ఫాక్స్‌ట్రాట్ నెట్‌వర్క్: ఇరాన్ వ్యతిరేకులను చంపేందుకు యువతను కిరాయి హంతకులుగా వాడుకుంటోందని ఆరోపణలున్న ఈ గ్యాంగ్ ఏమిటి

స్వీడన్, ఇరాన్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు, అమెరికా, ఫాక్స్‌ట్రాట్, రావా మజీద్

ఫొటో సోర్స్, Swedish Police

ఫొటో క్యాప్షన్, రావా మజీద్
    • రచయిత, ఫర్జాద్ సెఫికరన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

"నేనొక ప్రమాదకరమైన మిషన్‌ కోసం వెళుతున్నాను"

బ్రిటన్‌ వెళ్లే ముందు నార్వేకు చెందిన 19 ఏళ్ల జోహానెస్ నాట్లాండ్ తన ప్రేయసికి పంపిన చిన్న సందేశం అది.

2025 మార్చి 19న ఉత్తర ఇంగ్లాండ్‌లోని హడర్స్‌ఫీల్డ్ నగరంలోని ఒక హోటల్‌లో నాట్లాండ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర రెండు తుపాకులు, 19 రౌండ్ల బుల్లెట్లు, 2,000 పౌండ్లు ( సుమారు రూ. 2.55 లక్షలు) దొరికాయి.

ఇరాన్‌తో సంబంధాలున్న స్వీడిష్ క్రిమినల్ గ్యాంగ్ ఆదేశాలతో ఒకరి హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారించిన బ్రిటిష్ న్యాయస్థానం నాట్లాండ్‌ను దోషిగా తేల్చింది.

ఈ స్వీడిష్ నేర ముఠాను ఫాక్స్‌ట్రాట్ నెట్‌వర్క్ అని పిలుస్తారు. బ్రిటన్‌లో "కాంట్రాక్ట్ కిల్లింగ్" కోసం ఫాక్స్‌ట్రాట్ నెట్‌వర్క్ నాట్లాండ్‌ను పంపించిందని బ్రిటిష్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫాక్స్‌ట్రాట్ తీవ్రమైన హింసాత్మక చర్యలకు పేరు గాంచిన గ్రూప్. యువకులను కిరాయి హంతకులుగా ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలు ఈ గ్రూప్‌పై ఉన్నాయి.

ఇలాంటి కేసులను "హింసాత్మక చర్యలు"గా ఈయూ చట్టాల అమలు సంస్థ యూరోపోల్ పేర్కొంది.

బ్రిటన్‌లో ఎవరిని చంపేందుకు నాట్లాండ్‌ను పంపించారో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఫుట్‌బాల్‌ను ప్రేమించే ఒక యువకుడు హింసాత్మక చర్యలకు పెట్టింది పేరైన స్వీడిష్ నేర ముఠా చేతుల్లో ఎలా చిక్కున్నారు?

ఫాక్స్‌ట్రాట్ నాయకుడు రావా మజీద్ యూరోపియన్ దేశాలలో యువకుల్ని తమ ప్రయోజనాల కోసం ఎలా వాడుకుంటున్నారు? ఇరాన్ ప్రభుత్వంతో ఫాక్స్‌ట్రాట్‌కు సంబంధాలు ఉన్నాయా?

స్వీడన్, ఇరాన్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు, అమెరికా, ఫాక్స్‌ట్రాట్, రావా మజీద్

ఫొటో సోర్స్, Counter Terrorism Policing

ఫొటో క్యాప్షన్, మాంచెస్టర్ విమానాశ్రయంలో జోహన్నెస్ నాట్లాండ్

ఫాక్స్‌ట్రాట్ గురించి మనకేం తెలుసు?

2025 మార్చి 13న బ్రిటన్‌లో నాట్లాండ్ అరెస్టుకు వారం రోజుల ముందు.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా ఫాక్స్‌ట్రాట్, దాని నాయకుడు మజీద్‌పై ఆంక్షలు విధించినట్లు అమెరికా ట్రెజరీ విభాగం ప్రకటించింది.

ఫాక్స్‌ట్రాట్, రావా మజీద్ ఇరాన్ ఇంటెలిజెన్స్ విభాగంతో కలిసి పని చేస్తున్నారని అమెరికా ఆరోపించింది.

నెల రోజుల తర్వాత, యూరప్‌లోని అనేక ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయడంలో వారి పాత్ర ఉన్నట్లు తేలడంతో ఇరాన్ ప్రభుత్వ నెట్‌వర్క్‌, దాని నాయకుడిపైనా బ్రిటన్ ఆంక్షలు విధించింది.

