దక్షిణాఫ్రికా: వరుసగా 9మంది మహిళల హత్య, ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, పుమా ఫిహ్లానీ, నోమ్సా మసెకో, వైక్లిఫ్ ముయా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
''ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి'' అని నోక్వాండా మట్‌షికిజా అన్నారు. తన మేనకోడలు దినియో మోటాపనే హత్యను గుర్తు చేసుకుంటూ నోక్వాండా మాటల మధ్యలో ఏడుస్తున్నారు.
''మాకోసం, మిగతా మహిళలందరి కోసం ఏదైనా చర్య తీసుకునే లోపు ఇంకెంత మంది మహిళల శవాలు బయటపడాలి'' అని ఆమె ప్రశ్నించారు.
దక్షిణాఫ్రికా ప్రధాన నగరం జోహాన్నెస్‌బర్గ్ సమీపంలోని తన ఇంటి నుంచి నోక్వాండా బీబీసీతో మాట్లాడారు.
దినియో శవాన్ని బంధువులు గుర్తించి రెండురోజులే అయింది.
ఇద్దరు పిల్లల తల్లి అయిన 38 ఏళ్ల దినియో గత ఆదివారం (సెప్టెంబర్ 13) చివరిసారి కనిపించారు. ఆ తర్వాత ఎకుర్హులేని ప్రాంతంలో ఆమె మృతదేహం దొరికింది. ఆమె శరీరం నిండా గాయాలున్నాయి. కొంత భాగం కాలిపోయింది.

''దినియో చనిపోయారన్న విషయాన్ని ఏదో ఒక సమయంలో ఆమె కుమార్తెకు చెప్పాలి. కుటుంబానికి ఇది అత్యంత బాధాకరమైన పరిస్థితి. 'నీ తల్లిని దారుణంగా హత్యచేసి, ఒక నిర్జన ప్రదేశంలో పడేసి చెత్తలా అక్కడే వదిలేశారని ఎలా చెప్పాలి'' అని కన్నీళ్లు తుడుచుకుంటూ నోక్వాండా ఆవేదన చెందారు.
''ఇది ఎప్పటికీ భాధను కలిగించే విషయమే. దీన్నుంచి ఎప్పటికీ బయటపడలేం'' అని అన్నారు.
ఎకుర్హులేనిలో వరుసగా శవాలు బయటపడుతున్నాయి. ఈ వారంలో ఇలాంటి స్థితిలో లభ్యమైన మూడో మృతదేహం దినియోది. మొత్తంగా జూలై నుంచి ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితుల్లో హత్యకు గురైన తొమ్మిది మంది మహిళలను గుర్తించారు.
‘అప్రమత్తంగా ఉండండి’
ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. అయితే వరుసగా ఇలా భయంకరమైన స్థితిలో మృతదేహాలు బయటపడుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలపై హింస ఏ స్థాయిలో ఉందనేదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఆగ్రహం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో లింగ ఆధారిత హింస అత్యధికంగా ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి.
చనిపోయిన వారిలో 38ఏళ్ల ఎలిజబెత్ టిసొంట్సో మోసెలక్‌గోమో కూడా ఉన్నారు. గత వారం మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె తర్వాత కనిపించకుండాపోయారు.
మూడు రోజుల తర్వాత కెంప్టెన్ పార్క్‌లోని ఓ హోటల్ వెనక ఆమె మృతదేహం లభ్యమైంది.
కెంప్టన్ పార్క్, ఒలిఫాంట్స్ ఫొంటెయిన్, క్లేవిల్, క్వాథేమా ప్రాంతాల్లో హత్యలు జరిగాయి.
ఈ మరణాల మధ్య ఏమైనా లింక్ ఉందేమో తెలుసుకోడానికి డిటెక్టివ్‌లు, నిఘా అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర నిపుణులతో పలు బృందాలను ఏర్పాటుచేశారు.
