‘‘క్యాన్సర్‌తో నా జుట్టూ ఎటూ పోతుంది, అందుకే నా పిల్లలు ఆనందించేలా వాళ్లకు కత్తెర ఇచ్చి ఇష్టమొచ్చినట్లు కట్ చేసుకుంటూ ఆడుకోమన్నా’’

ఫొటో సోర్స్, Caroline Sikkenk
- రచయిత, నికోలా బ్రయన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
రియానన్ థామస్ ఇటీవలె కీమోథెరపీ, మాస్టెక్టమీ చేయించుకోవడంతో ఆమె జుట్టంతా రాలిపోయింది. దీంతో ఆమె ఎన్నడూ లేనంతగా ఆత్మవిశ్వాసం కోల్పోయారు.
అయితే, బ్రెస్ట్ క్యాన్సర్‌తో జీవిస్తున్న మహిళల ధైర్యాన్ని, పట్టుదలను చాటే ప్రచార కార్యక్రమం కోసం జరిగిన ఒక ఫోటోషూట్‌లో పాల్గొన్న రియానన్ తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోగలిగారు.
"మొదటిసారిగా నేను అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నానని అనిపించింది" అని 36 ఏళ్ల రియానన్ అన్నారు.
"ఇంత కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మనలో ఎంత బలం ఉందో తెలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది"
రియానన్‌కు ఇద్దరు కుమార్తెలు. 2025 నవంబర్‌లో స్నానం చేస్తుండగా రొమ్ములో గడ్డ తగిలిది. బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్ష నిర్వహించగా ఆమెకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

"నేను కుప్పకూలిపోయాను. పిల్లలకు ఈ విషయం ఎలా చెప్పాలి? వారికి చెప్పాలంటేనే చాలా భయమేసింది" అని టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె చెప్పారు.
అప్పటి నుంచి ఆమెకు మాస్టెక్టమీ, కీమోథెరపీ జరిగాయి. ప్రస్తుతం రేడియోథెరపీ తీసుకుంటున్నారు.
కీమోథెరపీ సమయంలో జుట్టు రాలడం ప్రారంభమైనప్పుడు తలను పూర్తిగా షేవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, అది తన పిల్లలకు సాధ్యమైనంత వరకు ఒక మంచి అనుభవంగా ఉండాలని ఆమె కోరుకున్నారు.
తల షేవ్ చేసుకునే ముందు చిన్న కుమార్తెను పిలిచి తనకు నచ్చినట్లుగా కత్తెరతో ఏమైనా చేసుకోవచ్చని చెప్పి, ఒక హెయిర్‌డ్రెస్సర్‌గా ఆడుకొమ్మని ప్రోత్సహించారు.
"ఎలాగూ జుట్టు మొత్తం పోతుంది కదా, నీకు నచ్చినట్లుగా కట్ చేయమని తనకి చెప్పాను" అని రియానన్ అన్నారు.
" ఒక క్లిష్టమైన పరిస్థితిని నా పిల్లలకు, నాకు సాధ్యమైనంత వరకు ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చాలని అనుకున్నాను. నేను బాధపడుతున్నట్లు వాళ్లు చూడకూడదనుకున్నాను. నా కుమార్తె కూడా చాలా ఆనందించింది."
ఆమె ఫోన్‌లో తీసిన వీడియోలో, కేఫిల్లీ సమీపంలోని అబెర్‌ట్రిడ్‌వర్‌లోని ఇంట్లో కుటుంబమంతా నవ్వుతూ ఉన్నట్లు రియానన్ కుమార్తె కత్తెరతో ఆమె జుట్టుపై తన టాలెంట్‌నంతా చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Rhiannon Thomas
కానీ ఆ తర్వాత, ఒంటరిగా ఉన్నప్పుడల్లా తన రూపంలో వచ్చిన ఈ తీవ్రమైన మార్పును భరించడం ఆమెకు కష్టంగా అనిపించింది.
"అద్దంలో చూసుకుని ఏడ్చిన విషయం నాకు గుర్తుంది. ఎందుకంటే మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితి కదా" అని ఆమె చెప్పారు.
తల పూర్తిగా షేవ్ చేసిన తర్వాత తొలిసారి తనను చూసినప్పుడు తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన భావోద్వేగాలను గుర్తుచేసుకుంటూ రియానన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ తలకు స్కార్ఫ్ కట్టుకోవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Caroline Sikkenk
మెంటల్ హెల్త్ నర్సు, ఇద్దరు పిల్లల తల్లి అయిన సామ్ గ్రోనో-వాల్టర్స్‌కు ఈ అనుభవాలన్నీ సుపరిచితమే.
