ఫ్లైట్ 901: గాల్లోకి ఎగిరిన 10 నిమిషాలకే ఈ విమానం పేలిపోవడానికి, 6వ నెంబర్ సీటులో కూర్చున్న వ్యక్తికి సంబంధం ఉందా?

ఫొటో సోర్స్, Cortesía Public Ministry of Panama
- రచయిత, లెయిరే వెంటాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
1994 జూలై 19 సాయంత్రం.
19 ఏళ్ల హోసే ఆంటోనియో గొంజాలెజ్ ఎంతో ఉత్సాహంగా అలాస్ చిరికానాస్ ఫ్లైట్ 901లో అడుగుపెట్టారు.
తన సుదీర్ఘ పైలట్ కెరీర్‌కు అది ప్రారంభం అని అనుకున్నారు.
"ఆ ఏడాది మే లో అతనికి 19 ఏళ్లు నిండాయి. అమెరికాలో పైలట్ శిక్షణ పూర్తి చేసుకుని, తన తండ్రిలాగే పైలట్ అవ్వాలని కలలు కన్నాడు" అని ఆయన తల్లి మార్తా మార్క్వెజ్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
మరోవైపు 35 ఏళ్ల వ్యాపారవేత్త సాల్ శ్వార్ట్జ్‌కు అది ఎప్పుడూ చేసే ఒక సాధారణ ప్రయాణం.

పనామాలోని రెండో అతిపెద్ద నగరమైన కోలన్ ఫ్రీ జోన్‌లో ఆయన వ్యాపారం చేసేవారు. కోలన్ నుంచి పనామా సిటీలోని తన ఇంటికి వెళ్లేందుకు ఆయన ఆ విమానం ఎక్కారు.
విమానంలోని 18 మంది ప్రయాణికులలో చాలామంది తరచూ ఈ మార్గంలో ప్రయాణించేవారే.
కానీ ఆ ప్రయాణం వారి చివరి ప్రయాణంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు.
ఆకాశంలోనే పేలిపోయిన విమానం
కోలన్ నగరం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ జోన్. లాటిన్ అమెరికాకు సరుకుల సరఫరాలో కీలకమైన నగరం.
కోలన్‌లోని ఫ్రాన్స్ ఫీల్డ్ విమానాశ్రయం నుంచి టేకాఫైన 10 నిమిషాలకే ఆ విమానం గాల్లో పేలిపోయింది.
దాని శకలాలు శాంటా రీటా పర్వతాల వాలుల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానంలోని 21 మందిలో(సిబ్బందితో కలిపి) ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు.
ఈ ఘటన జరిగి 30 ఏళ్లు దాటింది.
ఇన్నాళ్లూ ఈ కేసు ఎవరికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిపోయింది. సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో మిగిలిపోయాయి.
కానీ ఇప్పుడు నిజం వెలుగులోకి వస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి.
ఇటీవల వెనెజ్వెలా ఒక కీలక నిందితుడిని పనామాకు అప్పగించింది.
ఈ నిందితునికి హిజ్బొల్లాతో సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది.
ఇది ఉగ్రవాద దాడి కావచ్చనే కోణంలో పనామా ప్రాసిక్యూషన్ దీనిని దర్యాప్తు చేస్తోంది.
ఇది ఉగ్రవాద దాడిగా నిరూపితమైతే పనామా చరిత్రలోనే ఇలాంటి దాడుల్లో అత్యధిక ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే అవుతుంది.
"మాకు కొన్ని కొత్త ఆధారాలు లభించాయి. నిజాలను వెలికితీయడానికి ఇవి చాలా కీలకం. మేం సరైన దిశలోనే ముందుకెళ్తున్నాం " అని ఈ కేసు ప్రాసిక్యూటర్ గెయోమారా గువేరా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Cortesía Public Ministry of Panama
ప్రాథమిక దర్యాప్తులో పురోగతి శూన్యం
ఆ విషాదకరమైన రోజు తన మేనమామ సాల్ శ్వార్జ్‌ను వెతుక్కుంటూ శాంటారీటా కొండలకు మొదటగా చేరుకున్నవారిలో అబ్నెర్ బెనైమ్ ఉన్నారు. అబ్నెర్ పనామాలో ప్రముఖ ఫిల్మ్‌మేకర్.