మహిళలు ఒంటరిగా నడవద్దని, నిర్మానుష్య ప్రాంతాల వైపు వెళ్లొద్దని, అపరిచితులు, అనుమానాస్పద వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తామెక్కడున్నామనే విషయాన్ని కుటుంబంలోని సన్నిహితవ్యక్తికి చెప్పాలని కోరారు.
ఇయర్‌ఫోన్‌లు, ఇయర్ బడ్‌లతో ఎక్కువ సౌండ్ పెట్టుకుని పాటలు వింటూ నడవొద్దని, దీని వల్ల చుట్టుపక్కల పరిస్థితులను గమనించే సామర్థ్యం తగ్గొచ్చని హెచ్చరించారు.
ఈ హత్యల వెనక సీరియల్ కిల్లర్ ఎవరన్నా ఉన్నారా అనే విషయంపై పోలీసులు స్పందించడం లేదు. ఈ హత్యల వెనుక ఏదైనా గుంపు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అనుమానితుల సమాచారం అందించిన వారికి 24వేల డాలర్ల బహుమతి ప్రకటించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
20 నుంచి 30ఏళ్లలోపువారే
తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మరణంతో థెంబా కెకాన కూడా షాక్‌లో ఉన్నారు. ఎకుర్హ్యులేనిలో మొదట కనిపించకుండా పోయినవారిలో ఆయన సోదరి ఇటుమెలెంగ్ ఒకరు.
ఇటుమెలెంగ్ వయసు 32ఏళ్లు. ఆమె మృతదేహం జూలైలో లభ్యమైంది. ఆమె కనిపించకుండాపోయిన 17రోజుల తర్వాత ఆమె శవం దొరికింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి. ఒంటిపై దుస్తులు సరిగా లేవు. ఆమె మృతదేహం ఒక వంతెనపై పడిఉంది.
''ఆవేదనతో పూర్తిగా కుంగిపోయాం'' అని కన్నీళ్లతో థెంబా చెప్పారు.
''నా సోదరి చిన్న కుమార్తెను చూసినప్పుడల్లా నా కళ్లలో నీళ్లు వస్తాయి. ఆమెకు కలిగిన ఈ బాధను నేనెప్పటికీ తొలగించలేనని తెలుసు. మా పరిస్థితి ఏ కుటుంబానికీ రాకూడదు'' అని థెంబా అన్నారు.
ఈ హత్యలకు సంబంధించి ఇప్పటి వరకు ఒకే ఒక్కరిని అరెస్ట్ చేశారు. జూలై 15న మొదటి మృతదేహం లభ్యమైన రెండు రోజుల తర్వాత ఆ అరెస్ట్ జరిగింది.
ఇటుమెలెంగ్ లేదా దినియోతోపాటు ఎకుర్హులేనిలో హత్యకు గురైన మిగతా ఆరుగురు మహిళల కేసుల్లో ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
మృతుల్లో ఎక్కువ మంది 20 లేదా 30 ఏళ్ల వయసులో ఉన్న యువతులే. దాదాపు అందరిపై మరణానికి ముందు తీవ్రహింస జరిగింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
జాతీయ విపత్తుగా ప్రకటించినప్పటికీ...
దక్షిణాఫ్రికాలో అతిపెద్ద నగరమైన జోహాన్నెస్‌బర్గ్ తూర్పున ఉన్న ఈప్రాంతంలో జరిగిన వరుస ఘటనలు దేశాన్ని తీవ్రంగా కలచివేశాయి. చాలామంది దీన్నో సంక్షోభంగా చూస్తున్నారు. మహిళల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది.
దక్షిణాఫ్రికా పోలీసులు ప్రతి మూడు నెలలకు నేరాలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న త్రైమాసికంలో 5,427 మంది హత్యకు గురైనట్టు ఆ గణాంకాలు చెబుతున్నాయి
మృతుల్లో ఆడవాళ్ల సంఖ్య, పురుషుల సంఖ్య ఎంతనేది అధికారిక లెక్కల్లో వెల్లడించలేదు. మానవ హక్కుల కమిషన్ వి ఈ వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 569 మంది మహిళలు హత్యకు గురయ్యారు. అంటే సగటున రోజుకు ఆరుగురు మహిళల హత్యకు గురయ్యారు. మరో 1,052 మంది మహిళలపై హత్యాయత్నాలు జరిగాయి.
