ఎవరీ హూతీలు, సౌదీ అరేబియాపై ఎందుకు దాడులు చేస్తున్నారు?

హూతీలు యెమెన్‌లోని మైనారిటీ షియా జైదీ వర్గానికి చెందిన సాయుధ సమూహం.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హూతీలు యెమెన్‌లోని మైనారిటీ షియా జైదీ వర్గానికి చెందిన సాయుధ సమూహం.
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

హూతీ సాయుధ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌదీ అరేబియాకు అండగా నిలుస్తామని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్నామ్ ప్రకటించారు. సౌదీ అరేబియాకు బ్రిటన్ 'రక్షణాత్మక' సైనిక సాయం అందిస్తుందని ఆయన వెల్లడించారు.

సౌదీ అరేబియా నుంచి 'సైనిక సహాయం' కోసం వచ్చిన అభ్యర్థన మేరకు, ఆ దేశానికి ‘రక్షణాత్మక గగనతల ఇంధన సరఫరా’ అందిస్తామని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు.

ఓ సైనిక విమానం పదేపదే వైమానిక స్థావరాలకు వచ్చి ఇంధనం నింపుకోవాల్సిన అవసరం లేకుండా, ఆ విమానం గగనతంలో ఉండగానే మరో సైనిక విమానం నుంచి ఇంధనం నింపడమే ‘రక్షణాత్మక గగనతల ఇంధన సరఫరా’.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం, హూతీ తిరుగుబాటుదారుల మధ్య సాగుతున్న అంతర్యుద్ధంలో యెమెన్‌ చిక్కుకుంది. యెమెన్‌ ప్రభుత్వానికి పొరుగున ఉన్న సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది.

ఇటీవల సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఇంధన సంస్థలపై, ఎర్ర సముద్రం వెంబడి ఉన్న ప్రాంతాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణలతో దాడులు చేసినట్టు హూతీలు ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పవిత్ర మక్కా నగరంపై హూతీలు సాయుధులు దాడికి ప్రయత్నించాయని ఇటీవల సౌదీ అరేబియా ఆరోపించింది. కానీ తమ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకుని ధ్వంసం చేశాయని తెలిపింది.

ఈ ఆరోపిత దాడిని అనేక ముస్లిం దేశాలు, ప్రపంచ నాయకులు ఖండించారు.

సౌదీ అరేబియా ఆరోపణలను హూతీ గ్రూపు, దాని మద్దతుదారులు ఖండించారు. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా యెమెన్‌లో వేల మంది ప్రదర్శనలు చేశారు.

హూతీలు

ఫొటో సోర్స్, Handout/Houthi Media Center via Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ నెల మొదట్లో సౌదీ మద్దతుగల ప్రభుత్వ దళాల శిబిరంపై తాము దాడి చేశామని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించి, ఈ ఫోటోను విడుదల చేశారు.

ఎర్ర సముద్రం ఎందుకంత ముఖ్యమైనది?

అమెరికాతో కలిసి యెమెన్‌లోని హూతీ స్థావరాలపై 2024 జనవరి ప్రారంభంలో బ్రిటన్ వైమానిక దాడులు చేసింది.

రాయల్ నేవీ యుద్ధ నౌక సహా తమ నౌకలను లక్ష్యంగా చేసుకోవడం వల్లే, ఆత్మరక్షణలో భాగంగానే దాడులు చేసినట్టు అప్పటి బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చెప్పారు.

దీని తర్వాత, యెమెన్‌లో ఘర్షణలు కొంతకాలంపాటు సద్దుమణిగాయి. అయితే, గత కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. యెమెన్‌లోని అనేక ప్రాంతాలపై హూతీలు పట్టు బిగిస్తున్నారు.

ప్రపంచ వాణిజ్యానికి, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఎర్రసముద్ర గుండా వెళ్లే ముఖ్యమైన నౌకా రవాణా మార్గాలు కూడా హూతీలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఉన్నాయి.

ఎర్ర సముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన మోఖా పోర్టు పట్టణాన్ని, ఎర్ర సముద్ర ముఖద్వారం వద్ద ఉన్న పెరిమ్ ద్వీపాన్ని హూతీలు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాకు సరకు రవాణా నౌకలు వెళ్లే ముఖ్యమైన సముద్ర మార్గంలో ఈ ప్రాంతం ఉంది.

