భారత్ జెండాతో ఉన్న నౌకపై దాడి, యెమెన్ తీరంలో మునిగిపోయిన నౌక

యెమెన్, భారత్, హూతీలు, ఇరాన్, సముద్రమార్గాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, యెమెన్ తీరంలో భారత్ జెండా ఉన్న నౌకపై దాడిని మంత్రి సోనోవాల్ ఖండించారు. (ఫైల్ ఫోటో)
    • రచయిత, సోఫియా ఫెరీరా శాంటోజ్
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

యెమెన్ తీరంలో జరిగిన దాడిలో భారత్ జెండా కలిగిన నౌక బోల్తాపడి, మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు.

'ఎంఎస్‌వీ ఫైజ్ నూర్ ఎ ఓలియా' నౌకలో ఉన్న 13 మంది భారతీయులతో సహా మొత్తం 14 మందిని కాపాడినట్లు భారత నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.

ఈ అనూహ్య దాడిని సోనోవాల్ ఖండించారు. ఆ ప్రాంతంలో నావికుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అయితే, ఈ నౌకపై దాడి చేసింది ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇటీవల ఎర్ర సముద్రంలో వరుసగా జరుగుతున్న దాడుల్లో ఇది తాజా ఘటన. ఫిబ్రవరిలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసినప్పటి నుంచి కొన్ని ట్యాంకర్లు ఎర్ర సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ సముద్రమార్గంలో ప్రయాణిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు 'తీవ్ర ఆందోళనకరం' అని భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

"ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే ఆగాలి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, అంతర్జాతీయ జలమార్గాల్లో ఎలాంటి అడ్డంకులూ లేని ఉచిత నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి" అని విదేశాంగ శాఖ అందులో పేర్కొంది.

ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటి నుంచి ఈ ప్రాంతంలోని సముద్ర వాణిజ్య మార్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఆ దాడుల అనంతరం, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది, దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడింది.

సౌదీ అరేబియా నుంచి చమురు తీసుకెళ్లే కొన్ని నౌకలు ప్రత్యామ్నాయంగా ఎర్రసముద్రం మార్గాన్ని ఎంచుకున్నాయి. అయితే, యెమెన్‌లోని హూతీ ఫైటర్స్ చేస్తున్న వరుస దాడులతో ఈ మార్గంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరాన్ మద్దతు కలిగిన హూతీలు పేలుడు పదార్థాలున్న బోటు సాయంతో ఈ దాడికి పాల్పడినట్లు సౌదీ మద్దతు కలిగిన, యెమెన్‌ ప్రభుత్వంలోని రవాణా మంత్రిత్వ శాఖ ఆరోపించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

అయితే, దీనిపై హూతీలు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు, ఎర్రసముద్రపు తీరంలోని సౌదీ అరేబియా పోర్టులను దిగ్బంధిస్తామని జులై 20న హూతీలు ప్రకటించారు.

గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో ఓడలపై అనేక దాడులు జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) రిపోర్ట్ చేసింది.

యెమెన్, భారత్, హూతీలు, ఇరాన్, సముద్రమార్గాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇలాంటి పరిస్థితుల నడుమ, హార్ముజ్‌ పునరుద్ధరణకు ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ అమెరికా ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేయడంతో మంగళవారం చమురు ధరలు మూడువారాల కనిష్టానికి పడిపోయాయి.

సైనిక చర్యల నిలిపివేత, హార్ముజ్‌ను తిరిగి తెరవడం, 60 రోజుల్లో యుద్ధం ముగింపు ఒప్పందం వంటి 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై జూన్‌లో అమెరికా, ఇరాన్ సంతకాలు చేశాయి.

కానీ, ఒప్పందంపై సంతకాలు చేసిన మూడు వారాల అనంతరం హార్ముజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు, అందుకు ప్రతీకారంగా అమెరికా దాడులు జరిపింది, అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

తాజాగా, మంగళవారం లేదా బుధవారం నాటికి హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ సంకేతాలిచ్చారు, చర్చలు పురోగతిలో ఉన్నాయని అమెరికా అధికారులు మంగళవారం తెలిపారు.

అయితే, తాము అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని, తమకు అలాంటి ఆలోచనలు కూడా లేవని ఇరాన్ పేర్కొంది. అందుకు బదులుగా తాము ఒమన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)