షీ జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు కాకముందు ఏం చేసేవారు, అమెరికాతో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి?

ఫొటో సోర్స్, Reuters/Getty Images
- రచయిత, షాన్ యువాన్, జాక్ లావ్
- హోదా, బీబీసీ గ్లోబల్ చైనా యూనిట్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 11 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు.
చైనాలో అనేక తరాల తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకునిగా మారడానికి చాలా కాలం ముందే అమెరికాలో ఆయన పర్యటించారు. నాలుగు దశాబ్దాల క్రితం జిన్‌పింగ్ ఉత్తర చైనాలో ఓ జిల్లా అధికారి. అప్పుడు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అమెరికాకు వెళ్లారు.
అయోవాలో ఆయన కొన్ని రోజులు గడిపారు. అక్కడి వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. పొలాలను పరిశీలించారు. ఓ స్థానికుల ఇంట్లో బస చేశారు.
జిన్‌పింగ్ ఆ ఇంట్లో బస చేయడాన్ని, అలాగే అప్పటి అయోవా గవర్నర్ టెర్రీ బ్రాన్స్టాడ్తో ఆయనకు ఏర్పడిన స్నేహాన్ని చైనా ప్రభుత్వ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. డోనల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో బ్రాన్‌స్టాడ్ చైనాలో అమెరికా రాయబారిగా పనిచేశారు. అమెరికాతో జిన్పింగ్కున్న వ్యక్తిగత సంబంధాలను తెలియజేసేందుకు చైనా ప్రభుత్వ మీడియా ఈ విషయాలను ప్రస్తావించింది.
అమెరికా, చైనా మధ్య ఇప్పటి సంబంధాలు అప్పటితో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. ఒకదేశంపై మరొకటి సుంకాలు, ప్రతిసుంకాలు విధించుకుంటున్నాయి. సాంకేతికరంగంలో ఆంక్షలున్నాయి. సైనికరంగంలో కూడా పోటీ కొనసాగుతోంది.


ఫొటో సోర్స్, Reuters
సర్వం కోల్పోయిన 'రాకుమారుడు'
ప్రస్తుతం 73 ఏళ్ల వయసున్న జిన్‌పింగ్ అప్పటిలా ఒక సాధారణ అధికారి కాదు. చైనా నాయకునిగా దాదాపు 14 ఏళ్ల పదవీకాలంలో ప్రపంచంలో చైనా స్థానాన్ని ఆయన సుస్థిరం చేశారు. చైనా స్థాయిని, ప్రభావాన్ని పెంచారు.
జిన్‌పింగ్ జీవితం సుఖాలతో ప్రారంభమైంది.
ఆయన 1953లో బీజింగ్‌లో జన్మించారు. కమ్యూనిస్ట్ విప్లవకారుడైన షీ జోంగ్షున్కు జిన్‌పింగ్ ఆరో సంతానం. ఆయన తండ్రి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనలో పనిచేశారు. తదనంతరం కమ్యూనిస్ట్ పార్టీలో సీనియర్ నాయకునిగా, ఉప ప్రధానిగా ఎదిగారు.
చిన్నతనంలో జిన్‌పింగ్ ప్రతిష్టాత్మక పాఠశాలల్లో చదువుకున్నారు. ఆ కాలంలో చాలా కుటుంబాలకు అందుబాటులో లేని సౌకర్యాలు ఆయనుకుండేవి.
కానీ ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా మారాయి.
జిన్‌పింగ్ తండ్రి 'పార్టీ వ్యతిరేక' వర్గంలో ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనను పార్టీ నుంచి తొలగించి ఒక ఫ్యాక్టరీలో పని చేయడానికి గ్రామానికి పంపించారు.
'విప్లవ వ్యతిరేకి'గా భావించే వ్యక్తి కొడుకుగా జిన్‌పింగ్‌ని చూశారు. యుక్తవయసులోనే ఆయన్ను నిర్బంధ శిబిరానికి పంపించారు. అప్పటి నాయకుడు మావో జెడాంగ్ యువతను గ్రామాలకు వెళ్లి రైతుల నుంచి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. 15 ఏళ్ల జిన్‌పింగ్ నగరాల నుంచి లక్షలాదిమంది పిల్లలతో కలిసి గ్రామానికి వెళ్లారు.
2004లో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
"రైలులో ఉన్న ప్రతిఒక్కరూ ఏడుస్తున్నారు. నవ్వుతున్నది నేనొక్కడినే... ఒకవేళ నేను బయటపడలేకపోయి ఉంటే నేను కూడా ఏడ్చేవాడిని. నేను అక్కడే ఉండిపోయి ఉంటే ఈ రోజు నేను బతికి ఉండేవాణ్నో లేదో నాకు తెలియదు" అని జిన్‌పింగ్ అన్నారు.
