మియన్మార్: సైనిక పాలనను వ్యతిరేకించిన లక్షలాదిమంది ‘విప్లవ కల’ కరిగిపోయిందా?

ఫొటో సోర్స్, BBC/ Lulu Luo
- రచయిత, జోనాథన్ హెడ్,
- హోదా, ఆగ్నేయాసియా కరస్పాడెంట్
- నుంచి, థాయ్‌లాండ్
- రచయిత, లూలు ల్యూ
- హోదా, అగ్నేయాసియా ప్రొడ్యూసర్
- నుంచి, మే సాట్
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
''ఏదో ఒకరోజు మా స్వాతంత్య్రాన్ని మేం తిరిగి పొందుతాం''
ఆ 22 ఏళ్ల యువకుడు తన జీవితంలో ఎక్కువభాగం స్వేచ్ఛ కోసమే పోరాడారు. కానీ మియన్మార్‌లో ఐదేళ్ల అంతర్యుద్ధం తరువాత ఇప్పుడతను ఇక ఈ యుద్ధం, రాజకీయ పోరాటాలతో విసిగిపోయారు.
''మా ప్రజలకు నేనెంత సాయపడగలనో అంతా చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాను.''
థాయ్ సరిహద్దులోని పట్టణమైన మే సాట్‌లో ఆశ్రయం కోరుతూ మియన్మార్ నుంచి పెద్దఎత్తున వలసపోతున్న వారిలో ఈ యువకుడు కూడా ఒకరు.
కొత్తగా వచ్చినవారికి సాయపడేందుకు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన రక్షణాత్మక ఆశ్రయాల (సేఫ్ హౌసెస్) సమూహంలో భాగమైన ఓ చిన్న చీకటి గది నుంచి ఆయన బీబీసీతో మాట్లాడారు.

సేఫ్ హౌసెస్‌లో ఉన్న చాలామంది వద్ద ఒంటిపైన బట్టలు తప్ప మరేమీ లేవు. వాళ్లు తీవ్రంగా అలసిపోయారు, మియన్మార్‌లోని తమ అనుభవాలతో భయకంపితులయ్యారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. థాయ్‌లాండ్‌లో ఎలాంటి చట్టబద్ధ హోదా లేకపోవడంతో ఇప్పడీ చిన్నపాటి ఆశ్రయాలే వారికి ఏకైక దిక్కు.
మియన్మార్‌లో 2021లో సైనిక కుట్రకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాలలో తన 17 ఏళ్ల వయసులో ఈ యువకుడు కూడా పాల్గొన్నారు.
అయితే ఈ ఆందోళనలను సైన్యం అణిచివేయడంతో, అనేకమంది యువకుల్లానే సాయుధ తిరుగుబాటుదారుల నియంత్రణలోని ప్రాంతంలో మిలటరీ శిక్షణ తీసుకోవడానికి వెళ్లారు.

ఫొటో సోర్స్, BBC/ Lulu Luo
కల కరిగిపోతోంది
పోలీసు స్టేషన్ల వంటి లక్ష్యాల బయట బాంబులు అమర్చే అర్బన్ గెరిల్లా దళంలో భాగంగా ఆయన యాంగాన్‌కు తిరిగి వచ్చారు. ''మా స్వాతంత్య్రాన్ని తిరిగి సాధించడానికి శాంతియుత నిరసనలు సరైన మార్గం కాదని అప్పట్లో అనుకునేవాడిని.''
కానీ ఆయన త్వరలోనే పట్టుబడి ఏడేళ్ల జైలు శిక్షకు గురయ్యారు. ఖైదీలను క్రూరంగా హింసిస్తారనే పేరున్న ఇన్సెన్ జైలుకు ఆయనను తరలించారు.
కిందటేడాది ఆయన విడుదలయ్యారు. కానీ యాంగాన్‌లోని తన ఇంట్లోని కుటుంబ సభ్యులపై పోలీసులు తీవ్ర నిఘా పెట్టడంతో ఆయన మే సాట్‌కు పారిపోయారు. తన కుటుంబ సభ్యుల భద్రత కోసమే ఆయన తన పేరును వెల్లడించడానికి ఇష్టపడటం లేదు.
సైనిక పాలనను ఎదిరిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఇళ్లను వదిలివచ్చిన మిలియన్ల మంది బర్మీస్ ప్రజలకు ఇవి తీవ్ర నిరాశ కలిగించే రోజులు.