"మజీద్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కోసం పని చేస్తున్నారు" అని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ మొస్సాద్ అందించిన పత్రాలు, సమాచారం ఆధారంగా స్వీడిష్ వార్తాపత్రికలు డాగెన్స్ నైహెటర్, ఎక్స్‌ప్రెస్సెన్ కథనాలు ప్రచురించాయి.

ఫాక్స్‌ట్రాట్ నెట్‌వర్క్ 2023లో తొలిసారి వార్తల్లోకి వచ్చింది. 2023 జూన్‌లో స్వీడన్‌లోని ఉప్సాలా నగరాన్ని శక్తివంతమైన పేలుడు కుదిపేసింది.

ఆ పేలుడు ఎంత శక్తివంతంగా ఉందంటే, సమీపంలోని ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో ఓ యువతి మరణించారని పోలీసులు తెలిపారు.

అదే ఏడాది స్టాక్‌హోమ్ శివార్లలో అనేక సాయుధ ఘర్షణలు జరిగినట్లు కథనాలు వచ్చాయి.

ఈ ఘర్షణల కారణంగా టీనేజర్లతో పాటు అనేక మంది చనిపోయారు.

2024 జనవరి చివరి రోజున స్టాక్‌హోమ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పేలుడు పరికరం ఉన్నట్లు ఎంబసీలో పని చేస్తున్న ఉద్యోగి ఒకరు గుర్తించారు.

స్వీడిష్ పోలీస్ బాంబ్ స్క్వాడ్ దాన్ని పేలకుండా చేసింది.

ఇది 'టెర్రరిస్ట్ అటాక్ ప్రయత్నం' అని ఇజ్రాయెల్ రాయబారి అన్నారు.

ఈ సంఘటనలకు సంబంధించి స్వీడన్‌కు చెందిన ఫాక్స్‌ట్రాట్, రూంబా అనే రెండు క్రిమినల్ గ్యాంగుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ ప్రభుత్వం ఈ గ్రూపులకు సహకరిస్తోందని స్వీడన్, అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి.

ఇరాన్ ప్రభుత్వం 'నేరస్థుల నెట్‌వర్క్ ద్వారా స్వీడన్‌తో పాటు ఇతర దేశాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది' అని 2024 మే30న స్వీడిష్ సెక్యూరిటీ సర్వీస్ (సాపో) ఆరోపించింది.

"ఇరాన్ వ్యతిరేకులను ఈ నేర ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నప్పటికీ ఇజ్రాయెల్ ప్రతినిధులు, యూదు సంస్థలు, సంఘాలను కూడా వారు లక్ష్యంగా చేసుకుంటున్నారు" అని స్వీడిష్ సెక్యూరిటీ సర్వీసెస్ అధిపతి డేనియల్ స్టాన్లింగ్ అన్నారు.

నెదర్లాండ్స్ కూడా ఇరాన్‌పై ఇలాంటి ఆరోపణలే చేసింది.

ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా ఉన్న రెండు గ్రూపుల నాయకుల్ని 2015, 2017లో హత్య చేశారు. ఈ హత్యలకు ఇరాన్ "డచ్ క్రిమినల్ గ్రూపులకు డబ్బులు చెల్లించిందని" డచ్ ఇంటెలిజెన్స్ విభాగం ఏఐవీడీ ఆరోపించింది.

ఇరాన్ 'రాజకీయ ప్రత్యర్థులపై హింసాత్మక దాడుల కోసం క్రిమినల్ గ్యాంగుల నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది" అని గతేడాది యూకే విదేశాంగ విభాగం ప్రకటించింది.

గతంలో చైనా, రష్యాలను అతిపెద్ద భద్రత ముప్పుగా పేర్కొన్న స్వీడిష్ సెక్యూరిటీ సర్వీస్ ఇప్పుడు ఆ జాబితాలో ఇరాన్‌ను కూడా చేర్చింది.

"ఐరోపా దేశాలలో తన ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి తమ పాలనకు ముప్పుగా భావించిన వాటిని ఎదుర్కోవడానికి ఇరాన్ గతంలోనూ హింసను ఉపయోగించింది" అని స్వీడిష్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది.

ఇరాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

స్వీడన్ 'ఇజ్రాయెల్ నుంచి తప్పుడు సమాచారాన్ని' స్వీకరిస్తోందని ఆరోపించింది.

స్వీడన్, ఇరాన్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు, అమెరికా, ఫాక్స్‌ట్రాట్, రావా మజీద్

ఫొటో సోర్స్, ,Interpol

ఫొటో క్యాప్షన్, ఫాక్స్‌ట్రాట్ గ్యాంగ్ నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రావా మజీద్‌ను ఇంటర్‌పోల్ వాంటెడ్‌గా ప్రకటించింది.

