గర్భంలో ఉండగానే శిశువుకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన వైద్యులు, 3 నెలల తర్వాత తల్లికి సుఖ ప్రసవం

థియేతో తల్లి మైసే సావెజ్, తండ్రి జోష్

ఫొటో సోర్స్, Maisie Savage

    • రచయిత, కామిల్లా హార్రోక్స్
    • హోదా, గ్లోబల్ హెల్త్ రిపోర్టర్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

తల్లి గర్భంలోనే ఉన్న శిశువుకు శస్త్రచికిత్స చేయడం ద్వారా పుట్టుకతో వచ్చే ఒక లోపాన్ని సరిచేయడంలో వైద్యులు అరుదైన విజయాన్ని సాధించారు.

లండన్‌కు చెందిన మైసీ సావేజ్ అనే మహిళ 26 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు అమెరికాలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేశారు.

ప్రస్తుతం ఐదు నెలల వయసున్న థియోకు గ్యాస్ట్రోస్కిసిస్ అనే పుట్టుకతో వచ్చే లోపం ఉంది. ఇందులో బొడ్డు సరిగా అభివృద్ధి చెందకపోవడంతో పేగులు పొత్తికడుపు వెలుపలికి వచ్చి ఉంటాయి.

వైద్యులు కీహోల్ సర్జరీ ద్వారా తల్లి గర్భాశయాన్ని పాక్షికంగా తెరిచి, బయటకు వచ్చిన పేగులను మెల్లగా తిరిగి బిడ్డ పొత్తికడుపులోకి చేర్చారు.

ఈ తరహా తొలి క్లినికల్ ట్రయల్ ద్వారా ప్రయోజనం పొందిన ప్రపంచంలోని మూడో శిశువు థియో.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
థియో అమ్మ పొట్టలో ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేశారు

ఫొటో సోర్స్, Maisie Savage

‘శిశువుకు సమస్య ఉందని తెలిసి భయపడ్డాం’

ఉపాధ్యాయ దంపతులైన 29 ఏళ్ల మైసీ, 36 ఏళ్ల జోష్ ఫ్రెంచ్, ఈ సర్జరీ విజయవంతం కావడంతో ఎంతో ఊరట పొందామని చెప్పారు.

"వాడో చిన్న అద్భుతం కదా" అని మైసీ బీబీసీ న్యూస్‌తో అన్నారు. అయితే పరిస్థితి మరోలా కూడా ఉండేదని ఆ దంపతులకు తెలుసు.

పుట్టుకతో వచ్చే ఈ తీవ్రమైన లోపం యూకేలో ప్రతి మూడు వేలమంది శిశువుల్లో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి శిశువులకు వారాల తరబడి ఐసీయూలో చికిత్స, ట్యూబ్ లేదా ఐవీ ద్వారా పోషకాహారం, అనంతరం లోపాన్ని సరిచేసే శస్త్రచికిత్స అవసరమవుతుంది.

థియోలాంటి సంక్లిష్ట కేసుల్లో అయితే నవజాత శిశువుల ఐసీయూలో ఆరు నెలల వరకు చికిత్స, అనేక శస్త్రచికిత్సలు, రెండేళ్ల వరకు ఐవీ ద్వారా పోషకాహారం, అవసరమైతే పేగుల మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావచ్చు. మంచి వైద్యం అందించినా ప్రతి పదిమంది శిశువుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోతారు.

ఇంకా పుట్టని తమ బిడ్డకు ఇలాంటి సమస్య ఉందనే విషయం తొలుత థియో తల్లిదండ్రులకు తెలియదు.

"20 వారాల స్కాన్‌కు వెళ్లేటప్పుడు మా బిడ్డను చూడబోతున్నామనే ఆనందమే మాలో ఉంది. అప్పటికి బిడ్డ అబ్బాయో, అమ్మాయో కూడా మాకు తెలియదు" అని జోష్ చెప్పారు.

థియోకు గ్యాస్ట్రోస్కిసిస్ ఉందని తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యామనీ, భయపడ్డామని ఆయన అన్నారు.

