అజర్బైజాన్: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?

ఫొటో సోర్స్, @DrSJaishankar
అజర్బైజాన్ రాజధాని బాకూలోని చారిత్రక అతేశ్గాహ్ ఆలయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సందర్శించారు.
ఆలయాన్ని దర్శించిన చిత్రాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకుంటూ ''బాకూలోని చారిత్రక అతెశ్గాహ్ అగ్ని దేవాలయాన్ని సందర్శించాను. ఇది ఇరు దేశాల ప్రజల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు ప్రతీక'' అని రాశారు.
అతెశ్గాహ్ అగ్ని దేవాలయంలో దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉంటుంది.
దీంతోపాటు దేవనాగరి లిపిలో మరో ఐదు పంక్తులు కూడా ఉన్నాయి. ఇవి అగ్నిదేవత జ్వాలాజీతోపాటు ఇతర దేవతలను ప్రార్థిస్తూ రాసిన వాక్యాలు కూడా ఉన్నాయి.
అజార్బైజాన్ కాస్పియన్ సముద్ర తీరంలోని ఓ చిన్నదేశం. ఇక్కడ ముస్లీంలు ఎక్కువగా నివసిస్తారు. గతంలో ఇది సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది.

బాకూలోని భారత రాయబార కార్యాలయం ప్రకారం, అతెశ్గాహ్లో దేవనాగరి లిపిలో 18 శాసనాలు ఉన్నాయి. వీటిలో చాలా శాసనాలు గణేశుడి ప్రార్థనతో ప్రారంభమవుతాయి. జ్వాలాజీ ప్రస్తావన డజనుకుపైగా కనిపిస్తుందని బాకూలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
- చాలా శాసనాలు 'ఓం శ్రీ గణేశాయ నమః' అనే పదాలతో ప్రారంభమవుతాయి.
- జ్వాలా జీ దేవత ప్రస్తావన 12సార్లకుపైగా ఉంది.
- ఆరు శాసనాల్లో హిందూ మతానికి పవిత్ర చిన్హమైన స్వస్తిక్ ఉంది.
అగ్ని వేదిక, భారతీయ శాసనాలకు ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం అబ్షెరాన్ ద్వీపకల్పంలోని అగ్ని ఆరాధన సంప్రదాయాలకు, భారత ఉపఖండం నుంచి వచ్చిన వ్యాపారులు, యాత్రికులతో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధాలను తెలియజేస్తోంది.
ఈ నిర్మాణాలు 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య కాలానివిగా యునెస్కో చెబుతోంది.

ఫొటో సోర్స్, @DrSJaishankar
దేవాలయ చరిత్ర
ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు దాని చరిత్రలో కీలక పాత్ర పోషించాయని యునెస్కో రిపోర్టు తెలిపింది.
అబ్షెరాన్ ద్వీపకల్పంలో భూమి లోపలి నుంచి సహజ వాయువు వెలువడటంతో మంటలు ఎగసిపడేవి. దీంతో ఈ ప్రాంతానికి మతపరమైన ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ దేవాలయ ప్రారంభ చరిత్ర పార్సీ మతంతో ముడిపడి ఉంది. అయితే, ప్రస్తుతం కనిపించే దేవాలయ సముదాయం చాలా కాలం తర్వాత నిర్మితమైనవి.
అందువల్ల ఈ ప్రాంతంతో ముడిపడిన పురాతన మత విశ్వాసాలకు, ప్రస్తుత నిర్మాణాల వాస్తవ వయసుకు మధ్య తేడాను గుర్తించడం అవసరం.
17వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి యాత్రికుల రాకపోకలు మళ్లీ పెరిగాయి.
అధికారిక వివరాల ప్రకారం, 1683లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన జర్మన్ యాత్రికుడు ఎంగెల్బర్ట్ కెంప్ఫర్ కొన్ని విషయాలను నమోదు చేశారు. ఆ శతాబ్దం మధ్యకాలంలో యాత్రికులు దేవాలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగాయి. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి ఈ దేవాలయ సముదాయం ప్రస్తుతం కనిపిస్తున్న రూపాన్ని సంతరించుకుంది.
భారత్‌తో అతెశ్గాహ్కు ఉన్న సంబంధాలు ఈ దేవాలయ ప్రత్యేకతల్లో ఒకటి. యునెస్కోకు అజర్బైజాన్ సమర్పించిన పత్రాల్లో ఈ దేవాలయాన్ని ముల్తాన్‌కు చెందిన భక్తుల తీర్థయాత్ర స్థలంగా, తాత్త్విక చింతనా కేంద్రంగా పేర్కొన్నారు.
