భారత్‌లో షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్.. బంగ్లాదేశ్‌లో ఆగ్రహం

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP via Getty Images
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్‌లో నేరుగా మీడియాతో మాట్లాడేందుకు అనుమతించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
"ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా షేక్ హసీనా, ఆమె సహచరులు బంగ్లాదేశ్‌ను, దేశ ప్రజలను అపహాస్యం చేశారు" అని పేర్కొంది.
ఈ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్సులో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కూడా కనిపించడంతో బుధవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి జరిగినట్లు చెబుతున్నారు.
"బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ నివాసంపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్, గౌరవనీయ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనాతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొన్న కొద్ది గంటలకే ఈ దాడి జరిగింది" అని బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
"ప్రెస్ కాన్ఫరెన్సుకు ముందే, ఈ సమావేశానికి సంబంధించిన వార్తలను ప్రచురిస్తే న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కేసులు నమోదు చేస్తామని బీఎన్‌పీ, ఇస్లామీ జమాత్, ఎన్‌సీపీలు జాతీయ మీడియా సంస్థలను బహిరంగంగా హెచ్చరించాయి" అని అవామీ లీగ్ పేర్కొంది.

ప్రజాస్వామ్య స్థాపన పేరుతో తమ పార్టీ కార్యకర్తలపై సాగుతున్న జినోసైడ్ తరహా వరుస దాడులకు ఇదొక ఉదాహరణగా చెప్పింది, దీనిని ఫాసిజంగా అవామీ లీగ్ అభివర్ణించింది.
అమానవీయ నేరాలకు పాల్పడ్డారనే కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలోని న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2024 ఆగస్టు 5న పదవీచ్యుతురాలు అయినప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు.
అయితే, వర్చువల్‌గా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్సులో జర్నలిస్టుల ప్రశ్నలకు ఆమె నేరుగా సమాధానాలు ఇవ్వడం గత రెండేళ్ల కాలంలో ఇదే మొదటిసారి.

బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం
ఈ ప్రెస్ కాన్ఫరెన్సుకి సంబంధించి, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది.
"ఈ కార్యక్రమం బంగ్లాదేశ్ - భారత్ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ, ఇలాంటి బహిరంగ కార్యక్రమానికి అనుమతించడంపై ఢాకా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది" అని తెలిపింది.
దిల్లీలో బుధవారం సాయంత్రం, ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏసియా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో షేక్ హసీనా వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఆమె తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. డిసెంబర్ నాటికి తిరిగి వస్తానని చెప్పినప్పటికీ, కచ్చితమైన తేదీ ప్రకటించలేదు.
అనంతరం కొద్దిసేపటికే, రాత్రి 11 గంటలకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్ ద్వారా ఒక ప్రకటన చేసింది.
"దేశ ప్రజలు జులై రివల్యూషన్ రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజున భారత గడ్డపై షేక్ హసీనా మీడియా సమావేశం జరిగింది. ఇది బంగ్లాదేశ్ సార్వభౌమాధికారంపై దాడి, జులై విప్లవ వీరులను అవమానించడమే" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
"జులై విప్లవ స్ఫూర్తిని నింపుకున్న ఈ దేశ ప్రజలు, మన దేశం మళ్లీ ఆ నాటి ఫాసిజం చీకటి రోజులకు ఎప్పటికీ తిరిగి వెళ్లదని, బంగ్లాదేశ్ ఎవరికీ విధేయంగా ఉండే లేదా ప్రొటెక్టెడ్ స్టేట్‌గా మారదనే ప్రగాఢ నిశ్చయంతో ఉన్నారు. నరమేధానికి పాల్పడిన నేరస్థురాలు హసీనా, ఆమె మాఫియా ముఠాకు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇకపై ఎప్పటికీ చోటు ఉండదు."
ఇంకా ఆ ప్రకటనలో, "సార్వభౌమత్వ సమానత్వం, పరస్పర గౌరవం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడం, జాతీయ గౌరవాన్ని నిలబెట్టుకోవడం అనే సూత్రాల ఆధారంగా.. భారత్‌తో నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలను కొనసాగించాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది" అని పేర్కొంది.
షేక్ హసీనా అప్పగింతపై కూడా ఆ ప్రకటనలో నిరాశపూరిత వైఖరిని వ్యక్తం చేసింది.
"బంగ్లాదేశ్, భారత్ మధ్య 2013లో కుదిరిన అప్పగింత ఒప్పందం ప్రకారం, దోషిగా న్యాయస్థానం శిక్ష విధించిన నేరస్థురాలు హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ పలుమార్లు చేసిన అభ్యర్థనలకు భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడం దురదృష్టకరం" అని రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ వైఖరేంటి?
షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్‌పై భారత్ వైఖరి ఏమిటని మంగళవారం ఉదయం విదేశాంగ శాఖ ప్రతినిధిని జర్నలిస్టులు ప్రశ్నించారు. ఈ కాన్పరెన్సుపై అప్పటికే బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది.
అందుకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బదులిస్తూ, "ఒక ప్రైవేట్ సంస్థ ఆ కార్యక్రమం నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వానికి దానితో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమావేశంలో చేసే ప్రకటనలు, లేదా అభిప్రాయాలతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు" అన్నారు.
దీనికి ఒక రోజు ముందు, భారత హైకమిషనర్ దినేశ్ త్రివేదితో మాట్లాడిన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి విదేశాంగ సలహాదారు హుమాయూన్ కబీర్.. భారత్ సహకారం కోరారు.
"పదవీచ్యుతురాలైన ప్రధాన మంత్రి షేక్ హసీనాతో సహా నిషేధిత అవామీ లీగ్‌తో సంబంధమున్న ఎవరైనా భారత గడ్డపై నుంచి రాజకీయ ప్రకటనలు, లేదా బంగ్లాదేశ్‌లో అశాంతిని సృష్టించే ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా భారత్ సహకరించాలని బంగ్లాదేశ్ ఆశిస్తోంది" అని అన్నారు.
"మరణశిక్ష పడిన మాజీ ప్రధాని షేక్ హసీనా దిల్లీ నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటనలు లేదా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదు" అన్నారు.

ఫొటో సోర్స్, ANI
హసీనా వార్తలపై బంగ్లాదేశ్‌లో నిషేధం
బీబీసీ బంగ్లా కథనం ప్రకారం.. అవామీ లీగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రకటన అనంతరం.. న్యాయస్థానం విధించిన నిషేధాన్ని ఎత్తిచూపుతూ వారి ప్రకటనలను ప్రచురించొద్దని మీడియాను బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి సమాచార, ప్రసార సలహాదారు డాక్టర్ జాహిద్ ఉర్ రెహ్మాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ, "షేక్ హసీనా చేసే ద్వేషపూరిత ప్రకటనల ప్రచారాన్ని ట్రిబ్యునల్ నిషేధించింది. ఈ నిషేధం మీడియాతో పాటు సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుంది" అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