ఇంటికి చేరుకున్నాక తమ బిడ్డ థియోతో సాధారణ జీవితం గడుపుతున్న మైసీ దంపతులు
ఫొటో క్యాప్షన్, ఇంటికి చేరుకున్నాక తమ బిడ్డ థియోతో సాధారణ జీవితం గడుపుతున్న మైసీ దంపతులు

‘టెక్సస్‌కు వెళ్లమన్నారు’

మైసీ 24 వారాల గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డ పుట్టిన తర్వాత తొలి ఆరు నెలలు ఎలా ఉండొచ్చో లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి ప్రత్యేక వైద్యులు వారికి వివరించారు.

అయితే థియోకు మరింత సంక్లిష్టమైన గ్యాస్ట్రోస్కిసిస్ ఉన్నట్లు తేలడంతో, వారిని హ్యూస్టన్‌లోని టెక్సస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు పంపించారు.

అక్కడ డాక్టర్ మైఖేల్ బెల్‌ఫోర్ట్ నేతృత్వంలోని గర్భస్థ, శిశు శస్త్రచికిత్స నిపుణుల బృందం, పుట్టకముందే సంక్లిష్ట గ్యాస్ట్రోస్కిసిస్‌ను సరిచేసే తొలి క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది.

గతంలో వెన్నెముక లోపం (స్పైనా బిఫిడా) ఉన్న గర్భస్థ శిశువులకు గర్భంలోనే శస్త్రచికిత్స చేసిన టీమ్‌కు బెల్‌ఫోర్ట్ నాయకత్వం వహించారు.

వెంటనే టెక్సస్ వెళ్లి, కాన్పు వరకు అక్కడే ఉండాల్సి ఉంటుందని మైసీకి వైద్యులు చెప్పారు.

"అది చాలా పెద్ద నిర్ణయం" అని ఆమె అన్నారు.

ఈ క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ముందుగా ఆమె బెల్జియంలోని లూవెన్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు గర్భాశయం ద్వారా థియో పొత్తికడుపు గోడలోకి బోటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో కండరాలు సడలి, శస్త్రచికిత్స సులభమైంది.

ఆ తర్వాత ఈ కుటుంబం గత ఏడాది నవంబర్‌లో టెక్సాస్‌కు వెళ్లారు. మైసీ 26 వారాల గర్భంతో ఉన్న సమయంలో శస్త్రచికిత్స నిర్వహించారు.

సర్జరీ జరుగుతున్నంతసేపూ తీవ్ర ఆందోళనతో ఎదురుచూశానని జోష్ చెప్పారు.

"ఆ ఒక్క రోజే నాకు వారం రోజుల్లా అనిపించింది. ప్రతి దశలో ఏం జరుగుతోందో తెలియక ఎదురుచూడడం చాలా కష్టంగా అనిపించింది" అని ఆయన చెప్పారు.

ఆపరేషన్ చేసిన తీరు

ఫొటో సోర్స్, Texas Children’s Hospital

మైసీ గర్భాశయాన్ని శస్త్రచికిత్సకు అనువుగా పాక్షికంగా బయటకు తీశారు. గర్భాశయం, అందులోని శిశువు సరైన స్థితిలో ఉండేలా చేశారు. ఆపరేషన్ చేయడానికి తగినంత స్థలం కోసం గర్భాశయంలోని ఉమ్మనీటిని తొలగించి, కార్బన్‌ డై‌ఆక్సైడ్ నింపారు. ఆపై కీహోల్ సర్జరీ ద్వారా థియో పొత్తికడుపు బయటకు వచ్చిన అవయవాలను జాగ్రత్తగా లోపలికి నెట్టి, కుట్లు వేశారు.

దీనివల్ల మైసీకి సిజేరియన్ కాన్పు గాయం కంటే రెండింతల పెద్ద మచ్చ ఏర్పడింది. సిజేరియన్ కాన్పు తర్వాత కోలుకునే ఇతర మహిళలతో పోలిస్తే, ఈమె పరిస్థితి వేరు. ఆపరేషన్ అయ్యాక కూడా మరో 14 వారాల పాటు బిడ్డను కడుపులోనే మోయాల్సి వచ్చింది.

