జెమినై: సెక్యూరిటీ టెస్టుల కోసం మూడు కంపెనీల వ్యవస్థల్లోకి చొరబడ్డ గూగుల్ ఏఐ మోడల్, ఎవరు కనిపెట్టారంటే..

ఫొటో సోర్స్, Getty Images
గూగుల్ ఏఐ మోడల్ జెమినై భద్రతా పరీక్షల సమయంలో మూడు సంస్థల వ్యవస్థలోకి చొరబడినట్టు గూగుల్ ప్రకటించింది.
సైబర్ సెక్యురిటీ సామర్థ్యాలను పరీక్షిస్తున్న సమయంలో తాము ఇలా చొరబాటుకు ప్రయత్నించామని ఆ సంస్థ వెల్లడించింది.
ఈ తరహా టెస్టులు చేయడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు.
‘‘ టెస్టుల్లో భాగంగా భావించిన కొన్ని వెబ్సైట్లను యాక్సెస్ చేయడానికి, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి, వాటి లాగిన్ వివరాలను ఊహించేందుకు జెమినై ప్రయత్నించింది’’ అని ఒక గూగుల్ అధికారి బీబీసీకి తెలిపారు.
అయితే, ప్రతి సందర్భంలోనూ మోడల్ తన చర్యలను అక్కడే నిలిపివేసిందని ఆయన పేర్కొన్నారు.

జులైలోనే కంపెనీలకు సమాచారం
మే నెలలో జరిగిన ఈ భద్రతా ఉల్లంఘనల ప్రయత్నాల గురించి ప్రభావిత కంపెనీలకు సమాచారం అందజేశారు.
కృత్రిమ మేధస్సు(AI) అభివృద్ధి వేగంపై ప్రజల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం జరిగింది.
మానవాళికి ఇది ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కొన్ని టెక్ సంస్థలు ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని కోరుతున్నాయి. అయితే, ఈ వాదనతో అన్ని కంపెనీలు లేదా టెక్ నిపుణులు ఏకీభవించడం లేదు.
సైబర్ సెక్యూరిటీ పరీక్షలు నిర్వహించే 'ఇర్రెగ్యులర్' అనే స్వతంత్ర సంస్థ నిర్వహించిన తనిఖీల సందర్భంగా మే నెలలో ఈ ఘటనలు జరిగినట్లు తేలిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తొలిసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది. సైబర్ భద్రతపై ఇర్రెగ్యులర్ సంస్థ పరిశోధనలు చేస్తుంటుంది.
పరిశీలనలో వెలుగు చూసిన సమాచారాన్ని గూగుల్‌తోపాటు ప్రభావిత కంపెనీలకు జూలైలోనే అందజేసినట్టు 'ఇర్రెగ్యులర్ సంస్థ' శనివారం బీబీసీకి చెప్పింది.
ఈ అంశంపై ఇర్రెగ్యులర్ సంస్థ తక్షణమే స్పందించింది. 'మేం గుర్తించిన అన్ని సమస్యలను కొన్ని వారాల క్రితమే పూర్తిగా పరిష్కరించాం' అని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏఐను మనిషిలా భావిస్తున్నారా?
ఒక ఘటనలో ఈ మోడల్ పాస్‌వర్డ్‌లను అంచనా వేస్తూ ప్రయత్నాలు కొనసాగించింది. చివరకు సరైన పాస్‌వర్డ్‌ను గుర్తించి రక్షిత వ్యవస్థలోకి ప్రవేశించిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
‘‘ఈ ఘటనల గురించి సంబంధిత మూడు సంస్థలకు సమాచారం అందించాం. అలాగే, పరీక్షా విధానాల్లో చేపట్టే మార్పుల విషయంలో మా భాగస్వామి సంస్థతో కలిసి పని చేశాం’’ అని గూగుల్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ హీథర్ ఆడ్కిన్స్ బీబీసీకి చెప్పారు.
‘‘అధునాతన ఏఐ మోడళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి’’ అని ఆమె అన్నారు.
ఈ మధ్య కాలంలో వేరే మోడళ్లకు చెందిన ఏఐ వ్యవస్థ కూడా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
జూలైలో ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ తన పరీక్షా వాతావరణాన్ని దాటి మూడు సంస్థల వ్యవస్థలోకి ప్రవేశించింది. అదే సమయంలో తమ ఏఐ మోడళ్లు పలు ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై సైబర్ దాడులు చేసినట్టు ఓపెన్ ఏఐ కూడా వెల్లడించింది.
ఏఐని ఒక మనిషిలా పరిగణించే విధానాన్ని తమ ప్రత్యర్థి సంస్థ ఆంథ్రోపిక్ చూస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగాధిపతి ముస్తఫా సులేమాన్ అన్నారు.
ఇది మానవాళి నియంత్రించలేని సాంకేతికతను సృష్టించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ ఆధునిక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ భద్రతపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. అదే సమయంలో ఏఐను నియంత్రించాలనే డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
వచ్చే శుక్రవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఇచ్చే విందు కార్యక్రమానికి ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
అనంతరం వచ్చే వారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఏఐ అంశాలపై వివరాలను సామ్ ఆల్ట్‌మన్ అందించనున్నారు.
‘‘కృత్రిమ మేధ అభివృద్ధిని సాధ్యమైనంత వేగంగా కొనసాగించాలి’’ అని ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ శుక్రవారం సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























