మక్కా ఒప్పందం: భారత్‌తో ఘర్షణ వస్తే పాకిస్తాన్‌కు తుర్కియే, సౌదీ అరేబియా మద్దతు ఇస్తాయా?

ఫొటో సోర్స్, SPA
సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో శుక్రవారం సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్ దేశాలు ఒక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం, ఈ మూడింటిలో ఏ దేశంపైన దాడి జరిగినా.. అది మూడు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఏర్పడిన 'సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్', 'సౌత్ ఈస్ట్ ఆసియా ట్రీటీ ఆర్గనైజేషన్(ఎస్‌ఈఏటీఓ)' అనే మిలిటరీ కూటములలో చేరిన దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత, పాకిస్తాన్ మళ్లీ ఒక కొత్త సైనిక కూటమిలో చేరుతోందని 'ది బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్' థింక్ ట్యాంక్ సీనియర్ ఫెలో తన్వి మదన్ చెప్పారు.
"ఎస్ఈఏటీఓలోని ఆర్టికల్ 4లో పరస్పర రక్షణ నిబంధన ఉండేది. అయితే, అమెరికా ఇందులో కొన్ని షరతులు విధించింది. ఉదాహరణకు, భారత్ - పాకిస్తాన్ మధ్య ఘర్షణ తలెత్తితే అమెరికా తాను స్వయంగా అందులో జోక్యం చేసుకోకుండా తప్పుకునే వెసులుబాటును అమెరికా ఏర్పాటు చేసుకుంది. మరోవైపు, వియత్నాం యుద్ధంలో తమకు సహకరించాలని అమెరికా కోరినప్పుడు పాకిస్తాన్ కూడా ఆ వినతిని తిరస్కరించింది'' అని తన్వీ పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితుల్లో, భారత్‌తో ఘర్షణ వస్తే తుర్కియే, సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇజ్రాయెలీ పోడ్కాస్టర్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుమారుడు యాయిర్ నెతన్యాహు ఈ ఒప్పందంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
"మరోసారి ఇరాన్, హూతీలు లేదా ఇరాక్‌లోని మిలీషియాలు సౌదీ అరేబియాపై దాడి చేస్తే... తుర్కియే, పాకిస్తాన్ దేశాలు ఇరాన్, ఇరాక్, యెమెన్‌లపై దాడులు చేస్తాయా? అలాగే భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే తుర్కియే, సౌదీ అరేబియాలు భారత్‌పై దాడి చేస్తాయా?" అని ఆయన ప్రశ్నించారు.
'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్తాన్‌కు చైనా, తుర్కియేల నుంచి సాయం లభించింది.
పాకిస్తాన్ ఆ యుద్ధాన్ని తన సైనిక బలంతో, ఇతర దేశాల నుంచి వచ్చిన రక్షణ పరికరాలతో పోరాడింది.
ఇలాంటి స్థితిలో సౌదీ అరేబియా, తుర్కియేలతో కుదిరిన ఈ రక్షణ ఒప్పందం పాకిస్తాన్ బలాన్ని ఎంతవరకు పెంచుతుంది, దాని సామర్థ్యంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఫొటో సోర్స్, SPA
సౌదీతో సంబంధాలపై ప్రభావం
భారత్ - పాకిస్తాన్ వివాదంలో సౌదీ అరేబియా పాత్ర చాలా కీలకం. ఎందుకంటే, సౌదీతో భారత్‌కు ఉన్న బలమైన ఆర్థిక సంబంధాలే దీనికి ప్రధాన కారణం.
భారత్, సౌదీ అరేబియాల మధ్య 43 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. భారత్‌లోని ఇంధన, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టే ఉద్దేశాన్ని సౌదీ అరేబియా వ్యక్తం చేసింది.
