హంగేరి: పిల్లలను కంటే రాయితీలు, లేదంటే భారీ జరిమానాలు, ఈ విధానం విజయవంతమైందా?

హంగేరీ, సంతానోత్పత్తి రేటు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్టెఫానీ హెగార్టీ, జోఫియా పౌలికోవిక్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

తూర్పు హంగేరిలోని డెబ్రెసెన్ నగరంలో ఒక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పార్కు బెంచీపై కూర్చుని ఉన్న బార్బరా ఎలెక్ ఆందోళనగా తన ఈమెయిల్‌ను చెక్ చేసుకుంటున్నారు.

పది రోజుల కిందట జరిగిన తన మూడో ఐవీఎఫ్ చికిత్స విజయవంతమై, తాను గర్భవతి అయ్యానో లేదో తెలుసుకోవడానికి ఎలెక్‌తోపాటు ఆమె భర్త లెవీ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

''ఈసారి కూడా ఐవీఎఫ్ సక్సెస్ కాకపోతే, నేను ఖచ్చితంగా కుంగిపోతాను'' అని బీబీసీ గ్లోబల్ ఉమన్‌ టీమ్‌తో బార్బరా అన్నారు.

బిడ్డను కనలేకపోతున్నాననే బాధ మాత్రమే ఆమె ఆందోళనకు కారణం కాదు. ఒకవేళ ఈసారి కూడా ఆమె గర్భం దాల్చకపోతే.. బార్బరా, లెవీ దంపతులు పెద్ద మొత్తం అప్పు తీర్చాల్సి ఉంటుంది.

అనేక యువ హంగేరియన్ జంటల్లానే సామాజిక కార్యకర్త అయిన 33 ఏళ్ల బార్బరా, చెఫ్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల లెవీ దంపతులు తాము ఇద్దరు పిల్లల్ని కంటామని వాగ్దానం చేయడంతో.. వేలాది డాలర్ల వడ్డీ రహిత రుణాలు, రాయితీలు పొందే అర్హత వారికి లభించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కానీ, సహజంగా గర్భం దాల్చలేమని ఈ జంట తెలుసుకున్నప్పుడు, పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. నవంబర్‌ నాటికి బిడ్డ పుడుతున్నట్లు వారు నిరూపించుకోలేకపోతే, ఈ రుణాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వారి ఆదాయంలో సగానికిపైగా వీటికే ఖర్చయి పోతుంది.

ఈ జంట ఇద్దరు పిల్లలను కంటామనే వాగ్దానంతో 25 వేల పౌండ్ల రుణాన్ని (రూ.31,27,100) తీసుకున్నారు. హంగేరీకి చెందిన గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం... పిల్లలు కలగపోతే వారు 3700 పౌండ్ల (రూ.4.50 లక్షలు పైన) నుంచి 8600 పౌండ్ల (రూ.10.75 లక్షలు) మధ్య వడ్డీ రూపంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, అంత మొత్తాన్ని చెల్లించే స్తోమత తమకు లేదని వారు చెబుతున్నారు. అలాగే, వారు ఇదే తరహా నిబంధనలతో కూడిన ఇంటి రుణ రాయితీని కూడా పొందారు.

గత 16 సంవత్సరాలలో.. మాజీ ప్రధాని విక్టర్ ఓర్బన్ ప్రభుత్వ హయాంలో హంగేరీ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన, సంతానోత్పత్తి రేటును పెంచే లక్ష్యంతో రూపొందించిన పథకాలను అమలు చేసింది.

దంపతులు తాము ఎంతమంది పిల్లలను కంటామని చెప్పే సంఖ్యను బట్టి మెరుగైన నిబంధనలతో కూడిన రుణాలను ఈ పథకంలో చేర్చారు. ముగ్గురు పిల్లలు పుట్టినట్లు ప్రకటించిన జంటలకు రుణాలను రద్దు చేశారు.

ఈ చర్యల కోసం హంగేరీ ప్రభుత్వం తన జీడీపీలో 4 నుంచి 5 శాతం మధ్యలో అంటే సుమారు 16 బిలియన్ డాలర్లను కేటాయించింది. నేటో తన సభ్య దేశాలకు రక్షణ కోసం ఖర్చు చేయాలని సిఫారసు చేసే మొత్తానికి ఇది సమానం.

