‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?

గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం
ఫొటో క్యాప్షన్, గురజాడ నివాసంలో ఉన్న ఆయన విగ్రహం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

విజయనగరం కోట ప్రహరీగోడ పక్కనే, రోడ్డుకు ఆనుకుని వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ పాత ఇల్లు. ఆ ఇంట్లోకి వెళితే ఓ టేబుల్.. రెండు కుర్చీలు..ఓ కళ్లజోడు...రబ్బరు స్టాంపు...కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి.

తెలుగు సాహిత్యంలో కొత్త ఆలోచనలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు అడుగులు పడిన ఇల్లు అది.

ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది.

అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్రపరిచి ప్రదర్శనకు పెట్టారు. విజయనగరంలోని ఈ ఇంట్లోకి వెళ్తే గురజాడ రచనలతో పాటు ఆయన జీవించిననాటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి.

సెప్టెంబరు 21న గురజాడ అప్పారావు జయంతి. ఈ సందర్భంగా ఆయన ఇంట్లోని వస్తువులు వాటి వెనుక దాగి ఉన్న గురజాడ జీవితం, ఆయన రచనలు, ఆలోచనలను ఒకసారి చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గురజాడ ఇంట్లో భద్రపరిచిన వస్తువుల్లో ఆయన ఉపయోగించిన కళ్లజోడు కూడా ఉంది. ఆ కళ్లజోడుతో ఆయన చూసిన ప్రపంచం మాత్రం ఆయన కాలంలో చాలామంది చూడని మరో కోణాన్ని ఆవిష్కరించిందని గురజాడ నివాసం కేర్ టేకర్ గురజాడ ఇందిరా దేవి బీబీసీతో అన్నారు.

"ఆయన జీవించిన కాలంలో బాల్యవివాహాలు, కన్యాశుల్కం, మహిళలపట్ల వివక్ష వంటి సామాజిక సమస్యలు తీవ్రంగా ఉండేవి. వితంతువుల జీవితాలు ఎన్నో కష్టాలతో నిండిపోయేవి. వాటిని చూసి ఊరుకోకుండా తన రచనలతో ఆ సమాజాన్ని ప్రశ్నించారు గురజాడ. ఆ ప్రశ్నలకు నాటకరూపమే కన్యాశుల్కం" అని ఆమె చెప్పారు.

గురజాడ 'కన్యాశుల్కం' నాటకాన్ని 1892లో రాశారని ఇందిర తెలిపారు. "సమాజంలోని పరిస్థితులను లోతుగా పరిశీలించి, వాటిని నాటకంలో ప్రతిబింబించారు" అని ఆమె వివరించారు.

గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం
ఫొటో క్యాప్షన్, గురజాడ అప్పారావు ఉపయోగించిన కళ్లజోడు, రబ్బరు స్టాంపు

ఓ కళ్లజోడు.. ఓ కొత్త చూపు

కాలానికంటే ముందే నడిచిన అభ్యుదయవాది గురజాడ అనేది కేర్ టేకర్ ఇందిర అభిప్రాయం.

గురజాడ అప్పారావు అప్పటి గంజాం జిల్లాలో భాగంగా ఉన్న (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా) యలమంచిలిలోని సర్వసిద్ది రాయవరంలో 1862 సెప్టెంబర్ 21న జన్మించారు.

విజయనగరం, రాజమహేంద్రవరంలో చదువుకున్నారు.

ఆంగ్లభాషపై పట్టు సాధించిన గురజాడ, విజయనగరంలోని మహారాజ కళాశాలలో, సంస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.

ఈ సమయంలో బోధనతో పాటు సాహిత్య రచనలు కొనసాగించారు.

గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం
ఫొటో క్యాప్షన్, ఈ కుర్చీ, టేబుల్ మీదనే గురజాడ రచనలు కొనసాగించారు.

ఆ టేబుల్‌పై కూర్చుని..

ఇంట్లో కనిపించే ముఖ్యమైన వస్తువుల్లో టేకుతో తయారు చేసిన టేబుల్ కూడా ఉంది.

ఒక రచయితకు టేబుల్ అంటే కేవలం ఫర్నిచర్ కాదు.

అదే బల్లపై ఆయన రచనలు రూపుదిద్దుకున్నాయి. పాత్రలు పుట్టాయి. ఆలోచనలు అక్షరాలయ్యాయి.

