జైల్లో సింగర్లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు.. ట్యాక్సీలు, దుకాణాలు.. భయంకరమైన 'న్యూ బెల్' జైలు విచిత్రమైన కథ ఇది

ఫొటో సోర్స్, Artists Equity
- రచయిత, వెడెలీ చిబెలుషి, టామ్ బ్రూక్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
కామెరూన్‌లోని డౌలా నగరంలో ఉన్న భయంకరమైన 'న్యూ బెల్' జైలు చూస్తే... ఈ జైలు లోపలే ఇంకో ప్రపంచం ఉందేమో అనే భావన కలుగుతుంది.
ఆ జైలులో ఖైదీలే నడుపుకునే సొంత "ట్యాక్సీలు" ఉంటాయి. ఇక ఇక్కడి సెక్యూరిటీ గార్డుల సంఖ్య తక్కువగా ఉండటంతో, జైలులో శాంతిభద్రతలను చూసుకోవడానికి బలంగా ఉండే ఖైదీలతోనే ఒక 'పోలీస్ వ్యవస్థ'ను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు, వేయించిన దుంపలు, రకరకాల తినుబండారాలను అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి ఖైదీలే నడిపే చిన్న చిన్న దుకాణాలు కూడా ఇక్కడ ఉంటాయి.
మొత్తానికి, న్యూ బెల్ జైల్లో సడలించిన నిబంధనలను అక్కడి ఖైదీలు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇలా మలచుకున్నారని చెప్పడానికి అసలైన ఉదాహరణ 'జైల్ టైమ్ రికార్డ్స్'.

జైల్లోనే మ్యూజిక్ స్టూడియో..
జైల్ టైమ్ రికార్డ్స్ అనేది జైలు ఆవరణలోనే నడిచే మ్యూజిక్ స్టూడియో, మ్యూజిక్ లేబుల్. ప్రతిభ ఉన్న ఖైదీలను చిన్నపాటి స్టార్లగా మారుస్తోంది ఈ స్టూడియో.
జైలు లోపల, బయట ముఠాలను నడిపిస్తూ అందరినీ భయపెట్టే ఎంపరర్ అనే ఖైదీ, పూర్తిగా జైలులోనే షూట్ చేసిన తన మ్యూజిక్ వీడియోతో యూట్యూబ్‌లో ఏకంగా 24,000 వ్యూస్ సాధించాడు.
ఇక్కడి ఖైదీలు పాడిన పాటలకు దక్షిణాఫ్రికా, అమెరికా, అర్జెంటీనాల్లోనూ అభిమానులు ఉన్నారు.
జైల్ టైమ్ రికార్డ్స్ ఈ ఏడాది మొదట్లో న్యూ బెల్ జైల్లోని ఖైదీల కోసం జైలు ప్రాంగణంలోనే ఒక భారీ మ్యూజిక్ కాన్సర్ట్‌ను కూడా నిర్వహించింది.
'ఇదొక నిరసన మార్గం. ఇక్కడ మేం స్నేహాన్ని, ప్రేమను పంచుకోగలం. మా గొంతును ప్రపంచానికి వినిపించగలం' అని బీబీసీ టాకింగ్ మూవీస్ కార్యక్రమంలో జైల్ టైమ్ రికార్డ్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఖైదీ స్టీవ్ హప్పీ చెప్పారు.
'మేం ఇకపై జైలు నాలుగు గోడల మధ్య ఉన్నామని అనుకోవట్లేదు. ఇందులోనే మేం స్వేచ్ఛను వెతుక్కుంటున్నాం' అని ఆయన అన్నారు.
జైల్ టైమ్ రికార్డ్స్ స్టూడియో చాలా చిన్నది. ఒకే ఒక కంప్యూటర్ ఉన్న గదికి ఆనుకుని, ఉక్కపోతగా ఉండే ఒక చిన్న రికార్డింగ్ రూమ్ అది.