మియన్మార్‌ను మరింత ప్రజాస్వామ్యబద్ధ, సమగ్రమైన దేశంగా పునర్నిర్మించాలని, రాజకీయాల నుంచి సాయుధ బలగాలను పూర్తిగా తొలగించాలని వారు ఒక విప్లవాన్ని కలలు కన్నారు.
కానీ దానికి భిన్నంగా, ఈ అంతర్యుద్ధానికి కారకుడని తాము భావిస్తున్న వ్యక్తి, అధికారంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడాన్ని వారు చూడాల్సి వస్తోంది.
గత నెలలో చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ మియన్మార్ సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌కు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. రక్తపాతానికి బాధ్యుడైన సైనిక నియంత అనే పేరు నుంచి పొరుగు దేశాలు క్రమంగా అంగీకరిస్తున్న పౌర అధ్యక్షుడిగా చూపించేందుకు చైనా, మియన్మార్ చేస్తున్న ఉమ్మడి ప్రయత్నంలో ఇదో కీలకఘట్ఠంగా నిలచింది.

ఫొటో సోర్స్, BBC/ Lulu Luo
చైనా మద్దతు
ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో 2021లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఈ పాలకుడు, తన సైనిక కుట్ర వల్ల కలిగిన వినాశకర పరిణామాల నుంచి కోలుకోవడానికి చైనా అందించిన దౌత్య, సైనిక మద్దతు అత్యంత కీలకమైనదిగా మారింది.
గత ఏడాది కాలంలో, సైనిక కుట్రను నిరోధించేందుకు ఏర్పాటైన వందలాది తిరుగుబాటు బృందాలకు కోల్పోయిన భూభాగంలో చాలా భాగం సైనిక జుంటా తిరిగి వశం చేసుకుంది.
ప్రధాన ప్రతిపక్ష బృందాలను మినహాయించి, ఈ ఏడాది ఆరంభంలో నాటకీయంగా నిర్వహించిన ఎన్నికలు, ఇప్పుడు మిన్ ఆంగ్ హ్లైంగ్‌ను ఒక చట్టబద్ధమైన, ప్రజలు ఎన్నుకున్ననాయకుడిగా తనను తాను ప్రదర్శించుకోవడానికి దోహదపడ్డాయి.
అయితే, ఒక భిన్నమైన భవిష్యత్తును ఆశించిన వారి పరిస్థితి ఇప్పుడు ఏమిటి? చాలామంది మే సాట్‌లోనే చిక్కుకుపోయారు.
ఈ పట్టణం మియన్మార్, థాయ్‌లాండ్‌ల మధ్య వ్యాపారానికి ప్రధాన ద్వారంగా ఉంది. అలాగే ఇక్కడ ఎప్పుడూ భారీ సంఖ్యలో బర్మీస్ జనాభా నివసిస్తుంటుంది. సైనిక కుట్ర తర్వాత శరణార్థుల రాకతో ఈ సంఖ్య మరింత పెరిగింది. కానీ వారు బయట కనిపించడం చాలా అరుదు.
చాలామంది వద్ద సరైన పత్రాలు లేవు. సరిహద్దుగా ఉన్న ఇరుకైన మోయ్ నదిని దాటి వారు అధికారిక అనుమతులు లేకుండా ఇక్కడికి వచ్చారు. థాయ్ పోలీసుల చేతిలో అరెస్టు అవుతామనే, లేదా తిరిగి తమ దేశానికి పంపించివేస్తారనే తీవ్ర భయంతో జీవిస్తున్నారు.
మియన్మార్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులపై పగ తీర్చుకుంటారనే భయం కూడా వారిని వెంటాడుతోంది. మూడేళ్ల క్రితం ప్రతిపక్షంలోకి మారిన ఒక పూర్వపు ఆర్మీ ఆఫీసర్ బీబీసీతో మాట్లాడుతూ, తాను మే సాట్‌లో అద్దెకు ఉంటున్న గది నుంచి బయటకు రావడానికి నెలకు రెండుసార్లు మాత్రమే సాహసిస్తున్నానని చెప్పారు.
ఇప్పుడే కొత్తగా వచ్చిన వారికి సేఫ్ హౌసెస్ సాధారణంగా గరిష్టంగా ఆరు నెలల పాటు తాత్కాలిక నివాసాన్ని కల్పిస్తాయి. పట్టణంలోని చిన్న సందుల చివర దాగి ఉన్న ఈ ఇళ్లు, ప్రాథమిక సదుపాయాలు మాత్రమే ఉన్న చిన్న చిన్న గదుల సముదాయాలు.
