షిప్పులకు ముప్పు.. హార్ముజ్‌లో ఇరాన్ అడ్డంకులు.. ఎర్ర సముద్రంలో హూతీల దాడులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ డేనియల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి చమురు రవాణ చేసే నౌకలకు ముప్పు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరిందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలోని మరో కీలక సముద్ర మార్గంపై వరుస దాడులు జరుగుతున్న సమయంలో ఈ అభిప్రాయం వెల్లడైంది.
హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల్ని ఇరాన్ అడ్డుకోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా చమురు నౌకలు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి.
ఇక్కడ కూడా నౌకలపై దాడులు జరగడంతో ఈ హెచ్చరిక వెలువడింది.
మరోవైపు.. హార్ముజ్‌ను మళ్లీ తెరవడంపై చర్చలు జరుగుతున్నాయని డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యను ఇరాన్ ఖండించింది.
నౌకల రాకపోకలకు భద్రత కల్పించడంపై ఒమన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపింది.

"ముడి చమురు వాణిజ్యానికి ముప్పు పరంగా చూస్తే ఈ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యంత ప్రమాదకరమైన కాలం" అని నౌకల కదలికలను పర్యవేక్షించే సంస్థ కెప్లర్‌కు చెందిన విశ్లేషకుడు మాథ్యూ రైట్ అన్నారు.
ఆదివారం హార్ముజ్ జలసంధి మీదుగా ఎనిమిది నౌకలే ప్రయాణించాయి. శనివారం 11 మాత్రమే ఈ మార్గంలో వెళ్లాయి.
యుద్ధం ప్రారంభానికి ముందు అయితే రోజుకు 100 కంటే ఎక్కువ నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి అని కెప్లర్ పేర్కొంది.

యుద్ధానికి ముందు ప్రపంచంలోని చమురు, వాయువు సరఫరాలో సుమారు 20శాతం హార్ముజ్ మీదుగా వెళ్లేది.
జూన్ ప్రారంభంలో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం వల్ల నౌకల రాకపోకలు మళ్లీ పెరిగాయి.
అయితే దాదాపు నెల రోజుల తర్వాత రెండు దేశాల మధ్య దాడులు మళ్లీ ప్రారంభం కావడంతో హార్ముజ్ మీదుగా ప్రయాణించే నౌకల సంఖ్య గణనీయంగా తగ్గింది.
అనేక నౌకలు ఈ జలసంధిని దాటేటప్పుడు తమను గుర్తించకుండా ఉండేందుకు ట్రాన్స్‌పాండర్‌ను ఆఫ్ చేసి వెళ్తున్నాయి(గోయింగ్ డార్క్).
యుద్ధం కొనసాగిన సమయంలో సౌదీ అరేబియా నుంచి చమురు తీసుకెళ్తున్న కొన్ని నౌకలు ఎర్ర సముద్రంలోని ప్రత్యామ్నాయ నౌకాయాన మార్గంలో ప్రయాణించాయి.
అయితే, ఆ ప్రత్యామ్నాయ జలమార్గం ద్వారా వెళుతున్న సౌదీ చమురు ట్యాంకర్లపై యెమెన్‌కు చెందిన హూతీ ఫైటర్లు ఇటీవల వరుసగా దాడులు చేశారు.
ఇరాన్ మద్దతు ఉన్న హూతీ మిలీషియా జూలై 20న ఎర్ర సముద్ర తీరంలో సౌదీ పోర్టులపై దిగ్బంధం విధించినట్లు ప్రకటించింది.
గత వారం రోజులలో ఇక్కడి నౌకలపై అనేక దాడులు జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ నివేదించింది.
"ప్రస్తు పరిస్థితి హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న పరిస్థితి చమురు రవాణాను పరిమితం చేయడమే కాకుండా, మార్కెట్‌ను సమతుల్యం చేయడంలో సహాయకారిగా ఉన్న జల మార్గాన్ని ప్రమాదంలో పడేసింది. ఇది ఇప్పటికే ఉన్న సమస్యకు మరొక సమస్య తోడైనట్లుంది" అని రైట్ అన్నారు.
ముడి చమురు పరిశ్రమ "విస్తరిస్తున్న, క్షీణిస్తున్న మరింత సంక్లిష్టమవుతున్న భద్రత పరిస్థితిని ఎదుర్కొంటోంది" అని ట్యాంకర్ యజమానులకు ప్రాతినిధ్యం వహించే వాణిజ్య సంస్థ ఇంటర్‌టాంకో మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ విల్కిన్స్ చెప్పారు.
