారీగా కట్టుకున్న మిద్దెలు దర్శనమిస్తాయి.

ఊళ్లో ఉన్న మూడు వీధులకూ రెండువైపులా చిన్నాపెద్దా బండ్ల మిద్దెలు కనిపిస్తాయి.

ఒకప్పుడు ఆ ఊరు వైభవం ఏంటో ఆ భారీ బండ్ల మిద్దెలే చెబుతాయి.

కానీ మిద్దెలైనా, పూరిళ్లైనా తమకు తేడా లేదని చెబుతున్నాయి వాటి చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు.

60 ఇళ్లు ఉన్న గట్టుమీదపల్లెలో ఒకప్పుడు 60 ఉమ్మడి కుటుంబాలు నివసించేవారని స్థానికులు చెబుతున్నారు.

ఒక్కో ఇంట్లో పదిపదిహేనుమంది వరకు ఉండేవారని తెలిపారు.

ఊరి జనాభా 470.. వారిలో 350కి పైగా ఓటర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం 60 ఇళ్లూ ఖాళీ.

ఎవరూ లేని ఆ ఇళ్లలో దొంగతనాల బెడద ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఉన్నవాటిలో కొన్నింటిని దోచుకుపోగా ప్రస్తుతం ఏళ్ల తరబడి మండని పొయ్యిలు, గోడలకు వేలాడుతున్న కుటుంబ సభ్యుల ఫొటోలు, ధాన్యం నింపుకునే దొంతులు మాత్రమే మిగిలాయి.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

ఊరెందుకు ఖాళీ అయిందంటే..

ఒకప్పుడు గ్రామంలో కుటుంబాలు ఎక్కువగా వేరుసెనగ పండించేవి.

వర్షాభావ పరిస్థితులు, బోర్లు వేసినా నీళ్లు పడక అప్పులపాలవడంతో గ్రామస్థులుల ఏ దారీ లేక 20ఏళ్ల నుంచి క్రమేపీ ఊరు వదిలి వెళ్లడం మొదలైంది.

కొందరు మదనపల్లె, బెంగళూరు, తిరుపతి లాంటి వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు.

మిగిలిన వారు దిగువన ఉన్న కోసువారిపల్లెకు వచ్చి కొందరు వ్యవసాయం మరికొందరు కూలీనాలీ చేసుకుని బతుకుతున్నారు.

ఆ పంచాయతీలో అన్ని పల్లెలకంటే ముందు తమ ఊరికే కరెంట్ వచ్చిందని గర్వంగా చెబుతారు గ్రామస్థులు. ఆ ఊళ్లో ఇప్పటికీ లైట్లు వెలుగుతున్నాయి.. రామాలయం, ఒక స్కూల్ కూడా ఉంది.

గత ప్రభుత్వం చివరలో కింది నుంచిపై వరకూ తారురోడ్డు నిర్మించారు.

గత ఎన్నికలకు ముందు కూడా గట్టుమీదపల్లెలో ఐదు కుటుంబాలు నివసించేవి.

తర్వాత వాళ్లు కూడా ఖాళీ చేసేయడంతో ఇప్పుడు ఎవరూ లేని అనాథ పల్లెగా మారింది గట్టుమీద పల్లె.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

చరిత ఘనం.. మరి వర్తమానం?

ఖాళీ అయిపోయిన గట్టుమీదపల్లెను పరిశీలించడానికి బీబీసీ అక్కడకు వెళ్లినపుడు గట్టు దిగువన కోసువారిపల్లెలో నివసిస్తున్న గట్టుమీదపల్లెకు చెందిన కొందరు తమ ఇళ్లు చూపించడానికి బీబీసీతో కలిసి గుట్టమీదకు వచ్చారు.

తమ ఇళ్లు చూపిస్తూ రామసుబ్బారెడ్డి లాంటి వారు ఆవేదనకు లోనయ్యారు.