గురజాడ ఎక్కువగా గడిపిన రెండు గదుల్లో ఈ టేబుల్, కుర్చీ ఉండేవని ఆయన రచనల్లో ఎక్కువ భాగం అక్కడే రూపుదిద్దుకున్నాయని అందుకే వాటిని భద్రపరిచినట్లు ఇందిర చెప్పారు.

" ‘కన్యాశుల్కం’లోని గిరీశం, మధురవాణి వంటి పాత్రల ద్వారా తన కాలంలోని సామాజిక వాస్తవాలను గురజాడ మన ముందుంచారు. హాస్యం, వ్యంగ్యం, సంభాషణల మధ్యే సమాజంలోని లోపాలను ఎత్తిచూపారు. అందుకే 'కన్యాశుల్కం' ఒక నాటకం మాత్రమే కాదు. ఒక కాలానికి అద్దం. కన్యాశుల్కం పుస్తకాన్ని చదివేందుకు ఈ ఇంటికి ప్రతిరోజు కొందరు వస్తూనే ఉంటారు" అని ఇందిరా దేవి బీబీసీతో అన్నారు.

గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం
ఫొటో క్యాప్షన్, గురజాడ చదివిన పుస్తకాలను కూడా భద్రపరిచినట్లు గురజాడ నివాసం కేర్ టేకర్ గురజాడ ఇందిరా దేవి చెప్పారు.

వాడుక భాషలోనే..

గురజాడ ప్రత్యేకత ఆయన చెప్పిన విషయాల్లో మాత్రమే లేదు. ఆయన ఎంచుకున్న భాషలోనూ ఉందనేది సాహితీవేత్తల అభిప్రాయం.

"ఆయన కాలంలో సాహిత్యంలో గ్రాంథిక భాషకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. కానీ గురజాడ సామాన్య ప్రజలు మాట్లాడుకునే వ్యవహారిక భాషకు సాహిత్యంలో స్థానం కల్పించారు. అందుకే ఆయన పాత్రలు పుస్తకాల్లో రాసిన పాత్రల్లా కాకుండా... మన చుట్టూ ఉన్న మనుషుల్లా కనిపిస్తాయి.

'కన్యాశుల్కం'లోని సంభాషణలు ఇందుకు ఉదాహరణ.

‘‘130 ఏళ్లకు పైగా గడిచినా ఆ నాటకంలోని అనేక పదాలు, ముఖ్యంగా ఆంగ్ల పదాల వినియోగం ఇప్పటికీ మనకు పరిచయమున్నవే అనిపిస్తుంది’’ అని అభ్యుదయ రచయితల సంఘం విజయనగరం ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ బీబీసీతో అన్నారు.

ఆ కాలంలో దేశంలో ఆంగ్ల పదాల వాడుక అంతగా లేకపోయినా.. గురజాడ వాటిని తన రచనల్లో సహజంగా ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.

గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం
ఫొటో క్యాప్షన్, రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనల శాఖ ఆధ్వర్యంలో విజయనగరంలోని గురజాడ నివాసానికి సంరక్షణ కొనసాగుతోంది.

గురజాడ చదివిన పుస్తకాలు..

గురజాడకు పుస్తకాలంటే ఎంతో ఆసక్తి. ఆయన ఇంట్లో భద్రపరిచిన పుస్తకాలను చూస్తే అది తెలుస్తుంది.

ప్రపంచ సాహిత్యం, నాటకాలు, సైకాలజీకి సంబంధించిన పుస్తకాలు అక్కడ కనిపిస్తాయి.

మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి గురజాడ చేసిన అధ్యయనం 'కన్యాశుల్కం'లోని పాత్రల రూపకల్పనలో కనిపిస్తుందని ఇందిర చెప్పారు.

ఇదే ఇంట్లో ఆయన రచించిన పుస్తకాల ప్రతులు కూడా భద్రపరిచారు. వాటిలో కొన్ని ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం

చిన్న వస్తువులు, పెద్ద జ్ఞాపకాలు..

ఇంట్లో భద్రపరిచిన వస్తువుల్లో ఉన్న కళ్లజోడు, రబ్బరు స్టాంపు.. అవి చాలా చిన్న వస్తువుల్లానే కనిపిస్తాయి. కానీ ఒక రచయిత జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి వస్తువులే ఆధారాలుగా మిగులుతాయి.

ఒకప్పుడు ఒక మనిషి రోజువారీ జీవితంలో భాగమైన వస్తువులు ఇప్పుడు చరిత్రలో భాగమయ్యాయి.

గురజాడ ఇంట్లో ఉన్న వస్తువులను చూస్తే కుటుంబ జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి.