అక్కడి ప్రతి తలుపు వెనుక ఒక తీవ్ర విషాద వ్యక్తిగత కథ దాగి ఉంది.

ఫొటో సోర్స్, BBC/ Lulu Luo
‘సాయుధ పోరుపై ఆలోచన మారింది’
ఇన్‌సెయిన్ జైలులో శిక్ష అనుభవించిన ఓ యువ గెరిల్లా... అక్కడ జైలు సిబ్బంది చేసే చిత్రహింసలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయని చెప్పారు. అదే జైలులో ఉన్న సమయంలోనే సాయుధ పోరాటంపై తన ఆలోచన కూడా మారిందని తెలిపారు.
"విప్లవం మరింత మెరుగ్గా ఉంటుందని ఆశించాను. కానీ తిరుగుబాటు గ్రూపులు ఏమాత్రం ఐక్యంగా లేవు. అవి ఒకదానితో ఒకటి పోరాడుకున్నాయి. ఆ పరిస్థితి నాకు నచ్చలేదు. యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూశాను. అలాంటి దృశ్యాలను ఇక భరించలేకపోయాను" అని ఆయన చెప్పారు.
కుటుంబంలో పెద్ద కొడుకుగా తన ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాన్ని వదిలేయలేనని కూడా భావించినట్లు చెప్పారు.
"అందుకే సాయుధ పోరాటాన్ని విరమించుకున్నాను. అంతేకాదు, రాజకీయాలతో సహా ఎలాంటి ఉద్యమాల్లోనూ ఇక పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. నా ప్రజలకు మరో విధంగా సహాయం చేయాలనుకుంటున్నా" అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఆయన సేఫ్ హౌస్‌లోని పిల్లలకు బోధన, ఇంకా జైల్లోనే ఉన్న తన స్నేహితులకు తన వంతు సాయం చేయడానికే అంకితమయ్యారు.
"విప్లవం ఇంకా ముగియలేదని, గెలిచే అవకాశం మనకు ఇంకా ఉందని వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను" అని ఆయన అన్నారు.
మేము ఆ సేఫ్ హౌస్‌కు వెళ్లడంతో అక్కడి ఇతర నివాసితులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒకో ప్రత్యేక కథ ఉంది.
సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ సభ్యులు అక్కడ ఉన్నారు. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన ఓ నాయకుడు కూడా ఉన్నారు. బలవంతపు సైనిక నియామకం నుంచి తప్పించుకునేందుకు వచ్చిన పలువురు యువకులు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారు.
వారందరి మాటల్లో ఒకే భావం వినిపించింది. విప్లవంపై తమకు ఇప్పటికీ నమ్మకం ఉందని వారు చెబుతున్నారు. కానీ ఐదేళ్లుగా కొనసాగుతున్న పోరాటంతో తీవ్రంగా అలసిపోయామని, ఇప్పుడు కుటుంబాలను పోషించేందుకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వారి దృష్టిలో థాయ్‌లాండ్‌లోని మే సాట్ పట్టణమే ఇప్పుడు మిగిలిన ఏకైక ఆశ్రయం.

ఫొటో సోర్స్, BBC/ Lulu Luo
‘సైన్యం నుంచి తప్పించుకోవడానికి వెయ్యిమైళ్లు ప్రయాణించాం’
అక్కడే యిన్ యిన్ ఆంగ్ అనే 20 ఏళ్ల యువతి కూడా కనిపించారు. ఆమెతో పాటు ఆమె భర్త, చిన్న కుమారుడు ఉన్నారు.
వీరు మియన్మార్‌లోని సాగైంగ్ ప్రాంతం నుంచి దాదాపు వెయ్యి మైళ్ల దూరం ప్రయాణించి థాయ్‌లాండ్‌లోని మే సాట్ పట్టణానికి చేరుకున్నారు. సైనిక తిరుగుబాటుకు అత్యంత తీవ్రంగా ప్రతిఘటించిన ప్రాంతాల్లో సాగైంగ్ ఒకటి. దానికి ప్రతీకారంగా అక్కడ సైన్యం నిరంతర తీవ్ర వైమానిక దాడులు చేసింది.
యిన్ యిన్ నివసించిన హెట్మర్ గ్రామం... ఒకవైపు సైనిక స్థావరం, మరోవైపు తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతం మధ్య నలిగిపోయింది.
