సౌదీ అరేబియా: ఆ దేశంలో ఉరిశిక్ష పడిన విదేశీయుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించడం లేదని ఆరోపణలు

ఫొటో సోర్స్, Handout/BBC
- రచయిత, హానా జెరస్తియాన్, స్వామినాథన్ నటరాజన్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
"కుటుంబాన్ని ఓదార్చేందుకు, అబ్బాయి చనిపోయాడన్న నిజాన్ని వారు అంగీకరించేందుకు మేము ఈ ఆచారాలన్నీ నిర్వహించాం. కానీ ఇవేవీ నా బిడ్డను నాకు తిరిగి తీసుకురాలేవు" అని తన కొడుకు కిబ్రోమ్ మృతితో విషాదంలో మునిగిన కిన్ఫె అరెగావి అన్నారు.
"ఈ పశ్చాత్తాపం, బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటాయి" అని ఆయన అన్నారు.
కిబ్రోమ్ కిన్ఫె అరెగావి ఈ ఏడాది జూన్‌లో గంజాయి అక్రమ రవాణా కేసులో సౌదీ అరేబియాలో మరణశిక్ష పొందిన ఐదుగురు ఇథియోపియన్లలో ఒకరు.
ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేసే దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. చైనా, ఇరాన్ తర్వాత మూడో స్థానంలో ఉంది సౌదీయే.
చాలామంది ఇథియోపియన్ క్రైస్తవులకు మతపరమైన ఆచారాలతో అంత్యక్రియలు నిర్వహించడం వారి విశ్వాసంలో ముఖ్యమైన భాగం.

మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ప్రత్యేకమైన వస్త్రంతో చుట్టి, చెక్కతో చేసిన శవపేటికలో ఉంచుతారు.
అయితే 25 ఏళ్ల కిబ్రోమ్ అంత్యక్రియలప్పుడు అలా జరగలేదు. ఆయన మృతదేహాన్ని ఇథియోపియాకు తీసుకురాలేదు.
హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం, ఈ ఏడాది జూలై 27 వరకు సౌదీ అరేబియాలో 116 మందికి ఉరిశిక్ష అమలు చేశారు.

"మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకపోవడంటే అదొక పరిపాలనా అంశమే కాదు. దీనర్థం మీరు చనిపోయ్న వ్యక్తితో పాటు, అతని కుటుంబాన్నంతటినీ శిక్షిస్తున్నారని" అని యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్‌కు చెందిన సీనియర్ పరిశోధకులు దువా ధైనీ అన్నారు.
తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధితులైనవారి కోసం ఆమె సంస్థ పని చేస్తోంది.
మతస్వేచ్ఛపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి నజిలా ఘనేయా, మృతదేహాలను కుటుంబాలకు అప్పగించకుండా ఉండే సౌదీ అరేబియా విధానాన్ని హింసాత్మకం, విచక్షణారాహిత్యంగా అభివర్ణించారు.
దక్షిణ సౌదీ అరేబియాలోని అసీర్ ప్రావిన్స్‌లోని ఖమీస్ ముషైత్ కేంద్రంలో జూన్ 23న ఉరిశిక్ష పొందిన ఐదుగురు ఇథియోపియన్లకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, వారి వ్యక్తిగత వస్తువులను కూడా కుటుంబాలకు అందించలేదని బంధువులు చెబుతున్నారు.
వారి కుటుంబాలకు మరణాన్ని ధ్రువీకరించే పత్రాలు కూడా ఇవ్వలేదు.
కిబ్రోమ్ కిన్ఫె అరెగావి 2020లో తన తండ్రి కిన్ఫెతో కలిసి తొలిసారి సౌదీ అరేబియాకు వెళ్లారు. అయితే ఆయనకు సరైన వీసా లేదు.
అక్కడ ఆయనను అరెస్టు చేసి 15 నెలల పాటు జైలులో ఉంచి, ఆ తర్వాత దేశం నుంచి పంపించారు.
అయితే ఇథియోపియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా కిబ్రోమ్ మళ్లీ సౌదీ అరేబియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎర్ర సముద్రాన్ని దాటేందుకు రద్దీగా ఉన్న పడవ ఎక్కి, ఆ తర్వాత యెమెన్‌కు కాలినడకన వెళ్లారు.
2023లో సరిహద్దు దాటుతుండగా సౌదీ అధికారులు కిబ్రోమ్‌ను మళ్లీ అరెస్టు చేసి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు నమోదు చేశారు.
మూడు నెలలు జైలులో ఉన్న తర్వాత తన కుమారుడిని దోషిగా నిర్ధరించి మరణశిక్ష విధించారని కిన్ఫె చెప్పారు. మూడు సంవత్సరాల జైలు జీవితం తర్వాత జూన్‌లో ఆయన మరణశిక్షను అకస్మాత్తుగా అమలు చేశారు.
"మాతో మాట్లాడే అవకాశం కూడా అతనికి రాలేదు. అతను చనిపోయాడని నేను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నా" అని ఆయన బీబీసీతో చెప్పారు.
నిర్దోషి అయినప్పటికీ తన కొడుకును దోషి అంటూ తప్పుడు శిక్ష వేశారని కిన్ఫె నమ్ముతున్నారు.
"నా కొడుకు గంజాయి అక్రమ రవాణాలో పాల్గొన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు" అని కిన్ఫె అన్నారు.