"ఇప్పుడు అధిక ప్రమాద ప్రాంతం సౌదీ అరేబియా సముద్ర జలాల వరకు విస్తరించి, ఎర్ర సముద్రంలోని కొన్ని భాగాలకూ చేరుకుంది. దీంతో మార్కెట్‌పై, అలాగే నౌకాయాన స్వేచ్ఛపైనా ప్రభావం పడుతోంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
శనివారం బాబ్ ఎల్-మండెబ్ జలసంధి మీదుగా 28 సరకు రవాణా నౌకలు ప్రయాణించాయి. ఇందులో 6 నౌకలు తమ ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేశాయని కెప్లర్ డేటా వెల్లడిస్తోంది.
బాబ్ ఎల్- మండెబ్ మీదుగా వెళ్లే అన్ని నౌకలపైనా హూతీలు దాడులు చేయడం లేదు. వాళ్లు సౌదీ నుంచి వెళ్లే నౌకల్ని లక్ష్యంగా చేసుకున్నారు.
సౌదీ నుంచి ఆసియాకు చమురు తీసుకు వెళ్లే నౌకల సంఖ్య రోజుకు నాలుగుకి పడిపోయిందని కెప్లర్ తెలిపింది. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఇది అత్యల్ప స్థాయి.
తమ నౌకలు కొన్ని ఇంకా ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తున్నాయని ప్రపంచ నౌకాయాన దిగ్గజం హాపాగ్-లాయిడ్ ప్రతినిధి చెప్పారు. అయితే "పరిణామాలను నిశితంగా గమనిస్తాం. పరిస్థితులు మారితే మా నెట్‌వర్క్‌ను సర్దుబాటు చేస్తాం" అని పేర్కొన్నారు.
"హార్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంటే ఇక్కడ ఉన్న చాలా నౌకలు త్వరగా వెళ్లిపోతాయి. సాధారణ సరకు రవాణా పునరుద్ధరించడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది" అని అన్నారు.
"సేవలు ఆగిపోయాయి. నౌకలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. కాబట్టి సాధారణ రవాణా తిరిగి నెలకొనడానికి ఎక్కువగా మూడు నుంచి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది" అని హాపాగ్ లాయిడ్ ప్రతినిధి తెలిపారు.
ఒమన్‌తో చర్చలు జరిగినప్పటికీ హార్ముజ్ ద్వారా నౌకల రాకపోకలను కొనసాగించే ఒప్పందం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చని ఇరాన్ తెలిపింది.
అమెరికా దాడి కొనసాగుతున్నంత వరకు ఏ ఒప్పందమైనా ప్రస్తుత ఆంక్షలను ఎత్తివేయదని ఇరాన్ విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ అన్నారు.
ఒమన్‌తో చర్చలు ఫలప్రదంగా ఉండవచ్చని అయితే ఏ ఒప్పందానికైనా అమెరికా భాగస్వామ్యం అవసరమని అలాగే కనీసం ఒక పక్షం అయినా రాయితీలు ఇవ్వకపోతే ప్రస్తుత చర్చలు "తప్పుడు ఆరంభం"గా మిగిలిపోవచ్చనే ఆందోళన ఉందని కెప్లర్‌కు చెందిన రైట్ చెప్పారు.
చర్చలను దృష్టిలో ఉంచుకుని ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన తర్వాత చమురు ధరలు గణనీయంగా తగ్గాయి.
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 4.4 శాతం తగ్గి 84.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు రోజులో అది 7.3శాతం పడిపోయి బ్యారెల్‌కు 81.55 డాలర్లకు చేరుకుంది.
ఇరాన్ యుద్ధం షిప్పింగ్ పరిశ్రమను "మళ్లీ మొదటి దశకు తీసుకెళ్లింది. మీరు ఏ రకమైన షిప్పింగ్‌ను చూసినా పరిస్థితి చాలా దారుణంగా ఉంది" అని నౌకల ట్రాకింగ్ సంస్థ జెనెటాకు చెందిన ప్రధాన విశ్లేషకుడు పీటర్ సాండ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























