డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డ హత్య కేసు- నిర్దోషిగా విడుదలైన తల్లి

అబార్షన్, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేక్ క్వాన్, సోల్ కరెస్పాండెంట్, లీహ్యూన్ చోయ్, సోల్ ప్రొడ్యూసర్, కోహ్ ఈవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

(ఈ కథనంలోని అంశాలు కలచివేయొచ్చు)

ఆస్పత్రిలో ప్రసవించిన శిశువును హత్య చేసిన కేసులో గతంలో దోషిగా తేలిన ఓ మహిళను దక్షిణ కొరియా కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

దేశాన్ని కుదిపేసి, అస్పష్టమైన గర్భస్రావ (అబార్షన్) చట్టాలపై చర్చను రేకెత్తించిన ఈ కేసులో ఇదొక తాజా మలుపుగా నిలిచింది.

ఆ మహిళ 36 వారాల గర్భాన్ని తొలగించుకోవాలని కోరుకున్నారు. కానీ, బిడ్డ సజీవంగానే జన్మించిందని, ఆ తర్వాత హత్యకు గురైందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

క్వాన్ అనే ఇంటిపేరుతోనే ప్రస్తుతం ఆ మహిళను గుర్తించారు.

మార్చిలో ఇద్దరు వైద్యులతో పాటు ఆమె కూడా ఈ హత్య కేసులో దోషిగా తేలారు. ఆమెకు మూడేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష విధించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వైద్యులపై హత్య నేరారోపణలను అప్పీల్స్ కోర్టు సమర్థించినప్పటికీ, వారి జైలు శిక్షలను తగ్గించింది. క్వాన్‌కు ఆపరేషన్ చేసిన సర్జన్‌కు విధించిన నాలుగేళ్ల శిక్షను రెండున్నరేళ్లకు తగ్గించారు.

మొదట ఆరేళ్ల జైలు శిక్ష పడిన ఆసుపత్రి డైరెక్టర్‌కు నాలుగేళ్ల శిక్షగా తగ్గించారు.

విచారణలో ఈ ఇద్దరు వైద్యులు పుట్టిన బిడ్డను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

20ల వయసులో ఉన్నప్పుడు క్వాన్ ... యూట్యూబ్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు. 36 వారాల (ఎనిమిది నెలలు దాటిన) తన గర్భాన్ని తీసేసుకోవాలకుంటున్నట్లు ఆ వీడియోలో పేర్కొనడంతో 2024లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఆ వీడియోపై ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆరోగ్య శాఖ దీనిపై క్రిమినల్ కేసు పెట్టింది. అనంతరం పోలీసులు ఆమెపై, ఆమె వైద్యులపై దర్యాప్తు ప్రారంభించారు.

క్వాన్, ఆమె వైద్యులపై జరిగిన విచారణలో, చివరి దశలో గర్భాన్ని తీసివేయించుకోవాలని ఆ మహిళ కోరడంతో పాటు, ఆ ప్రక్రియలో పాల్గొన్న వైద్యులపై కూడా హత్యా నేరం మోపడం దేశంలో ఇదే మొదటిసారి.

అబార్షన్, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

2019లో దక్షిణ కొరియాలో అబార్షన్లు నేరం కాదని ప్రకటించినప్పటికీ, గర్భం దాల్చిన ఎంత వ్యవధి వరకు అబార్షన్ చేయించుకోవచ్చనే దానిపై ఎటువంటి స్పష్టమైన నిబంధనలు లేవు.

సిజేరియన్ ద్వారా బిడ్డ సజీవంగానే పుట్టినట్లు క్వాన్ కేసులోని ప్రాసిక్యూటర్లు తెలిపారు. కానీ, బిడ్డ చనిపోయేంత వరకు ఫ్రీజర్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు.

ఆ తర్వాత క్వాన్‌కు చనిపోయిన బిడ్డ పుట్టినట్లు చూపించేందుకు వైద్య రికార్డులను తప్పుగా చూపించినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.