"గురజాడ ఉపయోగించిన టేబుల్, పుస్తకాలు ఈ ఇంట్లోనే ఉన్నాయని, గురజాడ ఈ ఇంట్లో నడిచారని మా తాత చెప్పేవారు" అని గురజాడ అప్పారావు మునిమనవడు వెంకటేశ్వర ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

గురజాడను ప్రత్యక్షంగా చూడలేకపోయిన అభిమానులు తనను చూసి ఆయన కుటుంబ సభ్యుడిని చూశామనే భావనతో నమస్కరిస్తుంటారని ఆయన చెప్పారు.

గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం, పురావస్తు శాఖ
ఫొటో క్యాప్షన్, గురజాడ నివాసం పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది.

2015లో పురావస్తుశాఖ స్వాధీనం..

గురజాడ గృహాన్ని మే 25, 2015న రాష్ట్ర పురావస్తుశాఖ తన ఆధీనంలోకి తీసుకుందని ఇందిరా దేవి చెప్పారు. ఈ నివాసం ముందు పురావస్తు, ప్రదర్శనల శాఖ సంరక్షణలో ఉన్న నివాసం అని చెప్పే బోర్డు కూడా ఉంటుంది.

వందేళ్లు దాటిన ఈ ఇంటిని, ఆయన ఉపయోగించిన వస్తువులను ఇక్కడ భద్రపరిచారు.

ఇంటి గోడలు, మండువా లోగిలి, గదులు.. ఇవన్నీ ఆయన జీవించిన కాలాన్ని గుర్తు చేస్తుంటాయి.

ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందని ఇందిరా దేవి చెబుతున్నారు.

గురజాడ నడిచిన ప్రదేశంలో తాను ఎక్కువ కాలం గడుపుతున్నాననే భావనతో పాటు ఈ ప్రదేశంలో ఒకప్పుడు ఆయన తిన్నారా, ఇక్కడ ఇంతమంది తన గురించి మాట్లాడతారని ఆయన ఊహించారా అనే ఆలోచనలు వస్తుంటాయని ఆమె చెబుతున్నారు.

గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం, పురావస్తు శాఖ

ఇంటిని కాపాడుకోవాలి: సాహితీవేత్తలు

ఈ ఇంటి చరిత్రలో మరో కోణం కూడా ఉంది. గురజాడ ఇంటిని విక్రయించే అవకాశం ఉందన్న వార్తలు గతంలో ఆందోళనకు దారితీశాయి. ఇది రాష్ట్ర పురావస్తు శాఖ ఆ ఇంటిని తన ఆధీనంలోకి తీసుకోక ముందు సంగతి.

సాహితీవేత్తలు, గురజాడ అభిమానులు ఈ ఇంటిని కాపాడాలని అప్పట్లో బలంగా కోరుకున్నారు. వారి దృష్టిలో ఇది ఒక కుటుంబానికి చెందిన ఆస్తి మాత్రమే కాదు. తెలుగు సమాజానికి చెందిన సాంస్కృతిక వారసత్వం.

ఆయన జీవించిన ప్రదేశాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏళ్లుగా ఈ ఇంటి సంరక్షణపై చర్చ జరుగుతూనే ఉంది.

"ఇంటి పక్కనే సాహిత్య కార్యక్రమాలకు ఉపయోగపడే ఆడిటోరియం నిర్మాణం, గురజాడ రచనలను డిజిటలైజ్ చేసే ప్రయత్నాలు జరగాలి. ఇవి పూర్తయితే... ఈ ఇల్లు కేవలం గతాన్ని చూపించే మ్యూజియంగా కాకుండా, గురజాడ ఆలోచనలను కొత్త తరానికి పరిచయం చేసే కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు సాహితీవేత్తలుగా మా ప్రధాన ఆకాంక్ష" అని రత్నాల బాలకృష్ణ కోరుతున్నారు.

గురజాడ ఇంటితో పాటు పక్కనున్న ఖాళీ స్థలాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని ఆయన కోరారు.

"చరిత్ర పుస్తకాలలో మాత్రమే ఉండదు. కొన్నిసార్లు అది ఒక పాత ఇంటి గోడల్లో ఉంటుంది. ఒక కళ్లజోడులో ఉంటుంది. ఒక టేబుల్‌లో ఉంటుంది. ఒక కుర్చీలో ఉంటుంది. విజయనగరంలోని గురజాడ ఇల్లు...అలాంటి చరిత్రను ఇప్పటికీ తనలో దాచుకున్న ఇల్లు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది" అని రత్నాల బాలకృష్ణ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)