డ్యాన్సింగ్ గర్ల్: మొహెంజోదారోకు చెందిన ఈ మిస్టరీ కళాఖండం పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఎలా వచ్చింది?

డ్యాన్సింగ్ గర్ల్

ఫొటో సోర్స్, NCERT

    • రచయిత, షకీల్ అఖ్తర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇటీవల పతాక శీర్షికల్లో నిలిచిన ‘డాన్సింగ్ గర్ల్’ నగ్న కంచు శిల్పాన్ని సింధు లోయ నాగరికలకు చెందిన అద్భుత కళాఖండాల్లో ఒకటిగా పరిగణిస్తారు.

ఇటీవల, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 'మధురిమ' అనే కళా పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో.. నాలుగున్నర వేల ఏళ్ల నాటి ఈ కాంస్య శిల్పం మొండానికి, నగ్న శరీరం పైభాగానికి డిజిటల్ షేడింగ్, రంగులు వేసి శరీరాకృతి కనపడకుండా చేసింది.

ఆ తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ చెలరేగింది. ఈ ఫోటోలో మార్పులు చేసిన విషయం బయటకు రాగానే ఎన్‌సీఈఆర్‌టీపై చరిత్రకారులు విమర్శలు చేశారు.

పాఠ్యపుస్తకాలలో మొహెంజోదారో 'డ్యాన్సింగ్ గర్ల్' శిల్పం నగ్నభాగాలను కప్పిపుచ్చడంపై చరిత్రకారులు, విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత.. అసలు రూపంలోనే ఈ చిత్రాన్ని ఉంచుతామని ఎన్‌ఈఆర్‌టీ ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆమె నృత్యకారణా? కాదా?

మొహెంజోదారో‌కు చెందిన ఈ 'డ్యాన్సింగ్ గర్ల్‌కు' శిల్పం సుమారు 10 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది.

ఈ కాంస్య శిల్పంలో ఎడమ చేతికి కంకణం ధరించి, కుడి చేతిని నడుముపై ఆనించి ఉన్న ఒక యువతి ఉంది. ఆమె కాళ్లు మోకాళ్ల వద్ద కొద్దిగా వంగి ముందుకు చాచి ఉన్నాయి.

పురావస్తు శాస్త్రవేత్త జాన్ మార్షల్ దీనికి ''డ్యాన్సింగ్ గర్ల్''గా పేరు పెట్టేందుకు బహుశా ఈ శిల్పం శైలే కారణమై ఉండొచ్చు.

నాలుగున్నర వేల ఏళ్లైనా.. ఈ శిల్పానికి చెందిన గుర్తింపు(ఐడెంటిటీ) ఇంకా మిస్టరీగానే ఉంది.

''ఈ యువతి శిల్పాన్ని మీరు చూస్తే కనుక.. ఆమె నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. నాట్యమనేది మతపరమైన కార్యకలాపాల్లో, ముఖ్యంగా హిందూ మతంలో ఒక భాగంగా ఉంది. ఎప్పుడైనా దేవుళ్లను, దేవతలను చూస్తే.. వారు నృత్యం చేస్తున్నట్లు లేదా అదే విధంగా ఉన్నట్లు కనిపిస్తారు. నృత్యం మత విశ్వాసాల్లో భాగంగా ఉంది'' అని లాహోర్ మ్యూజియం క్యూరేటర్ ఎహ్‌తేషామ్ అజీజ్ చెప్పారు.

చరిత్రకారుడు గ్రెగొరీ ఎల్. పోసెల్ తన "ది ఇండస్ సివిలైజేషన్" అనే పుస్తకంలో ఆ శిల్పం ఒక నర్తకిని ప్రతిబింబించడం లేదని రాశారు. పలువురు ఇతర చరిత్రకారులు ఈ వాదనను ఖండించారు.

''ఆమె నిల్చున్న విధానం బట్టి బహుశా ఈ అమ్మాయి శిల్పానికి 'డ్యాన్సింగ్ గర్ల్' అని పేరు పెట్టి ఉండొచ్చు. కానీ, నిజమేంటంటే.. నేటికి కూడా చరిత్రకారులకు అంతు చిక్కని రహస్యం ఆమె అసలు ఐడెంటిటీ'' అని 'ఏ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా' రచయితలు ఆర్ ముఖర్జీ, శోభితా పుంజా, టోబీ సింక్లేర్ చెప్పారు.

'' ఈ డ్యాన్సింగ్ గర్ల్ ఆలయంలో నృత్యకారిణులకు లేదా వేశ్యలకు ప్రతీకని కొందరు చరిత్రకారులు అన్నారు. కానీ, ఇది చారిత్రకంగా రుజువు కాలేదు. అసలు ఈ అమ్మాయి నృత్యకారిణా? కాదా? అన్నది స్పష్టంగా తెలియదు. ఆమె టెంపుల్ డ్యాన్సర్ అన్నది నమ్మశక్యంగా లేదు'' అని ప్రముఖ చరిత్రకారుడు ఏ.ఎల్ బాషం తన పుస్తకం 'ది వండర్ దట్ వాజ్ ఇండియా'లో రాశారు.

