చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం కొత్త రహస్యాలను బయటపెట్టనుందా?

The last time it was confirmed that part of a rocket had collided with the Moon by accident was in 2022

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2022లో ఓ రాకెట్‌ భాగం చంద్రుడిని ప్రమాదవశాత్తు ఢీ కొందని నిర్థరణ అయింది.
    • రచయిత, పల్లభ్ ఘోష్
    • హోదా, సైన్స్ కరస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

‘చంద్రుడిని ఢీకొట్టిన’ స్పేస్‌ఎక్స్ రాకెట్‌ శకలం, ఐన్‌స్టీన్ బిలం సమీపంలో మరో కొత్త బిలం ఏర్పడటానికి కారణమైనట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఘటన భవిష్యత్ చంద్రయానాలకు ఉపయోగపడే అరుదైన పరిశోధన అవకాశాన్ని శాస్త్రవేత్తలకు కల్పించింది.

ఫాల్కన్-9 రాకెట్‌‌కు చెందిన ఖాళీ పైభాగం బుధవారం గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో ఐన్‌స్టీన్ బిలం సమీపంలో చంద్రుడిని ఢీకొట్టింది.

అలా ఢీకొన్నప్పుడు ఏర్పడిన స్వల్ప మెరుపును ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించడం దాదాపు అసాధ్యం. అయితే అమెరికాలోని పెద్ద పరిశోధన కేంద్రాలు ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నాయి.

అసలేం జరిగింది? దాన్నుంచి ఏమి నేర్చుకోవచ్చు? అన్నది పూర్తిగా అర్థం కావడానికి రోజులు, వారాలు కూడా పట్టొచ్చు. కానీ ప్లానెటరీ జియాలజిస్ట్‌లకు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన ఒక శాస్త్రీయ వరంలా మారింది.

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 పునర్వినియోగ రాకెట్. దీని కొంత భాగం భూమికి తిరిగి వచ్చేలా రూపొందించారు. అయితే పైదశ వంటి కొన్ని భాగాలు తమ పని పూర్తయ్యాక అంతరిక్షంలోనే విడిపోతాయి.

ఈ రాకెట్‌ను గతేడాది జనవరిలో ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. ఇది రెండు మూన్ ల్యాండర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఆ ల్యాండర్లు భూకక్ష్యను విడిచి చంద్రుడి వైపు ప్రయాణించేలా తగినంత వేగాన్ని అందించడమే రాకెట్‌లోని పైదశ పని. ఆ పని పూర్తయ్యాక అది అంతరిక్షంలోనే ఉండిపోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రుడు

రాకెట్ నుంచి వేరయిన తరువాత... అయిదు అంతస్తుల భవనం అంత ఎత్తున్న, సుమారు నాలుగు వేల కిలోల బరువున్న ఆ శకలం చంద్రుడి దీర్ఘవృత్తాకార కక్ష్యలో తేలియాడుతుండేది.

ఆ తరువాత 18 నెలలపాటు భూమి, చంద్రుడు, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, సూర్యకాంతి చూపిన స్వల్ప ప్రభావం దాని కక్ష్యను క్రమంగా మార్చాయి.

ఆ రాకెట్‌ శకలాన్ని పర్యవేక్షిస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు, ఆ చిన్న చిన్న ప్రభావాలే దానిని చంద్రుడి వైపు మళ్లించాయని, ప్రతిరోజూ దాని వేగం పెరుగుతోందని గుర్తించారు.

బుధవారం మధ్యాహ్నం సుమారు 12.05 గంటలకు(భారత కాలమానం ప్రకారం) అది చంద్రుడిని ఢీకొట్టింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అప్పటికే పగలు కావడంతో, ఆ ఢీకొన్నప్పుడు ఏర్పడిన స్వల్ప మెరుపు టెలిస్కోప్‌లో కూడా కనిపించనంత మసకగా ఉంది.

చంద్రుడిలోని ఆ భాగం అప్పటికే పగటి వెలుతురులో ఉండటం, ఆ మెరుపు కేవలం క్షణకాలం మాత్రమే ఉండటంతో ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు దాన్ని చూసే అవకాశం చాలా తక్కువ. అలాగే కొన్ని నిమిషాలపాటు నిలిచిన, దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించిన ధూళి మేఘాన్ని కూడా గుర్తించడం వారికి కష్టమే.

చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న అంతరిక్ష నౌకలు కూడా సరైన సమయంలో సరైన ప్రదేశంలో లేకపోవడంతో ఆ ఢీకొన్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా నమోదు చేయలేకపోయాయి. అయితే ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు ఆ ప్రాంతానికి సమీపంగా వెళ్లిన దక్షిణ కొరియాకు చెందిన దనురి ఆర్బిటర్‌కు దీనిని గమనించే అవకాశం ఎక్కువగా ఉంది.

అయితే... పరిశోధకులు తమ విశ్లేషణ పూర్తిచేశాకే ఫుటేజ్ విడుదల చేస్తామని ఆ బృందం దక్షిణ కొరియా మీడియాకు తెలిపింది.