హంగేరీ, సంతానోత్పత్తి రేటు

ప్రయోజనం పొందినవారూ ఉన్నారు

43 ఏళ్ల మాటే, 37 ఏళ్ల ఆగి గోరోండి దంపతులకు 10 ఏళ్ల లోపున్న పిల్లలు ఐదుగురు ఉన్నారు. వారు తమ ఇంటిని బాగు చేసుకోవడానికి, ఒక పెద్ద కారును కొనడానికి ప్రభుత్వం అందించే ఈ ఉదారమైన ప్రసూతి ప్రయోజనాలను, ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకున్నారు.

ఇండిపెండెంట్ బిజినెస్ డెవలపర్ అయిన మాటే, పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందుతున్నారు. ఇక ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కన్న ఆగి గోరోండి, ఒకవేళ మళ్లీ ఉద్యోగంలో చేరితే ఆమె ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

''ఈ ప్రయోజనాలు కుటుంబం పట్ల అనుకూల ధోరణిని కలిగించి, పిల్లలను కనాలనే మా నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని మేం భావిస్తున్నాం'' అని మాటే అన్నారు.

గణాంకాల ప్రకారం, హంగేరీలో 2010వ దశకంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల సంఖ్య పెరిగింది. 2020లో ఈ కుటుంబాల సంఖ్య 1,46,000తో గరిష్ఠ స్థాయికి చేరింది. 2024 నాటికి ఆ సంఖ్య 1,25,000కు తగ్గింది.

బుడాపెస్ట్ శివారులోని సంపన్న ప్రాంతమైన తన పట్టణంలో నలుగురు, ఐదుగురు పిల్లలున్న కుటుంబాల సంఖ్య బాగా పెరిగిందని మాటే కూడా చెప్పారు.

హంగేరీ, సంతానోత్పత్తి రేటు

జననాల రేటు తగ్గుతోంది

ఒకానొక సమయంలో హంగేరీలో సంతానోత్పత్తి రేటు బాగా పెరిగింది. 2010లో 1.25 ఉంటే.. 2020 నాటికి 1.59కి వచ్చింది. ఈ పెరుగుదలను కొందరు, ముఖ్యంగా కుటుంబాలకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉండాలని వాదించే అమెరికా కన్జర్వేటివ్స్ ఒక గొప్ప విజయంగా చూశారు.

అయితే, సంతానోత్పత్తి రేటు మళ్లీ పడిపోవడం ప్రారంభమైంది. 2025లో ఈ రేటు 1.31కి తగ్గింది.

''మిగతా చాలా ప్రొనాటలిస్ట్ అంటే జననాల రేటును పెంచే విధానాల లాగానే.. కొంతకాలం పాటు ఈ విధానాలు కూడా సమర్థవంతమైనవిగా పనిచేసినట్లు కనిపించాయి'' అని సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీలోని డెమోక్రసీ ఇన్‌స్టిట్యూట్ కో-డైరెక్టర్ ఈవా ఫోడర్ చెప్పారు.

''ఎలాగూ పిల్లలను కనాలనుకున్న వారు, ప్లాన్ చేసుకున్న దానికంటే కాస్త ముందుగా పిల్లల్ని కనేలా ఈ ప్రోత్సాహకాలు ప్రేరేపించాయి. అందుకే, ఒకట్రెండు సంవత్సరాల పాటు జననాల రేటు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తగ్గడం మొదలైంది'' అన్నారు.

రాజకీయ చర్చలలో కుటుంబాన్ని ఒక కేంద్రంగా ఉంచడం ఓర్బన్ సాధించిన గొప్ప విజయమని సంతానోత్పత్తి రేటు పడిపోవడంపై పలు పుస్తకాలను రచించిన అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో టిమోథీ పీ. కార్నీ చెప్పారు.

