సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
ప్రభుత్వంతో చర్చల అనంతరం తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు.
కేంద్రం, సీజేపీ మధ్య కొన్నిరోజులుగా చర్చలు సాగాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, మరోమారు చర్చలు జరిగాయి. ఆ తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు సంయుక్తంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా సౌరవ్ దాస్ మాట్లాడుతూ, "అంగీకారం కుదిరిన అంశాలు నిర్ణీత గడువులోగా అమలు చేస్తామన్న హామీతో, కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటిస్తోంది" అని పేర్కొన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ, "మన డిమాండ్లన్నీ అంగీకరించారు. కాబట్టి విద్యార్థులు వెంటనే తమ ఆందోళనలను విరమించుకుని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తు వ్యూహాన్ని, ఇతర అంశాలను మీకు తెలియజేస్తాం" అని చెప్పారు.
వారి డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. పరీక్షల సంస్కరణలపై చార్టర్ ఇచ్చారని, దానిపై చేయగలిగినదంతా చేస్తామని అన్నారు.

'మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి'
ప్రభుత్వ ప్రతినిధి బృందంతో మూడు విడతల్లో చర్చలు జరిపినట్లు అశుతోష్ రాంకా తెలిపారు.
"గత కొన్నిరోజులుగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మా ఆందోళనలో మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులు, నిర్వాహకులపై నమోదైన అన్ని చట్టపరమైన కేసులు, ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలి. భవిష్యత్తులో నిరసనకారులు లేదా నిర్వాహకులపై ఎలాంటి కేసులు పెట్టకూడదు.
నీట్ పరీక్ష లీకేజీ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం అందించాలనేది మా మూడో డిమాండ్" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
'ముసాయిదా అందించాం'
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, దీనర్థం మా మొదటి డిమాండ్ అంగీకరించారని అశుతోష్ రాంకా అన్నారు.
దిల్లీలోనే కాకుండా బీజేపీ పాలిత, మిత్రపక్ష రాష్ట్రాలన్నింటిలో నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలనేది తమ రెండో డిమాండ్ అని, ప్రభుత్వం దాన్ని కూడా అంగీకరించిందని సౌరవ్ దాస్ చెప్పారు.
"నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ల కాపీలను అందిస్తామని ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. మాకున్న సమాచారం ప్రకారం, దిల్లీలో 15 నుంచి 20 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆ కాపీలు మాకు అందుతాయి. ఉపసంహరణ త్వరలోనే జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంగళవారం నాటికి మాకు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది" అని ఆయన అన్నారు.
అశుతోష్ రాంకా మాట్లాడుతూ, "నీట్ బాధితుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం అందించాలని మేం డిమాండ్ చేశాం. నిబంధనల ప్రకారం వీలైనంత గౌరవప్రదమైన పరిహారాన్ని ఆయా కుటుంబాలకు అందజేస్తామని ప్రభుత్వం అంగీకరించింది. ఇది కాకుండా, మేం ప్రభుత్వానికి ఐదు అంశాల డిమాండ్ చార్టర్‌ను కూడా సమర్పించాం. ఇందులో విస్తృతమైన విద్యా సంస్కరణలు, పరీక్షల సంస్కరణల గురించి ప్రస్తావించాం. ఆ డిమాండ్ చార్టర్ విషయమై మేం నాలుగు వారాల్లో ప్రభుత్వాన్ని కలుస్తాం" అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images)
మేం చేయగలిగినదంతా చేస్తాం: జేపీ నడ్డా
కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, "ఈ రోజు మేం సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఉద్యమంలో నమోదైన ప్రస్తుత కేసులకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన ఒక లిఖితపూర్వక ముసాయిదాను వారు తీసుకువచ్చారు. వాటితో పాటు, మిగిలిన రెండు డిమాండ్లపై కూడా మేం చర్చించాం: ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, పరిహారం అందించాలి, అలాగే వారి ఐదు అంశాల చార్టర్‌ను పరిగణించడం. మేం వారికి ఎఫ్ఐఆర్ల కాపీలను అందిస్తాం, ఎలాంటి చర్యలు తీసుకోబోం.
రెండో విషయానికి వస్తే... పరిహారంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాకూ సానుభూతి ఉంది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్టంగా అందిస్తామని చెప్పాం" అని పేర్కొన్నారు.
"నాకు ఇచ్చిన ఈ ఐదు అంశాల చార్టర్, విద్యా పరీక్షల్లో సంస్కరణలకు సంబంధించినది. దీనిపై మేం చెప్పేది ఏంటంటే, పరీక్షల సంస్కరణల కోసం ఇచ్చిన చార్టర్‌పై మేం లోతుగా ఆలోచిస్తాం. మేం చేయగలిగినదంతా చేస్తాం. ఇవే వారి డిమాండ్లు. వాటన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని భావిస్తున్నాను" అని జేపీ నడ్డా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