రాబోయే కొద్ది రోజుల్లో నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ ఆ ప్రాంతాన్ని చిత్రీకరించనుంది. దీంతో ఢీకొట్టడానికి ముందు, తర్వాత పరిస్థితులను పోల్చి చూడడానికి శాస్త్రవేత్తలకు అవకాశం లభిస్తుంది.

ఈ ఘటనకు సంబంధించిన తొలి శాస్త్రీయ సమాచారం, తొలి చిత్రాలు కూడా అమెరికాలోని శక్తిమంతమైన టెలిస్కోపుల నుంచే వచ్చే అవకాశం ఉంది.

అయితే, 3.85 లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడి వెలుతురున్న భాగాన్ని ఢీకొట్టిన కేవలం 14 మీటర్ల పొడవున్న వస్తువును గుర్తించడం అంత సులభం కాదు. అయితే అది అసాధ్యమూ కాదు.

చిత్రాలను స్పష్టంగా రూపొందించడానికి శాస్త్రవేత్తలు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు గంటలు, రోజులు, కొన్ని సందర్భాల్లో వారాలు కూడా పట్టవచ్చు

ఐన్‌స్టీన్ బిలం.

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఐన్‌స్టీన్ బిలం. ఇది 180 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది.

అయితే శాస్త్రవేత్తలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నది చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న అంతరిక్ష నౌకలు పంపే కొత్త బిలం చిత్రాల కోసమే.

రాకెట్‌ పరిమాణం, వేగం, చంద్రుడిని ఢీకొట్టిన ఖచ్చితమైన ప్రదేశం ఇప్పటికే తెలిసి ఉండటంతో, ఇది యాదృచ్ఛిక ప్రమాదం మాత్రమే కాకుండా ఒక అరుదైన నియంత్రిత ప్రయోగంగా మారింది.

దీనివల్ల ప్లానెటరీ జియాలజిస్ట్‌లకు ఒక కల నెరవేరినట్టే. ఎందుకంటే ఢీకొన్నప్పుడు బిలాలు ఎలా ఏర్పడతాయి, శిథిలాలు చంద్రుడి ఉపరితలంపై ఎలా వ్యాపిస్తాయి, ప్రకంపనలు చంద్రుడి అంతర్భాగంలో ఎలా ప్రయాణిస్తాయనే అంశాలపై రూపొందించిన నమూనాలను పరీక్షించుకునే అరుదైన అవకాశం వారికి దొరికింది.

ఈ అధ్యయనానికి ప్రత్యక్ష ఆచరణాత్మక ప్రయోజనం కూడా ఉంది.

ఒక వస్తువు ఢీకొనడం వల్ల ఎంత మేర రాళ్లు, ధూళి పైకి ఎగురుతాయో తెలుసుకోవడం ద్వారా మరింత సురక్షితమైన చంద్ర ల్యాండర్లు, భవిష్యత్ చంద్ర స్థావరాలను రూపకల్పన చేయడానికి ఇంజినీర్లకు ఉపయోగపడుతుంది. అలాగే ఎగిరిన శిథిలాలు ఎంత దూరం ప్రయాణించగలవో, సమీప ప్రాంతాల్లో నేల ఎంత తీవ్రంగా కంపిస్తుందో కూడా అంచనా వేయవచ్చు.

చంద్రుడి ఉపరితలం కింద నుంచి పైకి వచ్చిన పదార్థం, దాని భూగర్భ నిర్మాణంపై కొత్త ఆధారాలను అందిస్తోంది. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి-చంద్రుడి వ్యవస్థ ఎలా ఏర్పడిందన్న అంశంపై శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఉన్న అవగాహనను ఇది మరింత విస్తరించనుంది.

మానవ నిర్మిత వస్తువు చంద్రుడిని ఢీకొనడం ఇదే తొలిసారి కాదు. 1959 నుంచి డజన్ల కొద్దీ అంతరిక్ష నౌకలు చంద్రుడిని ఢీకొన్నాయి. వాటిలో కొన్ని ప్రమాదవశాత్తూ జరిగితే, మరికొన్ని శాస్త్రీయ పరిశోధనల కోసమే ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారు.

సోవియట్ యూనియన్‌కు చెందిన 1959నాటి లూనా–2 ఈ జాబితాలో మొదటిది. ఆ తర్వాత 1960లలో నాసా రేంజర్ యాత్రలు, అపోలో కార్యక్రమంలో ఉపయోగించిన రాకెట్‌ పైదశలు, 2009లో చంద్రుడిపై మంచు జాడల కోసం ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన ఎల్‌క్రాస్ మిషన్ కూడా ఇందులో చేరాయి.

ఇటీవల నిర్థరించిన ప్రమాదవశాత్తు ఢీకొన్న ఘటన 2022లో నమోదైంది. 2014లో ప్రయోగించిన చైనా చంద్రయాత్రకు చెందిన బూస్టర్‌ అవశేషమే చంద్రుడిని ఢీకొట్టిందని అప్పట్లో భావించారు. అర్ధశతాబ్దానికి పైగా భూమి చుట్టూ, చంద్రుడి దిశగా మానవ నిర్మిత అంతరిక్ష శిథిలాలు పేరుకుపోతున్నాయనడానికి ఇదో మరో గుర్తు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)