''ఊరికి పెద్ద చరిత్రే ఉంది. ఇది పెద్ద ఊరు. బోర్లలో నీళ్లు పడ్డం లేదు. నీళ్లు అందుబాటులో లేవు. వర్షాలు లేనప్పుడు పంటలు చేతికి రావడం లేదు. కూలి పనులు కూడా లేవు. ఇక్కడికి ఆటోలు రావు. 2 కిలోమీటర్లు నడిచిపోవాల. అందుకే అందరం కింద పల్లెలకు వెళ్లిపోయాం. వ్యవసాయం లేకపోయినా అక్కడ ఉంటే కూలిపనులైనా చేసుకోవచ్చు. కొందరు కౌలుకు తీసుకుని చేస్తున్నారు. కొందరు కూలిపోతున్నారు. అదీ పరిస్థితి'' అని రామసుబ్బారెడ్డి చెప్పారు.

రామసుబ్బారెడ్డి 20 ఏళ్ల క్రితం ఉళ్లో తమ ఇల్లు ఖాళీ చేసి కింది గ్రామానికి వెళ్లిపోయారు.

''మా ఊళ్లో 500 నుంచి 600 ఎకరాలు ఉంటుంది. 60 కుటుంబాలు ఉన్నాయి. 500 మంది జనాభా ఉండేవారు. మేం ఉన్న సమయానికి 320 ఓట్లు ఉండేవి. తర్వాత ఖాళీ చేసేసరికి తగ్గుతూ పోయాయి. మా ఇల్లు కట్టే 60 ఏళ్లయ్యింది. నేను అప్పుడే పుట్టాను. పెద్దల కాలం నుంచీ మేం ఇక్కడే ఉండేవాళ్లం. మా తాతముత్తాతలు రెండు మూడు వందల ఏళ్ల నుంచీ ఇక్కడే ఉండేవారు'' అని ఆయన అన్నారు.

తమ పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే గ్రామస్థులు కొందరు వారి దగ్గరకు వెళ్లిపోయారని, ఆ పరిస్థితి లేని వారు దిగువ పల్లెకు వెళ్లి అక్కడే కూలీనాలీ చేసుకుంటూ స్థిరపడ్డారని రామసుబ్బారెడ్డి చెప్పారు.

ఎవరూ లేని ఊళ్లో ఉన్న పాడుబడిన తమ ఇంటి గోడలను తడుముతూ పుట్టిన ఊళ్లో ఉన్న ఆనందం వేరే ఎక్కడా ఉండదుగా అని గద్గద స్వరంతో చెప్పారు రెండేళ్ల క్రితమే గట్టుమీదపల్లెలో ఇల్లు ఖాళీ చేసిన రెడ్డప్పరెడ్డి.

''ఇక్కడ్నుంచి వెళ్లి రెండేళ్లు అయ్యింది. ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఈ వ్యవసాయం, ప్రకృతి అన్నీ సంతోషాన్ని ఇస్తాయి. మా అమ్మ నాయన కూడా ఇక్కడే బతికారు. అమ్మ ఉంది, నాయన లేడు. వెళ్లిపోయాడు. పుట్టి పెరిగిన తర్వాత కొన్ని జ్ఞాపకాలైతే ఉంటాయి కదా.. మా ముత్తాతలు ఇక్కడే బతికారు'' అని రెడ్డప్పరెడ్డి చెప్పారు.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

పుట్టిన ఊరు ఖాళీ అయితే..

గట్టుమీదపల్లెకు చెందిన శివశంకర్ రెడ్డి లాంటి వారు దిగువన కోసువారిపల్లెలో ఇల్లు కట్టుకుని అక్కడే స్థిరపడ్డారు.

పొరుగూళ్లో ఎంత సుఖంగా ఉన్నా పుట్టిన ఊరు ఖాళీ అయితే బాధేస్తుందని అన్నారు.

''ప్రస్తుత పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. నీళ్ల సమస్య వల్ల వేరుసెనగ పండడం లేదు. ఐదేళ్లు పంటలు పండకపోయేసరికి పల్లె అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కోసువారిపల్లెలో బోర్లు వేసుకుని అక్కడ సెటిలైపోయాం. ఇల్లు కట్టుకునేశాం. మేం ఊరు వదిలి మూడేళ్లయ్యింది. అంతకు ముందు ఇక్కడే ఉన్నాం. పుట్టిపెరిగి చదువుకున్నది కూడా గట్టుమీదపల్లిలోనే. ఐదో తరగతి వరకూ చదువుకున్నా. పదో తరగతి కోసువారిపల్లెలో చదువుకున్నా. బాధగా ఉంటుంది. పుట్టిన ఊరు కదా.. ఖాళీ అయితే బాధే కదా'' అని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

భూములు దండిగా ఉన్నా నీళ్లు లేక అన్నీ అమ్ముకోని వేరే ఊళ్లకు వెళ్లిపోయారని గట్టుమీదపల్లికే చెందిన అమ్మన్యమ్మ చెప్పారు.