''ఆర్థిక ప్రోత్సాహకాల ప్రభావాన్ని ఎక్కువగా అంచనా వేయడమే ఈ సమస్యలో కొంత భాగం. ఓర్బన్ కొంత విజయం సాధించారు. కానీ, కుటుంబ విధానాలకు సంబంధించిన ఖర్చులను, ప్రమాదాలను కూడా ఆయన తెలియజేశారు'' అని తెలిపారు.

ఆర్థిక, సామాజిక విధానాలతో పడిపోతున్న తమ సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఏకైక దేశం హంగేరి మాత్రమే కాదు.

హంగేరీ, సంతానోత్పత్తి రేటు

అత్యంత కనిష్ఠానికి దక్షిణ కొరియా సంతానోత్పత్తి రేటు

దక్షిణ కొరియాలో సంతానోత్పత్తి రేటు 2008లో 1.19గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ రేట్లలో ఇదొకటి. అప్పటి నుంచి ఆ దేశం కూడా తన జనాభాను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా సుమారు 290 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది.

దక్షిణకొరియాలో బర్త్ బోనస్ పద్ధతి ఉంది. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులకు 27 వేల నుంచి 40 వేల అమెరికా డాలర్ల వరకు 'బర్త్ బోనస్' అందిస్తారు. ప్రతి చిన్నారికి అందించే నెలవారీ అలవెన్స్‌కి ఇది అదనం. వీటితో పాటు పిల్లల సంరక్షణ కేంద్రాల ఖర్చులకు సహాయపడే వోచర్లు కూడా వారికి లభిస్తాయి.

అయినా, దక్షిణ కొరియా మొత్తం సంతానోత్పత్తి రేటు మరింత పడిపోయి, 2025లో 0.8కి చేరింది.

మహమ్మారి తర్వాత చాలా దేశాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గింది. కేవలం ఆర్థిక కారణాలే కాకుండా ఇతర అంశాలు కూడా ఈ మార్పుకు కారణమని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.

అయితే, హంగేరీలో జననాల రేటు పెరగడం, తగ్గడం అక్కడి ప్రభుత్వ విధానాలతో జరగలేదని, యూరప్‌లో విస్తృతమైన ధోరణిని ఇది ప్రతిబింబిస్తుందని కొందరు వాదిస్తున్నారు.

ఉదాహరణకు.. చెక్ రిపబ్లిక్.. ఇలా పెద్ద స్థాయిలో జననాల రేటును పెంచే చర్యలను ప్రకటించనప్పటికీ.. అక్కడ కూడా ఇదే తరహాలో పెరగడం, తగ్గడం జరిగిందని చెప్పారు.

‘కనీస అవసరాలు తీర్చితే చాలు’

బార్బరా, లెవీ తొమ్మిదేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కలుసుకున్నప్పుడు... వారింకా ఇరవైల్లోనే ఉన్నారు. ఏడాది తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. వారు ఇద్దరు పిల్లలను కనాలను ముందుగానే నిర్ణయించుకున్నారు.

2020లో కాబోయే తల్లిదండ్రుల కోసం ఉద్దేశించిన 33 వేల డాలర్ల (రూ.31 లక్షల పైబడిన) రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సహజంగా గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు.. వారు నివసించే ప్రాంతానికి గంటన్నర దూరంలో ఉన్న ప్రభుత్వ రాయితీతో నడిచే ఐవీఎఫ్ క్లినిక్‌కు వారిని సిఫార్సు చేశారు.

ఒకవేళ తాను గర్భవతి కాకపోతే, తనపై విధించబోయే జరిమానాల నుంచి విముక్తి పొందడానికి .. తాను సంతానం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశానని బార్బరా నిరూపించాల్సి ఉంది.

దీనికోసం ఆమె నాలుగు సైకిల్స్‌లో చికిత్స తీసుకోవాలి. కానీ, ఇప్పటి వరకు ఆమె మూడుసార్లు ఈ చికిత్స తీసుకున్నారు. ఆమె మళ్లీ ఈ ప్రక్రియ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆమె చికిత్సకు వెళ్లడానికి ముందు రోజు రాత్రి పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. మెడికల్, ఫైనాన్సియల్ డాక్యుమెంట్లతో పలు ఫోల్డర్లను నింపేశారు. బిడ్డను కనడానికి ఆమె అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు ఇవన్నీ ఆధారాలు.