అయినప్పటికీ, ఇటీవల ప్రశంసలు అందుకున్న ఒక డాక్యుమెంటరీలో చూపించినట్లుగా... ఇది ఖైదీల మానసిక బాధను పోగొట్టి, వారిలోని సృజనాత్మకతను బయటకు తీసే వేదికగా మారింది.

ఫొటో సోర్స్, Artists Equity
కూతురితో మాట్లాడాలనే ఆరాటం..
హప్పీతో పాటు ఆయనతో కలిసి జైల్ టైమ్ రికార్డ్స్‌ను స్థాపించిన ఇటాలియన్ ఆర్టిస్ట్ డియోన్ రోచ్ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు.
ఈ డాక్యుమెంటరీని ఆరేళ్ల పాటు న్యూ బెల్ జైలులోనే చిత్రీకరించారు.
గత నెలలో న్యూయార్క్‌లోని 'ట్రైబెకా ఫిల్మ్ ఫెస్టివల్'లో ఉత్తమ డాక్యుమెంటరీతో సహా మూడు అవార్డులను గెలుచుకుంది.
ఈ డాక్యుమెంటరీలో స్టోన్ అనే ఖైదీ మైక్ అందుకొని 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే ర్యాప్ పాడతారు.
కామెరూన్ ప్రెసిడెన్షియల్ గార్డ్‌లో సైనికుడిగా పని చేసిన స్టోన్‌కు దోపిడీ, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే కేసులో న్యూ బెల్ జైలులో 10 ఏళ్ల శిక్ష పడింది. అయితే తాను ఏ తప్పూ చేయలేదని ఆయన చెబుతున్నారు.
తన చిన్నారి.. కూతురు 'మైరా'కు ఫోన్ చేయడానికి ఆయన చేసే ప్రయత్నాలు (అవి తరచూ విఫలమవుతుంటాయి) ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తాయి. ఆయన బాధ ఈ కథలో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Artists Equity
ఖైదీల పాటలకు ఆస్కార్ విజేత ప్రశంసలు
ఫోన్ కలవకపోవడంతో... ''చాలా కాలమైంది. తండ్రినైన నన్ను తను మర్చిపోకుండా ఉండాలంటే తను తరచుగా నా గొంతు వినా"' అని తమ బంధువు ఒకరికి వాయిస్ మెసేజ్ పంపుతూ స్టోన్ బాధపడతారు.
'హార్ట్ ఆఫ్ స్టోన్' మ్యూజిక్ వీడియో జైల్ టైమ్ రికార్డ్స్ స్టయిల్‌లోనే ఉంటుంది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంటుంది. కథ ఆకట్టుకుంటుంది. మిగతా ఖైదీలు పెద్ద సంఖ్యలో నటులుగా, టెక్నీషియన్లుగా సాయం చేస్తారు.
''అక్కడి నుంచి వచ్చే మ్యూజిక్ నిజంగా అద్భుతంగా ఉంటుంది'' అని ఆస్కార్ విజేత, న్యూజీలాండ్ దర్శకుడు తైకా వైటిటి అన్నారు. ఆయన తన భార్య, గాయని రీటా ఓరాతో కలిసి ఈ డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
"జీవిత ఖైదు అనుభవిస్తున్న కొందరికి విముక్తిని ఇవ్వడంలో, వారి జీవితానికి ఒక అర్థాన్ని వెతుక్కోవడంలో కళ ఎంత ఉపయోగపడుతుందో ఇది చూపుతుంది. తమ భావాలను చెప్పుకోవడానికి ఒక దారి దొరకడం అనేది ఎంతో శక్తిమంతమైన, మానవీయమైన విషయం" అని ఆయన అన్నారు.
రోచ్ 2018లో న్యూ బెల్ జైలు లోపల కార్యక్రమాలు నిర్వహించే ఒక స్వచ్ఛంద సంస్థ కోసం వలంటీర్‌గా వెళ్లినప్పుడే ఈ 'జైల్ టైమ్ రికార్డ్స్'కు పునాది పడింది.