ఆయన చైనాలోని పశ్చిమ షాన్షీ ప్రావిన్స్‌లోని లియాంగ్జియాహే అనే పర్వతప్రాంత గ్రామానికి చేరుకున్నారు. అక్కడ యావోదోంగ్లో ఏడేళ్లు గడిపారు. యావోదోంగ్ అంటే కొండ వాలులో నిర్మించిన గుహ లాంటి నివాసం. అక్కడ ఆయన వ్యవసాయం చేశారు. ఎరువులు మోశారు. కాల్వలు తవ్వారు.
"ఊరగాయతో కలిపిన కూరగాయలు నాకు ఇష్టమైన ఆహారంగా మారిపోయాయి. ఆ రోజులు ఇప్పటికీ చాలా గుర్తొస్తుంటాయి" అని అక్కడ గడిపిన సమయం గురించి జిన్‌పింగ్ చెప్పారు.
అక్కడ పనిభారం ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
మొదట్లో ఆకలి, ఈగలతో ఇబ్బంది పడ్డారు. భోజనానికి ముందు సిగరెట్ తాగేందుకు లభించే కొద్దిపాటి విరామం ఆయనకు కొంత ఉపశమనం కలిగించేది.

ఫొటో సోర్స్, Getty Images
మావో మరణం తరువాత..
జిన్‌పింగ్ 22 ఏళ్ల వయసులో చైనాలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటైన సింషువా యూనివర్శిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు.
చదువు పూర్తి చేసిన తర్వాత బీజింగ్‌కు దూరంగా ఫుజియాన్,జెజియాంగ్ వంటి తీరప్రాంత ప్రావిన్సుల్లో స్థానిక అధికారిగా పనిచేశారు. 1980లలో చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతాలు దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతాలుగా మారాయి.
మావో మరణానంతరం జిన్‌పింగ్ తండ్రి రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. దీనివల్ల జిన్‌పింగ్ కేంద్ర ప్రభుత్వంలో, సైన్యంలో పదవులు పొందగలిగారు. పలువురు పార్టీ అధికారులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారిలో పలువురు అధికారులు తర్వాతి కాలంలో జిన్‌పింగ్‌కు విశ్వసనీయ నాయకత్వ బృందంలో భాగమయ్యారు.
జిన్‌పింగ్ 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఇది ఆయనకు మొదటి వివాహం. ఆమె బ్రిటన్‌లో చైనా మాజీ రాయబారి కుమార్తె. మూడేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.
ఒక ఉమ్మడి స్నేహితుని ద్వారా జిన్‌పింగ్‌కు ఆయన రెండో భార్య పెంగ్ లియువాన్‌ను పరిచయం అయ్యారు. పెంగ్ లియువాన్ సైన్యానికి అనుబంధంగా ఉన్న ఒక జానపద గాయని. అప్పటికే ఆమెకు చైనాలో చాలా పేరుప్రఖ్యాతులున్నాయి. ప్రతి సంవత్సరం చాంద్రమాన నూతన సంవత్సరం సందర్భంగా ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాల్లో పాటలు పాడేవారు. వాటిని కోట్లాదిమంది చూసేవారు.
జిన్పింగ్కన్నా 1980, 1990వ దశకాలలో పెంగ్‌కు ఎక్కువగా గుర్తింపు ఉండేది.
జిన్‌పింగ్‌తో కలిసి పెంగ్ విదేశీపర్యటనలకు వెళ్తుంటారు. చైనా ప్రథమ మహిళలు గతంలో బహిరంగంగా కనిపించని సంప్రదాయానికి ఇది భిన్నం.
వారి ఏకైక కుమార్తె షీ మింగ్జే 1992లో జన్మించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారని తప్ప ఆమె గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు.
షాంఘై అగ్ర నాయకునిగా కొద్దికాలం ఉన్న తర్వాత చైనా అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో జిన్‌పింగ్ 2007లో చేరారు.
ఐదేళ్ల తర్వాత ఆయన హు జింటావో తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా బాధ్యతలు స్వీకరించారు.
చైనా నాయకుడైన తర్వాత జిన్‌పింగ్ దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో ఊహించని మార్పులు తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, EPA
చైనాను జిన్‌పింగ్ ఎలా మార్చారు?
జిన్‌పింగ్ 14 ఏళ్ల పాలనలో చైనా ఆత్మవిశ్వాసం క్రమక్రమంగా పెరిగింది.
బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి ప్రాజెక్టుల ద్వారా జిన్‌పింగ్ ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రభావాన్ని విస్తరించారు. బీజింగ్‌ను గ్లోబల్ సౌత్ గళంగా నిలబెట్టారు.
అయితే అనేక కీలక ప్రజాస్వామ్య దేశాలతో చైనా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత పెరిగింది. తైవాన్‌పై ఒత్తిడి ఎక్కువయింది. అమెరికాతో పోటీ మరింత తీవ్రతరమయింది.