రెండేళ్ల క్రితం ఒకరోజు సైనికులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరుపుతూ, గ్రామస్థులను తన కళ్లెదుటే పరుగులు తీయించిన ఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు.
"ఫోన్ సిగ్నల్ ఒక్కసారిగా నిలిచిపోయినప్పుడు ఏదో జరగనుందని మాకు అర్థమైంది. మూడు సార్లు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. 'సైన్యం వస్తోంది' అంటూ ప్రజలు ఇళ్ల మధ్య నుంచి పరుగులు తీస్తూ అరుస్తున్నారు. మేం ఎక్కువ సామాను తీసుకెళ్లలేకపోయాం. తినడానికి ఏదైనా ఉండాలనే ఉద్దేశంతో మా నాన్న ఒక బస్తా బియ్యం మాత్రమే తీసుకున్నారు. అక్కడి నుంచి అడవులు, కొండల మధ్యలోని ఓ ప్రాంతానికి చేరుకునే వరకు పరిగెత్తుకుంటూ వెళ్లాం" అని ఆమె చెప్పారు.
అక్కడ ఎలాంటి సౌకర్యాలూ లేవని యిన్ యిన్ చెప్పారు. తాగడానికి, స్నానం చేయడానికి, మరుగుదొడ్డిగా ఉపయోగించడానికి... అన్నింటికీ నది నీరే ఆధారమైంది. దీంతో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ వారు ఆ అడవిలో ఆరు నెలలు గడపాల్సి వచ్చింది.
ఒక నెల తర్వాత సైనికులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటికే గ్రామాన్ని పూర్తిగా దోచుకున్నారని, ఇళ్ల చుట్టూ ల్యాండ్‌మైన్‌లను కూడా పాతిపెట్టారని యిన్ యిన్ చెప్పారు.
దాంతో తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు.
అదే సమయంలో యిన్ యిన్ తన కుమారుడికి జన్మనిచ్చారు. అయితే అతనికి హెర్నియా ఉండటంతో శస్త్రచికిత్స అవసరమైంది.
కొన్ని వారాల పాటు ప్రయాణిస్తూ ఆ కుటుంబం దక్షిణ, తూర్పు దిశగా సాగి, ఆరు నెలల క్రితం మే సాట్‌కు చేరుకుంది.
అక్కడ ఇది వారు ఆశ్రయం పొందుతున్న రెండో సేఫ్ హౌస్. మొదటి సేఫ్ హౌస్‌లో అనుమతించిన గరిష్ఠ కాలం పూర్తవడంతో అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది.
ప్రస్తుతం అద్దె గది తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకుంటున్నారు. అలా చేయడం ద్వారా తమ కుమారుడి శస్త్రచికిత్స కోసం కొంత డబ్బు కూడబెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/ Jonathan Head
‘తిరిగి యుద్ధంలోకి వెళ్లాలనుంది’
సైనికుల విజయాలను చూసి అందరూ ధైర్యం కోల్పోవడం లేదు.
సేఫ్‌హౌస్‌లో మేం బార్‌టెండర్ నుంచి తిరుగుబాటు దారుడిగా మారిన మరో వ్యక్తిని, ఆయన భార్యను, వారి రెండు నెలల చిన్నారిని కలిశాం.
యుద్ధంతో దెబ్బతిన్న కరెన్ ప్రాంతాన్ని వారు విడిచిపెట్టారు. అక్కడ కోబ్రా కాలమ్‌లో ఆయన సభ్యుడు. ఈ సంస్థకు శక్తిమంతమైన పోరాట దళాలు ఉన్నాయి. కానీ వీరు తమ బిడ్డ కోసం మే సాట్‌కు వచ్చారు.
కానీ ఆయన ఎప్పుడెప్పుడు తిరిగి యుద్ధంలోకి వెళదామా అని ఆతృతగా ఉన్నారు.
‘‘మేం చేస్తున్న ఈ పోరాటం ఏదో ఒకరోజు విజయం సాధిస్తుంది. ఎందుకంటే వారు (మిలటరీ) దేశం మొత్తానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. ఏ పౌరులనైతే కాపాడి, మద్దతుగా నిలవాలో వారిపైనే వారు పోరాటం చేస్తున్నారు. వాళ్లు గెలవడానికి అవకాశమే లేదు’’ అని చెప్పారు.