సామ్ (44 ) కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా జుట్టును కోల్పోయారు.
ఆమెకు వచ్చిన క్యాన్సర్ పూర్తిగా నయం కాలేనిది.
ఐదేళ్ల కిందట తొలిసారి ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఇంట్రావీనస్ కీమోథెరపీ, లంపెక్టమీ, రేడియోథెరపీ, ఆ తర్వాత నోటి ద్వారా తీసుకునే కీమోథెరపీతో చికిత్స విజయవంతంగా పూర్తయింది.
అయితే ఏడు నెలల తర్వాత మరో గడ్డ కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. క్యాన్సర్ తిరిగి వచ్చినట్లు పరీక్షల్లో తేలింది.
ఆ తర్వాత మాస్టెక్టమీ చేశారు. క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందని ఆమెకు చెప్పారు.
కానీ 2024లో క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాపించినట్లు ఆమెకు తెలిసింది. గత ఏడాది జూలైలో అది కాలేయం, లింఫ్ నోడ్స్‌కు కూడా వ్యాపించినట్లు పరీక్షల్లో తేలింది.
"మనం ముందుకు సాగుతూనే ఉండాలి. చేయగలిగినదంతా చేయాలి. ఎందుకంటే నా పిల్లలు ఎదగడాన్ని నేను చూడాలనుకుంటున్నా" అని వేల్స్‌లోని వేల్ ఆఫ్ గ్లామోర్గన్‌లోని సెయింట్ అథన్‌కు చెందిన సామ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Caroline Sikkenk
రియానన్‌లాగే, ఇక తలను షేవ్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని భావించినప్పుడు సామ్ ఆలోచనంతా కూడా తన పిల్లల గురించే. వారికి ఈ పరిస్థితిని ఎలా బాధగా మారకుండా ఏం చేయాలని ఆమె ఆలోచించారు. ఆమెకు 20 ఏళ్ల కూతురు, 13 ఏళ్ల కొడుకు ఉన్నారు.
2002 ప్రపంచకప్‌లో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డో చేయించుకున్న ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్‌ను గుర్తుచేస్తూ, ముందు భాగంలో కొంత జుట్టు ఉంచి తలను షేవ్ చేయించుకోవాలని ఆమె కొడుకు కోరాడు. సామ్ అలాగే చేశారు.
"నాకు అది చాలా సంతోషకరమైన జ్ఞాపకం. నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ సరదాగా గడపగలనని, నవ్వగలనని, నా పిల్లలను నవ్వించగలనని అనుకున్నా" అని ఆమె చెప్పారు.
తన కొత్త రూపం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆమె మరోసారి ఆందోళన చెందారు.
"నా కొడుకుని స్కూల్‌కు తీసుకెళ్లేటప్పుడు, నేను టోపీ పెట్టుకోకుండా వస్తే నీకు ఇబ్బందిగా ఉంటుందా అని అడిగేదాన్ని" అని సామ్ గుర్తుచేసుకున్నారు.
"నాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది అమ్మ? అనేవాడు" అన్నారామె.

బ్రెస్ట్ క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ పింక్ రిబ్బన్ ఫౌండేషన్ నిర్వహించిన బోల్డ్ (BOLD) వేల్స్ ప్రచారంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్న తర్వాత రియానన్, సామ్ తొలిసారి కలుసుకున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా జుట్టు కోల్పోయిన మహిళల ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని చాటడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.
వేల్స్‌కు చెందిన మరో తొమ్మిదిమంది మహిళలతో కలిసి వారు కార్డిఫ్‌లో ఒకరోజు గడిపి, డచ్ ఫోటోగ్రాఫర్ కరోలిన్ సిక్కెంక్‌తో ఫోటోలు తీయించుకున్నారు.
ఈ ఫోటోలను వచ్చే నెలలో లండన్‌లోని పికాడిలీ లైట్స్‌లో ప్రదర్శించనున్నారు.
ఫోటోలు దిగేందుకు ఇద్దరు మహిళలు మొదట కాస్త జంకినా, ఆ అనుభవమంతా ఎంతో సంతోషంగా సాగిందని చెప్పారు.
"ఆ రోజు మొదటిసారి కలవడమే అయినా ఇదివరకే పరిచయమున్నట్లు అనిపించింది. ఇప్పటికీ మేమంతా ఒకరితో ఒకరం మాట్లాడుతూనే ఉంటాం" అని సామ్ చెప్పారు.
