ది ప్యారడైజ్ సినిమా ఎలా ఉంది, మాస్ హీరోగా నానీ అలరించాడా?

ఫొటో సోర్స్, srikanthodela__INSTA
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ప్రేక్షకులు చాలా కాలంగా ది ప్యారడైజ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా కోసం నానీ చాలా కష్టపడి లుక్ మార్చాడు. జడలు పెంచాడు.
దసరాతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకుడు.
మోహన్‌బాబు విలన్, అన్నిటికీ మించి భారీ బడ్జెట్.
ట్రైలర్ రాకపోయినా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. రెండు పాటలు సూపర్ హిట్. మరి సినిమా ఎలా వుంది?

‘తల్లి అంటే ద్వేషం’
తెలంగాణలో గుర్తింపులేని , అణగారి పోయిన జాతి సవారి. దుర్భరమైన పేదరికంలో జీవిస్తూ, సారా తయారీ చేస్తూ దొంగలుగా ముద్రపడిన ఈ జాతి నివసిస్తున్న ప్రాంతం పేరు ప్యారడైజ్. ఈ ఏరియాకి కింగ్ షికంజామాలిక్ (మోహన్‌బాబు). అతనికి ఎదురు తిరిగిన వాళ్లు బతకరు.
హీరో తల్లి సమ్మక్క(సోనాలి కులకర్ణి) తమ జాతి గుర్తింపు కోసం ప్రభుత్వ కార్యాలయం ముందు అందరితో కలిసి ధర్నా చేస్తూ ఉండగా సినిమా ప్రారంభమవుతుంది.
అక్కడికి వచ్చిన మాలిక్ అందరినీ హింసిస్తాడు. ఆ బాధలోనే సమ్మక్క కవలలకు జన్మనిస్తుంది. ఆడపిల్ల చనిపోగా, మగపిల్లాడు బతుకుతాడు. అతనే జడల్ (నానీ).
చిన్న వయసులోనే ఆకలితో బిర్యాని దొంగిలిస్తే , అతని చేతి మీద లం...కొడుకు అని పచ్చబొట్లు వేయిస్తాడు మాలిక్. తల్లి వేశ్య అని తెలిసి హీరో ద్వేషిస్తుంటాడు. చిన్నప్పుడే అతన్ని విలన్ జైలుకి పంపిస్తాడు. 14 ఏళ్ల తర్వాత విడుదలవుతాడు.

ఫొటో సోర్స్, nameisnani/INSTA
సవారి జాతి విముక్తి కోసం...
తమ వాళ్ల విముక్తి కోసం ఆయుధం తీసుకుంటాడు. విలన్, అతని కొడుకు దౌర్జన్యాలను ఎదుర్కొంటాడు. ఈ జర్నీలో సుబ్బు (కాయదు లోహర్) కలుస్తుంది. ఫైనల్‌గా తమ జాతికి గుర్తింపు తెచ్చాడా? తల్లి మీద ద్వేషం పోయిందా? ఇదంతా మిగతా కథ....
కథా కాలాన్ని మనకు ఎక్కడా చెప్పరు. అయితే ఖైదీ సినిమా (1983) థియేటర్లో ఆడుతుంటుంది కాబట్టి మనమే ఊహించుకోవాలి.
దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమా మనకు కొత్తగా ఏమీ అనిపించదు. కేజీఎఫ్, సలార్ ఇంకా చాలా సినిమాలు గుర్తుకొస్తుంటాయి. తమ జాతి గుర్తింపు కోసం హీరో పోరాడడం కూడా పెద్దిలో చూశాం.
కొత్త పాయింట్ అనుకుని సవారి జాతి గుర్తింపు మోయడం చివరికి బరువై పోయి, దించుకోవడం తెలియక సెకండాఫ్ గందరగోళంగా మారింది.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నానీ గురించి. పాత్ర కోసం ఒక నటుడు ఇంత కష్టపడడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎమోషన్ సీన్స్ అద్భుతంగా పండించాడు. అయితే తెలంగాణ యాస అక్కడక్కడ కుదర్లేదు.
బీజీఎం హోరులో చాలా డైలాగ్‌లు వినపడవు. తల్లిని మళ్లీ కలుసుకునే సీన్, హీరోయిన్ని అర్థం చేసుకున్న సీన్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం. యాక్షన్ సన్నివేశాల్లో మితిమీరిన హింస అయనకి అతకలేదు.
పక్కింటి కుర్రాడిలా , మంచి తండ్రిగా, ప్రేమికుడిగా నానీని ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి అలవాటు పడ్డారు. అయితే కృష్ణార్జునయుద్ధం (2018) నుంచి ఆయనకి మాస్ హీరో కావాలనే కోరిక పుట్టింది. స్టామినా పెంచుకోడానికి మాస్ అప్పియరెన్స్ అవసరమే కానీ ఇంత రగ్డ్గా నానీని ఆమోదిస్తారా?