ఫొటో సోర్స్, Mebrahtom
అదే రోజు, అదే జైలులో అదే నేరానికి దోషిగా తేలిన త్సిగాబు గెబ్రెమారియమ్‌కు కూడా ఉరిశిక్ష అమలు చేశారు.
గెబ్రెమారియమ్ (26) ఇథియోపియాలోని టిగ్రే గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. ఎనిమిది మంది పిల్లల్లో ఆయన పెద్దవారు.
పేదరికం, అంతర్యుద్ధం నుంచి తప్పించుకునేందుకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయారని ఆయన తండ్రి హాగోస్ గెబ్రెమెస్కెల్ తెలిపారు.
"మా ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు ఎక్కువగా ఉండవు. నాకు సాయం చేసేందుకు అతను సౌదీ అరేబియాకు వెళ్లాడు" అని హాగోస్ చెప్పారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో త్సిగాబు దోషిగా తేలి, మూడున్నరేళ్లు జైలులో ఉన్నారు. ఆయన చివరిసారిగా ఫిబ్రవరిలో కుటుంబంతో మాట్లాడారు.
"త్వరలో ఇంటికి తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు" అని హాగోస్ బీబీసీతో చెప్పారు.
ఆయన తల్లి లెటెక్రిస్టోస్ గెబ్రెట్సాదిక్ తన కుమారుడి కోసం ఓ అమ్మాయిని వెతుకుతున్నారు. కానీ చివరికి ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
"నాకు కుమార్తెలు ఉన్నారు. వాడు నాకు ఒకేఒక్క కొడుకు. తమ సోదరుడు త్వరలో ఇంటికి వస్తాడని నా కుమార్తెలు ఆశగా ఎదురుచూశారు. ఆయన పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి దుఃఖం నా దుఃఖంకంటే ఎక్కువ" అని ఆమె చెప్పారు.
త్సిగాబుకు మరణశిక్ష విధించిన విషయం సౌదీ అరేబియాలో నివసిస్తున్న బంధువుల ద్వారా తెలుసుకున్న ఆయన కుటుంబం, స్థానిక చర్చిలో త్సిగాబు మృతదేహం లేకుండానే అంత్యక్రియలు, ప్రార్థనా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది.
"అతని మృతదేహాన్ని ఇంటికి ఎందుకు తీసుకురాలేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను" అని లెటెక్రిస్టోస్ అన్నారు.
తమ కుమారుడు నేరానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను సౌదీ అధికారులు అందించాలని త్సిగాబు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇతరులు తమ కుమారుడిని ఇరికించి, అతడిని ఉపయోగించుకున్నారని వారు అనుమానిస్తున్నారు.

మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గత ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాల్లో మరణశిక్ష పడిన వారిలో 75 శాతం మంది విదేశీయులే.
బలహీన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులే లక్ష్యంగా నేర ముఠాలు పని చేస్తున్నాయని ధైనీ చెప్పారు.
"కొన్ని ఇథియోపియన్ కేసుల్లో, సరిహద్దు దాటేందుకు సాయం చేస్తామని చెప్పి, వేరే వస్తువులు తీసుకెళ్లేలా తమను ఒప్పించారని ఖైదీలు తెలిపారు. కొంతమంది పాకిస్తాన్ పౌరులను బలవంతంగా అక్రమ వస్తువులను మింగేలా చేశారు. మరికొందరిపై ఒత్తిడి తెచ్చి లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి అలా చేయించారు" అని ధైనీ చెప్పారు.
కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ 2015లో సింహాసనం అధిష్ఠించినప్పటి నుంచి సౌదీ అరేబియాలో ఉరిశిక్షకు గురైన వారి సంఖ్య 2,000 దాటిందని, వీరిలో 42 శాతం మంది విదేశీయులేనని యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనా వేసింది.
2025లో సౌదీ అరేబియా 356 మందికి ఉరిశిక్ష అమలు చేసిందని, ఒక్క ఏడాదిలో అమలు చేసిన మరణశిక్షల్లో ఇదే అత్యధికమని ఆ సంస్థ అంచనా వేసింది.
సౌదీ చట్టం ప్రకారం, రాయబార కార్యాలయం ఖర్చుతో మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు అధికారులకు అనుమతి ఉంది. కాని అలా ఎప్పుడూ జరగదని ధైనీ చెప్పారు.
"మరణశిక్ష అమలైన తర్వాత విదేశీ పౌరుల మృతదేహాన్ని వారి కుటుంబానికి తిరిగి అప్పగించిన ఒక్క కేసు గురించి కూడా మాకు తెలియదు. సౌదీ పౌరులకు సంబంధించి మేము నమోదు చేసిన కేసుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది" అని ఆమె చెప్పారు.
గతంలో తుర్కియే, జోర్డాన్ పౌరుల కుటుంబాలు సహా మరికొన్ని కుటుంబాలు కూడా ఖైదీల మృతదేహాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ ప్రచారం నిర్వహించాయని, కానీ అవి విజయవంతం కాలేదని ధైనీ తెలిపారు.
ఈ విషయంపై స్పందించాలని బీబీసీ సౌదీ ప్రభుత్వాన్ని హోం ఆఫీస్, ఫారిన్ ఆఫీస్, లండన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ద్వారా సంప్రదించింది. అయితే ఎలాంటి స్పందన రాలేదు.