ఖైదీల కోసం నిర్వహించిన ఒక డ్యాన్స్ క్లాస్ సమయంలో, కొందరు ర్యాపర్లు మైక్ అందుకుని సొంతంగా ర్యాప్ పాడటం మొదలుపెట్టారు.
వారి పెర్ఫార్మెన్స్ నచ్చి, జైలు లోపల ఒక స్టూడియో ప్రారంభించడానికి ఆమె జైలు అధికారుల అనుమతి కోరారు.
అధికారులు ఒప్పుకోవడంతో రోచ్.. ప్రొడ్యూసర్‌గా, సౌండ్ ఇంజనీర్‌గా స్టూడియో బాధ్యతలు చూసుకోవడానికి హప్పీని నియమించారు.
జైలులో దారుణ పరిస్థితులు
న్యూ బెల్ జైలుకు తాను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, తర్వాత ఎలా బయటకు వచ్చారో హప్పీ వివరించారు.
'చనిపోయిన నా తండ్రి భౌతికకాయాన్ని ఏం చేయాలనే విషయంలో కుటుంబంలో గొడవ జరిగింది. ఆ వివాదంలో, హైకోర్టు జడ్జిగా ఉన్న మా బంధువు.. తండ్రిని చంపాడనే ఆరోపణతో నన్ను జైలుకు పంపించారు' అని ఆయన వివరించారు.
రెండేళ్ల తర్వాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినట్లు జైల్ టైమ్ రికార్డ్స్ తెలిపింది.
హప్పీ, రోచ్, ఖైదీలు కలిసి 2022లో 'జైల్ టైమ్ వాల్యూమ్ 1' అనే ఆల్బమ్ విడుదల చేశారు. ఈ ఆల్బమ్ అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో సగం కళాకారులకు ఇవ్వగా, మిగిలిన సగాన్ని తిరిగి మ్యూజిక్ లేబుల్‌లోనే పెట్టుబడి పెట్టారు.
న్యూ బెల్ జైలులోని దారుణ పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఖైదీలకు ఈ స్టూడియో నడవడం చాలా అవసరం.
పాడైపోయిన గోడలతో ఉన్న న్యూ బెల్ జైలులో ఉండాల్సిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా, అంటే 4,700 మంది ఖైదీలు ఉన్నారని 2022లో హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images for Tribeca Festival
నేరస్థులను గొప్పగా చూపిస్తున్నారా?
జైలులో విపరీతమైన జనం, అపరిశుభ్రత వల్ల నాలుగేళ్ల క్రితం అక్కడ కలరా వేగంగా వ్యాపించిందని హక్కుల సంఘాలు తెలిపాయి. కలరా వల్ల ఆరుగురు ఖైదీలు చనిపోయారు.
న్యూ బెల్ జైలులో గొడవలు కూడా ఎక్కువే. 2008లో ఖైదీలు జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ, గార్డులు జరిపిన కాల్పుల్లో 16 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.
ఖైదీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, బెదిరించడం కూడా జరుగుతుంటాయి. పలు నేరాలకు గాను 10 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న ఎంపరర్ అనే ఖైదీ, జైలులో ఒక యువ ఖైదీని బెదిరించి మెడలోని చైన్, చెప్పులు లాక్కుంటున్న దృశ్యాలు ఈ డాక్యుమెంటరీలో రికార్డయ్యాయి.
నేరాలు చేసిన ఎంపరర్ వంటి వారిని 'జైల్ టైమ్ రికార్డ్స్' గొప్పగా చూపిస్తోందా అని ప్రశ్నించగా... "మేం చేస్తున్నది ప్రాథమికంగా ఖైదీలను మార్చే ప్రయత్నం" అని రోచ్ చెప్పారు.
