‘బ్లూటూతింగ్’ : ఒకరి రక్తం ద్వారా మరొకరు మత్తును పంచుకునే ఈ పద్ధతి ఏమిటి, ఇదెంతటి ప్రమాదకరం?

బ్లూటూతింగ్, ఫిజీ, ఎయిడ్స్, హెచ్ఐవీ

ఫొటో సోర్స్, Getty/BBC

ఫొటో క్యాప్షన్, మత్తుపదార్థాలను పొదుపుగా వాడుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవడానికి బ్లూటూతింగ్‌ను ఒక మార్గంగా చూస్తున్నారు.
    • రచయిత, రెబెక్కా థార్న్
    • హోదా, వరల్డ్ సర్వీస్ గ్లోబల్ హెల్త్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఫిజీలో గత వారం జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా ఫిజీ మారుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణలో పురోగతి సాధించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇవి ఇప్పటికీ తీవ్రమైన ముప్పుగా ఉన్నాయని, వ్యాధి వ్యాప్తి ఒక్కసారిగా అదుపు తప్పే అవకాశం ఉందని ఈ పరిణామం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ పసిఫిక్ ద్వీపసమూహంలో ప్రతి 60 మంది పెద్దలలో ఒకరు ఈ వైరస్‌తో జీవిస్తున్నారు. ఐదేళ్ల కిందట ప్రతి 167 మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉండేది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.1 కోట్ల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్‌ ఏజెన్సీ, యూఎన్‌ఎయిడ్స్‌ అంచనా వేస్తోంది.

ఈ తాజా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్న మరో ఆందోళనకర పరిణామం మాదక ద్రవ్యాలు వాడేవారిలో కొంతమంది "బ్లూటూతింగ్" అనే నీడిల్ షేరింగ్ పద్దతి పాటించడం.

ఇందులో ఇప్పటికే మాదకద్రవ్యాన్ని తీసుకున్న వ్యక్తి శరీరం నుంచి రక్తాన్ని తీసి, మరో వ్యక్తికి ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కిస్తారు. దీని వల్ల రెండో వ్యక్తికి కూడా మాదకద్రవ్య ప్రభావంతోె మత్తు కలుగుతుందని భావిస్తారు. ఇలా ఒకరు డ్రగ్స్ తీసుకుంటే దాని మత్తును గొలుసుకట్టు పద్ధతిలో ఎక్కువ మంది అనుభవించడమే కాక, డబ్బు ఆదా చేసుకోవడానికి దీన్నొక మార్గంగా చూస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

లెసోతో, జింబాబ్వే, దక్షిణాఫ్రికా వంటి ఆఫ్రికా దేశాలలో కూడా ఈ పద్ధతిని గుర్తించారు.

ఇది ఎంత విస్తృతంగా ఉంది, ఫిజీలో ప్రస్తుత సంక్షోభానికి దీనిని ఎంతవరకు కారణంగా చెప్పవచ్చన్నది వివాదాస్పదంగా ఉంది. కానీ, ఇది నిజమైన సమస్యేనని కమ్యూనిటీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు తీవ్రంగా పరిగణించాలని వారు కోరుతున్నారు.

''మనం ఏదైనా చర్య తీసుకునే ముందు, ఇంకెన్ని ప్రాణాలు కోల్పోవాలి?'' అని డ్రగ్ ఫ్రీ ఫిజీ అనే స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలేసీ వొలటబు ప్రశ్నించారు.

బ్లూటూతింగ్, ఫిజీ, ఎయిడ్స్, హెచ్ఐవీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిజీలో హెచ్‌ఐవీ కేసులు పెరగడానికి కారణం ఎక్కువ మంది ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడమేనని నిపుణులు అంటున్నారు.

'బ్లూటూతింగ్' ఎందుకంత ప్రమాదకరం?

హెచ్ఐవీ రక్తం ద్వారా సంక్రమించే వ్యాధి. మాదకద్రవ్యాలతో కలుషితమైన రక్తాన్ని ఒకరి నుంచి మరొకరికి ఎక్కించే ఈ ప్రక్రియలో సూదులు పంచుకునే వ్యక్తులు కూడా హెచ్‌ఐవీ సోకే ప్రమాదానికి గురవుతారు.

ఈ పద్దతివల్ల హైపటైటిస్ బీ, సీ, వంటి ఇతర ఇన్‌ఫెక్షన్లతో పాటు తీవ్రమైన బ్యాక్టిరీయా ఇన్‌ఫెక్షన్లు సంక్రమించే ప్రమాదం కూడా ‘‘అసాధారణంగా’’ ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.

ఫిజీలో మాదకద్రవ్యాలు తీసుకునేవారు సూదులను పంచుకోవడం ఇప్పటికే సాధారణంగా ఉంది.

వారికి శుభ్రమైన ఇంజెక్షన్‌ పరికరాలు అందుబాటులోకి రావడం కూడా కష్టంగా ఉంటుంది.