చైనాలో రాజకీయ నియంత్రణ పెరగడం జిన్‌పింగ్ పాలన మరో ప్రధాన లక్షణం.
గతంలో ఎన్నడూ లేనంతగా భద్రత, రాజకీయ స్థిరత్వానికి జిన్‌పింగ్ హయాంలో చైనా అధిక ప్రాధాన్యతనిచ్చింది. షిన్జియాంగ్, టిబెట్, హాంగ్‌కాంగ్ వంటి ప్రాంతాలలో అనేక చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలతో శాంతిభద్రతలను పునరుద్ధరించామని జిన్‌పింగ్ మద్దతుదారులు అంటుండగా, అవి పౌర స్వేచ్ఛను తీవ్రంగా హరించాయని విమర్శకులు అంటున్నారు.
జిన్‌పింగ్ తన పేరు మీద ఓ రాజకీయ సిద్ధాంతాన్ని కూడా ముందుకు తెచ్చారు. ''కొత్త శకం కోసం చైనా ప్రత్యేకతలతో ఉండే సోషలిజంపై జిన్‌పింగ్ ఆలోచనలు''గా ఈ సిద్ధాంతాన్ని చెబుతారు. ఆయనకు ముందు చైనా అధ్యక్షులైన ఇద్దరు నేతలు సిద్ధాంతాల్లో తమ పేర్లను చేర్చుకోలేకపోయారు.
అధ్యక్ష పదవీ కాల పరిమితులను కూడా రాజ్యాంగం నుంచి జిన్‌పింగ్ తొలగించారు. దీంతో రెండు పర్యాయాలకు మించి పదవిలో కొనసాగేందుకు ఆయనకు వీలు కలిగింది.
చైనా ప్రభుత్వ మీడియా జిన్‌పింగ్‌ను ఒక గంభీరమైన వ్యక్తిగా చిత్రీకరిస్తుంది. అయితే అప్పుడప్పుడు ఆయన సరదాగా కూడా మాట్లాడుతుంటారు.
ఫుట్‌బాల్ తనకు ఇష్టమని జిన్‌పింగ్ అంటారు. చైనా పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రదర్శనపై థాయ్ ప్రధానమంత్రితో తన నిరాశను సరదాగా వ్యక్తం చేశారు.
బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో కలిసి బీరు తాగారు. చైనాలో తయారైన షావోమీ ఫోన్‌ను దక్షిణ కొరియా అధ్యక్షునికి బహుమతిగా ఇచ్చి దాన్ని తీసుకొనే ముందు అందులో 'బ్యాక్‌డోర్' ఏమైనా ఉందేమో చూసుకోవాలని సరదాగా చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రపంచ దేశాలకు మిత్రుడా, శత్రువా?
చైనా విదేశాంగ విధాన ప్రాధాన్యతలను ప్రతిబింబించేలా విదేశీ నాయకులతో జిన్ సంబంధాలు కాలక్రమేణా మారుతూ వచ్చాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉన్నంత సన్నిహిత సంబంధం జిన్‌పింగ్‌కు మరే ఇతర విదేశీ నాయకుడితోనూ లేదు. జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్లిద్దరూ 40 సార్లకు పైగా సమావేశమయ్యారు. పుతిన్‌ను "అత్యంత సన్నిహిత, విశ్వసనీయమైన వ్యక్తి"గా జిన్‌పింగ్ అభివర్ణించారు.
ట్రంప్‌తో జిన్‌పింగ్ సంబంధం మరింత సంక్లిష్టమైనది. చైనాతో వాణిజ్య యుద్ధం ప్రారంభించినప్పటికీ ట్రంప్ తరచుగా జిన్‌పింగ్ గురించి సానుకూలంగా మాట్లాడతారు. జిన్‌పింగ్ తన స్నేహితుడంటూ, ఆయన రాజకీయ బలాన్ని కూడా ప్రశంసిస్తుంటారు ట్రంప్.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకోవడంపై కూడా జిన్ పింగ్ మొదట్లో దృష్టి సారించారు. ఎలాంటి అధికారిక ఎజెండా లేకుండా సమావేశాలు నిర్వహించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆసియాలోని ఈ రెండు ప్రధాన దేశాల మధ్య సహకారం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. 2020లో సరిహద్దులో జరిగిన ప్రాణాంత ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారాయి.
జిన్‌పింగ్ వ్యక్తిగత సంబంధాలకన్నా దేశ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.
జిన్‌పింగ్ తాజా అమెరికా పర్యటన అయోవా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించే ఒక ఆసక్తిగల జిల్లా అధికారిగా కాకుండా 21వ శతాబ్దపు రాజకీయాలను తీర్చిదిద్దే ఒక కీలక నాయకుడిగా జరుగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