కోబ్రా కాలమ్... కరెన్ నేషనల్ యూనియన్ (కేఎన్‌యూ)తో కలిసి పోరాడుతోంది. తగినంత ఆయుధ సామగ్రి ఉన్న ఈ సంస్థ దాదాపు 80 ఏళ్లుగా మియన్మార్ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తోంది. అక్కడి యోధుల్లో ఇప్పటికీ పోరాట స్ఫూర్తి బలంగానే ఉంది.
అయితే ఇతర పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనా ఒత్తిడి కారణంగా వాటికి అందుతున్న ఆయుధాలు, సాంకేతిక పరికరాల సరఫరా తగ్గిపోయింది. మరోవైపు మియన్మార్ సైన్యానికి మాత్రం రష్యా, చైనా నుంచి శిక్షణతో పాటు కొత్త ఆయుధ సామగ్రి అందుతోంది.
లూయిస్ (అసలు పేరు కాదు) యాంగూన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. సైనిక తిరుగుబాటు తర్వాత కరెన్ రాష్ట్రంలోని తిరుగుబాటుదారులతో కలిసి పోరాడేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.
"అప్పటికే నాకు నలభై ఏళ్లు దాటిపోయాయి. అయినప్పటికీ పౌరుడిగా అది నా బాధ్యత అని భావించాను. ఇప్పుడు పోరాటంలో చేరకపోతే జీవితాంతం పశ్చాత్తాపంతో మిగిలి పోతాననిపించింది" అని ఆయన చెప్పారు.
లూయిస్ కూడా సైనిక ప్రభుత్వం చేతికి చిక్కి జైలుపాలయ్యారు. అయితే తాను సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఏర్పడిన శాసనోల్లంఘన ఉద్యమంలో సభ్యుడిని కాదని, కరెన్ జాతికి చెందిన యోధుడినని సైనికులను నమ్మించగలిగారు.
దాంతో కనీసం ఆయనపై కొంత తక్కువ కఠినంగా వ్యవహరించారు.
అయితే గత ఏడాది జైలు నుంచి విడుదలైన తర్వాత... విప్లవం కంటే తన కుటుంబ అవసరాలే ఇప్పుడు ఎక్కువ ముఖ్యమని ఆయన నిర్ణయించుకున్నారు.
"మొదటి రెండు, మూడు సంవత్సరాలు మాలో పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువగా ఉండేది. లక్ష్యంపై గట్టి నమ్మకంతో ముందుకు సాగాం. కానీ యుద్ధం ఇంతకాలం కొనసాగుతుండటంతో, జీవితంలోని ఇతర బాధ్యతలను ఇక నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాలేదు. నా పిల్లలు పెద్దవుతున్నారు. వారికి మంచి చదువు, మెరుగైన జీవితం అవసరం. నాతో పాటు చాలా మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ ఒత్తిడే మా ఆలోచనలను మార్చేసింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/ Lulu Luo
‘ఎప్పటికైనా వారికి ఓటమే’
మియన్మార్ అంతర్యుద్ధంలో పోరాడేందుకు నియమితులవుతున్న వారిలో 13 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలను తిరుగుబాటు గ్రూపుల నుంచి బయటకు తీసుకొచ్చి, థాయ్‌లాండ్‌లోని మే సాట్‌లో ఉన్న ఓ పాత ఇంటిని ఆశ్రయ కేంద్రంగా మార్చి అక్కడ వారికి పనిలో శిక్షణ, జీవన నైపుణ్యాలు నేర్పడానికి ఓ సామాజిక కార్యకర్త తన జీవితాన్ని అంకితం చేశారు.
అయితే సాధారణ జీవితానికి అలవాటుపడటం వారికి అంత సులభం కాదు. ముఖ్యంగా చిన్న వయసులోనే పోరాటంలో చేరిన బాలురు సైనిక జీవితానికే అలవాటు పడిపోయారు. వారి కుటుంబ సభ్యుల్లో చాలామంది ఇప్పటికీ సరిహద్దు ఆవల పోరాడుతూనే ఉన్నారు. తామూ వారితో ఉండటం తమ బాధ్యతగా భావిస్తున్నారు.
"కొన్నిసార్లు విప్లవం గురించి ఆలోచిస్తే నిరాశ కలుగుతుంది. తిరుగుబాటుకు ముందు ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్న గ్రామాలు... ఇప్పుడు ఒకటి సైన్యానికి, మరొకటి ప్రతిఘటనకు మద్దతు ఇవ్వడంతో శత్రువులుగా మారిపోయాయి" అని ఆమె అన్నారు.