హూతీ తిరుగుబాటుదారుల ఆకస్మిక దాడులు చేయడంతో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ బలగాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎర్ర సముద్ర వెంబడి ఉన్న దాదాపు యెమెన్ తీర ప్రాంతాన్నంతటినీ హూతీలు తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

అంతర్జాతీయ నౌకాయానానికి కీలక మార్గమైన బాబ్ అల్- మండెబ్ జలసంధి కూడా ఈ ప్రాంతంలో ఉంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల తర్వాత హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న పరిస్థితులు మరింత కాలం కొనసాగుతాయనే భయాలు నెలకొనడంతో బాబ్ అల్- మండెబ్ సముద్ర మార్గం ప్రాధాన్యత మరింత పెరిగింది.

సౌదీ అరేబియా తన ఇంధన వాణిజ్యానికి ఈ సముద్ర మార్గంలో ఎక్కువభాగాన్ని ఉపయోగిస్తోంది. ఇప్పుడీ మార్గం హూతీల ఆధీనంలోకి వెళ్లడంతో సౌదీ అరేబియా ఆందోళనలు మరింత పెరిగాయి.

హూతీలు

ఫొటో సోర్స్, Mohammed Hamoud/Getty Images

ఫొటో క్యాప్షన్, యెమెన్‌లో సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా హూతీ మద్దతుదారుల నిరసన

సౌదీ ఆరేబియాతో సంఘర్షణ

కొన్నేళ్ల కిందటే యెమెన్‌లోని చాలా ప్రాంతాలను హూతీలు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ నెలలో యెమెన్ తీరం వెంబడి బాబ్ అల్- మండెబ్ వైపు ముందుకు సాగుతున్నారు.

యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీరంలో పోరాటం అకస్మాత్తుగా తీవ్రరూపం దాల్చడంతో లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యారాజ్యసమితి అంచనా వేస్తోంది.

సౌదీ అరేబియా, హూతీల మధ్య 2022లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అప్పటికే బలహీనంగా ఉంది. ఇటీవల కాలంలో, ఇరుపక్షాల క్షిపణులు, డ్రోన్లు, వైమానిక దాడులు చేసుకోవడంతో అది పూర్తిగా విచ్చిన్నమైంది.

యెమెన్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. తీర ప్రాంతంలో వందలాది వైమానిక దాడులు నిర్వహించింది.

హూతీలు మాత్రం ఆ ప్రాంతంలో బలపడుతూ, నైరుతి సౌదీ అరేబియాలోని నగరాలు, మౌలిక సదుపాయాలపై వందలాది డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించారు.

ఈ సంఘర్షణ, ఎర్ర సముద్రానికి ఆవలి వైపున బాబ్ అల్- మండెబ్‌కు సరిగ్గా ఎదురుగా ఉన్న ఒక చిన్న ఆఫ్రికా దేశమైన జిబూటీ ప్రాముఖ్యాన్ని అకస్మాత్తుగా పెంచింది.

జిబూటీ ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక స్థావరాల్లో ఒకటిగా ఉంది. ఇది ఒకప్పుడు ఫ్రెంచ్ వలస రాజ్యంగా ఉండేది. అమెరికా 2003 నుంచి ఇక్కడ ఒక పెద్ద సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. ఇందులో పలు దేశాల సైనికులు ఉన్నారు. ఇక్కడ చైనాకు కూడా ఒక పెద్ద స్థావరం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆ దేశానికి ఉన్న అతిపెద్ద సైనిక స్థావరం ఇదే. దీనిని ఇటీవల ఆధునీకరించింది.

హూతీలు

ఫొటో సోర్స్, Mohammed Hamoud/Getty Images

ఫొటో క్యాప్షన్, సెప్టెంబర్ 18న, యెమెన్ రాజధాని సనాలో సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ప్రదర్శనలు చేశారు.

ఎవరీ హూతీలు?

హూతీలు యెమెన్‌లోని మైనారిటీ షియా జైదీ వర్గానికి చెందిన సాయుధ సమూహం. అప్పటి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఆరోపిస్తూ, 1990లలో ఈ సంస్థ ఏర్పాటైంది.