ఫొటో సోర్స్, srikanthodela__INSTA
హీరో ప్రతీకారాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందారా...?
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభావంతుడు. దసరాలో బొగ్గు గనుల జీవితాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ యాసలో మంత్రముగ్ధుల్ని చేశాడు.
ఆ కాన్ఫిడెన్స్‌తోనే నానీతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఏళ్లతరబడి తీశాడు. అతని శ్రమ, క్రియేటివిటీ తెరమీద కనిపిస్తాయి. కొన్ని సీన్స్‌లో దర్శకుడి సూక్ష్మత అబ్బురపరుస్తుంది. అయితే రైటర్‌గా అతని బలహీనత సెకండాఫ్ కొట్టొచ్చినట్టు కనబడింది.
ఒక రకంగా ఇది దళిత కాన్సెఫ్ట్ సినిమా. కేవలం పేదరికం, అంటరానితనం, వెలివేతను ఒకట్రెండు డైలాగ్‌లతో చెబితే కుదరదు. ఆ బాధ పట్టుకోవాలి. సీన్లో ఎలివేషన్ వుండాలి. చిన్నప్పటి హీరోకి పచ్చబొట్టు వేస్తున్నప్పుడు ఉన్న ఎమోషన్ తర్వాత క్యారీ కాలేదు.
కథ పరంగా సినిమాలో ఎంత లిబర్టీ అయినా తీసుకోవచ్చు. హద్దులు దాటితేనే చిరాకు. ఫస్టాఫ్‌లో లేని పోలీసులు, చట్టాలు, నిబంధనలు , రాజకీయాలు సెకండాఫ్‌లో వచ్చి కీలకంగా మారే సరికి మొత్తం దారి తప్పింది.
విలన్ని బలంగా చూపించినప్పుడు, హీరో కూడా అంతే బలంగా ప్రతీకారం తీర్చుకుంటాడని ప్రేక్షకులు ఆశిస్తారు. ఇంటర్వెల్లో గూస్బంప్స్ తెచ్చుకుని, అంతకు మించి సెకండాఫ్ ఆశిస్తే పూర్తి నిరాశ మిగులుతుంది.
అవే సీన్స్ రిపీట్ అవుతూ, కొత్తగా చెప్పడానికి ఏమీలేక విసుగు తెప్పిస్తుంది. దీనికి బాధ్యత దర్శకుడిదే. నాలుగు రోడ్ల కూడలిలో ఎటు పోవాలో అర్థంకాక, ప్రేక్షకుణ్ని కూడా గందరగోళపరిచాడు.
వ్యవస్థ ఎలా పని చేస్తుందో దర్శకుడికి తెలియనప్పుడు, దాని జోలికి వెళ్లకుండా సినిమాటెక్ దారిలోనే వెళితే సరిపోయేది. బలహీనమైన స్క్రిప్ట్ సెకండాఫ్ చావుదెబ్బ కొట్టింది.