మొహెంజోదారో

ఫొటో సోర్స్, DeAgostini/Getty Images

ఈ శిల్పం భారత్‌కు ఎలా చేరింది?

ఈ డ్యాన్సింగ్ గర్ల్ శిల్పం ప్రస్తుతం న్యూదిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంది. 1944 నుంచి 1948 మధ్య భారత పురవాస్తు సర్వేకి హెడ్‌గా మోర్టిమర్ వీలర్ ఉన్నారు.

స్వాతంత్య్రానికి ముందు.. లాహోర్ మ్యూజియం నుంచి మొహెంజోదారో, హరప్పా సంస్కృతికి చెందిన 12 వేల పురావస్తు నమూనాలను, వస్తువులను ఎగ్జిబిషన్ కోసం ఆయన దిల్లీకి తీసుకొచ్చారు.

భారత విభజన తర్వాత.. మొహెంజోదారో, హరప్పా వంటి పురాతన ప్రదేశాలు పాకిస్తాన్‌లోకి వెళ్లగా.. హరప్పా సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గుజరాత్‌లోని లోథల్, రాజస్థాన్‌లోని కాలీబంగన్, ధోలావీరా వంటి కొన్ని ప్రాంతాలు భారత్‌లోకి వచ్చాయి.

''విభజన సమయంలో సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన వస్తువుల్లో చాలా వరకు దిల్లీలోనే ఉంచారు. పాకిస్తాన్ భూభాగంలో వీటిని కనుగొన్నందున వీటిని తిరిగి తమకు ఇవ్వాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. 1950వ దశకంలో, మోర్టిమర్ వీలర్ సహాయంతో.. ఈ పురాతన వస్తువుల్లో సగం పాకిస్తాన్‌కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది'' అని ఒక పరిశోధనా పత్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం చరిత్రకారుడు ఆశిష్ కుమార్ రాశారు.

'ప్రీస్ట్ కింగ్', 'డ్యాన్సింగ్ గర్ల్' శిల్పాలను తిరిగి ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుందని ఆయన రాశారు. కానీ, వాటిల్లో ఏదో ఒకటే పాకిస్తాన్‌కు ఇచ్చేందుకు భారత్ అంగీకరించిందన్నారు.

కొంతమంది చరిత్రకారుల ప్రకారం... 'డ్యాన్సింగ్ గర్ల్' నగ్న శిల్పం తీసుకుంటే వివాదాస్పదమవుతుందేమోనన్న భయంతో 'ప్రీస్ట్ కింగ్'ను తీసుకోవాలని పాకిస్తాన్ అధికారులు నిర్ణయించారని కొంతమంది చరిత్రకారులు చెప్పారు.

కానీ, ఈ విషయం ఇక్కడితో ఆగలేదు.

డ్యాన్సింగ్ గర్ల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని డ్యాన్సింగ్ గర్ల్ చిత్రంపై విమర్శలు

భారత్ నుంచి 'డ్యాన్సింగ్ గర్ల్' శిల్పాన్ని తిరిగి తీసుకొచ్చేలా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2016లో లాహోర్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

1926లో మొహెంజోదారోలో ఈ శిల్పం లభ్యం కావడంతో ఈ ప్రాచీన వారసత్వానికి నిజమైన హక్కుదారు పాకిస్తానే అవుతుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆ సమయంలో, హరప్పా నాగరికతకు చెందిన వారసత్వం పాకిస్తాన్‌కు మాత్రమే చెందదని, అది మొత్తం దక్షిణాసియా ఉమ్మడి వారసత్వమని కొంతమంది భారతీయ చరిత్రకారులు వాదించారు.

''ఈజిప్ట్, మెసొపటోమియా, చైనాలతో పాటు సింధు లోయ నాగరికత ప్రాచీన కాలంలోని నాలుగు ప్రధాన నాగరికతలలో ఒకటి. భౌగోళికంగా ఈజిప్ట్, మెసొపటోమియాను రెండింటినీ కలుపుకున్న దానికంటే అతిపెద్దది సింధు లోయ నాగరికత. దీని జనాభా చాలా ఎక్కువ'' అని 'ఇండియా: ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ' అనే పేరుతో రాసిన పుస్తకంలో ఆండ్రీ ట్రష్కే పేర్కొన్నారు.

సింధు లోయలో తవ్వకాలలో బయటపడిన వేలాది వస్తువులపై గుర్తుతెలియని లిపిలో శాసనాలు ఉన్నాయని ఆమె రాశారు. ఆ కాలం నాటి ముద్రలు ఇప్పటికీ అర్థం కాని విధంగా ఉన్నాయి.

ఈ చర్చల మధ్య సింధు లోయ నాగరికతలాగే, 'డ్యాన్సింగ్ గర్ల్' కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

ఆమె ఎవరు, ఆమెను ఎవరు తయారు చేశారు, ఆమె దేనికి ప్రతీక, ఆమె నిజంగా నృత్యకారిణేనా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇంకా సమాధానాలు లభించాల్సి ఉంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)