లోపల థియో కదులుతూ తన్నినప్పుడల్లా ఆ గాయానికి తగిలి విపరీతమైన నొప్పి పుట్టేదని మైసీ చెప్పారు. "ఆ రోజుల్లో నొప్పిని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించేది. కానీ ఆ కష్టం వృథా పోలేదు" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఈ అరుదైన శస్త్రచికిత్స సంపూర్ణంగా సఫలమైంది. గర్భధారణ కాలం పూర్తయ్యాక, ఫిబ్రవరిలో టెక్సస్‌లో మైసీకి సహజ ప్రసవమైంది.

శస్త్రచికిత్స ఫలితాలతో తాను అబ్బురపడ్డానని బెల్‌ఫోర్ట్ చెప్పారు

ఫొటో సోర్స్, Texas Children’s Hospital

ఫొటో క్యాప్షన్, శస్త్రచికిత్స ఫలితాలతో తాను అబ్బురపడ్డానని బెల్‌ఫోర్ట్ చెప్పారు

ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన టెక్సస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రసూతి,స్త్రీ వైద్యనిపుణుడు డాక్టర్ బెల్‌ఫోర్ట్ స్పందిస్తూ, ఫలితం పట్ల తమ బృందం ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పారు.

"తల్లీబిడ్డ ఆరోగ్యం నుంచి ఆపరేషన్ వరకు ప్రతిదీ అనుకున్నట్లే జరిగింది. శస్త్రచికిత్స సమయంలోగానీ, ఆ తర్వాతగానీ ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవడం నిజంగా విశేషం" అని ఆయన అన్నారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే, లండన్‌లోని జీఓఎస్‌హెచ్ పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్ పాలో డి కొప్పి బ్రిటన్‌లో కూడా ఈ శస్త్రచికిత్సను నిర్వహిస్తారు. పాలో డి కొప్పి లండన్‌లోని యూనివర్సిటీ కాలేజీలో స్టెమ్‌సెల్స్, పునరుత్పత్తి వైద్య విభాగానికి అధిపతి కూడా.

"త్వరలోనే ఈ చికిత్సను మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తెస్తామనే నమ్మకం ఉంది" అని ప్రొఫెసర్ చెప్పారు.

ఈ రెండు వైద్య సంస్థల భాగస్వామ్యంపై డాక్టర్ బెల్‌ఫోర్ట్ హర్షం వ్యక్తం చేశారు. టెక్సస్ చిల్డ్రన్స్, జీఓఎస్‌హెచ్ చేతులు కలిపితే ఎంతో బలమైన బృందంగా నిలుస్తాయని ఆయన అన్నారు.

ఇప్పటికే బెల్‌ఫోర్ట్ తదుపరి ప్రయోగాలపై దృష్టి సారించారు.

"గర్భాశయం లోపలి భాగం ఇప్పుడు కొత్త తరహా శస్త్రచికిత్సలకు అవకాశంగా మారింది. వెన్నెముక, పొత్తికడుపు లోపాలకు సంబంధించి మనం ఇప్పుడు ఆపరేషన్లు చేస్తున్నాం. భవిష్యత్తులో బిడ్డ కడుపులో ఉండగానే గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు కూడా చేయడం సాధ్యమవుతుందని నమ్ముతున్నా" అని వివరించారు.

లండన్‌కు తిరిగి వచ్చిన తరువాత థియో ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్నాడని మైసీ చెప్పారు.

"వైద్యులు చేసిన ఈ పని నా బిడ్డకు రాబోయే పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఇప్పుడు వాడు మిగతా పిల్లలలాగే ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు" అన్నారు మైసీ.

"మా కుటుంబానికి లభించిన గొప్ప వరమిది. లండన్ వైద్యుల నుండి డాక్టర్ బెల్‌ఫోర్డ్ టీమ్ వరకు ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఆ భయానక సమయంలో వారు అందించిన వైద్యం, చూపిన శ్రద్ధ మాలో ఆందోళన లేకుండా చేశాయి. ఈ చిన్నారి లేకపోతే మేం సంతోషంగా ఉండేవాళ్ళం కాదు'' అని థియో తండ్రి జోష్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)