ఫొటో సోర్స్, keerthysureshofficial
మోహన్‌బాబు పాత్ర ఎలా ఉందంటే..
ఇక మోహన్‌బాబు గురించి చెప్పాలంటే అతి చేసే అవకాశం ఉన్న పాత్ర అయినా చాలా బ్యాలెన్స్‌గా నటించాడు. ఒక రేంజ్లో బిల్డప్ ఎంట్రీతో వచ్చిన మాలిక్ పాత్ర నుంచి ఎంతో ఆశిస్తే చివరికి చప్పబడి అనూహ్యంగా ముగుస్తుంది.
చట్టాలపై నమ్మకం లేకుండా, తానే ప్రభుత్వంగా నడిపించిన ఆయన చివర్లో లాయర్ని (సత్యరాజ్) పిలిపిస్తాడు.
హీరోయిన్గా కయదులోహార్ మొదట్లో మంచి ఇంప్రెషన్ కలిగించి తర్వాత గుంపులో ఒకరిగా మిగిలిపోతుంది. ఆమె బి గ్రేడ్ సినిమా అంటూ తల్లితో వీడియో కెమెరాలో షూట్ చేయించి, తమ థియేటర్లోనే ప్రదర్శిస్తుంది. ఆ రోజుల్లో సినిమా అంటే నెగెటివ్‌లు ప్రింట్ చేయడం ఇలా ప్రాసెస్ వుంది. ఇంతకీ అది వీడియో పార్లరా? థియేటరా?

ఫొటో సోర్స్, nameisnani/INSTA
ట్రోలింగ్‌కు చిక్కిన దర్శకుడు
తల్లిగా నటించిన సోనాలి కులకర్ణి చాలా బాగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించింది.
విలన్ కొడుకుగా నటించిన రాఘవ్ జుయాల్ మంచి నటుడే కాని, క్యారెక్టర్లో బలం లేదు. ఆ టైప్ సైకోలని చూసిచూసి ప్రేక్షకులు అలసిపోయారు. సినిమాలో సంపూర్ణేష్‌బాబు ఉన్నాడు కానీ, ఎందుకున్నాడో తెలియదు.
సినిమాలో కుక్కది కూడా చాలా కీలక పాత్ర. అయితే 1966లో వచ్చిన రాము సినిమా నాటి సీన్స్ అవి. దర్శకుడు శ్రీకాంత్ కొంత అమాయకత్వంతో మంచి మీమ్ మెటీరియల్ కూడా అందించాడు. సెకండాఫ్‌లో హీరో తల్లి డ్యాన్స్ ట్రోలర్స్‌కి మంచి పండుగ.
అనిరుద్ బీజీఎం కొన్ని చోట్ల డైలాగ్‌లు కూడా వినపడనంత ఆవేశంతో ఉతికేశాడు. నిజానికి సెకండాఫ్‌లో వచ్చే ఏషనాగుల పాటకి జనం ఊగిపోవాలి. అప్పటికే అలసిపోయి తూగుతున్నారు.
సాయి కెమెరా మూడ్‌ని క్రియేట్ చేస్తూ, ఎంతోకొంత సినిమాని నిలబెట్టింది. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనింగ్ అద్భుతం. డబ్బులు ఊరికే రావు, అయినా కూడా నిర్మాతలు ఖర్చుకి వెనుకాడలేదు. ప్రస్తుతం మూడు గంటలు సినిమా తీసి ప్రేక్షకులతో అటోఇటో తేల్చుకోవడం ట్రెండ్ కాబట్టి, ఎడిటర్ నవీన్ నూలిని నిందించి ప్రయోజనం లేదు.
ప్యారడైజ్ అంటే మంచి బిర్యాని గుర్తుకొస్తుంది. దర్శకుడు ఆ ప్రయత్నంతోనే మసాలాలు నూరుకుని చికెన్ మరిచిపోయాడు. సినిమాలో విపరీతమైన హింస వుంది. అది చాలా చోట్ల ఆడియన్స్‌కి వర్తించింది.

ఫొటో సోర్స్, nameisnani/INSTA
ప్లస్ పాయింట్:
1.నానీ, సోనాలి కులకర్ణి నటన
2.అక్కడక్కడ డైలాగ్‌లు
3.కెమెరా
4.రెండు పాటలు
మైనస్ పాయింట్:
1.నిడివి
2.సెకండాఫ్
3.వీక్ రైటింగ్
4.ఓవర్ సినిమాటిక్ లిబర్టీ
5.అల్రెడీ చూసేసిన ఫీల్
ఫైనల్‌గా ఫస్టాప్ ప్యారడైజ్ , సెకండాఫ్ భారడైజ్.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