భారత పశ్చిమ తీరంలో చేపడుతున్న పెద్ద ప్రాజెక్టుల్లో సౌదీకి చెందిన 'అరామ్కో' సంస్థ భాగస్వామిగా ఉంది. మరోవైపు, సౌదీ అరేబియాలో 25 లక్షలకు పైగా భారతీయులు పనిచేస్తూ, కోట్లాది డాలర్ల ఆదాయాన్ని స్వదేశానికి పంపుతున్నారు.
భారతదేశపు ఇంధన దిగుమతులలో సౌదీ అరేబియా ముడిచమురు పాత్ర చాలా కీలకం.
సౌదీతో భారత్‌కు ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో, ఆ సంబంధాల తీవ్రత ఎలాంటిదో చెప్పడానికి చాలా ఏళ్లుగా ఈ లెక్కలనే ఉదాహరణగా చూపుతున్నారు.
మరి పాకిస్తాన్‌తో కుదిరిన రక్షణ ఒప్పందం వల్ల ఈ సంబంధాలపై ప్రభావం పడుతుందా? ఆర్థిక బలం, దౌత్య బలం ఉన్న సౌదీ అరేబియా, 11 నెలల వ్యవధిలోనే రెండుసార్లు ఈ ఒప్పందం ద్వారా తన భద్రతను పాకిస్తాన్ భద్రతతో ముడిపెట్టింది.
"ఈ ఒప్పందం ఉద్దేశం తమపై ఎవరూ దాడి చేయకుండా అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడమే తప్ప యుద్ధ పరిధిని విస్తరించడం కాదు. తుర్కియే, పాకిస్తాన్‌లు ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేయవు. ఈ రెండు దేశాలు తమను తాము ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడే శక్తులుగా చూసుకుంటున్నాయి. దీని కోసం అనుకూల రాజకీయ వాతావరణాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాయి" అని తుర్కియే జర్నలిస్ట్, బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ ఫెలో అస్లీ ఐదిన్ తబ్స్ అభిప్రాయపడ్డారు.
ఈ ఒప్పందంతో తమకేం సంబంధం లేదని ఇజ్రాయెల్, ఇరాన్‌లు భావిస్తే పొరపాటే అవుతుందని ఐదిన్ అంటున్నారు.
అమెరికా ఈ ఒప్పందాన్ని ఎలా చూస్తుంది?
అమెరికాకు తుర్కియే, పాకిస్తాన్, సౌదీ మూడూ ముఖ్యమైన భాగస్వామ్య దేశాలే అని ఐదిన్ అన్నారు.
'తమ మూడు కీలక భాగస్వామ్య దేశాల మధ్య ప్రాంతీయ ఒప్పందం లేదా పరిష్కారం కుదరడంపై అమెరికాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. భద్రతా భారాన్ని పంచుకునే దిశగా పడిన అడుగుగా భావించి అమెరికా దీన్ని స్వాగతిస్తుంది. అయితే, గల్ఫ్ ప్రాంతానికి భద్రత కల్పించే విషయంలో ఉన్న అమెరికా స్థానాన్ని ఈ ఒప్పందం భర్తీ చేయలేదు' అని ఐదిన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SPA
తుర్కియే ఏమంది?
పాకిస్తాన్, సౌదీ అరేబియాలతో కుదిరిన ఈ ఒప్పందం ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకుని చేసింది కాదని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ తెలిపారు.
సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య ఇప్పటికే రక్షణ ఒప్పందం ఉంది. ఇప్పుడు ఈ కూటమిలో తుర్కియే కూడా చేరింది.
సౌదీ అరేబియా వద్ద ఆర్థిక బలం ఉంది. పాకిస్తాన్ వద్ద అణు సామర్థ్యం, బాలిస్టిక్ మిసైళ్లు, మానవ వనరులు ఉన్నాయి. తుర్కియే వద్ద సైనిక అనుభవం ఉంది. అలాగే అది సొంతంగా రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసుకుంది.
ఒప్పందం తర్వాత తుర్కియే అధ్యక్షుడు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' లో రాస్తూ... ఇది ఏ దేశానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి కాదని పేర్కొన్నారు.
