జంతర్ మంతర్ నిరసన: బెదిరింపులు రావడంతో ఇల్లువదిలి వెళ్లిపోయిన ఓ యువతి కుటుంబం, ఏం జరిగింది?

జంతర్ మంతర్ ఆందోళన

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరచవచ్చు.

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో 36 రోజుల పాటు జరిగిన నిరసన ప్రభుత్వంతో చర్చల అనంతరం ముగిసింది. అయితే దానికి సంబంధించిన వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని నిరసనలో పాల్గొని వైరలైన వీడియోలలో భాగమైన బాలికలకు సంబంధించినవి.

వీరిలో ఒకరు 15 ఏళ్ల బాలిక. ఆమె తాను అన్న మాటలకు క్షమాపణ చెబుతూ ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఈ అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్ కావాలని కలలు కన్నారు. అయితే ప్రస్తుతం పదో తరగతిలో ఉన్న ఆమెకు తను బోర్డ్ పరీక్షలు రాయగలదో లేదో కూడా తెలియదు.

భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆమెకు ఒక భయానక స్వప్నంగా మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆమెపై ఎఫ్‌ఐఆర్ దాఖలైన తర్వాత ఇంటిని వదిలేసి జూలై 26 నుంచి తన తల్లితో కలిసి వేరేచోట నివసిస్తోంది. తాను ఇంటికి తిరిగి రాగలదో లేదో కూడా ఆమెకు తెలియదు.

నీట్ లీకేజ్‌పై నిరసనల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో, స్నేహితుల నుంచి సమాచారం రావడంతో ఆ అమ్మాయి జూలై 22న జంతర్ మంతర్‌కు చేరుకుని ఒక బృందంలో చేరింది.

అక్కడున్నవారి మాటల ప్రభావానికి లోనై తాను అనకూడని మాట అన్నానని ఆమె బీబీసీతో చెప్పారు.

ఆ మాటల తీవ్రత గురించి ఆమెకు తర్వాత తెలిసింది. ఆమె ఏదైనా చేసేలోపే ఆ రీల్ వైరల్ అయిపోయింది.

ఈ కేసులో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.

శృతి ( భద్రత దృష్ట్యా ఆమె పేరు మార్చాం) ఇలా చెప్పారు

"ఈ సంఘటన జూలై 22న జరిగింది, నేను రెండు రోజుల తర్వాత మా అమ్మకు చెప్పాను. ఈ రీల్‌తో‌పాటు నాపై చాలామంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. చంపేస్తామని, అత్యాచారం చేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరించారు. నేను చాలా భయపడ్డా. రెండు రోజులు ఇంట్లోనే ఉన్నా. నా నంబర్ లీక్ అయింది. ఈ విషయాలన్నీ నాకు కాల్స్, మెసేజ్‌లలో చెప్పారు. అదింకా ఆగలేదు" అని శృతి అన్నారు.

జంతర్ మంతర్ ఆందోళన

ఫొటో సోర్స్, ANI

సోషల్ మీడియాకు తాను దూరంగా ఉంటాననీ, భర్త చనిపోయిన తర్వాత భజనలపై దృష్టి పెడుతూ ఇంటి ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నానని శృతి తల్లి చెప్పారు.

కూతురి ద్వారా ఈ విషయం తెలుసుకున్న తర్వాత మూడు రోజుల పాటు తీవ్ర ఆందోళనకు గురైనట్లు, ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడినట్లు వెల్లడించారు.

"బాంబు పేలినట్లు అనిపించింది. నా కూతురు అలా దుర్భాషలాడిందని నేను నమ్మలేకపోయా" అని ఆమె బీబీసీతో అన్నారు.

"కొంతమంది మమ్మల్ని దేశద్రోహులు, ఉగ్రవాదులు అంటున్నారు. మాకు పాకిస్తా‌న్‌తో సంబంధాలున్నాయట. ఆమె తల్లి ఏం మనిషి? కూతురికి ఎలాంటి విలువలు నేర్పారు? ఇవన్నీ వేశ్యల వేషాలు అంటూ ఆరోపణలు చేశారు. క్షమాపణ చెప్పాలని అడిగారు. నిజమే బూతులు మాట్లాడకూడదు. ఇతరుల్ని దూషించడం నిరసన కాదు. ఎఫ్ఐఆర్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కొట్టివేశారు. నీకేం కాదు, మేమున్నామని, నిర్భయంగా మీ ఇంటికి వెళ్లండని ఎవరూ ఎందుకు అనడం లేదు" అని ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు.