"అప్పుడు జోరున వర్షం పడుతోంది. అంతా బురదమయం. నేను మా మావయ్య కోసం ఆ కొండల్లో ఎంత దూరం నడిచానో నాకే తెలియదు. చివరికు విమానం కూలిపోయిన పొలం దగ్గరకు చేరుకున్నాం. అప్పటికే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లకుండా పోలీసులు నన్ను అడ్డుకున్నారు. విమానంలో ఓ ప్రయాణికుడి బంధువుని. సాయం చేయడానికి వచ్చా’ అని వారితో చెబితే, ‘అందరూ చనిపోయారు' అని పోలీసులు తెలిపారని అబ్నెర్ గుర్తు చేసుకున్నారు.
ఈ విషాదం ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది.
ఈ ఘటనపై ఓ డాక్యుమెంటరీ తీయాలనే ఆలొచన వచ్చింది.
చాలా ఏళ్ల తర్వాత అది పూర్తయింది.
ఇది అబ్నెర్‌కు పూర్తిగా వ్యక్తిగతమైన కథ.
ఈ కేసుకు సంబంధించిన సమాధానం లేని ప్రశ్నలకు జవాబు వెతికే ప్రయత్నమది.
'ట్రాపికల్ పారడైజ్' అనే డాక్యుమెంటరీని ఆయన రూపొందించారు.
ఆ డాక్యుమెంటరీలోని ఒక సీన్‌లో అబ్నర్ తన సైకాలజిస్ట్‌తో "1994లో మా మావయ్యకు ఏం జరిగిందో తెలుసుకోవడం నా జీవితంలో అతిపెద్ద ప్రశ్నగా మారింది. నా తల పైనే విమానం పేలిపోయినట్టు అనిపిస్తుంది" అన్నారు.
అసలింతకీ విమాన ప్రమాదం ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? వారికి ఎవరు సాయం చేశారు? లక్ష్యం ఎవరు? ఘటన పనామాలోనే ఎందుకు జరిగింది? వంటి ఎన్నో ప్రశ్నలు మిస్టరీగా మిగిలిపోయాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సీట్ నంబర్ 6.. ఆ మృతదేహం ఎవరిది?
మరణించిన 21 మందిలో విమాన సిబ్బందితో కలిపి 12 మంది పనామాకు చెందిన యూదులని, ముగ్గురు అమెరికన్లని తేలింది.
సాల్ ష్వార్ట్జ్ కూడా వారిలో ఒకరు.
కొన్నిరోజుల తర్వాత ఒక్కరిది తప్ప మిగతా అన్ని మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ ఒక్క మృతదేహంపై తీవ్ర గాయాల గుర్తులున్నాయి.
మృతదేహంతో పాటు ఇతర ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.
ఆ వ్యక్తి విమానంలోకి పేలుడు పదార్థాలను తీసుకొచ్చిఉండొచ్చని వారు భావించారు. విమానంలోని సీట్ నంబర్ 6లో కూర్చున్న ఆ వ్యక్తిని "లియా జమాల్" లేదా 'అలీ హవా జమాల్'గా గుర్తించారు. ఒక వైర్‌లెస్ పరికరంలో దాచిన బాంబు ద్వారా విమానాన్ని ఆయన పేల్చివేసి ఉండొచ్చని అంచనాకు వచ్చారు.
ఈ ఘటనకు కేవలం ఒకరోజు ముందు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో యూదు సహాయ కేంద్రం 'అమియా'పై కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 85 మంది చనిపోయారు. ఈ దాడికి కారణాలు ఇంకా తెలియలేదు.
ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో జరగడంతో ఫ్లైట్ 901పై దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది.
అప్పట్లో దర్యాప్తు సంస్థలు రెండు కోణాల్లో కేసును దర్యాప్తు చేశాయి.