ఈ ఉద్యమ స్థాపకుడు హుస్సేన్ అల్-హూతీ పేర మీదుగానే ఈ సంస్థకు 'హూతీ' అనే పేరు వచ్చింది. హూతీలు తమను 'అన్సార్ అల్లా' అని కూడా పిలుచుకుంటారు, దీని అర్థం 'దేవుని అనుచరులు'

అమెరికా నేతృత్వంలో ఇరాక్‌పై దండయాత్ర జరిగినప్పుడు, 2003లో హూతీలు అమెరికాకు, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇస్లాం విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

హూతీలు తమను తాము హమాస్, హిజ్బుల్లాతో కలిసి ఇరాన్ నేతృత్వంలోని 'యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్'లో భాగంగా పేర్కొంటారు. ఈ కూటమి ఇజ్రాయెల్, అమెరికా, పాశ్చాత్య దేశాలను వ్యతిరేకిస్తుంది.

హూతీలు తమను తాము ఇరాన్ మిత్రులుగా చెప్పుకుంటారు. వీరికి సౌదీ అరేబియా ఉమ్మడి శత్రువు.

ఇరాన్ నుంచి హూతీలు ఆయుధాలు అందుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను సరఫరా చేసిందని అమెరికా, సౌదీ అరేబియా ఆరోపిస్తున్నాయి.

హూతీలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, యెమెన్ ప్రభుత్వ బలగాలకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది.

ఇరాన్ మద్దతు, హిజ్బొల్లా నమూనా

హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లను సరఫరా చేసిందని సౌదీ అరేబియా ఆరోపించింది.

యెమెన్‌లోని పలు ప్రాంతాలను హూతీ తిరుగుబాటుదారులు తమ నియంత్రణలో ఉంచుకున్నారు. వీరు దేశంలోని ఉత్తర భాగంలో పన్నులు వసూలు చేస్తున్నారు, సొంత కరెన్సీని కూడా చలామణిలోకి తీసుకొచ్చారు.

లెబనాన్‌లోని సాయుధ షియా సమూహమైన హిజ్బొల్లా నుంచి కూడా హూతీ తిరుగుబాటుదారులు స్ఫూర్తి పొందుతారు.

అమెరికా పరిశోధనా సంస్థ 'కాంబాటింగ్ టెర్రరిజం సెంటర్' ప్రకారం, హిజ్బొల్లా 2014 నుంచి హూతీలకు భారీ స్థాయిలో సైనిక శిక్షణ, నైపుణ్యాన్ని అందిస్తోంది.

అలీ అబ్దుల్లా సలే తర్వాత 2014 ప్రారంభంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అబ్దరబ్బు మన్సూర్ హాదీకి వ్యతిరేకంగా ప్రారంభించిన తిరుగుబాటుతో హూతీలు యెమెన్‌లో భారీగా రాజకీయ బలాన్ని పుంజుకున్నారు.

గతంలో తమకు ప్రత్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేతో హూతీలు చేతులు కలిపారు. ఆయన్ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఒప్పందం చేసుకున్నారు.

హూతీలు ఉత్తర యెమెన్‌లోని సాదా ప్రావిన్స్‌ను నియంత్రణలోకి తీసుకొని, ఆ తర్వాత 2015 ప్రారంభంలో రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత అధ్యక్షుడు హాదీ యెమెన్ దేశం విడిచి వెళ్లిపోయారు.

హూతీలను అధికారం నుంచి తొలగించి, హాదీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి యెమెన్ పొరుగు దేశమైన సౌదీ అరేబియా సైనిక జోక్యం చేసుకుంది. ఇందుకు యూఏఈ, బహ్రెయిన్ కూడా సౌదీ అరేబియాకు మద్దతు ఇచ్చాయి.

హూతీ తిరుగుబాటుదారులు ఈ దాడులను తట్టుకొని, యెమెన్‌లోని చాలా ప్రాంతాలపై పట్టుబిగించారు. హూతీలతో ఉన్న ఒప్పందాన్ని కాదని సౌదీ అరేబియాతో చేతులు కలపడానికి యత్నించిన అలీ అబ్దుల్లా సలేను హత్య చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)