ఈ భక్తులు కాస్పియన్ ప్రాంతంతో వ్యాపార సంబంధాలు కూడా కొనసాగించేవారు.
ముల్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అయితే, గతంలో ఇది భారత ఉపఖండంలోని విస్తృత వాణిజ్య, మతపరమైన వ్యవస్థల్లో భాగంగా ఉండేది.
భారతీయ వ్యాపారులు, యాత్రికులు ఈ దేవాలయ సముదాయం నిర్మాణానికి, నిర్వహణకు ఆర్థిక సహాయం అందించారు. దీన్ని తమ ఆరాధనలకు కూడా ఉపయోగించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సిల్క్ రూటు, భారత యాత్రికుల విడిది
ఇక్కడి శాసనాల్లో హిందూ, సిక్కు సంప్రదాయాలకు సంబంధించిన సంస్కృత, పంజాబీ లిపి కనిపిస్తుంది. హిందూ ప్రార్థనల్లో గణేశుడు, శివుడితోపాటు వివిధ దేవతల ప్రస్తావన కనిపిస్తుంది. పవిత్ర అగ్ని ఆరాధనకు జ్వాలాజీతో సంబంధం ఉంది.
'ది ష్రైన్ ఆఫ్ డెత్' రచయిత్రి దివ్య కుమార్ 2018లో ఈ దేవాలయం గురించి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ'లో ఒక కథనం రాశారు.
''అతెశ్గాహ్ చరిత్ర, ప్రపంచీకరణ, భారత ఉపఖండం నుంచి ఐరోపా వరకు జరిగిన సాంస్కృతిక మార్పిడికి సంబంధించిన ఆసక్తికరమైన చారిత్రక వారసత్వ సంపద. దీని చరిత్ర 16వ శతాబ్దం నాటిది'' అని దివ్య కుమార్ రాశారు.
ఆమె తన కథనంలో ''ఆసియా, ఐరోపాలను కలిపే సిల్క్ రూట్లో అజర్బైజాన్ భాగంగా ఉండేది. అబ్షెరాన్ ద్వీపకల్పంలోని 'మండే భూమి', 'నిత్యం వెలిగే జ్వాలల' గురించి ప్రచారంలో ఉన్న కథలు భారత ఉపఖండంలోని వ్యాపారులకు తెలిసి ఉంటాయి. ఈ ద్వీపకల్పం సహజంగా వెలిగే అగ్ని జ్వాలలకు ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి అజర్‌బైజాన్‌ను తరచూ 'అగ్ని భూమి' అని కూడా పిలుస్తారు.
16వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో, 17వ శతాబ్దం ప్రారంభంలో భారతీయ యాత్రికులు, తీర్థయాత్రికులు ఇక్కడికి చేరుకున్నారు. వారే అతెశ్గాహ్కు ప్రస్తుతం కనిపిస్తున్న రూపాన్ని ఇచ్చారు. గణేశుడు, శివుడు వంటి తమ దేవతలను పూజించడంతోపాటు ఇక్కడి పవిత్ర అగ్నిని కూడా ఆరాధించారు'' అని రాశారు.
''మేం దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన రోజు బలమైన గాలులు వీస్తున్నాయి. చుట్టూ దుమ్ము ఎగసిపడుతోంది. మేం బాకూ నుంచి 20 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నాం. స్థానిక అజెరీ భాషలో బాకూను అనధికారికంగా 'గాలుల నగరం' అని పిలుస్తారు’’ అని పేర్కొన్నారు.
‘‘అయితే, బలమైన గాలులు వీస్తున్నప్పటికీ దేవాలయ సముదాయం మధ్యలో ఉన్న ఎత్తైన ప్రధాన అగ్ని గుండంలో పవిత్ర జ్వాల నిరంతరం వెలుగుతూనే ఉంది. ప్రస్తుతం దేవాలయం మధ్యలో వెలిగే ఈ జ్వాలకు, పక్కనే ఉన్న రెండు వృత్తాకార వేదికలపై మండే మంటలకు బాకూలోని ప్రధాన గ్యాస్ పైప్‌లైన్ నుంచి సహజ వాయువును సరఫరా చేస్తున్నారు’’ అని తెలిపారు.
