కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారంటూ పదేపదే వదంతులు, ఎందుకిలా?

ఫొటో సోర్స్, KCNA
- రచయిత, లారా బికర్
- హోదా, చైనా కరెస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించి తాజా ఫోటోలు ప్రచురితమవుతున్నాయి.
ఈ ఫోటోల్లో ఆయన చాలా ఆరోగ్యకరంగా కనిపించారు.
మెదడులో రక్తస్రావం కారణంగా బీజింగ్‌లోని ఓ ఆస్పత్రిలో ఉత్తర కొరియా పాలకుడు చనిపోయారంటూ.. అంతకు కొన్ని గంటల క్రితమే పెద్ద ఎత్తున వదంతులు వినిపించిన తర్వాత.. ఈ ఫోటోలు బయటికు వచ్చాయి.
ఉత్తర కొరియా అధికారిక వార్తా పత్రిక 'రోడోంగ్ సిన్మున్' వీటిని ప్రచురించింది.
వీటిల్లో.. ఉత్తర కొరియా పాలకుడు 42 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి దుస్తులు, షూలకు చెందిన ఒక ఎగ్జిబిషన్‌ను తిలకిస్తూ కనిపించారు.

అమెరికాలో నివసించే అసమ్మతి చైనా కార్యకర్త ఒకరు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన చనిపోయారంటూ వదంతులు సృష్టించిన తర్వాత.. కొన్ని గంటలకే ఈ ఫోటోలు దర్శనమిచ్చాయి.
కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారని, చికిత్స కోసం ఆయన్ను బీజింగ్‌లో ఒక ఆస్పత్రిలో చేర్చారని, అక్కడే ఆయన మరణించినట్లు ఈ అసమ్మతివాది పేర్కొన్నారు.
ఉత్తర కొరియాను నిశితంగా పరిశీలిస్తున్న వారికి, ఇలాంటి వదంతులు ప్రస్తుతం చాలా సాధారణ విషయమైపోయాయి.
ప్రపంచంలో అత్యంత రహస్యంగా ఉండే దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఆ దేశానికి సంబంధించిన ఏ సమాచారన్నైనా ధ్రువీకరించడం కష్టమే. అందుకే, చాలా తేలికగా వదంతులు వ్యాపిస్తుంటాయి.
కిమ్ చనిపోయిన వదంతి ఎక్కడ నుంచి వచ్చింది?
ఈసారి ఈ వదంతిని వాంజున్ షీ అనే వ్యక్తి వ్యాప్తి చేశారు.
ఈయన తనను తాను చైనీస్ అధికారులు నిషేధించిన చైనీస్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన చైర్మన్‌గా చెప్పుకుంటున్నారు.
చైనా నేత షి జిన్‌పింగ్ మరణంతో పాటు ఈయన అంతకుముందు చాలా ధ్రువీకరించని వాదనలు చేశారు.
కిమ్ జోంగ్ ఉన్ మెదడులో తీవ్రమైన రక్తస్రావంతో ఇబ్బందిపడ్డారని వాంజున్ షీ పేర్కొన్నారు.
ఉత్తర కొరియాలో అవసరమైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో వెంటనే ఆయన్ను బీజింగ్‌కు తీసుకువెళ్లారని తెలిపారు.
ఆ తర్వాత కిమ్ చనిపోయారని, రహస్యంగా ఆయన మృతదేహాన్ని ఉత్తర కొరియాకు తిరిగి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఆయన మరణాన్ని ఉత్తర కొరియా దాచిపెడుతోందని కూడా ఆరోపించారు.
అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోలు ఆయన చెప్పిన దానికి భిన్నమైన కథనాన్ని వెల్లడిస్తున్నాయి.

ఫొటో సోర్స్, KCNA
2020లోనూ వదంతులు
ఈ ఫోటోల్లో కిమ్ తన కుమార్తె 'కిమ్ జు యే'తో, ఎల్లప్పుడూ తనతోనే ఉండే అధికారులతో ఈ ప్రదర్శనను సందర్శిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఈ ఫోటోలు సరిగ్గా ఎప్పుడు తీశారో తెలుసుకునే అవకాశం లేకపోయినప్పటికీ, ఈ వాదనను అనుమానించడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే, ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఎలాంటి అలజడి కనిపించలేదు.
ఒకవేళ నిజంగానే కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా సీరియస్‌గా మారి ఉంటే, బహుశా ఉత్తర కొరియా సరిహద్దుల బయట కూడా ఇది కనిపించి ఉండేది.
