ఎన్నికల కమిషన్‌లో విభేదాల వార్తలతో ప్రతిపక్షాలకు లక్ష్యంగా మారిన జ్ఞానేష్ కుమార్ ఎవరు? ఆయనపై మోదీ ప్రభుత్వానికి ఎంత నమ్మకం ఉంది?

Chief Election Commissioner Of India Gyanesh Kumar

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ను తప్పించాలనే డిమాండ్‌ను ప్రతిపక్షాలు మరింత ముమ్మరం చేశాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విషయంలో కొన్ని నిర్ణయాలు తమకు తెలియజేయలేదంటూ మిగిలిన ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు చెప్పారనే వార్తలు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు తమ విమర్శలను తీవ్రతరం చేశాయి.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ తీసుకున్నపలు నిర్ణయాలు ప్రతిపక్షాలకు లక్ష్యంగా మారాయి.

ఇంతకీ జ్ఞానేష్ కుమార్ ఎవరు? జ్ఞానేష్ కుమార్ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 2025 ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

ఆయన జనవరి 31, 2024న కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. మే 2022 నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని ఈ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ చేసిన రెండు నెలల తర్వాత అంటే మార్చి 14, 2024న, ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన మార్చి 15న బాధ్యతలు స్వీకరించిన తరువాత రోజే లోక్‌సభ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న సుమారు ఏడాదిలోపే జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జ్ఞానేష్ కుమార్ ఐఐటి కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పట్టా పొందారు. ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ ఫైనాన్స్ కూడా చదువుకున్నారు.

ఎన్నికల కమిషన్ బాధ్యతలు చేపట్టక ముందు జ్ఞానేష్ కుమార్ ఐదేళ్లపాటు హోం మంత్రిత్వ శాఖలో పనిచేశారు.

అక్కడ మే 2016 నుంచి సెప్టెంబర్ 2018 వరకు జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత సెప్టెంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2021 వరకు అదనపు కార్యదర్శిగా పనిచేశారు.

Chief Election Commissioner Of India Gyanesh Kumar

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ అయిన వెంటనే 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి

కశ్మీర్‌ నుంచి రామ మందిరం వరకు...

హోంశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న సమయంలో జ్ఞానేష్ కుమార్ జమ్మూకశ్మీర్ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. ఆయన ఆ పదవిలో ఉన్న సమయంలోనే 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు ప్రకటించారు.

ఆర్టికల్ 370ని రద్దు చేసే చట్టాన్ని తీసుకువస్తున్నప్పుడు, ఆయన హోంమంత్రి అమిత్‌షాతో కలిసి రోజూ పార్లమెంట్‌కు వచ్చేవారని హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించింది.

ఓ అధికారిగా జ్ఞానేష్ కుమార్‌పై మోదీ ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచిందని, ఇది కేవలం ఆయనకు అప్పగించిన బాధ్యతల ద్వారానే కాకుండా, జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ లాంటి ముఖ్యమైన బిల్లుల తయారీ బాధ్యతను ఇవ్వడం ద్వారా నిరూపితమైందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏర్పాటులోనూ ఆయన భాగస్వామ్యం ఉందని తెలిపింది. ఆయన సహకార కార్యదర్శిగా ఉన్న సమయంలోనే సహకారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి ఉద్దేశించిన మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (ఎంఎస్‌సీఎస్) (సవరణ) బిల్లు 2023 ఆమోదం పొందిందని తెలిపింది.

ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఉన్న కాలంలో, 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటు, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర, దిల్లీలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ పదవీకాలం జనవరి 26, 2029 వరకు ఉంది. ఆయన పదవీకాలంలో 20 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆయన 2027 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహించి, 2029 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు చేస్తారు.

Gyanesh Kumar

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2024లో జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా ఎన్నికయ్యారు

కొత్త చట్టం కింద తొలిసారిగా ఎంపిక

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవల నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023 ప్రకారం జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఇలా కొత్త చట్టం ప్రకారం జరిగిన మొదటి ఎంపిక ఇదే. అంతకు ముందు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఈ కొత్త చట్టం కింద ఎన్నికల కమిషనర్లుగా 2024లో నియమితులయ్యారు.

ఈ చట్టం రాక ముందు, ప్రభుత్వ సిఫార్సు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించేవారు.

అయితే 2023 మార్చిలో వీరి నియామక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కేంద్రం సీజేఐ స్థానంలో కేంద్రమంత్రిని తీసుకొస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసింది.

2023 నాటి ఈ చట్టం ప్రకారం ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాని ఎంపిక చేసిన కేంద్రమంత్రితో కూడిన ప్యానెల్ ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషన్ సభ్యుల పేర్లను సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియామాకాలు చేస్తారు.

అయితే జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వ్యతిరేకించింది. కానీ, కాంగ్రెస్ అభ్యంతరాన్ని ప్రభుత్వం తోసిపుచ్చి జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించింది.

Rahul Gandhi

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది.

అసలేం జరిగింది?

సర్ విషయంలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు చెప్పలేదని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ నిర్ణయాలను పదేపదే వ్యతిరేకించారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఓ కథనాన్ని ప్రచురించింది.

ఎన్నికల కమిషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆ కథనం వెల్లడించింది.

మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న రాజ్యాంగ సంస్థల్లో భిన్నమైన అభిప్రాయాలు, సూచనలు, వ్యాఖ్యలు రావడం సహజమని పేర్కొంది. ఎస్ఐఆర్‌తో సహా గతేడాది కాలంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నట్టు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)