పాకిస్తాన్‌లో ఇంటర్నేషనల్ మీడియాపై ఆంక్షలు.. రిపోర్టింగ్ చేయాలంటే 'ఎన్‌వోసీ తప్పనిసరి'

ఫొటో సోర్స్, EPA
- రచయిత, కరోలిన్ డేవీస్
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
పాకిస్తాన్‌లో అంతర్జాతీయ మీడియా రిపోర్టింగ్‌పై అక్కడి అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ నగరాలు మినహా ఆ దేశంలోని ఏ ఇతర ప్రాంతాల నుంచైనా విదేశీ మీడియా ప్రతినిధులు రిపోర్టింగ్ చేయాలంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ మీడియా కోసం పనిచేసే పాకిస్తాన్ పౌరులకూ ఇది వర్తిస్తుంది.
పాకిస్తాన్ ప్రస్తుతం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలకు గానూ 153వ స్థానంలో ఉంది.
తాజా ఆంక్షలతో, పాకిస్తాన్‌లోని మెజారిటీ ప్రాంతాల నుంచి విదేశీ మీడియా నేరుగా చేసే రిపోర్టింగ్.. ఇకపై పూర్తిగా అక్కడి అధికారుల విచక్షణ, నిర్ణయాలపై ఆధారపడనుంది.
"అంతకంతకూ కుంచించుకుపోతున్న పరిస్థితుల్లో, ఈ మార్గదర్శకాలు అంతర్జాతీయ మీడియా గొంతునొక్కడంతో సమానం" అని రాజకీయ విశ్లేషకులు ముస్తపా నవాజ్ ఖోఖర్ అన్నారు.

మీడియాపై ఆంక్షలు కొత్తేమీ కాకపోయినప్పటికీ, అంతర్జాతీయ మీడియాతో పోలిస్తే స్థానిక మీడియాపైనే తరచూ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
"స్వతంత్ర కథనాల కోసం ప్రజలు అంతర్జాతీయ మీడియా వైపు చూస్తుంటారు" అని ఖోఖర్ చెప్పారు. ఇలాంటి ఆంక్షలతో తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్ వ్యాప్తికి మరింత ఆస్కారం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదివారం జారీ చేసిన మార్గదర్శకాలు మీడియాపై ఆంక్షలు విధించేందుకు కాదని.. మీడియా ధ్రువీకరణకు, సమాచార సేకరణకు వీలు కల్పించేందుకు, రిపోర్టింగ్ అవసరాల సమన్వయానికి ఒక 'పరిపాలనా యంత్రాంగాన్ని' ఏర్పాటు చేయడం కోసం మాత్రమేనని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది.
ఎన్‌వోసీ తప్పనిసరి
'ఫారిన్ మీడియా ఫెసిలిటేషన్ గైడ్‌లైన్స్ - 2026' పేరిట తెచ్చిన ఈ కొత్త నిబంధనల్లో, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ - నిరభ్యంతర పత్రం) పొందేందుకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని పేర్కొనలేదు.
విదేశీ జర్నలిస్టులకు ఇప్పటికే ఎన్‌వోసీలు తప్పనిసరి. వీరు అనుమతుల కోసం నెలల తరబడి వేచిచూడాల్సి వస్తుంది, లేదా అసలు సమాధానమే రాదు. ఈ పరిస్థితి 24 కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్‌లో క్షేత్రస్థాయి నుంచి తాజా వార్తలను(బ్రేకింగ్ న్యూస్) రిపోర్ట్ చేసే వారి సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తోంది.
అందువల్ల అంతర్జాతీయ మీడియా సంస్థలు సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు పెషావర్ లేదా క్వెట్టా వంటి నగరాల్లో నివాసముంటున్న లేదా అక్కడికి సులభంగా వెళ్లగలిగిన పాకిస్తాన్ పౌరులపైనే ఆధారపడుతుంటాయి.
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఆ మూడు నగరాలను మినహాయించి దేశంలో ఏ ఇతర ప్రాంతం నుంచైనా వార్తలు రిపోర్ట్ చేయాలంటే.. ఫ్రీలాన్సర్లు సహా ఏ కంట్రిబ్యూటర్ అయినా ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది.
"ఈ ఆంక్షలు హాస్యాస్పదంగా ఉన్నాయి, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని డాన్ పత్రిక ఎడిటర్ జాఫర్ అబ్బాస్ అన్నారు.
"నేను ఈ దేశంలో 40 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేస్తున్నా. ఇద్దరు సైనిక పాలకులు, అనేక మంది నిరంకుశ పాలకుల కాలంలోనూ రిపోర్టింగ్ చేశా. కానీ, ఇలాంటి ఆంక్షలు నేనెప్పుడూ చూడలేదు.
మూడు నగరాలు కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జర్నలిస్టులను ఎన్‌వోసీలు అడగడం స్వేచ్ఛగా సంచరించే వారి హక్కునే కాదు, పత్రికా స్వేచ్ఛను కూడా దెబ్బతీస్తుంది" అని ఆయన అన్నారు.
అయితే, ఇది వ్యక్తుల రాకపోకలపై విధించిన ఆంక్ష కాదని ప్రభుత్వం అంటోంది.

