'మా అమ్మమీద జాలేస్తోంది'

బ్రిటన్, ఫౌండ్లింగ్, కుటుంబాన్ని కలిసిన వ్యక్తి

ఫొటో సోర్స్, Julie Stevenson

ఫొటో క్యాప్షన్, డేవిడ్ స్టీవెన్సన్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
    • రచయిత, షరిఖా అహ్మద్, డాటీ మెక్‌లియోడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

65 ఏళ్ల పాటు డేవిడ్ స్టీవెన్సన్‌ను ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది. అది తన మూలాలేంటి? అని.

బ్రిటన్‌లోని పీటర్‌బరోకు చెందిన డేవిడ్ ఒక ఫౌండ్లింగ్ ( అనాథ శిశువు). తల్లిదండ్రులు వదిలివేస్తే అపరిచితులు గుర్తించి కాపాడిన బిడ్డను ఇలా పిలుస్తారు.

1960లో లండన్‌లోని గోల్డర్స్ గ్రీన్‌లోని ఒక అపార్ట్‌మెంట్ బ్లాక్ కారిడార్‌లో కేవలం కొన్ని రోజుల వయసులో ఆయన్ను గుర్తించారు.

పుట్టిన కొద్ది రోజులకే ఆ బిడ్డను ఎందుకు వదిలేశారో ఎవరికీ తెలియదు. ఆయన్ను స్టీవెన్సన్ కుటుంబం దత్తత తీసుకుంది.

"చిన్నప్పుడు నేను అనాథనని నాకు తెలుసు. నన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఆ విషయం చెప్పారు. కానీ, నాకు పిల్లలు పుట్టేంత వరకు నా మూలాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు" అని డేవిడ్ స్టీవెన్సన్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిటన్, ఫౌండ్లింగ్, కుటుంబాన్ని కలిసిన వ్యక్తి

ఫొటో సోర్స్, Julie Stevenson

ఫొటో క్యాప్షన్, 1960లో బాలుడిగా ఉన్నప్పుడు డేవిడ్ స్టీవెన్సన్ గురించి ది డైలీ మెయిల్ కథనం ప్రచురించింది.

1960లో లండన్‌లోని ఒక భవనం రెండో అంతస్తులో కనిపించిన "రెయిన్‌బో బేబీ" ఎవరో ఆచూకీ కోసం డైలీ మెయిల్ ఒక విజ్ఞప్తిని ప్రచురించింది. ఆ బిడ్డ గురించి ఆధారాలను కనుక్కునే ప్రయత్నంలో భాగంగా ఆ పత్రిక 2009లో నాటి కథను తిరిగి ప్రచురించింది.

ఏళ్ల తరబడి వెతికినా తన దత్తత రికార్డులలో కన్న తల్లిదండ్రుల గురించి చాలా తక్కువ సమాచారం ఉందని డేవిడ్ పేర్కొన్నారు.

"అది గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది" అని ఆయన చెప్పారు

"కానీ, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నా భార్య దానికి సంబంధించి ఒక పోలీసు రిపోర్ట్ ఉన్నట్లు తెలుసుకుంది. నా గురించి విచారణ జరిపిన టెగ్వీన్ కర్ల్ అనే అధికారిణిని గుర్తించింది. నేను దొరికిన రోజు గురించి ఆమె మాకు మరింత సమాచారం ఇచ్చారు" అని డేవిడ్ తెలిపారు.

"డేవిడ్‌ను రక్షించిన ఘటనను తాను ఎన్నడూ మర్చిపోలేనని ఆ పోలీస్ అధికారిణి చెప్పారు. అది ఆమె కెరీర్‌లోని అత్యంత భావోద్వేగభరితమైన క్షణాలలో ఒకటి" అని డేవిడ్ భార్య జూలీ స్టీవెన్సన్ అన్నారు. ఆమె పీటర్‌బరో నగర మాజీ కౌన్సిలర్ కూడా.

బ్రిటన్, ఫౌండ్లింగ్, కుటుంబాన్ని కలిసిన వ్యక్తి

ఫొటో సోర్స్, Julie Stevenson

ఫొటో క్యాప్షన్, డేవిడ్ స్టీవెన్సన్ దొరికిన రోజు గురించి సమాచార సేకరణలో ఏజెంట్ టెగ్విన్‌ సాయం చేశారు.

'ఆమెపై జాలేస్తోంది'

డేవిడ్ మొదలుపెట్టిన అన్వేషణతో ఆయనకు తన కన్నతల్లి పెట్రా గురించి వివరాలు తెలిశాయి. ఆమె1940లో నెదర్లాండ్స్‌లో జన్మించారు. క్యాథలిక్ కుటుంబంలో పెరిగారు.