అందులో ఒకటి హిజ్బొల్లాతో సంబంధాలున్న యెమెన్‌కు చెందిన షియా అన్సార్ అల్లా (హూతీ) తిరుగుబాటుదారులు ఈ దాడి చేసి ఉండొచ్చని అనుమానించారు.
రెండో కోణం ఓ వ్యక్తిపై పాత కక్ష తీర్చుకోడానికి ఈ దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానం.
ఆ వ్యక్తికి కొలంబియా డ్రగ్ మాఫియాతో విభేదాలు ఉండి ఉండొచ్చని, 'వ్యక్తిగత కక్షల' వల్ల ఈ దాడి జరిగి ఉండవచ్చనేది ఈ కోణం.
అయితే పనామాలో దర్యాప్తు పలు మలుపులు తిరిగినప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఫలితం రాకుండానే కేసు మూతపడింది.
అప్పటి ప్రాసిక్యూటర్ జువాన్ ఆంటోనియో తేహాదాను బీబీసీ సంప్రదించగా మాట్లాడటానికి ఆయన నిరాకరించారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నవారితోనే మాట్లాడాలని సూచించారు.
మరోవైపు అర్జెంటీనా న్యాయవ్యవస్థ కూడా దీనిపై రహస్య దర్యాప్తు జరిపింది. ఆ దర్యాప్తు ఫలితాలు ఒక రహస్య ఫైల్‌లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, FBI
2018లో కేసు రీఓపెన్
చాలా ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్, అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అందించిన కీలక సమాచారంతో 2018లో పనామా ప్రభుత్వం ఈ కేసును తిరిగి తెరిచింది.
అప్పటి పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వారెలాకు ఇది వ్యక్తిగతమైన విషయం కూడా.
ఎందుకంటే ఆ విమానంలో ఆయన కాలేజీ స్నేహితుడు మౌరిసియో హరోష్ కూడా మరణించారు. వీరిద్దరూ అట్లాంటాలోని జార్జియా టెక్ విశ్వవిద్యాలయంలో నాలుగేళ్లపాటు కలిసి చదువుకున్నారు.
‘‘మా గదులు ఒకదానికొకటి దగ్గర ఉండేవి. చివరి సంవత్సరం ఆయన నాతోనే ఉన్నారు. పనామాకు తిరిగి వచ్చిన తర్వాత మా స్నేహం మరింత బలపడింది’’ అని వారెలా చెప్పారు.
వారెలా 2009లో ఉపాధ్యక్షుడు అయినప్పటి నుంచే ఈ కేసుపై దృష్టి పెట్టారు. బొగెటాలోని మొసాద్ ఏజెంట్లు, ఎఫ్‌బీఐ అధికారులతో సంప్రదింపులు జరిపారు.
వారెలా ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు ఫ్లైట్ 901 విమాన ప్రమాదం కేసును తిరగదోడాలని ఇజ్రాయెల్ ప్రధాని నెనత్యాహు ఆయనకు ఓ లేక అందచేశారు.
దీంతో మే 2018లో వారెలా అధికారికంగా ఈ కేసును తిరిగి తెరిపించారు.
"నా స్నేహితుడికి న్యాయం చేయడమే నా లక్ష్యం" అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, FBI
ఎఫ్‌బీఐ ముమ్మర అన్వేషణ రూ. 42 కోట్ల బహుమతి
పనామా దర్యాప్తుతో పాటు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ కూడా ఈ 'అలాస్ కేసు'పై విచారణను కొనసాగించింది.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందించాలని ఎఫ్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 2024 మే 29న ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఈ విచారణలో భాగంగా ఎఫ్‌బీఐ కొన్ని కీలక ఆధారాలను బయటపెట్టింది.
మానవ బాంబుగా మారినట్లు అనుమానిస్తున్న అలీ హవా జమాల్ స్కెచ్‌ను విడుదల చేసింది.
భద్రత కెమెరాల నుంచి సేకరించిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను వెబ్‌సైట్‌లో ఉంచింది.
వీరికి ఈ పేలుడుతో సంబంధం ఉండవచ్చని భావిస్తున్నారు.
