పాకిస్తాన్‌తో అమెరికా డ్రోన్ల తయారీ సంస్థ 'పవర్‌అస్' కీలక ఒప్పందం

ఫొటో సోర్స్, @usembislamabad
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మద్దతు ఉన్న క్రిప్టోకరెన్సీ కంపెనీ 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' అనుబంధ సంస్థతో పాకిస్తాన్ 2026 జనవరిలో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. అమెరికా ప్రత్యేక రాయబారి, ట్రంప్‌కు సన్నిహిత సలహాదారు స్టీవ్ విట్‌కాఫ్ కుమారుడు జాక్ విట్‌కాఫ్ 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' వ్యవస్థాపకుడు.
తాజాగా డ్రోన్ల ఒప్పందం కోసం మరో సంస్థతో పాకిస్తాన్ ఎంఓయూపై సంతకం చేసింది. ఆ సంస్థ త్వరలో ట్రంప్ ఇద్దరు కుమారుల మద్దతు ఉన్న మరో కంపెనీలో విలీనం కానుంది.
అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎంఓయూ జరిగింది. ట్రంప్ గతంలో పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌ను బహిరంగంగా ప్రశంసించారు.
ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పవర్‌అస్ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫోటోను పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మరోవైపు, అమెరికా రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా పోస్ట్‌లో ''బలమైన అమెరికా-పాకిస్తాన్ భద్రతా భాగస్వామ్యం మన ఉమ్మడి భద్రతకు, దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకు దోహదపడుతుంది. అమెరికా తాత్కాలిక రాయబారి నటాలీ బేకర్, అమెరికా డిఫెన్స్ కంపెనీ పవర్‌అస్ ప్రతినిధులు సెప్టెంబర్ 16న రావల్పిండిలో ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో సమావేశమయ్యారు'' అని రాసింది.
''ఈ సందర్భంగా రక్షణ పరికరాల కొనుగోలు, ఉత్పత్తిలో సహకారం అందించే అవకాశాలపై చర్చించారు. భాగస్వామ్య దేశాల స్వయం సమృద్ధిని పెంచే ట్రంప్ యంత్రాంగం విధానం, భద్రతా సవాళ్లను ఎదుర్కొనే ఆయా దేశాల సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఎలా సహాయపడుతుందో ఈ చర్చలు స్పష్టం చేస్తున్నాయి'' అని తెలిపింది.

ఫొటో సోర్స్, GOVERNMENT OF PAKISTAN
అమెరికన్ కంపెనీకి, పాకిస్తాన్‌కు మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి?
వార్తాసంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం, అమెరికా డ్రోన్ల సంస్థ 'పవర్‌అస్' పాకిస్తాన్ సైన్యంతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో డ్రోన్లకు సంబంధించిన ప్రాథమిక ఆర్డర్ కూడా ఉంది.
బుధవారం నాడు సంస్థ సహ వ్యవస్థాపకుడు బ్రెట్ వెలికోవిచ్ ఈ సమాచారాన్ని రాయిటర్స్‌తో పంచుకున్నారు. అయితే, ఆయన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ఈ ఒప్పందం ఆయుధాలు లేని వైమానిక వ్యవస్థ(అన్‌ఆర్మ్డ్ ఏరియల్ సిస్టమ్స్)కు సంబంధించినదని మాత్రమే వెలికోవిచ్ తెలిపారు.
రక్షణ రంగంలో వినియోగించేందుకు గాలిలో ఎగిరే, సముద్ర డ్రోన్లను పవర్‌అస్ తయారు చేస్తుంది. ఈ సంస్థ త్వరలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన 'ఆరియస్ గ్రీన్ వే హోల్డింగ్స్' కంపెనీలో విలీనం కానుంది.
ఈ కంపెనీకి ట్రంప్ ఇద్దరు కుమారుల మద్దతు ఉన్నట్లు రిపోర్టులున్నాయి. అక్టోబర్ ప్రారంభం నాటికి ఈ విలీన ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు ఆ రెండు కంపెనీలు తెలిపాయి.
అమెరికా రెగ్యులేటరీ పత్రాల ప్రకారం డోనల్డ్ ట్రంప్ కుమారులు డోనల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్.. 'అమెరికన్ వెంచర్స్' అనే పెట్టుబడి నిధి ద్వారా ఆరియస్‌లో వాటాలు కలిగి ఉన్నారని రాయిటర్స్ తెలిపింది.
విలీనం తర్వాత ఏర్పడే ఉమ్మడి కంపెనీలో అమెరికన్ వెంచర్స్‌కు 9.9 శాతం వాటా ఉంటుంది. అయితే, ట్రంప్ కుమారులతో సంబంధం ఉండటం వల్లే తమ కంపెనీ అభివృద్ధి చెందుతోందన్న ఊహాగానాలను పవర్‌అస్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆండ్రూ ఫాక్స్ ఖండించారు. కంపెనీకి దాని అర్హతను బట్టే కాంట్రాక్టులు వస్తున్నాయని, "కంపెనీ వ్యాపార వ్యవహారాల్లో" ట్రంప్ కుమారుల పాత్ర ఏమీ లేదని తెలిపారు.