ఇప్పటికే తమకు భద్రత లేదని భావిస్తున్న అనేక మంది మహిళలు ఈ తాజా ఘటనలతో మరింత భయాందోళనకు గురవుతున్నారు.
ఈ పరిస్థితి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచింది. ఎందుకంటే ఈ సమస్య తీవ్రతను మంత్రులు అంగీకరించి, లింగ ఆధారిత హింసను జాతీయ విపత్తుగా ప్రకటించి ఏడాది కూడా గడవలేదు.
ఈ సమస్యను గత నవంబర్‌లో జాతీయ విపత్తుగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి సాయపడుతుందని సామాజిక అభివృద్ధి మంత్రి నుకోజుల సిసిసి టోలాషే ఆ సమయంలో చెప్పారు.
దీనికి ముందు వారాలపాటు నిరసనలు జరిగాయి. జీ 20 సదస్సుకు దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తున్న సమయంలో విమెన్స్ షట్‌డౌన్ పేరుతో ర్యాలీ జరిగింది.
ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ వారం కూడా నిరసనలు జరిగాయి

ఫొటో సోర్స్, Dineo Motapane
కేవలం మహిళ అనే కారణంతో హత్య
మహిళలకు రక్షణ కల్పించేందుకు దక్షిణాఫ్రికా చేయాల్సిన మొదటి పని ఫెమిసైడ్‌ను ప్రత్యేక నేరంగా గుర్తించడమని మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్‌నేషనల్ తెలిపింది.
మహిళను లక్ష్యంగా చేసుకొని హత్యలు జరుగుతున్నప్పటికీ ఫెమిసైడ్‌ను నేరంగా గుర్తించకుండా గడిచే ప్రతిరోజూ ఈ సమస్యను ఎదుర్కోవడంలో వైఫల్యమే అని అమ్నెస్టీ దక్షిణాఫ్రికా డైరెక్టర్ షినిల్లా మొహమ్మద్ ఒక ప్రకటనలో అన్నారు. దీన్ని ఫెమిసైడ్ పేరుతో పిలవాల్సిన సమయం వచ్చిందన్నారు.
పెమిసైడ్ అంటే లింగ ఆధారిత నేరం. ఒక మహిళను కేవలం ఆమె మహిళ అనే కారణంతోనే హత్య చేయడం.
ఆఫ్రికాలోని గాబన్, మొరాకో సహా ప్రపంచంలోని 33 దేశాల్లో ఫెమిసైడ్‌ను ప్రత్యేక నేరంగా గుర్తించినట్టు అమ్నెస్టీ తెలిపింది.
దక్షిణాఫ్రికాలో కూడా ఫెమిసైడ్‌ను ప్రత్యేక నేరంగా గుర్తిస్తే ఈ సమస్య తీవ్రతపై మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది.
మహిళలను, బాలికలను హింస నుంచి రక్షించడంలో ప్రభుత్వం విఫలమవుతున్న విషయాన్ని గుర్తించి దానిపై చర్యలు తీసుకునేలా ఇది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని షినిల్లా అన్నారు. మనం సమస్య తీవ్రతను గుర్తించకపోతే దాన్ని పరిష్కరించలేమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Kekana family
‘ రక్షణ కల్పించాలి’
ఈ సమస్యపై మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని దక్షిణాఫ్రికాలో దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు.
ఎకుర్హులేనిలో జరిగిన నేరాల దర్యాప్తులో అన్ని కోణాల్లోనూ చర్యలు తీసుకుంటామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఈ వారం హామీ ఇచ్చారు. మహిళలు, బాలికల హక్కులు, భద్రత, గౌరవం కోసం ఓ దేశంగా మనం నిలబడాలని ఆయన అన్నారు.