ఈ రుణాల్లో ఒకదాని కోసం దరఖాస్తు చేసుకున్న మరో యువతి యాంటోనియా మిస్కోల్జీ. తన విషయానికి వస్తే, ఈ రుణాలు ఎక్కువ మంది పిల్లలను కనేలా తనను ఏమాత్రం ప్రోత్సహించలేదని ఆమె స్పష్టం చేశారు.

తనకెంతమంది పిల్లలు కావాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేయకపోతేనే రుణాలను తాను అంగీకరించాలనేది ఆమె పెట్టుకున్న ముఖ్యమైన షరతు.

ఓర్బన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా దారుణంగా మారిందని బుడాపెస్ట్‌కు చెందిన 29 ఏళ్ల ఈ తల్లి చెబుతున్నారు. ప్రజా సేవలను మెరుగుపర్చేందుకు ప్రజా నిధులను వాడుంటే బాగుండేదని ఆమె అంటున్నారు.

''నా హస్పిటల్ బ్యాగులో ఏమి సర్దుకోవాలి'' అని కాబోయే తల్లుల వీడియోలను సోషల్ మీడియాలో చూశానని, వారినే సొంతంగా టాయిలెట్ పేపర్, డిజ్‌ఇన్ఫెక్టెంట్ కూడా తెచ్చుకోవాలని అడగడం చూసి తాను చాలా దిగ్భ్రాంతి చెందానని చెప్పారు.

''పెద్ద పెద్ద వాగ్దానాలు అవసరం లేదని అనుకుంటున్నా'' అన్నారు. ''కేవలం కనీస అవసరాలను తీర్చితే చాలు. పిల్లల్ని కనాలనే కోరిక పెరుగుతుంది'' అని చెప్పారు. యాంటోనియా చివరికి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు.

క్లినిక్‌లో తీవ్ర వేదనతో ఒక ఉదయమంతా గడిపిన తర్వాత.. బార్బరా, లెవీలకు ఒక విషాదకరమైన వార్త తెలిసింది. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ (పిండం బదిలీ చేసే ప్రక్రియ) విఫలమైంది. దీనర్థం కేవలం పిల్లలు కలగరనే కాదు... వారు తిరిగి చెల్లించే నెలవారీ చెల్లింపులు ఏకంగా నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది.

హంగేరీ, సంతానోత్పత్తి రేటు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ప్రోత్సాహకాలను కొనసాగించాలా? వద్దా?

ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది బార్బారా లెవీ దంపతులు ఒక్కరే కాదు. 2019 నుంచి 2021 మధ్య రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఐదు జంటల్లో ఒక జంట అంటే 25 వేల మంది జంటలకు పిల్లలు కలగనందున.. వారు ఈ సంవత్సరం జరిమానా వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని హంగేరి జాతీయ బ్యాంకు అంచనా వేస్తోంది.

ఏప్రిల్‌లో అధికారంలోకి వచ్చిన కొత్త హంగేరియన్ ప్రభుత్వం.. పిల్లలను కనాలనుకునే దంపతులకు తుది గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, తాము ఆశించిన విధంగా పిల్లల్ని కనలేకపోతున్న జంటల కోసం పరిష్కారాలు కూడా చూస్తామని చెప్పింది.

ప్రోత్సాహకాలను కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం ప్రభుత్వానికి క్లిష్టంగా మారుతుంది ఈ విధానాలు ప్రజాదరణ పొందాయి.

ఒకవేళ వీటిని తొలగిస్తే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని యాంటోనియా అన్నారు. ఎందుకంటే, ఇప్పటికే చాలామంది ఆ విధానాల ఆధారంగానే పిల్లల్ని కనడానికి ప్రణాళికలు వేసుకున్నారు.

హంగేరీలో కుటుంబాలకు అనుకూలమైన విధానాలు భవిష్యత్‌లో అనిశ్చితి పరిస్థితిలో పడొచ్చు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)