''అక్కడ నీళ్ల ఆదరవు లేదు. భూములేమో దండిగా ఉన్నాయి. ఆవులు, ఎనుములు పెట్టుకుని చాలామంది బతికేవోళ్లు. వేపమానులు, చింతమానులు దండిగా ఉండేవి. వాటితోనే సగం మంది బతికిపోయేవారు. పొలాలన్నీ ఈ చెరవు కింద ఉన్నాయి. పొద్దున్నే వచ్చి, మద్యాహ్నం మళ్లీ గట్టుమీద పల్లికి పొయ్యి పిల్లలకు పాలిచ్చి మల్లి కిందికి వచ్చి మడి నాటి పొయ్యేవాళ్లం" అని ఆమె చెప్పారు.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

మా అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు..

గట్టు దిగువన ఉన్న తరుగువారిపల్లెలో నివసించే వేణుగోపాల్ రెడ్డి గట్టుమీదపల్లెతో తన అనుబంధం ఎలాంటిదో చెప్పారు. ఆ ఊళ్లో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

''చిన్నప్పుడు మా అమ్మ పుట్టిన ఊరు అదే. నా చిన్నప్పుడు ప్రతి ఆదివారం అక్కడకు వెళ్లేవాడిని. జామ చెట్లు ఉండేవి, జామకాయలు కోసుకుంటూ ఆడుకునేవాళ్లం. నా వయసు పిల్లోళ్లు ఉండేవాళ్లు. అక్కడ 75 ఇళ్లు ఉండేవి. మా ఊళ్లో ఇక్కడ 15 ఇళ్లే ఉండేవి. అందుకే అక్కడకు వెళ్లి బాగా ఆడుకునేవాళ్లం. ఆదివారం సాయంత్రం వరకూ అక్కడే ఆడుకుని వచ్చి, తర్వాత రోజు స్కూలుకు వెళ్లేవాళ్లం. ఏవైనా పనులున్నప్పుడు సాయం చేయడానికి మా అమ్మ వాళ్లతో కలిసి గట్టుమీదపల్లె వెళ్లేవాళ్లం'' అని ఆయన చెప్పారు.

ఒక్కో ఇంటికి 150 బస్తాల వేరుసెనగ పండించే గ్రామం ఇప్పుడు ఇలా పాడుబడడం చూస్తుంటే బాధగా ఉంటుందని అంటారు వేణుగోపాల్ రెడ్డి.

''ఒకప్పుడు బాగా బతికిన ఊరు. వేరు శెనగ పంట పండిచేటప్పుడు ఒక్కో ఇల్లు 150 బస్తాలు అలా పండించేవాళ్లు. ప్రతి ఇల్లూ అలా ఉండేది. మా చిన్నప్పుడు పనులకు ఇక్కడి మనుషులు చాలక పలమనేరు, వేరే పల్లెలకు వెళ్లి పిలుచుకొచ్చేవాళ్లు'' అని ఆయన అన్నారు.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

వర్షాధార పంటలే ఆధారం

''వ్యవసాయం వర్షాధారం అంతే, వర్షాధార పంటలు మాత్రమే పండించేవాళ్లం. అది కూడా ఒక పంటే. వాన పడితేనే ఆ పంట కూడా ఉంటుంది. లేదంటే మొత్తం వేస్ట్ అవుతుంది. వేరుసెనగ వేసేవాళ్లం. ఎకరాకు 12 మూటలయ్యేవి. రానురాను తగ్గాయి. పెట్టుబడి చేతుల్లోకి రావడం లేదు. బోర్లు వేసినా నీళ్లు పడట్లేదు. ఒకాయన పట్టుదలతో పది బోర్లు వేశాడు. అన్నీ ఫెయిల్. చాలా నష్టపోయి ఇబ్బందిపడ్డాడు'' అని రామసుబ్బారెడ్డి అన్నారు.