అయితే, "బ్లూటూతింగ్‌" పద్ధతి ప్రాచుర్యంలోకి రావడం చూస్తే, ఈ ప్రమాదకరమైన పద్ధతి వెనుక పేదరికం కూడా ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాను మొదట దీన్ని కళ్లారా చూసినప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వొలటబు చెప్పారు.

''ఆ ఇంజెక్షన్ తీసుకోడానికి చుట్టూ ఐదారుగురు సిద్ధంగా ఉన్నారు'' అని ఆమె బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు తెలిపారు.

‘‘అంటే వాళ్లు మరో ఐదుగురికి ఇన్‌ఫెక్షన్ సోకేలా చేయవచ్చు. ఐదుగురితో మొదలై అది 25 నుంచి 30మందికి చేరిపోతుంది. ఇదెంత సులభంగా జరుగుతుందో చూడండి'' అన్నారు.

దేశంలో హెచ్‌ఐవీ కేసులు పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలలో బ్లూటూతింగ్ ఒకటని 2024లో ఫిజీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది.

ఈ ఏడాది జనవరిలో హెచ్‌ఐవీ వ్యాప్తిని "జాతీయ సంక్షోభం"గా అభివర్ణించిన మంత్రిత్వ శాఖ, సిరంజీలు, సూదులు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.

గత ఏడాది డిసెంబరులో జరిపిన ఒక సర్వే ప్రకారం... ఫిజీలో "బ్లూటూతింగ్" విస్తృతంగా జరుగుతున్నట్లు చెప్పడానికి తగిన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇంజెక్షన్ ద్వారా మాదక ద్రవ్యాలను తీసుకునే 56 మందిని ఈ సర్వేలో భాగంగా ఇంటర్వ్యూ చేశారు. వారిలో ఇద్దరు మాత్రమే "బ్లూటూతింగ్"లో పాల్గొన్నట్టు తెలిపారు. మరో నలుగురు దానిని ప్రత్యక్షంగా చూసినట్టు చెప్పారని ఆ సర్వేలో చెప్పారు.

అయితే, తాను స్వయంగా చూసే వరకు ఎవరైనా నిజంగా అలా చేస్తున్నారని తాను కూడా నమ్మలేకపోయానని వోలటబు చెప్పారు.

ఇంజెక్షన్‌ ద్వారా మాదకద్రవ్యాలు తీసుకోవడంపై ఉన్నఅపోహలు, అవమాన భావనల కారణంగా ఫిజీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి వెనుకాడుతోందని ఆమె భావిస్తున్నారు.

‘‘సునామీ రానున్నదని తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిని నియంత్రించాలని కోరుకుందాం’’ అని ఆమె అన్నారు.

బ్లూటూతింగ్, ఫిజీ, ఎయిడ్స్, హెచ్ఐవీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తల్లి నుంచి పిల్లలకు కూడా హెచ్‌ఐవీ సంక్రమిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ

హెచ్‌ఐవీ రోగనిరోధక వ్యవస్థలోని కణాలను దెబ్బతీసే ఒక వైరస్. ఇది రోజువారీ ఇన్‌ఫెక్షన్‌లతో, వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.

హెచ్‌ఐవీ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. అరక్షిత లైంగిక సంబంధాల సమయంలో ఇది ఎక్కువగా వ్యాపించినప్పటికీ, గాయాల ద్వారా, మాదకద్రవ్యాలను తీసుకునేందుకు ఒకే సూదిని పంచుకోవడం ద్వారా కూడా వ్యాపిస్తుంది.

గర్భధారణ, ప్రసవం, తల్లిపాలు ఇచ్చే సమయంలో తల్లి నుంచి బిడ్డకు కూడా ఇది సంక్రమించవచ్చు.

హెచ్‌ఐవీ వైరస్ వల్ల రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత, ప్రాణాంతకమైన అనేక ఇన్‌ఫెక్షన్‌లు, వ్యాధులు సోకినప్పుడు ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్) వస్తుంది.

గత కొన్ని దశాబ్దాల్లో చికిత్సా విధానాల్లో వచ్చిన పురోగతి వల్ల హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారి ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2025లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 570,000 మంది హెచ్‌ఐవీ సంబంధిత కారణాలతో మరణించారు. ఇది 2004లోని గరిష్ఠ స్థాయితో పోలిస్తే 73 శాతం తక్కువ.

ప్రస్తుతం సిఫార్సు చేస్తున్న చికిత్సలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) కూడా ఉంది. ఇది సాధారణంగా వైరల్ లోడ్‌ను గుర్తించలేని స్థాయికి తగ్గించి, రోగనిరోధక వ్యవస్థను రక్షించడంతోపాటు లైంగిక సంబంధాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ సాయాన్ని నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 2,000 కొత్త హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉందని, వచ్చే నాలుగేళ్లలో మరో 60 లక్షల మందికి పైగా మరణించే ప్రమాదం ఉందని గత ఏడాది యూఎన్‌ఎయిడ్స్‌‌ హెడ్ విన్నీ బియాన్యిమా చెప్పారు.

ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ ఏజెన్సీ (యూఎన్‌ఎయిడ్స్) తెలిపిన వివరాల ప్రకారం.. 2025లో మూడు ప్రాంతాలు, 21 దేశాలలో కొత్త హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్లు పెరిగాయి. వీటిలో అఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, కెన్యా, బ్రెజిల్, పాకిస్తాన్, యెమెన్, ఈజిప్ట్, సెనెగల్, ఫిలిప్పీన్స్ ఉన్నాయి.

బ్లూటూతింగ్, ఫిజీ, ఎయిడ్స్, హెచ్ఐవీ

ఫొటో సోర్స్, Ponto Tumisi

ఫొటో క్యాప్షన్, లెసోతోలో మాదకద్రవ్య వినియోగంపై పోరాడుతున్న 'మోఖోసి ఓ మంగోనా' సంస్థ సభ్యులు

ఇంకెక్కడ 'బ్లూటూతింగ్' జరుగుతోంది?

ప్రపంచంలో హెచ్‌ఐవీ వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో లెసోతో రెండో స్థానంలో ఉందని, అక్కడ మహిళల మరణాలకు హెచ్‌ఐవీ ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

లెసోతోలో "బ్లూటూతింగ్‌"ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న సంస్థల్లో ఒక తల్లి ఆక్రందన అనే అర్థం వచ్చే మోఖోసి ఓ మాంగోవానా కూడా ఒకటి. మాదకద్రవ్యాలకు బానిసలైన పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రుల అనుభవాలను ఈ మహిళల బృందం పంచుకుంటుంది.

బ్లూటూతింగ్ పద్దతి దక్షిణాఫ్రికాలో జరుగుతున్నట్లు వారు విన్నారు. కానీ, 2024లో ఇది తమకు చాలా దగ్గర్లోనే జరుగుతోందని వారు గుర్తించారు. ముఖ్యంగా "ట్రాప్‌ హౌస్‌"లలో ఇది జరుగుతున్నట్లు తెలిసింది. మాదకద్రవ్యాల వినియోగదారుల బృందాలు అక్కడ వాటిని అమ్మడం, కొనడం, తీసుకోవడం చేస్తుంటాయి. ఇవి సాధారణంగా ఖాళీగా ఉన్న లేదా ప్రైవేటు భవనాలు.

పొంటో టుమిసి కుమార్తె క్రిస్టల్ మెథాంఫేటమిన్ (మత్తుమందు) తీసుకోవడం ప్రారంభించడానికి ముందు అన్ని సబ్జెక్టులలోనూ అత్యుత్తమ మార్కులు సాధించే విద్యార్థిని. కొద్దిపాటి డ్రగ్స్‌ను అందరూ పంచుకోవాలనుకున్నప్పుడు "బ్లూటూతింగ్" జరుగుతుందని ఆమె చెప్పారు.

"వారి బ్లడ్ గ్రూప్స్ కలుస్తాయా లేదా అనేదానితో సంబంధం లేదు. ఆ రక్తం ద్వారా వారికి ఏమైనా వ్యాధులు సోకుతాయా అనే దానితోనూ సంబంధం లేదు. ఇవేవీ వారికి ముఖ్యం కాదు" అని ఆమె అన్నారు.

బ్లూటూతింగ్, ఫిజీ, ఎయిడ్స్, హెచ్ఐవీ

ఫొటో సోర్స్, Ponto Tumisi

ఫొటో క్యాప్షన్, ప్రజలు మాదకద్రవ్యాల బారిన పడకుండా నివారించడంలో చదువు అత్యంత కీలకమని టుమిసి అన్నారు.

అయితే, ఇంజెక్షన్‌ ద్వారా మాదకద్రవ్యాలు తీసుకునే వారిలో ప్రత్యక్షంగా రక్తాన్ని పంచుకునే ఇలాంటి పద్ధతులు ఇతర ప్రాంతాల్లోనూ వేర్వేరు పేర్లతో నమోదయ్యాయని యూఎన్‌ఎయిడ్స్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ ఈమన్‌ మర్ఫీ చెప్పారు.

టాంజానియాలో దీనిని "ఫ్లాష్‌బ్లడ్‌" అని పిలుస్తారని ఆయన తెలిపారు. అయితే, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సాధారణ ధోరణి కాదని స్పష్టం చేశారు.

అయితే, ఇలాంటి కొత్త, అంతగా తెలియని మాదకద్రవ్యాల వినియోగ పద్ధతులు ఇతర దేశాల్లో కూడా గుర్తించకుండా ఉండిపోవచ్చని టుమిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాదక ద్రవ్యాల దుర్వినియోగం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు హెచ్చరిక సంకేతాల గురించి తమకు తాము అవగాహన కల్పించుకోవాలని ఆమె హెచ్చరించారు.

''మీరు తల్లిదండ్రులైతే, ప్రపంచంలో ఏ మూలన ఉన్నప్పటికీ మీరూ ఒక మనిషే. అంటే, మీరు ప్రమాదంలో ఉన్నట్లే. మాదక ద్రవ్యాల వ్యవసనం విషయంలో ఏదైనా జరగొచ్చు'' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)