మధ్యప్రాచ్యానికి చెందిన ఓ గుర్తుతెలియని వ్యక్తి 1994 మే 27, 28తేదీల్లో దొంగతానికి గురైన అమెరికా పౌరుడి క్రెడిట్ కార్డును ఉపయోగించారు.
దీని ద్వారా పనామా సిటీలో రెండు ఎస్‌యూవీ వాహనాలు, ఒక టూ లైన్ టెలిఫోన్ సిస్టమ్‌ను అద్దెకు తీసుకున్నారు. ఈ వాహనాలు తర్వాత టోకుమెన్ విమానాశ్రయం సమీపంలో లభ్యమయ్యాయి.
‘‘ఫోటోల్లో కనిపిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు అలీ హవా జమాల్ సహచరులో కాదో స్పష్టంగా తెలియదు’’ అని ఎఫ్‌బీఐ తెలిపింది.
కొలంబియా, వెనెజ్వెలా, కోస్టారికా, లెబనాన్‌కు అలీ హవా జమాల్ వెళ్లిఉండొచ్చని, ఆయనకు ఆయుధాల అక్రమ రవాణాదారులతో పరిచయాలు ఉండి ఉండొచ్చని ఎఫ్‌బీఐ నివేదిక పేర్కొంది.
ఫ్లైట్ 901 పేలుడుకు వ్యూహరచన చేసిన వారిని లేదా సహకరించిన వారిని అరెస్ట్ చేయడానికి సహాయపడే సమాచారం ఇస్తే 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 42 కోట్లు) రివార్డు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
2020లో ఎఫ్‌బీఐ మరో పోస్టర్ విడుదల చేసింది.
అలీ జకీ జలీల్ అనే వ్యక్తి గురించి సమాచారం ఇవ్వాలని కోరింది.
వెనెజ్వెలాలోని మార్గరీటా ద్వీపంలో ఆయన బార్లు, రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారని భావిస్తున్నారు.
స్కైడైవింగ్ అంటే ఆసక్తి ఉన్న ఆయన దగ్గర ఈ కేసుకు సంబంధించిన "అత్యంత కీలకమైన సమాచారం" ఉండవచ్చని ఎఫ్‌బీఐ అనుమానిస్తోంది.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
హిజ్బొల్లాపై పెరుగుతున్న అనుమానాలు
ఈ కేసుపై డాక్యుమెంటరీ తీస్తున్న క్రమంలో అబ్నర్ బెనైమ్ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు కూడా వెళ్లారు.
1989 నుంచి 1996 వరకు మొసాద్ అధిపతిగా పనిచేసిన శబ్తై శావిత్ ఈ డాక్యుమెంటరీలో మాట్లాడారు.
అయితే ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో దీని గురించి తాను ఎక్కువగా మాట్లాడలేనని తనకు చాలా విషయాలు గుర్తులేవని ఆయన చెప్పారు.
కానీ ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ 'షిన్ బెట్' మాజీ అధిపతి యాకోవ్ పెరి మాత్రం ఈ దాడి వెనుక హిజ్బొల్లా ఉందని బలంగా నమ్ముతున్నారు.
"మొదట్లో దీనిని ఎవరూ ఉగ్రవాద దాడిగా భావించలేదు. కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు జరగలేదు. ఆ తర్వాత లభించిన ఫోరెన్సిక్ ఆధారాల వల్లే అసలు నిజం తెలిసింది. కానీ అప్పటికే చాలా సమయం వృధా అయిపోయింది. దీంతో ఆధారాలు గుర్తించడం కష్టమైంది. ఇలాంటి కేసుల్లో సమయం చాలా ముఖ్యమైంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Cortesía Public Ministry of Panama
దర్యాప్తు ఇప్పుడెందుకు వేగం పుంజుకుందంటే...
లెబనాన్ సంతతికి చెందిన కొలంబియా-వెెనెజ్వెలా పౌరుడు అలీ హజ్ జలీల్‌ను 2025 నవంబర్‌లో వెనిజ్వెలాలోని మార్గరీటా ద్వీపంలో అరెస్టు చేశారు.
