అమెరికా: ఎర్రతివాచీ, యుద్ధ విమానాలతో జిన్‌పింగ్‌కు ట్రంప్ ఘనస్వాగతం

ఫొటో సోర్స్, Getty Images
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు యూఎస్ అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు.
మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో 100 అడుగుల ఎర్రతివాచీ పరిచి, సైనిక విమాన విన్యాసాలతో జిన్‌పింగ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా వైమానిక దళ బ్యాండ్ రన్‌వేపై కవాతు చేస్తుండగా అమెరికా, చైనా జెండాలు రెపరెపలాడుతుండగా, చైనా అధ్యక్షుడిని ట్రంప్ ఆహ్వానించారు.
షి, పెంగ్ తమ విమానం నుంచి బయటకు రాగానే, ట్రంప్ దంపతులతో కరచాలనం చేశారు. అనంతరం రెడ్ కార్పెట్ మీద పక్కపక్కనే నడుస్తూ ఫోటోలకు పోజులిచ్చారు.
ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ అమెరికా జాతీయ గీతాన్ని వాయిస్తుండగా, రెండు బి-1 బాంబర్లు పైన చక్కర్లు కొట్టాయి. ఈ సూపర్‌సోనిక్ విమానాలు అమెరికా యుద్ధ ఆయుధా గారంలో ఒక కీలక భాగం.
ఈ స్వాగత కార్యక్రమం సాధారణమైనది కాదని బీబీసీ వైట్‌హౌస్ రిపోర్టర్ బెర్ండ్ డెబుస్‌మన్ జూనియర్ వ్యాఖ్యానించారు. గతంలో ఐరోపా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని అమెరికా కీలక మిత్రదేశాల నాయకులు వచ్చిన సందర్భంగా వార్తలను కవర్ చేశానని, అయితే ఇలాంటి స్వాగత కార్యక్రమం గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

నిజానికి, 1962 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు ఈ విమానాశ్రయంలో ఒక విదేశీ నాయకుడికి వ్యక్తిగతంగా స్వాగతం పలకడం ఇదే మొదటిసారి. నాటి బ్రిటిష్ ప్రధాని హెరాల్డ్ మాక్‌మిలన్‌కు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఇలా స్వాగతం పలికారని బీబీసీ ప్రతినిధి బెర్ండ్ డెబుస్‌మన్ జూనియర్ పేర్కొన్నారు.
ట్రంప్ ఈ పర్యటనకు ఇస్తున్న ప్రాముఖ్యతకు ఈ స్వాగతమే ఒక సంకేతమని, మే నెలలోచైనా పర్యటనకు వెళ్ళిన ట్రంప్‌కు ఇలాంటి స్వాగతం లభించలేదని ఆయన గుర్తు చేశారు.
జిన్‌పింగ్ 2015 తర్వాత వాషింగ్టన్‌లో చేస్తున్న ఈ తొలి పర్యటనలో, రహస్య సమావేశాలు, ఒక అధికారిక విందుతో పాటు, ఏఐ నుంచి ఇరాన్ యుద్ధం, తైవాన్ వరకు, వాణిజ్య ఒప్పందం పొడిగింపు వరకు చర్చించడానికి చాలా అంశాలు ఉంటాయని భావిస్తున్నారు.
వాణిజ్యం నుంచి తైవాన్ సమస్య వరకు...

ఫొటో సోర్స్, Reuters
కేవలం ఆర్భాటాల కోసమో, హంగుల కోసమో 11,104 కిలోమీటర్లుపైగా ప్రయాణించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వాషింగ్టన్‌లోని ట్రంప్‌ను కలవడానికి రాలేదని బీబీసీ రిపోర్టర్ బ్రాండన్ డ్రెనన్ అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ మాదిరిగానే ఆయనకూ ప్రత్యేక అజెండా ఉందని అన్నారు.
చైనా అరుదైన ఖనిజాలపై ఆంక్షలను సడలించడానికి ప్రతిగా, ట్రంప్ కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించే ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం నవంబర్‌లో ముగియాల్సి ఉంది. అమెరికన్ ఉత్పత్తులపై చైనా సుంకాలను తగ్గించడం, చైనా అరుదైన ఖనిజాల దిగుమతులను పెంచడం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం వంటి ఇతర వాణిజ్యం, సుంకాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారని బుష్ చైనా ఫౌండేషన్‌కు చెందిన డేవిడ్ ఫైర్‌స్టీన్ చెబుతున్నారు.
తైవాన్‌కు $14 బిలియన్ల(1 లక్షా 17 వేల 600 కోట్ల రూపాయలు) ఆయుధాల విక్రయించాలంటూ కాంగ్రెస్ ఆమోదించిన ప్రతిపాదనను మరింత ఆలస్యం చేయడానికి, లేదా రద్దు చేయడానికి, అమెరికా-చైనా వాణిజ్య ఏకీకరణను మరింతగా పెంచుకునేలా ట్రంప్‌ను ప్రభావితం చేయడానికి జిన్‌పింగ్ ప్రయత్నిస్తారని ఫైర్‌స్టీన్ అంచనా వేస్తున్నారు. ఇవి ఎప్పటినుంచో ఉన్న అమెరికా-చైనా సమస్యలేనని ఆయన అంటున్నారు, కానీ, ఈసారి, ' 2025తో పోలిస్తే ఈ సంబంధంలో అస్థిరత తగ్గినట్లు కనిపిస్తోంది' అని అభిప్రాయపడుతున్నారు.
వాణిజ్య వివాదంపై ఒప్పందం గడువు పెంపు