ఫొటో సోర్స్, EPA
'అవి చట్టబద్ధం కావు'
"పాకిస్తాన్ భావజాలం, సార్వభౌమత్వం, భద్రత లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు" పాల్పడినా జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్‌ను కోల్పోతారని కూడా ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీటిని 'అస్పష్టమైనవి'గా అభివర్ణించిన ఖోఖర్, దీనిని ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై సందేహాలు వ్యక్తం చేశారు.
అయితే, "జాతీయ భద్రతకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యల్లో అక్రిడిటేషన్ పొందిన వ్యక్తి పాల్గొన్నప్పుడు" లేదా ఇతర సందర్భాల్లో చర్యలు తీసుకోగలిగిన అధికారం ఏ వ్యవస్థలోనైనా ఉండాలని ప్రభుత్వం అంటోంది.
సుప్రీం కోర్టు న్యాయవాది సల్హుద్దీన్ అహ్మద్ ప్రకారం, ఈ మార్గదర్శకాలను బలపరిచే ఎలాంటి చట్టబద్ధమైన నిబంధనలూ లేవు.
"ఈ మార్గదర్శకాలు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే. వీటికి చట్టపరంగా ఎలాంటి మద్దతు లభించదు" అని అహ్మద్ చెప్పారు.
"వారు రూల్స్ ఆఫ్ బిజినెస్‌ను ప్రస్తావిస్తున్నారు. ఈ నిబంధనలు కేవలం ప్రభుత్వ అంతర్గత కార్యకలాపాల నియంత్రణకు ఉద్దేశించినవే కానీ, ఇతరులపై చట్టపరమైన బాధ్యతలను మోపజాలవు."
"స్పష్టంగా చెప్పాలంటే, పాకిస్తాన్‌లో స్వతంత్ర రిపోర్టింగ్‌ను మరింత అణచివేసేందుకు హడావిడిగా, లోతుగా ఆలోచించకుండా చేసిన ఒక ప్రయత్నం."
ప్రభుత్వం ప్రకారం," ఈ మార్గదర్శకాలు రూల్స్ ఆఫ్ బిజినెస్ కింద ఉపయోగిస్తున్నారు. అలాగే, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని ఎక్స్‌టర్నల్ పబ్లిసిటీ విభాగం విదేశీ మీడియా వ్యవహారాల బాధ్యతలు చూస్తున్నందున, ఈ మార్గదర్శకాలు మంత్రిత్వ శాఖకు, విదేశీ మీడియాకు మధ్య ఉన్న పరిపాలనా సంబంధాలను నియంత్రిస్తాయి."
ఈ మార్గదర్శకాలకు సంబంధించి తమ ఆందోళనలను తెలియజేసేందుకు అంతర్జాతీయ జర్నలిస్టుల బృందం, పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు సమాచార ప్రసార శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు నెలలుగా తీవ్ర ఘర్షణలు
కొన్ని నిర్దిష్ట ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కనిపిస్తోంది.
పాక్ పాలిత్ కశ్మీర్‌లో ఉన్న ఎవరైనా "వెంటనే తిరిగి వచ్చేయాలి" అని, ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్స్‌టర్నల్ పబ్లిసిటీ విభాగం నుంచి విదేశీ మీడియా సంస్థలకు సోమవారం సాయంత్రం ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
ఈ ప్రాంతంలో నిరసనకారులు, భద్రతాధికారుల మధ్య గత రెండు నెలలుగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ జరిగిన హింసలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను నిరసనకారులు బహిష్కరించారు. ఇంటర్నెట్ సేవలపై కూడా ఆంక్షలు విధించడంతో సమాచారాన్ని ధ్రువీకరించుకోవడం కష్టతరంగా మారింది.
పాక్ పాలిత్ కశ్మీర్ నుంచి బీబీసీ సహా పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలను ప్రచురించిన అనంతరం, మంత్రిత్వ శాఖ ఈ మెసేజ్ పంపింది.
ఆ ప్రాంత రాజధాని నుంచి అల్ జజీరా జర్నలిస్ట్ చేసిన కథనాన్ని "ఎల్లో జర్నలిజం"గా పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
ఆ తర్వాత, అల్ జజీరా వెబ్‌సైట్ పాకిస్తాన్‌లో పనిచేయలేదు. అయితే, ఆ వెబ్‌సైట్‌పై నిషేధం విధించినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పాక్ పాలిత కశ్మీర్‌లో నెలకొన్న అశాంతిపై కథనాలు అక్కడ రాజకీయంగా చాలా సున్నితమైన అంశం. ఈ అంశానికి దూరంగా ఉండాలని తమ ఎడిటర్లు తమను హెచ్చరించినట్లు ఇద్దరు పాకిస్తానీ జర్నలిస్టులు బీబీసీకి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























