పిట్‌బుల్: ఆరు నెలల చిన్నారిపై దాడి తర్వాత ఈ జాతి కుక్కలను పెంచే నిబంధనలపై చర్చ, ఇవి అంత ప్రమాదకరమా?

ఫొటో సోర్స్, Renee DeKona/MediaNews Group/Boston Herald via Getty Images
- రచయిత, శుభ్ రాణా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
సాధారణంగా జంతువులన్నింటిలో కుక్కను మనిషికి అత్యంత నమ్మకమైన నేస్తంగా భావిస్తారు. అయితే అన్ని కుక్కలూ స్నేహపూర్వకంగా ఉంటాయని చెప్పలేం. కొన్ని జాతుల కుక్కలను అత్యంత ప్రమాదకరమైనవిగా భావిస్తారు.
భారత్‌లో కూడా పెంపుడు కుక్కలు మనుషులపై దాడిచేసినట్టు ఇటీవలి సంవత్సరాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ దాడుల్లో కొన్నిసార్లు బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని దాడుల్లో కొందరు మరణించారు.
భారత్‌లో 37లక్షలకుపైగా కుక్కకాటు కేసులు 2024లో నమోదయ్యాయని ఆరోగ్యశాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ లెక్కలు చెబుతునన్నాయి.
2025 మొదటి నెలలోనే 4,29,664 కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం అధికారికంగా నమోదైన కేసులు మాత్రమే.
అధికారిక లెక్కలకు అందని ఘటనలు చాలా ఉంటాయని భావిస్తున్నారు.

ఆరు నెలల పసికందుపై పిట్‌బుల్ దాడి
హరియాణాలో ఆరు నెలల చిన్నారిపై పొరుగింటివారు పెంచుకుంటున్న పిట్‌బుల్ జాతి శునకం దాడి చేసింది.
సోనీపట్ సిక్కా కాలనీలో 2026 సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం ఇది జరిగింది.
ఆ సమయంలో బాలుడు మేనత్త దగ్గర ఉన్నాడు. ఆమె చిన్నారిని ఎత్తుకుని వీధిలో నడుస్తుండగా కుక్క బయటకు వచ్చి వారిపై దాడి చేసింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడు రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గతంలోనూ ఇలాంటి కేసులు
బాలుడిని కాపాడే ప్రయత్నంలో అతని మేనత్త కూడా గాయపడ్డారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. దీనిపై స్పందించాలని కుటుంబ సభ్యులను కోరగా వారు మాట్లాడడానికి నిరాకరించారు.
చిన్నారి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.
భారత్‌లో ప్రమాదకరమైనవిగా భావించే కుక్కల జాతులు, ముఖ్యంగా పిట్‌బుల్ వంటి కుక్కల విషయంలో ఉన్న నిబంధనలు, వాటి యజమానుల బాధ్యత, ప్రజా భద్రతపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇంతకు ముందు కూడా పిట్‌బుల్ జాతి శునకాలు దాడిచేసినట్టు అనేకసార్లు విన్నాం.
2026 ఆగస్టులో పంజాబ్ పాటియాలాలోని ఘుమ్మన్ నగర్‌లో దంపతులపై పిట్ బుల్ కుక్క దాడి చేసింది. అంకిత్ సభర్వాల్, ఆయన భార్య షెఫాలీ అద్దె ఇల్లు కోసం అక్కడికి వెళ్లారు.
గేటు తెరిచిన వెంటనే కుక్క బయటకు దూసుకొచ్చి వారిపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం కుక్క యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు .
2025 ఆగస్టులో చెన్నైలో పొరుగింటివారి పిట్‌బుల్ కుక్క చేసిన దాడిలో 55 ఏళ్ల కరుణాకరన్ మరణించారు. ఆయన ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కుక్క ఆయన్ను కరిచింది. ఈ ఘటనలో కుక్క యజమాని కూడా గాయపడ్డారు. నిర్లక్ష్యం ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఒక పిట్‌బుల్ కుక్క 82 ఏళ్ల యజమానురాలిపై దాడి చేసింది. ఆ కుక్క దాడిలో మహిళ తీవ్రంగా గాయపడి మరణించారు.