వారానికి ఒకసారి వచ్చి తమ ఊరును చూసుకుని వెళ్తుంటానని గట్టుమీదపల్లెకు చెందిన రెడ్డప్పరెడ్డి చెప్పారు. ఆయన ప్రస్తుతం దిగువన ఉన్న కోసువారిపల్లెలో ఉంటున్నారు.

''మా ఊరి పరిస్థితి ముందు బాగుండేది. 40 ఏళ్ల ముందు ఇది గొప్ప చరిత్ర ఉన్న పల్లె. నేను పుట్టి 55 ఏళ్లయ్యింది. వ్యవసాయం చేసుకుంటున్నా. గొప్పగా బతికిన పల్లె. పరిస్థితులు సరిలేక వెళ్లిపోయారు. ఊరు విడిచిపెట్టి పోలేక వారానికి ఒకసారి వచ్చి పోతుంటాం. వ్యవసాయం బాగా చేశాం. మాకు మేకలు ఉండేవి. కుటుంబం అంతా చెల్లా చెదరైపోయింది" అని రెడ్డప్పరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

గ్రామంలో రామాలయం, స్కూలు

ఒకప్పుడు గ్రామంలోని రామాలయంలో సందడిగా ఉండేదని, ఊళ్లో వాళ్లందరూ భజనలు చేసేవారని, ప్రసాదాలు పంచేవారని గుర్తు చేసుకున్నారు ఆ ఊరి ఆడపడుచు అమ్మన్నమ్మ.

''అక్కడ రామాలయం ఉంది. వారానికొకరోజు, ఇంటికొకరు వేడుకలు చేసి ప్రసాదాలు ఇచ్చి టెంకాయలు కొట్టి భజలు చేసుకుంటూ ఉండేవాళ్లం. ఆనందంగా కాలం గడిపేవాళ్లం. శ్రీరామనవమి వచ్చిందంటే మూడు దినాలు పండగ చేసేవాళ్లు. అట్లాంటిది నీళ్ల ఆదరవు లేక ఒక్కొక్కరుగా వెళ్లిపోయినారు. మిగిలిన 30, 40 ఇళ్లు ఇక్కడ కోసువారి పల్లెకు వచ్చేసి కూలి చేసుకుంటున్నాయి. చెరువు కింద నీళ్లు కూడా లేక ఇప్పుడు సేద్యం కూడా చేసేవాళ్లు లేరులే. కూలికి పోతాండారు అందరూ.''

పాడుబడిన గట్టుమీదపల్లెకు ఇప్పుడు దొంగల బెడదకూడా ఎక్కువయ్యింది. ఇళ్లలో ఎవరూ లేకపోవడం. కొన్ని ఇళ్లకు తాళాలు కూడా లేకపోవడంతో దొంగలు తమకు దొరికిన వస్తువులను దోచుకుపోతున్నారని రామసుబ్బారెడ్డి చెప్పారు.

''దొంగలు పడి మా ఇల్లంతా పగలగొట్టేశారు. మా ఊళ్లో రాముడి గుడి ఉంది. అక్కడ ఇటీవల రీసెంటుగా రెండు గంటలు ఎత్తుకెళ్లిపోయారు. ఖరీదైన విగ్రహాలను దొంగిలిస్తారని వాటిని ముందే కింద ఊళ్లో ఉన్న రామాలయానికి తీసుకెళ్లి అక్కడ పెట్టాం. ఇక్కడ దొంగతనాలు ఎక్కువయ్యాయి. అన్నీ అలా వదిలేసి వెళ్లిపోయాం కాబట్టి పనికిరాని సామాన్లు అమ్ముకోడానికి ఎత్తుకెళ్లిపోతున్నారు.''

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

తాగునీళ్లు మాత్రం పుష్కలం

సాగునీటి కోసం ఇబ్బంది పడిన గ్రామంలో తాగునీటికి తమకు పెద్దగా ఇబ్బంది రాలేదని చెబుతున్నారు గ్రామస్థులు. గతంలో ఒక బావి గ్రామానికి నీళ్లు అందించగా, ఇప్పుడు గ్రామంలో ఉన్న చేతి పంపులో పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. ఎండాకాలం కాస్త తాగునీటి కొరత వచ్చినా మిగతా కాలాలు అవి ఊరికి సరిపోతాయని గ్రామస్థులు చెబుతున్నారు.