అస్థిరత ముప్పు లేదా శరణార్థుల ప్రవాహం తలెత్తే అవకాశం ఉన్నందున చైనా తన సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసి ఉండవచ్చు.
ఉత్తర కొరియా దౌత్య కార్యాలయాల పరిసరాల్లో కూడా కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది.
దక్షిణ కొరియాలో నివసించే ఉత్తర కొరియన్లకు చైనా సరిహద్దులోని అనధికారిక వ్యక్తుల ద్వారా తరచూ సమాచారం పొందుతూ ఉంటారు.
కానీ, ఈసారి అలా జరగలేదు.
ఈ నివేదికలను ధృవీకరించే ఎలాంటి సమాచారం తమకు అందలేదని దక్షిణ కొరియా నిఘా అధికారులు కూడా యోన్హాప్ వార్తా సంస్థకు తెలిపారు.
కిమ్ జోంగ్ ఉన్ మరణం గురించిన ఈ వదంతి, గతంలో వ్యాపించిన తప్పుడు వార్తల్లానే ఉంది.
2020లో, కూడా గుండె శస్త్రచికిత్స తర్వాత కిమ్ మరణించారని తాను "99 శాతం కచ్చితంగా" నమ్ముతున్నానని ఉత్తర కొరియాకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి (దేశం విడిచి వచ్చిన వ్యక్తి) పేర్కొన్నారు.
అయితే, కొద్ది కాలానికే కిమ్ బహిరంగంగా కనిపించడంతో, ఆ వాదన నిజం కాదని తేలిపోయింది.
పదేపదే ఈ వదంతులు దేనికి?
ఇలాంటి వదంతులు పుట్టడానికి మొదటి కారణం ఉత్తర కొరియాలో అధికార వారసత్వానికి సంబంధించిన అనిశ్చితినే.
ఉత్తర కొరియాను కిమ్ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు పాలించారు. కానీ కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఏం జరుగుతుందనే విషయంలో, ఆయన పూర్వీకుల హయాంలో కంటే ప్రస్తుతం స్పష్టత కరువైంది.
కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ తన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్కు అధికారాన్ని బదిలీ చేయడానికి దశాబ్దాలపాటు సన్నాహాలు చేశారు.
కిమ్ ఇల్ సంగ్ 1994లో మరణించే సమయానికి వారసత్వ బదిలీ ప్రణాళిక సిద్ధంగా ఉంది. దీంతో, కిమ్ జోంగ్ ఇల్కు అధికార మార్పిడి చాలా తేలికగా జరిగింది.
కానీ, కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి రావడం చాలా వేగంగా, అనిశ్చితి పరిస్థితుల మధ్య జరిగింది. 2008లో కిమ్ జోంగ్ ఇల్ స్ట్రోక్‌కు గురైన తర్వాత.. ఆయన చిన్న కుమారుడు అధికారంలో వివిధ స్థాయిల్లో చాలా వేగంగా ప్రమోట్ అవుతూ వచ్చారు.
ఆయన తండ్రి 2011లో మరణించే సమయానికి, కిమ్ జోంగ్ ఉన్ను ఉత్తర కొరియా భవిష్యత్ నాయకుడిగా బహిరంగంగా ప్రకటించారు.
అయినా తన అధికారాన్ని పదిలం చేసుకోడానికి కిమ్ జోంగ్ ఉన్‌కు చాలా ఏళ్లు పట్టింది.
ఈ సమయంలో ఆయన తన ప్రత్యర్థులను, తనకు ముప్పుగా భావించిన వారిని తొలగించారు.

ఫొటో సోర్స్, KCNA VIA KNS/AFP via Getty Images
కిమ్ జో యే ఆయన వారసురాలా?
కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా తన కుమార్తెను సిద్ధం చేస్తుండొచ్చని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ భావిస్తోంది.
కిమ్ జు యే అంతకుముందు కంటే ఎక్కువగా ప్రముఖ బహిరంగ సమావేశాల్లోనూ, సైనిక ప్రదర్శనల్లోనూ బాగా కనిపిస్తున్నారు.
అయితే, ఆమె వయసు కేవలం 13 ఏళ్లే ఉంటాయని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ఉత్తర కొరియాకు ఒక మహిళ నాయకత్వం వహించలేదు. పైగా, ఇప్పటి వరకు కిమ్ జు యేను అధికారికంగా ఆయన వారసురాలిగా కూడా ప్రకటించలేదు.
ఆమె వయసులో చిన్నది కావడంతో, ఏదైనా అధికార పోటీ నెలకొంటే ఆమె స్థానం బలహీనంగా మారవచ్చు.