ఫొటో సోర్స్, Peerapon Boonyakiat/SOPA Images/LightRocket via Getty Images
పిట్‌బుల్ ఎక్కడి జాతి?
పిట్‌బుల్ జాతి శునకాల మూలాలు ఇంగ్లండ్‌లో 1800 సంవత్సరాల నాటి నుంచి కనిపిస్తున్నాయి. ఆ సమయంలో వాటిని వినోదం కోసం ఉపయోగించేవారు.
బోనులో కట్టేసిన ఎద్దు లేదా ఎలుగుబంట్లతో ఈ కుక్కలకు పోటీపెట్టేవాళ్లు.
ఈ క్రీడను 1835వ సంవత్సరంలో నిషేధించారు. ఆ తర్వాత ఈ శునకాలను ఒకదానితో మరొకటి పోరాడేలా చేసే ఆట మొదలైంది. దీనిపై చాలా దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా ఈ పోటీలు జరిగినట్టు కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూనేఉన్నాయి.
1960లలో అమెరికాలో మాదకద్రవ్యాల స్మగ్లర్లు కొందరు పిట్‌బుల్ కుక్కలను పెంచుకోవడం మొదలుపెట్టారు.
వాటికి బలమైన దవడలు, ఎక్కువ నొప్పిని తట్టుకునే సామర్థ్యం, వేటాడే స్వభావం, పట్టుదల ఉంటాయి. మధ్యస్థ పరిమాణంలో మంచి కండలతో బలంగా కనిపిస్తాయి
చాలామంది యజమానులు వీటిని విశ్వాసపాత్రంగా ఉండే, కుటుంబంతో కలిసిమెలిసి ఉండే కుక్కలని అంటారు. అయితే సరైన శిక్షణ, ఇతరులతో కలిసి మెలిసి ఉండే అలవాటు, నియంత్రణ లేకపోతే అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Roy Rochlin/Getty Images for Westminster Kennel Club
పిట్‌బుల్ దాడి నుంచి తప్పించుకోవడం కష్టమా?
పిట్‌బుల్ జాతి శునకాలను దూకుడు స్వభావంగలవాటిగా భావిస్తారు.
"పిట్‌బుల్ కుక్కలను చారిత్రకంగా ప్రత్యేకంగా బలంగా, పోరాటాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేశారు. మొదట ఎద్దులను అదుపు చేయడానికి, ఆ తర్వాత ఇతర కుక్కలతో పోరాడడానికి వీలుగా ఎంపిక చేసిన సంతానోత్పత్తి పద్ధతి ద్వారా వీటిని అభివృద్ధి చేశారు. ఈ కుక్కలకు అసాధారణమైన శారీరక బలం, బలమైన పట్టు, వేటపై దాడి చేసి దాన్ని వదలకుండా పట్టుకునే స్వభావం కనిపిస్తుంది'' అని భారత్‌లో పెటా ప్రతినిధి సచిన్ ఎస్ బంగేరా బీబీసీతో చెప్పారు.
అయితే ఏ కుక్క ప్రవర్తన అయినా దాని జాతిపై మాత్రమే ఆధారపడి ఉండదని కూడా ఆయన చెప్పారు.
ఇతరులతో ఎలా మెలగాలో కుక్క నేర్చుకున్నతీరు, శిక్షణ, సంరక్షణ, చుట్టూ ఉన్న వాతావరణం కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయని తెలిపారు.
చాలామంది తమ సామాజిక హోదా చూపించుకోడానికి పిట్‌బుల్ జాతి వంటి కుక్కలను పెంచుకుంటారని స్వతంత్ర జంతు హక్కుల కార్యకర్త సరాహనా అన్నారు. వాటికి పుట్టుక నుంచే దూకుడుగా ప్రవర్తించేలా శిక్షణ ఇస్తారని, వాటిని తల్లి దగ్గర ఎక్కువకాలం ఉంచరని ఇది కూడా వాటి ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
ఈ కుక్కలకు వయసు పెరిగి బలహీనమైనప్పుడు కొందరు యజమానులు వాటిని వదిలేస్తారని, ఈ జాతి కుక్కలను జంతువుల ఆశ్రయ కేంద్రాల్లో ఇతర శునకాలతో కలిపి ఉంచడం కూడా సమస్యగా మారుతుందని ఆమె చెప్పారు.
పిట్‌బుల్ వంటి జాతుల కుక్కలు చాల బలంగా, కండలపుష్టితో ఉంటాయని పెటా ప్రతినిధి బంగేరా చెప్పారు. వాటి విశాలమైన ఛాతీ, పెద్ద దవడ కండరాలువంటివి వేటను బలంగా పట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయని చెప్పారు.
ఒకసారి ఆ శునకం దాడి చేస్తే దాన్ని వేట జంతువు నుంచి లేదా దాడి చేసిన వ్యక్తి నుంచి వేరు చేయడం చాలా కష్టం.
అందుకే ఇలాంటి కుక్కలు దాడిచేసినప్పుడు చాలా తీవ్రమైన గాయాలవుతాయి. పిల్లలయితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావొచ్చు.

