గ్రేట్ వైట్ షార్క్ : ‘కనిపిస్తే పట్టుకుని చంపేయండి’ అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది?

షార్క్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టిన్షుయ్ యెంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్రానికి చెందని ఒక సముద్ర తీరంలో శుక్రవారం 63 ఏళ్ల గజ ఈతగాడు గ్రెగ్ ఓ'నీల్ మరణించడంతో, అక్కడి 'గ్రేట్ వైట్ షార్క్'ను పట్టుకుని చంపేయాలనే అరుదైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన మృతదేహం లభించలేదు.

ఈ షార్క్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో ఆదివారం వరకు రాజధాని పెర్త్‌తో సహా రాష్ట్రంలోని తీర ప్రాంతాలు, బీచ్‌లు మూసివేసే ఉంటాయని అధికారులు చెప్పారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈ వారంలో జరిగిన రెండో షార్క్ దాడి కాగా.. ఈ ఏడాది ఈ రాష్ట్రంలో జరిగిన ప్రాణాంతక దాడి ఇది.

పెర్త్ నగరానికి ఉత్తరాన ఉన్న సోరెంటో బీచ్‌లో జరిగిన ఈ ఘటన, ఆస్ట్రేలియాలో బీచ్‌లకు వెళ్లేవారి భద్రత ఎలా అంశంపై చర్చను మళ్లీ రేకెత్తించింది.

''ఈ భయంకరమైన ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం, తీవ్రంగా కుంగిపోయాం'' అని గ్రెగ్ ఓ'నీల్ కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గ్రెగ్ ఓ'నీల్

ఫొటో సోర్స్, O'Neill family

ఫొటో క్యాప్షన్, శుక్రవారం సోరెంటో బీచ్‌లో జరిగిన షార్క్ దాడిలో మరణించిన 63 ఏళ్ల గ్రెగ్ ఓ'నీల్

''గ్రెగ్‌కు సముద్రమంటే చాలా ఇష్టం. ఉత్సాహవంతమైన ఈతగాడిగా, క్రీడా అభిమానిగా, ఉద్యోగిగా, సహృదయమైన, చమత్కారమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు'' అని కుటుంబ సభ్యులు చెప్పారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడ స్థానికులు పువ్వులతో గ్రెగ్‌కు నివాళులు అర్పించారు.

ఇద్దరు వ్యక్తులు సముద్రంలో ఈత కొడుతున్నారని, కానీ వారిలో ఒకరు మాత్రమే తిరిగి ఒడ్డుకు చేరుకున్నారని ప్రత్యక్ష సాక్షి జాక్వి రపైక్ ఏబీసీకి తెలిపారు. అక్కడ నీటిలో "రక్తపు ఆనవాలు" కనిపించిందని చెప్పారు.

‘‘షార్క్ ఆయన్ను ఒక చేపలా విసిరివేస్తూ.. ’’ చీల్చి చెండాడడం తాను చూసినట్లు మరో ప్రత్యక్ష సాక్షి 'డబ్ల్యుఏటుడే'తో తెలిపారు.

2.5 మీటర్ల (8 అడుగుల 2 అంగుళాలు) పొడవున్న షార్క్‌ను చూసినట్లు స్థానికులు తెలిపారు.

పెర్త్ తీరప్రాంతాలు

ఫొటో సోర్స్, APTN

ఫొటో క్యాప్షన్, పెర్త్ తీరప్రాంతాల్లో గాలింపు కోసం పోలీసులు పడవను, హెలికాప్టర్‌ను వాడారు.

"ముందు జాగ్రత్త చర్యగా" అన్ని బీచ్‌లను మూసివేసినట్లు సోరెంటో ఉన్న ప్రాంతానికి చెందిన జూండలప్ అధికారులు తెలిపారు. కనీసం ఆదివారం మధ్యాహ్నం వరకు బీచ్‌లు మూసివేసే ఉంటాయని చెప్పారు.

పోలీసులు పడవలో, హెలికాప్టర్‌లో తీర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు శనివారం ఫోటోల్లో కనిపించింది.

‘షార్క్‌ను పట్టుకుని చంపేయండి’ అని ఆదేశాలు జారీ చేయడం ఆస్ట్రేలియాలో చాలా అరుదు, వివాదస్పదం కూడా.

ఎందుకంటే, అక్కడ గ్రేట్ వైట్ షార్క్‌లు సంరక్షిత జాతి కిందకు వస్తాయి.

శనివారం ఉదయం వాటర్ పోలీస్ ఆ షార్క్‌ను గుర్తించి, ఆ ఘటనకు ఈ షార్క్‌నే కారణమని కచ్చితంగా నిర్ధరించిన తర్వాతనే.. అసాధారణ చర్యగా ఈ ఉత్తర్వును జారీ చేసినట్లు పశ్చిమ ఆస్ట్రేలియాలోని మత్స్య శాఖ మంత్రి జాకీ జార్విస్ తెలిపారు.

ఆ దాడికి సంబంధించిన అసాధారణ పరిస్థితులు, ఆ షార్క్ వల్ల ఉన్న ముప్పు దృష్ట్యా, దానిని పట్టుకోగలిగితే, చంపేయాలని మత్స్యశాఖ అధికారులకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలో ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం పదేళ్లలో ఇదే తొలిసారని భావిస్తున్నట్లు జార్విస్ చెప్పారు. అయితే, గతంలో రాష్ట్రంలో జరిగినట్లుగా ఇది విస్తృత స్థాయి జంతు నిర్మూలన చర్య కాదని ఆయన నొక్కి చెప్పారు.

బీచ్‌లకు వెళ్లేవారి భద్రతకు సాయపడేలా డ్రోన్లను, ట్యాగింగ్‌ను పెంచుతామని మంత్రి తెలిపారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలో షార్క్‌లను పట్టుకోవడం, చంపడం సుదీర్ఘమైన, వివాదాస్పద అంశం.

వరుస దాడుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిని చంపడానికి అధికారం ఇచ్చినప్పుడు, 2014లో నెలల తరబడి భారీ నిరసనలు జరిగాయి.

ఈ వారంలో పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగిన ఇటువంటి ఘటనలలో సోరెంటోలో జరిగిన ఈ సంఘటన రెండవది.

సోమవారం పెర్త్‌కు ఉత్తరాన 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెరాల్డ్‌టన్ తీరంలో సర్ఫింగ్ చేస్తున్న 56 ఏళ్ల వ్యక్తిపై ఇది దాడి చేసింది.

ఆయన ప్రాణాలతో బయటపడినప్పటికీ తన కాలిలో కొంత భాగాన్ని కోల్పోయారని, ఆయన్ను రక్షించిన మరో సర్ఫర్ ఏబీసీకి తెలిపారు.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఐదు ప్రాణాంతకమైన షార్క్ దాడులు జరిగాయి.

జనవరిలో సిడ్నీ హార్బర్‌లో షార్క్ కాటుకు గురై 12 ఏళ్ల బాలుడు మరణించగా, మే, జూన్ మధ్య జరిగిన వేర్వేరు సంఘటనలలో ముగ్గురు డైవర్లు ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో ఇద్దరు పశ్చిమ ఆస్ట్రేలియాలో, మూడో వ్యక్తి క్వీన్స్‌లాండ్‌లో మరణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)