ఫొటో సోర్స్, త్సిగాబు కుటుంబం
గంజాయికి సంబంధించిన నేరంలో దోషిగా తేలిన ఓ సౌదీ పౌరుడికి జూన్‌లో మరణశిక్ష ప్రకటిస్తూ సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన ప్రకటనలో "భూమిపై అవినీతిని వ్యాప్తి చేసేవారికి’’ కఠిన శిక్ష విధించాలని సూచించే ఖురాన్ వచనాలను ఉటంకించారు.
"మాదకద్రవ్యాల ముప్పు నుంచి పౌరులను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, అందులో పాలుపంచుకునే వారికి చట్టం ప్రకారం సాధ్యమైనంత కఠినమైన శిక్ష విధించేందుకు కూడా కట్టుబడి ఉంది. మాదకద్రవ్యాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటాయి, తీవ్రమైన అవినీతికి ఆజ్యం పోస్తాయి" అని ప్రకటన పేర్కొంది.
ఈ అంశంపై స్పందించాలని సౌదీ అరేబియాలోని ఇథియోపియా రాయబార కార్యాలయాన్ని కూడా బీబీసీ సంప్రదించింది.
ప్రస్తుతం ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న ఖైదీల సంఖ్యను సౌదీ అరేబియా వెల్లడించదు. అయితే ఆ సంఖ్య వందల్లో ఉండచ్చని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
"సౌదీ అరేబియాలో ఉరిశిక్షలను రహస్యంగా లేదా ముందస్తు సమాచారం లేకుండా అమలు చేస్తారు. దీంతో ఖైదీకి, వారి కుటుంబానికి మరణానికి సిద్ధమయ్యేందుకు తగిన సమయం లభించదు. ఇది వారి హక్కుల ఉల్లంఘనే" అని మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్‌కు చెందిన పరిశోధకురాలు జాయ్ షియా అన్నారు.
రహస్యంగా ఉంచే విధానం కారణంగా మరణశిక్ష కోసం ఎదురుచూస్తున్న ఖైదీల జీవితం మరింత కష్టంగా మారుతోంది.
భద్రతా కారణాల వల్ల గుర్తింపు వెల్లడించలేని ఓ ఖైదీ తన జైలు జీవితాన్ని బీబీసీతో వివరించారు.
2023లో ఆయన్ను అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలను ఆయన అంగీకరించారు. అనంతరం తనను దోషిగా నిర్ధరించి మరణశిక్ష విధించారని చెప్పారు.
ఈ ఏడాది ఆయనతో పాటు ఉన్న 15 మంది ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేయడాన్ని చూశారు. ఇప్పుడు తనకూ ఉరిశిక్ష విధిస్తారేమోనని ఆయన భయపడుతున్నారు.
"గార్డులు తలుపులు తెరిచిన ప్రతిసారీ, తర్వాత వంతు ఎవరిదో అని మేము వణికిపోతూ ఉంటాం."
ఏదైనా మిరాకిల్ జరిగి తన శిక్ష మారుతుందేమోనని ఆయన ఆశిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఉపశమనం లభించాలని కోరుకుంటున్నారు. కానీ పరిస్థితి అత్యంత దారుణంగా మారితే, తన అవశేషాలను స్వదేశానికి పంపించాలని కోరుతున్నారు.
"నా తల్లిదండ్రులు నా మృతదేహాన్ని కూడా చూడలేరేమోనని భయంగా ఉంది" అని ఆయన అన్నారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