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్- జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల అధ్యక్షులు జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద కలుసుకుంటున్న సమయంలోనే, వాణిజ్య వివాదంపై చేసుకున్న ఒప్పందం పొడిగించారని బీబీసీ బిజినెస్ రిపోర్టర్ పీటర్ హాస్కిన్స్ చెప్పారు.
నవంబర్‌లో ముగియాల్సిన ఉన్న ఈ ఒప్పందాన్ని కనీసం జనవరి 10 వరకు పొడిగించినట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించారు. వారాంతంలో న్యూయార్క్‌లో, బుధవారం వాషింగ్టన్‌లో చైనా వైస్ ప్రీమియర్ హే లిఫెంగ్‌తో జరిపిన సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
మూడు రోజుల షెడ్యూల్ ఇదే

ఫొటో సోర్స్, EPA/Shutterstock
ఆప్యాయమైన పలకరింపులు, రహస్య సమావేశాలు, అధికారిక విందుతోపాటు చాలా విషయాలు ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
మొదట జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్ మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్నారు. వారికి అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికారు. రెండో రోజు వైట్ హౌస్‌లో ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, జిన్‌పింగ్, పెంగ్‌లకు ఆతిథ్యం ఇస్తారు.
అనంతరం వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో సైనిక గౌరవ వందన కార్యక్రమం ఉంటుంది. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది.
అమెరికా, చైనా అధికారులు, అలాగే టెక్ రంగ ప్రముఖులు హాజరయ్యే అధికారిక విందులో ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడతారు.
చివరి రోజున వైట్ హౌస్‌లో ట్రంప్ దంపతులతో షీ, పెంగ్ ప్రైవేట్ టీ విందులో పాల్గొని, నేషనల్ ఆర్కైవ్స్‌ను సందర్శిస్తారు.
ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి తిరిగి పయనమవుతారు.
జిన్‌పింగ్‌తోపాటు ఎవరెవరు ఉన్నారు?

ఫొటో సోర్స్, EPA/Shutterstock
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజుల అమెరికా పర్యటనలో ఆయనతోపాటు ఆయన ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ నాయకులు కొందరు ఉన్నారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.
అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానంలో వచ్చిన వారిలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కై క్వి, విదేశాంగ మంత్రి వాంగ్ యి ఉన్నారు.
ఈ పర్యటనకు ముందు న్యూయార్క్‌లో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌ను కలిసిన చైనా ఉప ప్రధాని హే లిఫెంగ్, అమెరికాలో చైనా రాయబారి షీ ఫెంగ్‌తో సహా, ప్రభుత్వాధికారులు ఉన్నారు.
వీళ్లంతా జిన్‌పింగ్ రావడాని కంటే ముందే యూఎస్ చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పర్యటనకు వ్యాపారవేత్తలు దూరంగా ఉన్నారా?
జిన్‌పింగ్‌తోపాటు ఈ పర్యటనకు ఏ వ్యాపారవేత్తలు వస్తున్నారో, అసలు వస్తున్నారో లేదో స్పష్టంగా తెలియడం లేదని బీబీసీ చైనా కరస్పాండెంట్ లారా బికర్ తెలిపారు.
మే నెలలో ట్రంప్ చైనా పర్యటనలో కొందరు సీఈవోలు బీజింగ్ వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న పర్యటనలో అధికారిక విందులో కూడా కొందరు పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో చైనా వ్యాపార వర్గాల నుంచి ఎవరూ హాజరు కాకపోతే మాత్రం జిన్‌పింగ్ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అదే సమయంలో చైనా సంస్థలను అమెరికాకు తీసుకురావడం వల్ల వ్యాపారపద్ధతులు, సబ్సిడీలు, ఉత్పత్తి సామర్థ్యంపై ప్రశ్నలు వినిపిస్తాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























