రంగా కార్పొరేటర్‌గా గెలిచిన బెజవాడకు ఇప్పుడు రాధా మేయర్

ఫొటో సోర్స్, facebook/Vangaveeti Radha krishna
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
పాతికేళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో విజయవాడ మేయర్‌గా ఎన్నికయ్యారు.
నవంబర్ 1న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేనఅభ్యర్థిగా పోటీ చేసిన రాధాకృష్ణ సమీప వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు వచ్చాయి.
విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి మోహన రంగా, వంగవీటి రత్నకుమారిల కుమారుడే రాధాకృష్ణ.
వంగవీటి మోహనరంగా 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవగా.. రంగా హత్యానంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య రత్నకుమారి అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1994 ఎన్నికల్లోనూ ఆమె అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు.
అయితే ఆ తర్వాత అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె టీడీపీలో చేరారు. కానీ, 1999 ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే సీటు దక్కలేదు.
ఆ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా సినీ నటుడు కోట శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు.


ఫొటో సోర్స్, Vangaveeti Radha krishna/FB
కాంగ్రెస్ నుంచి జనసేన వరకు
వంగవీటి రత్నకుమారికి 1999 ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో వంగవీటి రాధాకృష్ణ 2003 చివరిలో రాజకీయ ప్రవేశం చేశారు.
ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2003 డిసెంబర్ 26న రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరంలోని పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ నేత ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ తర్వాత 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లి, తండ్రి పోటీ చేసిన తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
అప్పటికి రాధా వయస్సు 25 సంవత్సరాలే. అప్పట్లో పిన్నవయసులో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు పొందారు.
2008లో పీఆర్పీ. ఆ తర్వాత వైసీపీ.. అటు నుంచి టీడీపీ ఇప్పుడు జనసేనలోకి వచ్చారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో 2008 డిసెంబర్ 21న రాధా చేరారు. 2009 ఎన్నికల్లోపునర్విభజనలో భాగంగా విజయవాడలో మూడో నియోజకవర్గంగా రూపాంతరం చెందిన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.
విజయవాడ నగరంలో మూడు సీట్లు ఉండగా రెండు సీట్లలో పీఆర్పీ గెలిచినా రాధా మాత్రం పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత 2012లో వైసీపీలో చేరిన రాధా 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో 12 వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు.

ఫొటో సోర్స్, facebook/VangaveetiRadhaKrishna
ఏడేళ్లుగా టీడీపీలోనే
2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన రాధా ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2024 ఎన్నికల్లో సైతం ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు కానీ ఎక్కడా పోటీ చేయలేదు.
రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాధా మేయర్ బరిలోకి వచ్చారు కానీ దాదాపుగా ఏడేళ్లుగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా సరిగ్గా ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేసి గెలుపొందారు.

ఫొటో సోర్స్, facebook/vangaveetiradhakrishna
‘కృష్ణలంక కార్పొరేటర్‌గా వంగవీటి మోహన రంగా’
వంగవీటి మోహనరంగా 1985లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు అయితే అంతకుముందు 1981లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన కృష్ణలంక ప్రాంత కార్పొరేటర్ గా 40వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
అప్పట్లో ఓ హత్య కేసులో జైల్లో ఉన్న ఆయన ప్రచారం కూడా చేయకుండానే జైలు నుంచి కార్పొరేటరుగా గెలుపొందారు.
ఇప్పుడు ఆయన కుమారుడు అదే విజయవాడ నగరానికి మేయరుగా ఎన్నికయ్యారు.
1979లో కృష్ణా జిల్లాలోని పెనమలూరులో జన్మించిన వంగవీటి రాధా గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుకున్న తరువాత తమిళనాడులోని సేలం నగరంలోని వినాయక మిషన్స్ మెడికల్ కాలేజీలో మెడిసిన్‌లో చేరినప్పటికీ మధ్యలోనే ఆపేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