ఎవరీ రావా మజీద్?

ఫాక్స్‌ట్రాట్ నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్న రావా మజీద్‌ను 'కుర్దిష్ ఫాక్స్' అని పిలుస్తారు.

రావా మజీద్ ఇరాన్‌లోనే జన్మించారు. అతని కుటుంబం కుర్దిస్తాన్‌కు చెందినదని స్వీడన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అతని కుటుంబం స్వీడన్‌కు వలస వెళ్లింది. మజీద్ ఉప్సాలాలో పెరిగారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్య, హత్యలకు సహకరించడం, హింస, ఆయుధాల వాడకం, ఇతర నేరాలతో సహా పలు అభియోగాలను ఎదుర్కొంటున్న మజీద్ కోసం ఇంటర్‌పోల్ గాలిస్తోంది.

అరెస్టును తప్పించుకోవడానికి మజీద్ కొన్నేళ్ల క్రితం స్వీడన్‌ను విడిచి వెళ్ళారని భావిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆచూకీపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. 2023 అక్టోబర్‌లో తుర్కియే మీదుగా ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ కుర్దిష్ జర్నలిస్టును ఇరాన్ అరెస్టు చేసిందని స్వీడిష్ టెలివిజన్ ఆరోపించింది.

మజీద్ ఆచూకీ తెలియకపోవడంతో స్వీడిష్ పోలీసులు అతనిపై పలు అరెస్టు వారెంట్లు జారీ చేశారు.

2023 సెప్టెంబర్‌లో 800 కిలోగ్రాముల ఆంఫెటమైన్, కొకై, హషీష్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

మజీద్‌కు స్వీడిష్ పౌరసత్వంతో పాటు ఇరాక్, తుర్కియే పౌరసత్వం ఉన్నట్లు స్వీడన్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

అతనిని తమకు అప్పగించాలని స్వీడన్ ప్రభుత్వం తుర్కియేను కోరింది. అయితే అతనికి తుర్కియే పౌరసత్వం ఉండటంతో తుర్కియే అందుకు నిరాకరించింది.

ఆ సమయంలో మజీద్ ఇరాన్‌కు పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.

ఇరాన్‌లో రావా మజీద్‌ను అరెస్టు చేసినప్పుడు జైలు శిక్ష అనుభవించడం లేదా ఇరాన్‌కు సహకరించడం అనే రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోమని అతనిని బలవంతం చేసినట్లు మొస్సాద్ పత్రాల ద్వారా తెలిసిందని డాగెన్స్ నైహెటర్ ఆరోపించింది.

'ఇరాన్‌లో మజీద్ అరెస్టు అయినట్లు సూచించే ధృవీకరించని సమాచారం తమ వద్ద ఉందని' స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్ 2023 అక్టోబర్‌లో ఎస్‌వీటీ వార్తా సంస్థతో చెప్పారు.

స్వీడన్, ఇరాన్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు, అమెరికా, ఫాక్స్‌ట్రాట్, రావా మజీద్

ఫొటో సోర్స్, Swedish Poilice

ఫొటో క్యాప్షన్, రావా మజీద్‌

స్వీడన్ నుంచి పారిపోవడానికి ముందు హత్య, కాల్పులు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై మజీద్‌ను పోలీసులు అనేకసార్లు అరెస్ట్ చేశారు.

రావా మజీద్ 2018 నుంచి ఫాక్స్‌ట్రాట్ ముఠాను రిమోట్‌గా నడుపుతున్నారు. అతని నేర కార్యకలాపాలలో చాలా వరకు అతను స్వీడన్‌లో లేనప్పుడే జరిగాయి.

కుర్దిష్ ఫాక్స్, ఫాక్స్‌ట్రాట్ గ్యాంగ్‌తో పాటు మజీద్ ప్రత్యర్థి 'రూంబా' గ్యాంగ్, దాని నాయకుడు ఇస్మాయిల్ అబ్డో కూడా ఇరాన్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అబ్డో.. ఒకప్పుడు మజీద్‌కు స్నేహితుడు, సహోద్యోగి. తీవ్ర విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు.

రెండు నేర ముఠాల మధ్య వివాదం, వైరం 2023లో తీవ్రమైంది.

దీని ఫలితంగా స్టాక్‌హోమ్‌తో పాటు చుట్టుపక్కల నగరాల్లో బాంబు దాడులు, హత్యలు, రక్తపాత ఘర్షణలతో సహా పలు హింసాత్మక ఘటనలు జరిగాయి.

ఇందులో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)