"మేం వాళ్లను జడ్జ్ చేయకుండా జైల్లోకి అడుగుపెడతాం. ఖైదీలను మార్చాలనుకున్నప్పుడు వాళ్లను నేరస్థుల్లా కాకుండా సాధారణ మనుషుల్లా చూడటమే సరైన మార్గం. సంగీతం కూడా మనల్ని మనం తెలుసుకోవడానికి, చేసిన తప్పులను అర్థం చేసుకొని, మంచిగా మారడానికి ఉపయోగపడుతుంది'' అని రోచ్ అన్నారు.
మ్యూజిక్ కాన్సర్ట్‌కు జైలు సూపరింటెండెంట్ హాజరు
జైలు అధికారులు కూడా ఇదే అనుకుంటున్నారు.
"వారు ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. కామెరూన్‌లో ప్రతి ఒక్కరూ సంగీతాన్ని ప్రేమిస్తారు" అని హప్పీ చెప్పారు.
ఈ ఏడాది జరిగిన కాన్సర్ట్‌కు జైలు సూపరింటెండెంట్ కూడా హాజరయ్యారని, కళాకారులతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారని హప్పీ గుర్తుచేసుకున్నారు.
జైలు అధికారుల మద్దతు ఉండటంతో జైల్ టైమ్ రికార్డ్స్ బాగా విస్తరించింది. న్యూ బెల్ జైలులోని మహిళా విభాగంలో ఉన్న ఖైదీలకు కూడా అవకాశాలు ఇస్తోంది.

ఫొటో సోర్స్, Jail Time Records
మహిళా ఖైదీలకు కూడా అవకాశం
జైల్ టైమ్ రికార్డ్స్ ద్వారా పరిచయమైన తొలి మహిళా సింగర్ 'జెజె'.
జెజె 2022లో 'షో మీ ది వే' అనే పాటతో అరంగేట్రం చేశారు. తనను వేధిస్తున్న ఒక బంధువు నుంచి డబ్బులు దొంగిలించి పారిపోవడంతో ఆమె జైలు పాలయ్యారు.
మహిళా విభాగంతో పనిచేయడమే కాకుండా, జైల్ టైమ్ రికార్డ్స్ తమ ప్రాజెక్ట్‌ను కామెరూన్ దాటించి ఇతర దేశాలకూ తీసుకెళ్లింది.
కామెరూన్‌కు 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్కినా ఫాసో రాజధాని ఉగడూగూ సెంట్రల్ జైలులో కూడా రోచ్, హప్పీ 2023లో మరో స్టూడియోను ఏర్పాటు చేశారు.
న్యూ బెల్ స్టూడియో సాధించిన విజయాన్ని ఇక్కడ కూడా సాధించాలని జైల్ టైమ్ రికార్డ్స్ ఆశిస్తోంది.
ఈ డాక్యుమెంటరీ "ఇన్ మెమోరియమ్" సీక్వెన్స్‌తో ముగుస్తుంది. అంటే జైల్ టైమ్ రికార్డ్స్ ప్రాజెక్ట్ నడుస్తున్న సమయంలో చనిపోయిన ఆరుగురు ఖైదీలకు ఇది నివాళి అర్పిస్తుంది.
న్యూ బెల్ జైలు చూడటానికి ఎంత చీకటిగా, నిరాశగా కనిపించినా... సంగీతం అక్కడ ఉన్నవారికి "మంచి భవిష్యత్తును ఇచ్చే దీపం" లాంటిదని హప్పీ అంటారు.
ఇంతకుముందు వారిలో 'మా దారి మాదే. ప్రపంచంతో మాకేంటి' అనే వైఖరి ఉండేదని, కానీ ఇప్పుడు 'సమాజంలో తమకు కూడా ఒక గుర్తింపు, స్థానం ఉన్నాయి' అని వారు బలంగా నముతున్నట్లు హప్పీ చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