వారసత్వానికి సంబంధించిన ఈ అనిశ్చితి వల్లే, కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యానికి సంబంధించిన పుకార్లు ఇంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పుకార్లు పూర్తి అబద్దమని ఎందుకు అనిపించడం లేదు?
కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి వ్యాపిస్తున్న వదంతులు పూర్తిగా అసాధ్యమైనవిగా అనిపించడం లేదు.
ఎందుకంటే, కిమ్ అధిక బరువుతో ఉంటారు. ఎక్కువగా ధూమపానం చేస్తారు.
ఆయన జీవనశైలి గుండె, ధమనులకు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతుందని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు పదేపదే హెచ్చరించింది.
కిమ్ కుటుంబానికి గుండె జబ్బులు, పక్షవాతం చరిత్ర కూడా ఉంది.
ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్‌కు ఏదైనా అయితే.. దాని పొరుగు దేశాలపై, అంతర్జాతీయ సమాజంపై పర్యవసనాలు విస్తృతంగాఉంటాయి
అకస్మాత్తుగా ఏదైనా నాయకత్వ సంక్షోభం తలెత్తితే.. ఉత్తర కొరియా అణ్వాయుధాల నియంత్రణ, రాజకీయ అస్థిరతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తనున్నాయి.
అధికారం కోసం జరిగే పోరాటం, రాడికల్ నాయకులను దూకుడు చర్యలు తీసుకునేలా ప్రేరేపించగలదా?
ఈ అశాంతి చైనా సరిహద్దులో శరణార్థుల సంక్షోభానికి దారితీయగలదా?
ఈ ప్రశ్నలు.. బీజింగ్, సియోల్‌కు మాత్రమే సంబంధించినవి కావు.
దక్షిణ కొరియాలో సుమారు 28,000 మంది సైనికులను మోహరించిన వాషింగ్టన్ కూడా వాటిపై నిఘా ఉంచుతుంది.
అందుకే నిఘా సంస్థలు కిమ్ జోంగ్ ఉన్‌పై చాలా నిశితంగా నిఘా ఉంచుతాయి. దీంతో ఆయనకు సంబంధించిన ఏ వార్తకైనా ముందుగానే సిద్ధంగా ఉంటాయి.
'బ్లాక్ హోల్స్' సమాచారం లాంటిది
ఉత్తర కొరియా సమాచారానికి సంబంధించినంతవరకు ఒక బ్లాక్ హోల్ లాంటిది. దీనివల్ల ఇది నకిలీ వార్తలకు సులభమైన లక్ష్యంగా మారుతుంది.
ఉత్తర కొరియా నాయకుడిని క్రమం తప్పకుండా కలిసే అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంది. నిఘా వర్గాలకు కూడా నమ్మదగిన సమాచారాన్ని సేకరించడం కష్టంగా మారుతోంది.
బయటకు వచ్చే సమాచారం కూడా తరచూ అనేక షరతులు లేదా హెచ్చరికలతో ఉంటుంది.
అంటే, దీన్ని కచ్చితమైన వాస్తవంగా కాకుండా, "ధృవీకరించనిదిగా" లేదా "జరిగే అవకాశం ఉన్నదిగా" పేర్కొంటుంటారు.
దేశం లోపల అసలు ఏం జరుగుతోందో దాచిపెట్టడానికి, ఉద్దేశపూర్వకంగా ఉత్తర కొరియా గందరగోళాన్ని సృష్టిస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందేలా చేస్తోందని అనుమానిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితిలో, ఉత్తర కొరియాపై నిఘా ఉంచాల్సిన వారికి ఎలాంటి సమాచారం అందకుండా, వాంజున్ షీకి అంత ముఖ్యమైన వార్త ఎలా అందిందో నమ్మడం కష్టం.. ఆయన కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు.
ఉత్తర కొరియాతో చైనాకున్న సంబంధాలను ఎత్తిచూపుతూ బీజింగ్‌ను ఇబ్బంది పెట్టాలన్నది కూడా ఆయన ఉద్దేశం కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే, బీజింగ్, ప్యాంగ్యాంగ్ల మధ్య సంబంధం ప్రపంచానికి ఇప్పటికే సుపరిచితమే.
ఆయన ఉద్దేశాలు ఏవైనప్పటికీ, ఉత్తర కొరియా నాయకత్వం చుట్టూ నెలకొన్న అనిశ్చితిని అవకాశంగా తీసుకున్న మొదటి వ్యక్తి వాంజున్ షీ మాత్రమే కాదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