"ఈ ఒప్పందం ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51కి లోబడి ఉంది. ఇందులో ఆత్మరక్షణ హక్కు ఒక భాగంగా ఉంటుంది. ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం దీని ఉద్దేశం కాదు. తమ ప్రాంతంలో శాంతి, సమృద్ధి, స్థిరత్వాన్ని కోరుకునే మిత్రదేశాలన్నీ ఇందులో చేరవచ్చు.
దీనివల్ల భద్రతా రంగంలో సహకారం పెరుగుతుంది. రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటాయి. ఉగ్రవాదంపై పోరాడటానికి సహాయపడుతుంది" అని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.
అయితే, భారతదేశానికి ఈ సైనిక కూటమి ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఇందులో ఉన్న రెండు దేశాలతో (పాకిస్తాన్, తుర్కియే) భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలు లేవు.
ఈ ఒప్పందం వల్ల ఉత్పన్నమయ్యే కొన్ని అంశాలు కచ్చితంగా భారత్ ఆందోళనను పెంచుతాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA/Reuters
భారత్‌కు ఆందోళనకరమా?
భవిష్యత్తులో భారత్ - పాకిస్తాన్ ఘర్షణల సమయంలో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకునే వ్యూహం మరింత సంక్లిష్టం కావొచ్చని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ అభిప్రాయపడ్డారు.
"ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే కంటే చైనా నుంచే పాకిస్తాన్‌కు ఎక్కువ సైనిక సాయం లభించింది. అయితే, తుర్కియే నేరుగా పాక్‌కు చేసిన సాయం ద్వారా, భారత్‌తో ఘర్షణ వస్తే పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చాటింది.
భవిష్యత్తులో భారత్ 'ఆపరేషన్ సిందూర్' తరహాలో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై గానీ, సైనిక స్థావరాలపై గానీ ఏదైనా కఠిన చర్యలు చేపడితే... ఇస్లామాబాద్ సిద్ధాంతపరంగా దాన్ని యుద్ధ చర్యగా చిత్రీకరించి, ఒప్పందంలోని ఉమ్మడి రక్షణ నిబంధనలను అమలు చేయాలని కోరే అవకాశం ఉంది" అని ట్వీట్లో బ్రహ్మ చెల్లానీ పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ రాయబారి టి.ఎస్. తిరుమూర్తి కూడా ఈ ఒప్పందం భారత్‌కు అనుకూలమైనది కాదని భావిస్తున్నారు.
"ఫిబ్రవరి చివరిలో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, మార్చి 10న నేను 'ది హిందూ' పత్రికలో... 'తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు దీనివల్ల లబ్ధి పొందుతాయి. ఈ ప్రాంతంలో తమ ఆశయాలను, ప్రభావాన్ని పెంచుకోవడానికి వారికి ఎక్కువ అవకాశం దక్కుతుంది. ఇది భారత్‌కు మంచి వార్త కాదు' అని రాశాను. ఇప్పుడు అదే నిజమవుతున్నట్లు కనిపిస్తోంది" అని పేర్కొన్నారు.
భారతీయ థింక్ ట్యాంక్ 'అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్' మిడిల్ ఈస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కబీర్ తనేజా కూడా ఎక్స్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
"తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య కుదిరిన కొత్త రక్షణ ఒప్పందంలో నేటో ఆర్టికల్ 5 తరహా భాషను ఉపయోగించారు. చాలామంది దీన్ని మిడిల్ ఈస్ట్ కోణంలో చూస్తున్నప్పటికీ, దీని ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా ఉంటుంది. పాకిస్తాన్, భారత్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్త సంబంధాల కోణంలో కూడా దీన్ని చూడాల్సి ఉంటుంది" అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ప్రాధాన్యం పెరుగుతోందా?
పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియేల మధ్య కుదిరిన ఈ ఒప్పందం.. గత కొన్ని నెలలుగా ఈ మూడు దేశాల మధ్య భద్రతా సంబంధాలు ఎంతగా బలపడుతూ వచ్చాయో స్పష్టం చేస్తోందని థింక్ ట్యాంక్ 'అట్లాంటిక్ కౌన్సిల్' సౌత్ ఏసియా వ్యవహారాల సీనియర్ ఫెలో మైకేల్ కుగెల్మన్ అభిప్రాయపడ్డారు.
ఈ ఒప్పందంలో పాకిస్తాన్ పాత్రను ప్రస్తావిస్తూ... "ఈ ఒప్పందం మిడిల్ ఈస్ట్ కొత్త భద్రతా వ్యవస్థలో పాకిస్తాన్ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. ఈమధ్య కాలంలో ఈజిప్ట్, జోర్డాన్ వంటి మిడిల్ ఈస్ట్‌లోని ఇతర ప్రభావవంతమైన దేశాలతో కూడా తన భద్రతా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. దీనివల్ల మిడిల్ ఈస్ట్‌లో పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతోంది" అని ఆయన ట్వీట్ రాశారు.
ఈ ఒప్పందం ఒక బ్యాడ్ ఐడియా (చెడ్డ ఆలోచన) అని ఎక్స్‌లో యుద్ధ విశ్లేషకులు జాన్ స్పెన్సర్ పేర్కొన్నారు.
"ఇది చాలా చెడ్డ ఆలోచన. పాకిస్తాన్ ఇప్పటికీ అంతర్జాతీయంగా నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తోంది. సరిహద్దు దాటి దాడులు చేసే ఉగ్రవాద ముఠాలపై అది ఎలాంటి బాధ్యత తీసుకోదు, చర్యలూ తీసుకోదు.
చైనాపై పాకిస్తాన్ ఆధారపడుతోంది. పాక్ సైన్యం వద్ద ఎక్కువగా చైనా ఆయుధాలే ఉన్నాయి. ఇవే కాకుండా పాక్ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. వారికి పదే పదే ఐఎమ్ఎఫ్ నుంచి ఉపశమన ప్యాకేజీలు అవసరమవుతాయి.
ఏదైనా నేటో సభ్య దేశం ఆర్టికల్ 5 తరహా రక్షణ ఒప్పందం చేసుకోవడానికి చివరి ప్రాధాన్యత ఇవ్వాల్సిన దేశం పాకిస్తాన్.
సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి చేసినప్పుడు, సహాయంగా పాకిస్తాన్ ఏమీ చేయలేదు" అని ఆయన రాశారు.

ఇది పాన్ - ఇస్లామిక్ కూటమా?
కొందరు విశ్లేషకుల దృష్టిలో ఇదొక ఇస్లామిక్ కూటమి.
ఇందులో తుర్కియే పాత్ర గురించి ప్రస్తావిస్తూ భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ ఎక్స్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ఎర్దోవాన్ ఎప్పటిలాగే కపట దౌత్యం చేస్తున్నారని ఆయనకు తెలుసు. ఈ రక్షణ ఒప్పందం ఎవరికీ వ్యతిరేకం కానప్పుడు, అసలు దీని అవసరం ఏమొచ్చింది? ఉనికిలోనే లేని ముప్పును ఎదుర్కోవడానికి దీన్ని ఏర్పాటు చేశారా?" అని ట్వీట్లో ఆయన ప్రశ్నించారు.
ఆయన అభిప్రాయంతో బ్రహ్మ చెల్లానీ కూడా ఏకీభవించారు.
"ఒప్పందంలో 'ఇస్లామిక్ ఐక్యత' అనే స్పష్టమైన ప్రస్తావన ఉండటం, మక్కాలో సంతకాలు చేయడం ఈ కొత్త రక్షణ కూటమికి స్పష్టంగా పాన్ - ఇస్లామిక్ స్వభావాన్ని ఇస్తోంది" అని బ్రహ్మ చెల్లానీ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























