లైవ్, ఆంధ్రప్రదేశ్: పొంచి ఉన్న తుపాను ముప్పు, ఏయే జిల్లాల్లో అంటే..

ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచివున్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని హెచ్చరించింది.

సారాంశం

  • ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచివున్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని హెచ్చరించింది.
  • ఈ ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
  • న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్‌ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్‌ కుశాగ్రాను రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
  • జోర్డాన్‌లోని ఓ చర్చిలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 34 మంది గాయపడ్డట్లు తెలిపారు.
  • కరాక్ గవర్నరేట్‌లోని హమూద్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దుండగులు ఓ కారులో వచ్చి, చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ‘మక్కా ఒప్పందం ఉన్నా తుర్కియేకు హూతీ రెబెల్స్‌తో పోరాడే ఉద్దేశం లేదు’

    హూతీ, తుర్కియే, మక్కా ఒప్పందం
    ఫొటో క్యాప్షన్, తుర్కియే రక్షణ మంత్రి యాషర్ గులెర్

    ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ఎలాంటి సైనిక పోరాటంలోనూ పాల్గొనే ఉద్దేశం తమకు లేదని తుర్కియే తెలిపింది.

    వాస్తవానికి సౌదీ అరేబియా, పాకిస్తాన్‌తో కలిసి తుర్కియే ఉమ్మడి రక్షణ ఒప్పందం (మక్కా ఒప్పందం) కుదుర్చుకుంది.అయితే, సౌదీ అరేబియాపై దాడులు చేస్తున్న హూతీ తిరుగుబాటుదారులతో పోరాడేందుకు తుర్కియే నిరాకరించింది.

    ‘‘హూతీలతో ఎలాంటి పోరాటంలోనూ పాల్గొనే విషయాన్ని మేం పరిశీలించడం లేదు’’ అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తుర్కియే రక్షణ మంత్రి యాషర్ గులెర్ చెప్పారు.

    సౌదీ అరేబియాకు తుర్కియే అందించే సైనిక సహాయం ప్రధానంగా దాడులను నిరోధించే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికే ఉద్దేశించినదని ఆయన తెలిపారు.

    ఆగస్టులో తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య ‘మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం’ కుదిరింది. ఈ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, దాన్ని మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.

  2. ఆంధ్రప్రదేశ్: పొంచివున్న తుపాను ముప్పు, ఏయే జిల్లాల్లో అంటే..

    విశాఖపట్నం, తుపాను హెచ్చరిక కేంద్రం
    ఫొటో క్యాప్షన్, ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది.

    ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచివున్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని హెచ్చరించింది.

    ముఖ్యమైన హెచ్చరికలు, వివరాలు:

    • అల్పపీడనం బలపడే తీరు: ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
    • ఇది అక్టోబర్ 26 నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మరే అవకాశం ఉందని, ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించనుందని అంచనా వేశారు.
    • భారీ వర్షాలు: ఈ ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
    • విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అతి తీవ్ర వర్షాలు కురిసే సూచనలున్నాయి.
    • ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో (అప్పుడప్పుడు 185 కిలోమీటర్లు) తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది.
    • మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
    • ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు.
  3. టీమిండియా న్యూజీలాండ్ టూర్: ఇషాన్ కిషాన్ స్థానంలో ఎవరంటే...?

    ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్ర
    ఫొటో క్యాప్షన్, తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు.

    న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్‌ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్‌ కుశాగ్రాను రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

    ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియా 'ఏ' జట్టుతో ఉన్న కుశాగ్రా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టుతో కలవనున్నాడు.

    తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం (రైట్ అడక్టర్ స్ట్రెయిన్)తో బాధపడ్డాడు.

    రెండో టీ20 కోసం భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్).

  4. జోర్డాన్: అంత్యక్రియల వద్ద కాల్పులు, ఏడుగురి మృతి

    జోర్డాన్ కాల్పులు
    ఫొటో క్యాప్షన్, కరాక్ గవర్నరేట్‌లోని హమూద్ గ్రామంలో దాడి జరిగినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

    జోర్డాన్‌లోని ఓ చర్చిలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో 34 మంది గాయపడినట్లు తెలిపారు.

    కరాక్ గవర్నరేట్‌లోని హమూద్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దుండగులు ఓ కారులో వచ్చి, చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

    ఈ ఘటనను ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ అల్-మోమానీ మొహమ్మద్ ‘హేయమైన దాడి’గా అభివర్ణించారు.

    బీబీసీ ధ్రువీకరించిన సీసీటీవీ దృశ్యాల్లో ముగ్గురు సాయుధులు రోడ్డు నుంచి చర్చి వైపు వెళ్తున్నట్లు కనిపించింది.

    ఇద్దరు దుండగులు చర్చి ప్రాంగణంలోకి వాహనాలు ప్రవేశించే ద్వారం వైపు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మూడో వ్యక్తితో కలిసి తిరిగి వస్తున్నట్లు ఆ దృశ్యాల్లో కనిపించింది. ముగ్గురి చేతుల్లోనూ తుపాకులు ఉన్నాయి.

    అంత్యక్రియలకు హాజరైన ఓ వ్యక్తి జోర్డాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ అల్-మమ్లకాతో మాట్లాడారు. ఇద్దరు దుండగులు కొన్ని నిమిషాలపాటు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. సంతాప సభకు వచ్చినవారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలిపారు.

  5. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.