ఇప్పుడు పోరాట వ్యూహాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని ఆమె అభిప్రాయపడుతున్నారు.
"ఈ విప్లవం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని భావించి సిద్ధమవ్వాలి. కేవలం ఆయుధాలతోనే కాదు... విద్య, ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలి. ప్రస్తుతం శరణార్థుల శిబిరాల్లో ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారు. వారి కోసం మనం ఏం చేయాలన్నదీ ఆలోచించాలి" అని ఆమె అన్నారు.
ఇదిలా ఉండగా, తన కుమారుడికి శస్త్రచికిత్స చేయాలంటే ముందుగా 38 వేల థాయ్ బాట్‌లు డిపాజిట్‌గా చెల్లించాలని మే సాట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి చెప్పిందని యిన్ యిన్ ఆంగ్ తెలిపారు. ఆమెకు, ఆమె భర్తకు అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం దాదాపు అసాధ్యమే.
అధికారిక హోదా లేకపోవడంతో వారికి థాయ్‌లాండ్ ప్రభుత్వ ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు.
అవకాశముంటే తిరిగి తమ గ్రామానికే వెళ్లాలని యిన్ యిన్ కోరుకుంటున్నారు. కానీ మిన్ ఆంగ్ హ్లైంగ్ అధికారంలో ఉన్నంతకాలం తాము థాయ్‌లాండ్‌లోనే ఉండక తప్పదని ఆమె చెబుతున్నారు.
"ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఆయనే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేం తిరిగి అక్కడికి వెళ్లి జీవించగలమా అంటే... అస్సలు కాదు. నిజానికి అవకాశం ఉంటే నా తల్లిదండ్రులను కూడా ఇక్కడికే తీసుకురావాలనుకుంటాను" అని ఆమె అన్నారు.
మరోవైపు, సైనిక దుస్తులు వదిలేసినప్పటికీ, ప్రతిపక్షంపై తన యుద్ధాన్ని మిన్ ఆంగ్ హ్లైంగ్ మాత్రం ఆపడం లేదు.
గత ఏడాది ఆగస్టులో ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ ఏడాది జనవరి చివర్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కనీసం 702 మంది పౌరులు మరణించారని గత నెల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. వీరిలో అత్యధికులు వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
వందలాది సాయుధ గ్రూపులుగా విడిపోయి, ఆయుధాల కొరతతో పోరాడుతున్న ప్రతిఘటన దళాలు ఇటీవల కొంత వెనుకబడినా... ఇప్పటికీ దేశంలోని విస్తారమైన ప్రాంతాలు వాటి ఆధీనంలోనే ఉన్నాయి.
అయితే మియన్మార్ పొరుగు దేశాలు దౌత్యపరంగా జరిపిన ప్రయత్నాల వల్ల ఇప్పటివరకు సైనిక ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి గణనీయమైన మార్పు రాలేదు.
దీంతో మే సాట్‌లో ఆశ్రయం పొందిన వారితో పాటు లక్షలాది మంది మియన్మార్ యుద్ధ శరణార్థులు ఎటూ తేలని దయనీయ స్థితిలో చిక్కుకుపోయారు.
ప్రస్తుతం యిన్ యిన్ ఆంగ్ కుటుంబానికి ఇల్లంటే... మసక వెలుతురుతో ఉండే ఒక చిన్న గది. వెనుకవైపు అత్యంత సాధారణ సౌకర్యాలతో కూడిన ఒక చిన్న స్నానాల గది మాత్రమే ఉంది. ముగ్గురు సభ్యుల కుటుంబానికి అది ఏమాత్రం సరిపోదు.
ఆ భవనంలోని మిగిలిన 19 గదుల్లో నివసిస్తున్న కుటుంబాల పరిస్థితీ ఇంచుమించు అంతే. వారిలో ప్రతి ఒక్కరూ యుద్ధం మిగిల్చిన భయానక జ్ఞాపకాల భారాన్ని మోస్తూనే జీవిస్తున్నారు.
మే సాట్‌లో తన నిర్వాసిత జీవితం ఎప్పుడు ముగుస్తుందో యిన్ యిన్ ఆంగ్‌కు తెలియదు. అయితే మరో ఆరు నెలల్లో ఆమె మళ్లీ మరో ఆశ్రయం కోసం మారాల్సి వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