ఆ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని, తిట్టారని ఆరోపిస్తూ న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఫిర్యాదు చేశారు.

ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజాశాంతికి భంగం కలిగిస్తాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

జంతర్ మంతర్ ఆందోళన

ఫొటో సోర్స్, ANI

ఈ కేసులో భారత న్యాయసంహిత (BNS)లోని సెక్షన్లు 352 (శాంతి భద్రతలకు హాని కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 353 (1) (ప్రజా అశాంతికి దారితీసే ప్రకటనలు), 356 (1) (పరువు నష్టం) కింద నోయిడా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కేసు గురించి స్మృతి సింగ్ చందేల్‌ను బీబీసీ ప్రశ్నించినప్పుడు, ఈ కేసు దిల్లీ పోలీసుల దగ్గరకు వచ్చినప్పుడు వారు తనకు కాల్ చేశారనీ ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.

"ప్రధానమంత్రి పిల్లలను క్షమించారు. మేము ఆయనకంటే గొప్పవాళ్ళం కాదు. అందుకే మేము కూడా వారిని క్షమించాం" అని చెబుతూ అన్ని సెక్షన్లను ఉపసంహరించుకున్నట్లు ఆమె వివరించారు.

స్మృతి సింగ్ చందేల్ వృత్తిరీత్యా న్యాయవాది. జనతా దళ్ డెమోక్రటిక్ పార్టీతో అనుబంధం ఉంది.

సంఘటన జరిగిన ప్రాంతపు అధికార పరిధికి వెలుపల ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. తర్వాత దాన్ని ఆ సంఘటన జరిగిన ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు పంపిస్తారు.

జంతర్ మంతర్ ఆందోళన

ఫొటో సోర్స్, @arjunmodhwadia X/ANI Photo)

క్షమాపణలు కోరిన బాలిక

బాలిక క్షమాపణలు చెబుతూ ఆగస్టు 1న ఒక వీడియో విడుదల చేశారు. ''ఇది నా మొదటి తప్పు, ఇదే ఆఖరుది కూడా'' అని వీడియోలో పేర్కొన్న ఆ బాలిక, నిరసనలో పాల్గొన్న కొన్ని గ్రూపుల ప్రభావానికి తాను లోనయ్యానని చెప్పారు.

''నేను నిరసనలు జరిగే ప్రాంతానికి వెళ్లాను. అక్కడ ప్రధాని మోదీపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న గ్రూపులు చాలా ఉన్నాయి. వాళ్లు ఇతరులను కూడా రెచ్చగొడుతున్నారు. అప్పుడు నేను అలా మాట్లాడినందుకు చాలా సిగ్గుపడుతున్నా. ఇప్పుడు నేను అందరి ముందు తల ఎత్తుకోలేకపోతున్నా. నేను చేసిన పనికి దేశం మొత్తానికి క్షమాపణలు చెప్తున్నా. ఇది నా మొదటి, చివరి తప్పు" అని వీడియాలో ఆ బాలిక పేర్కొన్నారు.

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

''పిల్లలు తెలియక చేసే తప్పుల నుంచి నేర్చుకుని తమను తాము సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. వీళ్లు దారి తప్పిన పిల్లలు. వీరికి సరైన దారి చూపించాల్సిన సమయమిది. నేను వారిని క్షమిస్తున్నా'' అని మోదీ ఆ వీడియో సందేశంలో అన్నారు.

''జంతర్ మంతర్ వద్ద జరిగినదాన్ని దేశంతోపాటు ప్రపంచమంతా చూసింది. కొంతమంది అల్లరి పిల్లలు అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారు. అలాంటి భాషను ఎవరూ ఆమోదించరు. నన్ను వ్యక్తిగతంగా తిట్టడమే కాకుండా చనిపోయిన నా తల్లిని కూడా తిట్టారు'' అని వీడియోలో మోదీ పేర్కొన్నారు.

జంతర్ మంతర్ ఆందోళన

ఫొటో సోర్స్, ANI

ఆగని బెదిరింపులు

క్షమాపణలు చెప్పినప్పటికీ తనకు బెదిరింపులు రావడం ఆగలేదని, తానేదో క్షమించరాని నేరం చేసినట్లు ప్రవర్తిస్తున్నారని ఆ 15 ఏళ్ల బాలిక అంటోంది.