తన కడుపు నుంచి తీసిన తర్వాత బిడ్డను చంపేస్తారని కనీసం క్వాన్‌కు కూడా తెలియదని ఆమె న్యాయవాది వాదించారు. ఆమె అప్పీల్ చేసుకునేందుకు చేపట్టిన వాదన కూడా ఇదే.

మార్చిలో తొలుత దీనిపై తీర్పు చెప్పిన జడ్జి.. సిజేరియన్ ద్వారా బిడ్డ ప్రాణాలతోనే పుడుతుందని క్వాన్‌కు తెలుసని చెప్పారు.

కానీ, పుట్టబోయే బిడ్డ చనిపోయి పుడుతుందని క్వాన్‌కు ఒక మధ్యవర్తి చెప్పడంతో.. క్వాన్‌కు తెలుసన్న విషయం నిజం కాకపోవచ్చని గురువారం అపీల్స్ కోర్టు వెల్లడించిన తీర్పులో పేర్కొంది.

అబార్షన్, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 36 వారాల ప్రెగ్నెన్సీ తొలగించుకోవాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళ యూట్యూబ్‌ వీడియోలో కోరడం దక్షిణ కొరియాలో సంచలనం సృష్టించింది.

''క్వాన్‌ను నిర్దోషిగా విడుదల చేయాలన్న కోర్టు నిర్ణయాన్ని మా సంస్థ స్వాగతిస్తోంది. అయితే, దక్షిణ కొరియా గర్భస్రావ చట్టంలోని లోపం కారణంగా "గర్భిణీ స్త్రీలకు స్పష్టమైన చట్టపరమైన రక్షణలు, అవసరమైన సంతానోత్పత్తి ఆరోగ్య సంరక్షణ అందుబాటు లేకుండా పోయింది" అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కొరియా కార్యనిర్వాహక డైరెక్టర్ హీక్యోంగ్ చో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

''సురక్షితమైన గర్భస్రావాన్ని పొందేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు, అలాగే గర్భస్రావ సేవల విధానంపై సరైన నిబంధనలను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి'' అని తెలిపారు.

ఈ విచారణ ప్రారంభంలో.. తనకు ఏడు నెలల గర్భమని, స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల అబార్షన్ కోరుకున్నట్లు కోర్టుకు తెలిపారు క్వాన్.

తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మద్యం, ధూమపానం చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏమైనా లోపాలు వచ్చే అవకాశం ఉందని భయపడినట్లు కూడా క్వాన్ చెప్పారు.

2019లో దీర్ఘకాలంగా ఉన్న గర్భస్రావం రద్దును దక్షిణ కొరియా రాజ్యాంగపరంగా తొలగించిన తర్వాత ఆ దేశంలో గర్భస్రావాల చుట్టూ నెలకొన్న చట్టపరమైన శూన్యతపై క్వాన్ కేసు ప్రత్యేక దృష్టి సారించేలా చేసింది.

అదే సమయంలో, 22 వారాల ప్రెగ్నెన్సీ వరకు గర్భస్రావానికి అనుమతి ఇచ్చేందుకు చట్టాన్ని పార్లమెంట్ సవరించాలని కోర్టు ప్రతిపాదించింది.

అయితే, ప్రభుత్వం రూపొందించిన చట్టం, మతపరమైన కారణంతో కన్జర్వేటివ్ చట్టసభ సభ్యుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా నిలిచిపోయింది.

2021లో ఈ నిషేధ రద్దు అమలులోకి వచ్చిన నాటికి, దేశంలో అబార్షన్‌లను నియంత్రించడానికి ఎటువంటి చట్టాలు అందుబాటులో లేవు.

క్వాన్‌కు తొలిసారిగా శిక్ష విధించేటప్పుడు ఈ విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆమె చివరి దశ గర్భధారణ సమయంలో తగిన సహాయం పొందలేకపోయినందున... తాము కొంత ఉదారత చూపినట్లు కోర్టు పేర్కొంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)