ప్రభుత్వం బోర్లు వేస్తే ఎలాగోలా మళ్లీ తమ ఊరిలో బతకాలని ఉందని రైతు రెడ్డప్పరెడ్డి చెప్పారు.

''ప్రభుత్వం దయ చూపి ఇక్కడ బోర్లు వేస్తే మేం మళ్లీ ఇక్కడకు రావచ్చేమో. మాకు కూడా బోరు వేసుకోవాలని ఉంది. సేద్యం చేయలేకపోయినా, కోళ్ల ఫారాలు లాంటివి పెట్టుకోవాలని మనసులో ఉండాది. నీళ్లు తాగేదానికి పుష్కలంగా ఉన్నాయి సర్. మేం పది బోర్లు వేశాం. అయినా పడలేదు. ఈ ఇళ్ల కింద 600 అడుగులు వేశాం. తాగే నీళ్లకయితే పడతాయి. వ్యవసాయానికైతే ఆరు ఏడు వందలు వేసినా నీళ్లు పడవు. అదీ ఇక్కడి పరిస్థితి''

చుట్టుపక్కల ఎవరికైనా అప్పులు కావాలన్నా తమ ఊరికే వచ్చేవారని, కానీ ఇప్పుడు తామే వేరే ఊళ్లకు వెళ్లికూలి చేసుకునే పరిస్థితి వచ్చిందంటారు రెడ్డప్పరెడ్డి.

''చాలా గొప్పగాబతికిన ఊరు మాది. మా మండలంలో ఎవరికైనా డబ్బులు కావాలంటే ఈ ఊరికే వచ్చి తీసుకుపోయేవాళ్లు. అలాంటి పల్లె ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేసింది. శెనిక్కాయలు బాగా పండించేవారు. డబ్బులు బాగా ఉండేవి. పల్లెకు బిడ్డను ఇవ్వాలన్నా, చేసుకోవాలన్నా.. వెనుకాముందూ చూడకుండా చేసుకునేవాళ్లు, ఇచ్చేవాళ్లు. అలాంటిది ఇప్పుడు పాడుబడిపోయింది.''

ఒకప్పుడు కళకళలాడిన తమ గ్రామం ఇప్పుడు పశువులు మేపుకోడానికి తప్ప ఎందుకూ పనికిరావడం లేదని అమ్మన్నమ్మ ఆవేదన చెందారు.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

జియాలజిస్టులు ఏం చెబుతున్నారు?

కొంతకాలం వరకూ పంటలు పండిన గట్టుమీదపల్లెలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది. తాగునీరు వస్తున్నా, వ్యవసాయం కోసం బోర్లు వేస్తే వారికి నీళ్లు ఎందుకు పడడం లేదు. దీనిపై బీబీసీ ఎస్వీ యూనివర్సిటీ జియాలజిస్టు ప్రొఫెసర్ మధుతో మాట్లాడింది.

''తాగడానికి నీళ్లు వస్తున్నాయంటే అక్కడ నీరు ఉంటాయి. వాళ్లు జియాలజిస్టులతో కాకుండా పుల్ల, టెంకాయతో చూసే వారితో పాయింట్లు పెట్టించి ఉంటారు అందుకే ఫెయిల్ అయి ఉంటాయి. వాతావరణ మార్పులవ ల్లా వర్షాలు తగ్గాయి. వర్షాధార పంటలు పండించేవారు కాబట్టి వ్యవసాయం తగ్గుతుంది. దాంతో ఊరు ఖాళీ చేసుంటారు'' అని మధు అన్నారు.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు
ఫొటో క్యాప్షన్, గ్రామంలో తన జ్ఞాపకాల గురించి రామసుబ్బారెడ్డి బీబీసీకి వివరించారు.

అధికారులు ఏమంటున్నారు?