దేశంలో మహిళలపై జరుగుతున్న హింస వెనుక మరింత పెద్ద సమస్య ఉందని, అది మనిషి ప్రాణానికి మానవత్వానికి విలువ ఇవ్వకపోవడమని లింగసమానత్వం , సామాజిక న్యాయం కోసం పనిచేసే లెబోగాంగ్ రమోఫోకో చెప్పారు.
''ఈ దేశంలో నల్లజాతి మహిళల ప్రాణాలకు చాలాకాలంగా విలువ లేకుండా పోయింది. వలస పాలన కాలం నుంచి 1994 వరకు ఉన్న అపార్థెయిడ్ వ్యవస్థ వరకు ఈ ధోరణి కొనసాగింది'' అని ఆమె బీబీసీతో చెప్పారు. 1994వరకు అమల్లో ఉన్న చట్టబద్ధమైన జాతివివక్షను అపార్థెయిడ్ అని పిలుస్తారు.
''మహిళలపై ఇప్పుడు జరుగుతున్న హింస ఆ వ్యవస్థ మిగిల్చిన హింసకు నిదర్శనం. ఆ వ్యవస్థల వల్ల ఏర్పడిన గాయాలను ఎప్పుడూ పరిష్కరించలేదు.
తాజాగా బయటపడిన తొమ్మిది మృతదేహాల్లో ఐదు కెప్టెన్ పార్క్‌లోనే దొరికాయి. ఈప్రాంతంలో నేరాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘గాల్ టు విమెన్’ ఫౌండేషన్ బృందంలో లుమ్కా మఖుబెలా ఒకరు.
''మేం తీవ్ర విషాదంలో ఉన్నాం. మాకు భయంభయంగా ఉంది. పోలీసులు మమ్మల్ని రక్షించలేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి'' అని ఆమె అన్నారు.
''మేం సురక్షితంగా లేమన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మాతో చెబితే సరిపోదు. మా ప్రాంతాలను సురక్షితంగా మార్చేందుకు వారు మరిన్ని చర్యలు తీసుకోవాలి. మేమింకేం చేయాలి. మాకెక్కడా భద్రత లేదు. ఇళ్లలోనూ లేదు... వీధిలోనూ లేదు... ఇది ఆగాలి'' అని ఆమె అన్నారు.
తనకు చాలా భయంగా, అసౌకర్యంగా అనిపిస్తోందని 32ఏళ్ల థులిసిలే సిబాండే చెప్పారు.
''దుకాణానికి వెళ్లినప్పుడు కూడా చుట్టూ చూసుకోవాల్సి వస్తోంది. షాక్ లో ఉన్నా. చాలా భయంగా ఉంది. ఇదంతా ఒక మానసిక వేదనలా మారిపోయింది'' అని ఆమె చెప్పారు.
థెంబి మబేనా వయసు 60ఏళ్లు. తాను దినియో నివసించిన అదే ప్రాంతంలో ఉండేదాన్నని బీబీసీతో చెప్పారు.
''ఆమె రోజూ అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండేది'' అని థెంబి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తనకు భయంగా ఉందన్నారు.
''దుకాణానికి ఒంటరిగా వెళ్లాలంటేనే భయంగా ఉందని చెప్పే చాలామంది పిల్లలు, అమ్మాయిలు నాకు తెలుసు. నాకు కూడా భద్రత లేదనే అనిపిస్తోంది. నా వయసైపోయింది అయినా కూడా నాకు భద్రత లేదు'' అని ఆమె అన్నారు.
''దక్షిణాఫ్రికాలో మహిళలకు ఇక ఎంత మాత్రం భద్రత లేదు'' అని 20 ఏళ్ల లెరాటో మిజిజి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