ఫొటో సోర్స్, MICHAL CIZEK/AFP via Getty Images
భారత్‌లో పిట్‌బుల్ జాతి శునకాల పెంపకంపై ఎలాంటి నిబంధనలున్నాయి?
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ 2024 మార్చిలో ఒక లేఖ రాసింది.
పిట్‌బుల్ టెర్రియర్‌తో సహా దాదాపు 23-24 జాతులను (మిశ్రమ, క్రాస్‌బ్రీడ్‌లతో సహా) ప్రమాదకరమైనవాటి జాబితాలో చేర్చింది.
వాటి దిగుమతి, పెంపకం, సంతానోత్పత్తి, అమ్మకాలపై నిషేధం విధించాలని సూచించింది. ఇప్పటికే జనం దగ్గర ఉన్న కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయాలని కూడా సిఫార్సు చేసింది.
ఈ జాబితాలో పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ స్టాఫర్డ్‌షైర్ టెర్రియర్, రాట్‌వైలర్, అమెరికన్ బుల్‌డాగ్, డోగో అర్జెంటీనో, ఫిలా బ్రసిలీరో, కేన్ కార్సో, మాస్టిఫ్, వోల్ఫ్ డాగ్, కంగల్ కాకేసియన్ షెపర్డ్ వంటి జాతులున్నాయి.
ఈ కేంద్ర ఆదేశం పూర్తి చట్టపరమైన నిషేధం కాదు. దిల్లీ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులతో సహా కొన్ని న్యాయస్థానాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాయి.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు దీనిని అమలు చేయకూడదని 2024 మేలో కేంద్రం ఒక నోటీసు జారీ చేసింది .
పిట్ బుల్ కుక్కలను పెంచుకోవడంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే తరహా కఠినమైన, చట్టపరమైన నిషేధం ఏదీ లేదు. అయితే వాటి సంతానోత్పత్తి, అమ్మకం, పెంపకానికి సంబంధించిన నిబంధనలు రాష్ట్రాలు, స్థానిక అధికారాలను బట్టి మారతాయి.
కొన్నిచోట్ల స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంది.
ఈ జాతుల కుక్కల పెంపకానికి అనుమతించకూడదని, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయాలని
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ, ఘజియాబాద్‌లలో ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏ జాతి జంతువునైనా "ప్రమాదకరమైన జంతువు"గా ప్రకటించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పించే చట్టాన్ని గోవా 2025లో ఆమోదించింది.
ఒకజాతిని అలా ప్రకటించిన తర్వాత, ఆ జాతిని పెంచడం, వృద్ధి చేయడం, వాటిని రాష్ట్రంలోకి తీసుకురావడంపై నిషేధం ఉంటాయి.
ఇప్పటికే పెంచుకుంటున్న శునకాలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయించడం తప్పనిసరి. లేదంటే 15 రోజుల నుంచి 3 నెలల వరకు జైలు శిక్ష, 50వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశముంది.
పిట్‌బుల్, రాట్ వైలర్ శునకాలను పెంచడంపై కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించిందని పెటా ప్రతినిధి తెలిపారు.
ఘజియాబాద్‌లో కూడా పిట్‌బుల్, రాట్ వైలర్, డోగో అర్జెంటీనో కుక్కల విషయంలో చర్యలు తీసుకున్నారు.
ఆరు ప్రమాదకరమైన జాతులపై చండీగఢ్‌లో నిషేధం ఉంది.

ఫొటో సోర్స్, Nasir Kachroo/NurPhoto via Getty Images
బాధితులకు చట్టపరమైన అవకాశాలు, యజమాని బాధ్యత
ఒక పిట్‌బుల్ కుక్క ఎవరిపైనైనా దాడి చేస్తే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. వైద్య ఖర్చులతో సహా జరిగిన నష్టానికి పరిహారం కోరుతూ సివిల్ కేసు దాఖలు చేయొచ్చు.
తీవ్ర గాయాలు లేదా నిర్లక్ష్యానికి సంబంధించిన కేసుల్లో భారతీయ న్యాయసంహిత కింద క్రిమినల్ చట్టపరమైన నిబంధనలు కూడా వర్తించే అవకాశంఉంది. కుక్కవల్ల ప్రమాదం జరిగే అవకాశముందని యజమానికి తెలిసి కూడా దానిని నియంత్రించకపోతే యజమాని బాధ్యత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, JOSH EDELSON/AFP via Getty Images
శునకాల యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పిట్‌బుల్ రకం కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయించాలి. అవసరమైన చోట రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలని పెటా పేర్కొంది. వాటిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కుటుంబంలో ఒక భాగంగా చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో తీసుకెళ్లేటప్పుడు దాని మెడ, శరీరం చుట్టూ బలమైన పట్టీవెయ్యాలి.
కుక్కను ఎప్పుడూ గొలుసుతో కట్టకూడదు. దాడి చేసేలా దాన్ని రెచ్చగొట్టకూడదు. పోరాటాలకుగానీ, కాపలా కాయడానికి గానీ దాన్ని ఉపయోగించవద్దు.
పెంపకందారులు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా పిట్‌బుల్‌ను అమ్ముతుంటారు. జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