‘‘వందల ఏళ్లపాటు, బహుశా వేల ఏళ్లపాటు కూడా ఈ మంటలు సహజంగా వెలుగుతూ ఉండేవి. ఈ దేశంలో భారీగా ఉన్న సహజ వాయువు నిల్వల నుంచి గ్యాస్ రాతి పొరల్లోని రంధ్రాల ద్వారా బయటకు వచ్చేది. గాలి తాకిన వెంటనే అది మండిపోయేది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, @DrSJaishankar
పార్సీ మతంతో ముడిపడిన చరిత్ర
దివ్య కుమార్ కథనం ప్రకారం, ''అజర్బైజాన్ చరిత్రలో అగ్నిని ఆరాధించేవారు ఈ 'నిత్యం వెలిగే జ్వాలలను' పూజించేవారు. ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రికులు రాసిన వివరాల్లో ఏడో శతాబ్దం నుంచే వీటి ప్రస్తావన కనిపిస్తుంది. భారతీయ యాత్రికులు ఇక్కడికి రావడానికి చాలా కాలం ముందే పార్సీ మతాన్ని అనుసరించేవారు ఈ అగ్ని దేవాలయానికి పూర్వరూపాన్ని నిర్మించి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. 1969లో దేవాలయ పునరుద్ధరణ పనులు చేపట్టినప్పుడు ప్రస్తుతం ఉన్న నిర్మాణం కింద పాత భవనానికి సంబంధించిన కొన్ని భాగాలు బయటపడ్డాయి.
'అతెశ్గాహ్' అనే పేరు పర్షియన్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం 'అగ్ని గృహం'. పాత దేవాలయం ప్రస్తుతం ఉన్న సముదాయం సరిహద్దులను దాటి విస్తరించి ఉండవచ్చని సూచించే ఆధారాలు కూడా లభించాయి.
అయితే, 19వ శతాబ్దం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు అన్వేషణ పనులు చేపట్టడంతో మిగిలిన పురాతన నిర్మాణాలు ధ్వంసమై ఉండవచ్చు'' అని పేర్కొన్నారు.
యునెస్కోకు అజర్బైజాన్ సమర్పించిన పత్రాల ప్రకారం, సురాఖానీలో పెట్రోలియం పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలు విస్తరించడంతో 1883లో ఈ దేవాలయంలో పూజలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చారు. ప్రస్తుతం దీన్ని చారిత్రక, వాస్తుశిల్ప పరిరక్షిత ప్రాంతంగా సంరక్షిస్తున్నారు.
దివ్య కుమార్ తన కథనంలో ''దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ఇప్పటికీ నిలిచి ఉంది. విభిన్న సంస్కృతులతో ముడిపడి ఉన్న తన గత చరిత్ర ఆనవాళ్లను కాపాడుకుంటోంది. దేవాలయం మధ్యలో ఉన్న అగ్ని వేదిక నిర్మాణం పూర్తిగా హిందూ శైలిలో లేదు. సంప్రదాయ పార్సీ అగ్ని వేదికలతో కూడా దీనికి పోలికలు కనిపిస్తాయి. దేవాలయ సముదాయంలో పర్షియన్ భాషలో రాసిన ఓ శాసనం కూడా ఉంది. అజర్బైజాన్లో పార్సీ మత ప్రభావం చాలా పురాతనమైనది. ఈ ప్రాంత చరిత్రతో అది బలంగా ముడిపడి ఉంది.
ఇస్లాం రాకముందు, ఈ ప్రాంతాన్ని పాలించిన పర్షియన్ రాజవంశాల కాలం నుంచి ఈ వారసత్వం కొనసాగుతోంది. నేటికీ పార్సీ నూతన సంవత్సరమైన నౌరోజ్ ఇక్కడి పండుగల్లో ప్రధానమైనదిగా ఉంది. చారిత్రక వివరాల ప్రకారం, 19వ శతాబ్దంలో బొంబాయి నుంచి వచ్చే పార్సీలకు కూడా అతెశ్గాహ్ ఒక తీర్థయాత్ర స్థలంగా మారింది. ఒకప్పుడు పార్సీ మతాన్ని అనుసరించేవారి ఆరాధనా స్థలంగా ఉన్న ఈ భారతీయ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వారు వచ్చేవారు'' అని రాశారు.
1969లో పునరుద్ధరణ పనులు చేపట్టిన తర్వాత 1975లో ఈ దేవాలయాన్ని మ్యూజియంగా మార్చారు. 1998లో దీన్ని అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