ఈ ఏప్రిల్‌లో వెనెజ్వెలా ప్రభుత్వం ఆయనను పనామాకు అప్పగించడంతో ఈ కేసు దర్యాప్తు ఊహించని వేగం పుంజుకుంది.
"ఈ అప్పగింత ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి పాత విషయాలు బాగా గుర్తుంటాయి. విస్తృత పరిధిలో చర్యలు తీసుకోగలరు’’అని పనామాలోని అమెరికా రాయబారి కెవిన్ మారినో కాబ్రెరా అన్నారు.
ప్రస్తుత ప్రాసిక్యూటర్ గెయోమారా గువేరా బృందం పాత దర్యాప్తులోని లోపాలను సరిదిద్దుకుంటూ కొత్త ఆధారాలను సేకరిస్తోంది.
బాంబు తీసుకువచ్చిన వ్యక్తి ప్రమాదానికి ముందు ఎక్కడెక్కడ తిరిగాడో కొన్ని ప్రాంతాలను గుర్తించామని .మరో ఇద్దరు వ్యక్తులకు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు గుర్తించామని ఆమె తెలిపారు.
అయితే మూడు దశాబ్దాలకుపైగా కాలం గడిచిపోవడంతో దర్యాప్తు కష్టంగా మారిందని ఆమె అన్నారు.
‘‘మేం చాలా విస్తృతస్థాయిలో దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పుడు చాలా ఆధారాలు అందుబాటులో లేవు’’ అని చెప్పారు.
ఏప్రిల్‌లో జరిగిన విచారణలో అలీ హజ్ జలీల్ ఏమీ మాట్లాడలేదు.
ఘటన జరిగి 20 ఏళ్లు దాటిపోయినందున అప్పటి కాలపరిమితి చట్టం కింద ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు.
కానీ, ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు పనామా అత్యున్నత క్రిమినల్ అప్పీళ్ల కోర్టు దీనిని 'సంక్లిష్టమైన కేసు'గా ప్రకటించి దర్యాప్తు కోసం ప్రాసిక్యూటర్లకు మరో 12 నెలల అదనపు సమయాన్ని ఇచ్చింది.
హిజ్బొల్లా వంటి సంస్థలు దశాబ్దాలుగా లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్‌లను విస్తరించి, నిధులను చేరవేస్తున్నాయని అమెరికా అధికారులు చాన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు.
హింస మిగిల్చిన తీవ్ర గాయం
"32 ఏళ్ల తర్వాత కొత్త ఆధారాలు దొరుకుతాయా?" అని ప్రమాదంలో మరణించిన యువ పైలట్ హోసే ఆంటోనియో తల్లి మార్తా మార్క్వెజ్ ప్రశ్నించారు.
"ఈ కేసును ఎప్పటికైనా తిరగదోడుతారని, ఎవరైనా అరెస్ట్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు. పాత కేసు ఫైళ్లను మళ్లీ తెరిచారని, ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉందని విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. పోయిన మావాళ్లు తిరిగి రాకపోయినా దీనివల్ల మాకు కొంత ఉపశమనం లభిస్తుంది" అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
‘‘అసలు దీన్ని ఎందుకు చేశారు, దీని లక్ష్యం ఏమిటి, పనామానే ఎందుకు ఎంచుకున్నారు?’’లాంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదని అబ్నర్ బెనైమ్ అన్నారు.
తన డాక్యుమెంటరీని ప్రజలకు చూపించిన తరువాత విమాన ప్రమాద ఘటన కారణంగా ప్రజలకు కలిగిన మానసిక గాయాలు పూర్తిగా మాసిపోలేదని అర్థం చేసుకున్నట్టు బెనైమ్ చెప్పారు.
"హింస మనందరినీ ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తుంది. అది సమాజానికి ఎంతటి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందో మన అనుభవంలోకి వచ్చేవరకు అర్థం కాదు. ఈ గాయం ఒక తరం నుంచి తర్వాతి తరానికి చేరుతూనే ఉంటుంది" అని డైరెక్టర్ అబ్నర్ బెనైమ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























