కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని డ్రోన్‌తో వెంటాడి దాడి చేసిందని రష్యాపై యుక్రెయిన్ ఆరోపణ

- రచయిత, లారా గోజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఒక వ్యక్తిని డ్రోన్ తరుముతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ.. పౌరులపై రష్యా జరుపుతున్న 'సఫారీ' దాడులకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
ఖేర్సన్ ప్రాంతంలోని ఒక వీధిలో ఒక చిరువ్యాపారిని ఆ డ్రోన్ వెంటాడుతున్నట్లుగా జెలియెన్‌స్కీ షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. పైన తిరుగుతున్న డ్రోన్ నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అక్కడే ఉన్న ఒక తెల్లటి వ్యాన్ చుట్టూ ఆ వ్యక్తి పరిగెత్తారు. అప్పటికీ ఆయననే తరిమిన ఆ డ్రోన్ చివరకు ఆయన పైకి దూసుకొచ్చి ఒక్కసారిగా పేలడం వీడియోలో చూడొచ్చు.
ఈ డ్రోన్ దాడిలో స్పృహ తప్పిన ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని, ఆయన ట్రామాలో ఉన్నారని డాక్టర్ తెలిపారు.
పౌరులపైకి రిమోట్ ద్వారా నడిచే డ్రోన్‌లను ఉపయోగించడాన్ని 'హ్యూమన్ సఫారీ' అని పిలుస్తుంటారు. యుక్రెయిన్‌లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికి రష్యన్లు వీటిని తరచూ వాడుతుంటారు.
''ప్రపంచం అంతా ఈ వీడియోను తప్పక చూడాలి. రష్యాకు పిచ్చి పట్టిందని చూపే ప్రతీ సాక్ష్యాన్ని, యుక్రెయిన్ పౌరులను చంపుతూ, హింసిస్తూ రష్యా సైనికులు ఆనందిస్తున్నారని చెప్పే ప్రతీ విషయాన్ని అందరూ చూడాలి' అంటూ టెలిగ్రామ్‌లో జెలియెన్‌స్కీ పేర్కొన్నారు.


ఈ వీడియో ఒక 'దారుణమైన యుద్ధ నేరానికి' నిదర్శనమని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహ అన్నారు.
'రష్యా ఉద్దేశపూర్వకంగా, ఒక పథకం ప్రకారం చేస్తున్న దాడులు ఇవి. ఆ డ్రోన్‌ను ఆపరేట్ చేసిన శాడిస్ట్‌కు తను ఒక సామాన్య పౌరుడిని లక్ష్యంగా చేసుకున్నాననే విషయం బాగా తెలుసు' అని సిబిహా వ్యాఖ్యానించారు.
పౌరులను భయాందోళనలకు గురిచేయడానికి రష్యా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రలో భాగమే ఈ దాడి అని సిబిహా అన్నారు. ఈ దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రి బెడ్ మీద నుంచి బాధితుడి ఆవేదన
ఆ డ్రోన్ దాడి తర్వాత, ఆసుపత్రి బెడ్‌పై నుంచి బాధితుడు మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో ఖేర్సన్ రీజినల్ గవర్నర్ పోస్ట్ చేశారు. ఆ వ్యక్తిని యూరీ (52) అనే కూరగాయల వ్యాపారిగా గుర్తించారు.
తాను, తన భార్య కలిసి వ్యాన్ పక్కన కూరగాయల పెట్టెలు సర్దుతుండగా పైన బజ్ అంటూ ఏదో శబ్ధం వినిపించిందని యూరీ చెప్పారు.
ఆయన భార్య భయంతో అక్కడి నుంచి పరిగెత్తగానే, ఆ డ్రోన్ ఆయన వైపు తిరిగింది. తాను దాన్ని వీడియో తీయట్లేదని చూపించడానికి, తన వద్ద ఉన్న కొన్ని వెల్లుల్లిపాయలను డ్రోన్ వైపు ఎత్తి చూపినట్లు ఆయన చెప్పారు.
'నేను కిందపెట్టిన టొమాటోలు, దోసకాయలు, వంకాయలు ఆ డ్రోన్‌కు స్పష్టంగా కనిపిస్తాయి. నేను వ్యాన్‌కు అవతలివైపుకు పరిగెడుతున్నప్పుడు అది గొడుగు కిందకు కూడా వచ్చి చూసింది' అని యూరీ వివరించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఈ వీడియో ఉత్తర ఖేర్సన్‌లోని తావ్రీస్కీ ప్రాంతంలో ఉన్న మార్కెట్ ప్రదేశానికి చెందినట్లుగా బీబీసీ వెరిఫై గుర్తించింది. ఎవరు ఈ దాడిని చేశారో? ఎలా చేశారనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
అయితే, బీబీసీకి దొరికిన మొదటి వీడియో కాపీ.. మంగళవారం ఉదయం యుక్రెయిన్ అనుకూల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కనిపించింది.
ఖేర్సన్‌లో రష్యన్ దళాలు చాలా కాలంగా ఇలాంటి "సఫారీ" దాడులకు పాల్పడుతున్నాయి.
ఈ ప్రాంతంలో రష్యన్ సాయుధ దళాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడుల చేస్తోందని, వాటితో "పౌరులను చంపడం, గాయపరచడం" చేస్తున్నట్లు 2025 ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపైకి దూసుకెళ్లి పేలిపోయే ముందు ఆ డ్రోన్లు చిత్రీకరించిన వీడియోలు తరచుగా ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటాయి. దీనివల్ల ఆ క్షణంలో బాధితులు అనుభవించిన భయాన్ని, వారి చివరి క్షణాలను వేలాది మంది చూడాల్సి వస్తోంది.
'ప్రజలు చనిపోతుండగా, గాయపడుతుండగా వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం అనేది వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని, ఇది తీవ్రమైన యుద్ధ నేరం కిందకే వస్తుంది' అని ఐరాస పేర్కొంది.
యుక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి రష్యా, తాము సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నామనే ఆరోపణలను ఖండిస్తోంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