క్యాన్సర్ చికిత్సలో జుట్టు కోల్పోయిన మరో మహిళతో రియానన్ అంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు.
"నాకు చాలా సురక్షితంగా అనిపించింది. ఎవరూ నన్ను జడ్జ్ చేయడం లేదన్న భావన కలిగింది" అని ఆమె చెప్పారు.
తాము దిగిన ఫొటోలను మొదటిసారి చూసినప్పుడు ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు.
"వావ్" అని రియానన్ అన్నారు. ఆ సమయంలో ఫోటోలు దిగేందుకు తనలో కూడగట్టుకున్న ధైర్యంపట్ల ఆమె గర్వంగా ఫీల్ అయ్యారు.
సామ్ అయితే తనను తాను చూసుకున్నప్పుడు గుర్తుపట్టలేకపోయారు.
"వావ్, ఇది నేనేనా అనిపించింది" అని ఆమె అన్నారు.
"వాటిని నా కుటుంబానికి చూపిస్తూ, ఇదిగో నేనే అని చెప్పడం చాలా గర్వంగా అనిపించింది"

ఫొటో సోర్స్, The Pink Ribbon Foundation
2022లో బోల్డ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సమయంలో పింక్ రిబ్బన్ ఫౌండేషన్‌కు చెందిన లీసా అలెన్, బ్రెస్ట్ క్యాన్సర్‌పై జరిగిన ఒక సమావేశంలో ఫోటోగ్రాఫర్ కరోలిన్ సిక్కెన్‌క్‌ను కలిశారు.
అనారోగ్యం కారణంగా జుట్టు కోల్పోయిన మహిళలను కరోలిన్ ఎన్నో ఏళ్లుగా ఫోటోలు తీస్తున్నారు.
"ఆమె తీసిన ఫోటోల్లో మాకు ముఖ్యంగా కనిపించిన విషయం ఏమిటంటే, ఆ మహిళలను రోగులుగా చూపించలేదు. వారు ఆత్మవిశ్వాసంతో, అందంగా కనిపించారు" అని లీసా చెప్పారు.
మొదటి బోల్డ్ ఫోటోషూట్ 2023లో జరిగింది.
"మేమిలా ఓ కమ్యూనిటీని సృష్టిస్తామని అప్పట్లో ఊహించలేదు" అని లీసా చెప్పారు.
ఫోటో తీసే ముందే ఈ కార్యక్రమం ప్రభావం మొదలవుతుందని ఆమె చెప్పారు.
"ముందుగానే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. అందువల్ల మహిళలు అక్కడికి చేరుకునే సమయానికి, తాము ఈ పరిస్థితిని కలిసి ఎదుర్కొంటున్నామనే భావన వారిలో కలుగుతుంది.
"ఆ తర్వాత ఏర్పడే స్నేహాలు, పరస్పర సహకారం ఫోటో తీసిన తర్వాత కూడా చాలాకాలం కొనసాగుతాయి."
ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తమలో కొత్త బలం, భవిష్యత్తుపై ఆశ ఏర్పడ్డాయని ఇద్దరు మహిళలు చెప్పారు.
"ఆ ఫోటోషూట్ తర్వాత నా ఆత్మవిశ్వాసం, జీవితంపై ఒక సానుకూల దృక్పథం మరింత బలపడ్డాయని అనిపించింది" అని రియానన్ చెప్పారు.
"అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో, స్వేచ్ఛగా అనిపించింది. ఇక నేను దాక్కోవాల్సిన అవసరం లేదనిపించింది."
ఇప్పుడు ఆమె తలకు స్కార్ఫ్‌లు ధరించడం మానేశారు. షేవ్ చేసిన తలను గర్వంగా చూపించడం ఆమెకు అలవోకగా మారింది.
సామ్‌కు ఈ ఫోటోషూట్ తనను తాను అంగీకరించడంలో సహాయపడింది.
"ఇదే నేను. మళ్లీ పొడవాటి జుట్టు ఉండకపోవచ్చు" అని ఆమె చెప్పారు.
"జుట్టు రాలిపోవడం నన్ను నిర్వచించే విశేషం కాదు. నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నానని, నేను బలంగా ఉన్నానని చెప్పే ఒక గుర్తు మాత్రమే" అంటారు రియానన్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