డోనల్డ్ ట్రంప్ జూనియర్ కేవలం పరోక్ష వాటా కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టర్ (క్రియాశీలక పాత్ర లేని పెట్టుబడిదారుడు) మాత్రమేనని ఆయన ప్రతినిధి తెలిపారు. ఈ ఒప్పందంలో ఎలాంటి 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' లేదని వైట్‌హౌస్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ డీల్ గురించి 'ఫైనాన్షియల్ టైమ్స్' రిపోర్ట్ చేస్తూ, ట్రంప్ ఇద్దరు కుమారుల మద్దతున్న కంపెనీ.. పాకిస్తాన్‌కు రక్షణ సాంకేతికతను విక్రయించే విషయమై చర్చలు జరుపుతోందని పేర్కొంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఒప్పందం కూడా ఒక భాగం.
పవర్‌అస్‌లో డోనల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ కూడా పెట్టుబడిదారులని ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో తెలిపింది. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో పవర్‌అస్ బుధవారం ఒక ఎంఓయూ కుదుర్చుకుంది.
కంపెనీ సహ వ్యవస్థాపకుల ప్రకారం, ''ఈ ఒప్పందం కింద పాకిస్తాన్‌లోనే ఒక జాయింట్ వెంచర్‌ను ప్రారంభించి స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు''.
పాకిస్తాన్ సైన్యానికి డ్రోన్లు, డ్రోన్ ఇంటర్‌సెప్టర్లను విక్రయించే అంశం కూడా ఈ ఒప్పందంలో ఉందని ఈ విషయమై అవగాహన ఉన్న ఇస్లామాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
'అమెరికా విధానంలో మార్పు'
"అమెరికా ప్రభుత్వం అనేక దశాబ్దాలుగా పాకిస్తాన్ లాంటి దేశాలకు డ్రోన్ వ్యవస్థలను ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉందనుకున్నా. కానీ, చైనా మాత్రం ఇక్కడి ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా దాదాపు అన్ని రకాల సాంకేతికతలను అందించింది. దీనివల్ల ఆధారపడే తత్వం ఏర్పడింది. అయితే, ఇప్పుడు అమెరికా విధానంలో ఒక రకమైన మార్పును చూస్తున్నాం. ఈ మార్పు కేవలం పాకిస్తాన్‌కు మాత్రమే పరిమితం కాదు. అమెరికా తన డ్రోన్ వ్యవస్థలను ఇతర దేశాలతో కూడా పంచుకునే దిశగా అడుగులు వేస్తోంది" అని పవర్‌అస్ ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకుడు బ్రెట్ వెలికోవిచ్ అన్నారని 'ఫైనాన్షియల్ టైమ్స్' రిపోర్ట్ చేసింది.
ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) నివేదికల ఆధారంగా పాకిస్తాన్ రక్షణ దిగుమతుల్లో సుమారు 80 శాతం చైనా వాటానే ఉంది. సిప్రి గణాంకాలను బట్టి చూస్తే, ప్రపంచంలో భారీ ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల్లో పాకిస్తాన్ ఐదో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది.
అమెరికా, పాకిస్తాన్ మధ్య మెరుగుపడుతున్న సంబంధాలను సద్వినియోగం చేసుకునేందుకు పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ప్రయత్నిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం ఆయన నెలల తరబడి మధ్యవర్తిత్వం వహించారు.
క్రిప్టోకరెన్సీ, క్రిటికల్ మినరల్స్ లాంటి రంగాల్లో పలు ఒప్పందాల ద్వారా ట్రంప్, ఆయన సన్నిహితులతో సంబంధాలను కూడా మునీర్ బలోపేతం చేసుకున్నారు.
"పాకిస్తాన్‌కు కేవలం దౌత్యపరంగానే కాకుండా ఆర్థిక స్థాయిలో కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. ఆ దేశం పరిశ్రమలను స్థాపించగలదు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచగలదు, ఎగుమతి అవకాశాలను సృష్టించగలదు" అని పవర్‌అస్ ఛైర్మన్, సీఈఓ ఆండ్రూ ఫాక్స్ అన్నారు.
పవర్‌అస్ వ్యాపారం ఎంత పెద్దది?
పవర్‌అస్ సంస్థ గత ఏడాది 'అటానమస్ పవర్ కార్పొరేషన్' పేరుతో ఏర్పాటైంది. ఈ ఏడాది నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన 'ఆరియస్ గ్రీన్‌వే హోల్డింగ్స్'తో విలీనం కావడం ద్వారా ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానుంది.
ఈ పెట్టుబడి సంస్థలో డోనల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ కూడా వాటాదారులుగా ఉన్నారు.
యుక్రెయిన్ నుంచి పవర్‌అస్ డ్రోన్ టెక్నాలజీ లైసెన్స్ పొందింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో భారీ ఎత్తున తయారవుతున్న డ్రోన్లు యుక్రెయిన్ యుద్ధభూమిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
యుద్ధం, మానవతాపరమైన అత్యవసర పరిస్థితులు, వ్యవసాయ అవసరాల కోసం భారీ బరువులు మోసుకెళ్లగల తక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థలను తయారు చేసే ఇతర డ్రోన్ కంపెనీలను కూడా పవర్‌అస్ సొంతం చేసుకుంది.
ఈ కంపెనీ ప్రతి నెలా సుమారు 3,000 డ్రోన్ ఇంటర్‌సెప్టర్లను తయారు చేస్తుంది. అమెరికా వైమానిక దళానికి ఇంటర్‌సెప్టర్లను సరఫరా చేసేందుకు గత నెలలో 900 మిలియన్ డాలర్ల ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