''నేను ఆత్మహత్య చేసుకోవడానికి రెండుసార్లు ప్రయత్నించాను. కానీ, ఆ తర్వాత ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నాది తప్పే, అందుకు నేను క్షమాపణ కూడా చెప్పా. నన్ను ఆయన (ప్రధానమంత్రి ) క్షమించారు కూడా. నా దగ్గర ఎలాంటి రక్షణ లేదు. ఇప్పుడు నేను చివరివరకు దీనిపై పోరాడాల్సింది. వీళ్ల కారణంగా నా ప్రాణాలు తీసుకోబోను. నేను కూడా ఈ దేశపు బిడ్డనే కదా? ఈ దేశంలోని పిల్లలను ఇలాగే చేస్తారా?'' అని ఆమె అన్నారు.

(ఆత్మహత్య అనేది తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. ఎవరైనా తీవ్ర మనస్తాపంతో బాధపడుతుంటే భారత ప్రభుత్వ 'జీవన్ ఆస్థా' హెల్ప్‌లైన్ 1800 233 3330 సాయం పొందవచ్చు. మీరు ప్రభుత్వ 'కిరణ్' మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్ 1800-599-0019 లేదా 'మనోదర్పణ్' హెల్ప్‌లైన్ 844 844 0632 కి కూడా ఫోన్ చేసి నిపుణులతో మాట్లాడవచ్చు. ఆత్మహత్య ఆలోచనలు వస్తే వెంటనే మీ స్నేహితులు, బంధువులతో మీ సమస్య గురించి మాట్లాడాలి.)

‘మమ్మల్ని బెదిరిస్తున్నవారిని ఎవరూ ఎందుకు ఆపట్లేదు?’’

ప్రధానమంత్రిని తిట్టారంటూ తమను బెదిరిస్తున్న వారిని ఎందుకు అడ్డుకోవడం లేదంటూ సదరు బాలిక, ఆమె తల్లి ప్రశ్నిస్తున్నారు.

''అవును, తప్పు జరిగింది. చేసిన తప్పుకు మేం ప్రధానిని క్షమాపణలు కోరాం. ఆయన క్షమించారు కూడా. కానీ ఇలా బెదిరింపులకు పాల్పడుతున్న వారిని ఎందుకు అడ్డుకోవడం లేదు? మాకు కనీసం ఆ మాత్రం సాయమైనా చేయాలి కదా. మేం మా ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాం. ముఖం చూసి ఎవరైనా గుర్తుపట్టి మమ్మల్ని చంపేస్తారేమోనని భయంతో ముఖాలు దాచుకుని తిరగాల్సి వస్తోంది'' అని వారిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ భయం కారణంగా ముగ్గురు సభ్యులున్న ఆ కుటుంబం ఇప్పటివరకు తమ ఇంటికి తిరిగి వెళ్లలేదు.

పోలీసులపై తమకు నమ్మకం లేదని, వారి దగ్గర కూడా తమకు రక్షణ ఉన్నట్లుగా అనిపించడం లేదని వారు చెప్పారు.

తల్లీకూతుళ్ల ఇబ్బందుల గురించి స్మృతిని ప్రశ్నించగా... "వారు పోలీసుల సాయం కోరాలి. పైగా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు" అని ఆమె స్పందించారు.

''అక్కడ ఇక్కడ దాక్కుంటూ బతుకుతున్నాం. మాకు ఫోన్ చేయొద్దని, మమ్మల్ని కూడా చిక్కుల్లోకి లాగొద్దని మా బంధువులు అంటున్నారు. మాకు కష్టం వచ్చేసరికి ఎవరూ తోడుగా నిలబడలేదు'' అని బాలిక తల్లి అన్నారు.

‘‘ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతూ నా కూతురు చనిపోయి ఉంటే...పిల్లల భవిష్యత్తు కోసమే కదా ప్రాణాలు పోయాయని సర్దుకుపోయేదాన్ని. కానీ, ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి నా కూతురిని ఎక్కడ చంపేస్తారోననే భయంతో బతకలేకపోతున్నా. ఇప్పుడు మాపై ఇలాంటి కామెంట్లు చేస్తున్న వారు జీవితంలో ఎప్పుడూ ఎలాంటి తప్పులూ చేయలేదా?" అని ఆమె ప్రశ్నించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)