వెట్ నర్సుగా పనిచేయడానికి 19 ఏళ్ల వయసులో పెట్రా ఫ్రాన్స్‌కు, ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లారని, 1960లో ఆమె గర్భవతి అయ్యారని జూలీ వివరించారు.

"లండన్‌కు వచ్చినప్పుడు తాను గర్భవతినని ఆమెకు తెలుసో లేదో స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ, ఆమె గర్భాన్ని పూర్తికాలం మోసింది. గర్భవతి అయిన తర్వాత ఆమెకు చుట్టూ ఉన్నవారి మద్దతు లభించినట్లు కనిపిస్తోంది" అని ఆమె చెప్పారు.

2015లో ఫౌండ్లింగ్ మ్యూజియంను సందర్శించినప్పుడు డేవిడ్ మొదటిసారిగా ఐటీవీ టెలివిజన్ ఛానల్‌కి చెందిన లాంగ్ లాస్ట్ ఫ్యామిలీ బృందాన్ని కలిశారు.

"డీఎన్ఏ విశ్లేషణ, జీనోలాజికల్ సెర్చ్ ద్వారా నా కన్నతల్లి ఎవరో గుర్తించడంలో ఈ కార్యక్రమం గొప్ప పురోగతిని సాధించింది. ఇది అద్భుతం" అని డేవిడ్ గుర్తు చేసుకున్నారు.

"దురదృత్తువశాత్తూ, ఆమె 2010లో కన్నుమూశారు. కానీ, నా కొత్త కుటుంబం ఆమెను నా జీవితంలోకి తిరిగి తీసుకువచ్చింది. ఆమె చాలా ప్రేమగల మహిళ" అని చెప్పారు.

"నన్ను చూసుకోవడానికి ఆమె ఏదో ఏర్పాటు చేసి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. బహుశా, ఆ ఏర్పాటులో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు, దానివల్లే నన్ను ఒక సంరక్షణ కేంద్రంలో చేర్చారు" అని డేవిడ్ చెప్పారు.

"ఆమె పట్ల నాకు జాలి తప్ప మరేమీ కలగడం లేదు. 50, 60వ దశకాలలో అమ్మాయిలు ఒంటరి తల్లులుగా ఉండటం చాలా కష్టంగా ఉండేది. ఆమె తన శక్తికొలది చేసిందని నేను అనుకుంటున్నాను" అని డేవిడ్ చెప్పారు.

"ఆమె తన పరిస్థితిని చెప్పుకోలేకపోవడానికి ఏవో బలమైన కారణాలు ఉండి ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. తీర్పులు ఇచ్చేయడానికి మనం ఎవరు? ఆమె జీవితాన్ని మనం జీవించలేదు కదా. అది కేవలం జరిగిపోయిన ఒక అత్యంత విషాదకరమైన సంఘటన" అని జూలీ అన్నారు.

బ్రిటన్, ఫౌండ్లింగ్, కుటుంబాన్ని కలిసిన వ్యక్తి

ఫొటో సోర్స్, Julie Stevenson

ఫొటో క్యాప్షన్, డేవిడ్ స్టీవెన్సన్‌కు ( అందరి కంటే చిన్న బాలుడు) రోజుల వయసు ఉన్నప్పుడు స్టీవెన్సన్ కుటుంబం ఆయన్ను దత్తత తీసుకుంది.

కొత్త కుటుంబం

ఆ తర్వాత, రోటర్‌డామ్‌లో ఉంటున్న తన పిన్ని మేరియాన్, ఆమె పిల్లలను డేవిడ్ కలిశారు. దీనిని ఆయన "ఆసక్తికరమైన కథ"గా అభివర్ణించారు.

ఆ కుటుంబం నన్ను సాదరంగా ఆహ్వానించింది. వాళ్లు చాలా మంచివారు. వారిని కలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇదంతా కొత్త డీఎన్ఏ సాంకేతికత వల్లే సాధ్యమైందని డేవిడ్ వివరించారు.

"కెనడాకు చెందిన ఒక అమ్మాయి డీఎన్ఏ నా డీఎన్ఏతో సరిపోలింది. దానివల్ల మేము ఈ కుటుంబాన్ని కనుగొన్నాం. మా అమ్మమ్మ వాళ్ల అమ్మ మూలాలు ఇండోనేషియా సంతతికి చెందినదని కూడా తెలుసుకున్నా" అని డేవిడ్ అన్నారు.

"నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నా తండ్రి వైపు కుటుంబం గురించి ఇంకా కొంత అన్వేషించాల్సి ఉంది" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)