వ్యవసాయం కోసం సాగునీరు అందేలా ప్రభుత్వం సాయం చేస్తే తిరిగి గట్టుమీదపల్లెలోకి వెళ్లాలని ఉందని కొందరు గ్రామస్థులు చెబుతుంటే ప్రభుత్వ అధికారులు మాత్రం వారి సౌకర్యం కోసమే గ్రామస్థులు ఇళ్లను ఖాళీ చేశారని, అక్కడ తాము చేయగలిగింది ఏమీలేదని చెబుతోంది.

గట్టుమీదపల్లె ఖాళీ అవడంపై తంబళ్లపల్లె ఎంఆర్వో శ్రీనివాస్‌తో బీబీసీ మాట్లాడింది.

''వాళ్లు వారి సౌకర్యాలు చూసుకని వెళ్లిపోయారు. పట్టణాల్లో ఉండడం వల్ల ఎదుగుదల ఉంటుందనే వాళ్లు ఇళ్లు ఖాళీ చేశారు. కొంతమంది తమ పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడడంతో అక్కడకు వెళ్లిపోయారు. ఇలా గ్రామంలో ఒకరు వెళ్తుండడం చూసి ఇంకొకరు ఖాళీ చేశారు. రైతులకు సాగునీటి కోసం బోర్లు వేయించడానికి ఎలాంటి ప్రభుత్వ పథకాలూ లేవు’’ అన్నారు.

గట్టుమీదపల్లె నుంచి బయటకు వచ్చినవారు బాగానే వృద్ధి చెందారని తరుగువారిపల్లెకు చెందిన వేణుగోపాల్ రెడ్డి లాంటి వారు కూడా చెబుతున్నారు.

''చెరువు ఆయకట్టు కింద పొలాలు ఉన్న వాళ్లు బాగానే వృద్ధిలోకి వచ్చారు. తోటలు, వరి సాగు చేశారు. కానీ ఒకరు వెళ్లారు అని ఇంకొకరు రావడం వల్లే ఊరు ఖాళీ అవడం మొదలయ్యింది. ఇక్కడైతే కూలీ అయినా దొరుకుతుంది అనుకుని స్థలాలు తీసుకుని ఇళ్లు కూడా కట్టుకున్నారు. 15 ఇళ్లకు చెందిన వారు ఇక్కడే పనులు చేసుకుంటూ నిలిచిపోయినారు. ఇక్కడే భూములున్న 30 ఇళ్లు వాళ్లు మాత్రం మరిన్ని భూములు కొని వ్యవసాయం చేసుకుంటున్నారు. మిగతా చాలా ఇళ్ల వారు దిగువకు వచ్చేసి కూలీనాలి చేసుకుంటున్నారు. కొందరు ఆవులు పెట్టుకుని పాలు పిండుకుంటుంటే, పిల్లల్ని చదివించుకున్నవాళ్లు వాళ్లు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండడంతో వారితో పాటూ స్థిరపడ్డారు''అని చెప్పారు.

గట్టుమీదపల్లె, ఖాళీ అయిన గ్రామం, వలస వెళ్లిన ఊరి ప్రజలు

కొత్త తరం ఆలోచనేంటి?

అయితే ఆ గ్రామం నుంచీ వెళ్లిపోయి బయట సెటిల్ అయిన యువత ఆలోచన మరోలా ఉంది. తమ గ్రామం ఖాళీ అవడంపై తిరుపతిలో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్న దిలీప్ కుమార్ రెడ్డిని ఆవేదన వ్యక్తం చేశారు.

''మేము వెళ్లి వచ్చేవాళ్ళం అక్కడ గుడి గాని అక్కడ వాతావరణం బాగుంటాయి. నా ఆశ ఏమిటి అంటే మన పూర్వీకులు, పెద్దలు ఎలా అయితే కలిసి ఉన్నారో అలాగే మా జనరేషన్ కనీసం పండగల కన్నా వెళ్లి కలిసి వస్తే బాగుంటుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు రోడ్లు పడ్డాయి. ప్రభుత్వం ఏదైనా చేయాలి అనుకుంటే టూరిజం స్పాట్ లాగా మదనపల్లి దగ్గర ఉన్న హార్సిలీ హిల్స్ లాగా ఏమైనా ప్లాన్ చేసినా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది'' అని కోరుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)