అంతరిక్షంలోకి ఆయుధం పంపిన అమెరికా.. స్పేస్ వార్‌పై నిపుణులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాబర్ట్ గ్రీనాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
భూ కక్ష్యలో ఓ అంతరిక్ష ఆయుధాన్ని మోహరించినట్టు అమెరికా ప్రకటించడంతో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రస్తుతం అంతరిక్షంలో ఎలాంటి ఆయుధాలున్నాయి? ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీలో ఆ ఆయుధాలు ఎలాంటి పాత్ర పోషించగలవు? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆయుధానికి సంబంధించిన వివరాలను తన ప్రకటనలో అమెరికా పెద్దగా వెల్లడించలేదు.
''అమెరికాకు వ్యతిరేకంగా శత్రువులు చేస్తున్న చర్యలను అడ్డుకునే రక్షణాత్మక ఆయుధం అవసరం" అని అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మింక్ అన్నారు. అంతేతప్ప కొత్తగా కక్ష్యలో చేర్చిన ఆయుధ శక్తి సామర్థ్యాలేంటి? దీన్ని ఎప్పుడు కక్ష్యలో ఉంచారు? లాంటి వివరాలు చెప్పలేదు.
అమెరికా పంపిన ఈ ఆయుధం ఏమై ఉండొచ్చు? అంతరిక్షంలో సైనిక శక్తిసామర్థ్యాల అభివృద్ధికి సంబంధించి భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఇలాంటి ఆయుధాలు ఇంకా ఎవరెవరి వద్ద ఉన్నాయి?
అంతరిక్ష శకం ప్రారంభమైనప్పటి నుంచే అక్కడ మిలిటరీకి సంబంధించిన కార్యకలాపాలు మొదలయ్యాయి. 1960ల చివర్లోనే సోవియట్ యూనియన్ తన ఆయుధాలను మోహరించింది. ఇస్త్రెబిటెల్ స్పుత్నికోవ్ (ఉపగ్రహ వినాశనకారి) కార్యక్రమంలో భాగంగా కొన్ని ఉపగ్రహాలను రూపొందించారు. ఇవి పేలిపోయి శకలాలను విడుదల చేస్తాయి. అవి ఇతర ఉపగ్రహాల (సాధారణంగా అమెరికా) మార్గాల్లోకి దూసుకెళ్లి వాటిని ఇబ్బంది పెడతాయి.

ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల సైన్యాలు అనేక అవసరాల కోసం అంతరిక్షంలో ఉపగ్రహాలను మోహరిస్తున్నాయి. సైనిక గూఢచర్యం, సమాచార మార్పిడి, ప్రత్యర్థుల క్షిపణి ప్రయోగాలను గుర్తించడం, నేరుగా లక్ష్యాన్ని తాకేలా కచ్చితమైన ప్రదేశాల సమాచారం కోసం ఆధునిక ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాయి.
యుద్ధరంగంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, అంతరిక్షంలో ఆయుధాలు, పరికరాల వాడకం మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా పంపించిన ఆయుధం ఏమైఉండొచ్చనేదానిపై రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌లో మిలటరీ సైన్సెస్ అసోసియేట్ ఫెలో, డర్హామ్ విశ్వవిద్యాలయంలో ఆస్ట్రోపాలిటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ బ్లెడిన్ బోవెన్ ఓ అంచనా మాత్రమే చెప్పగలనన్నారు.
రష్యా, చైనా కూడా ఇలాంటి ఆయుధాలు పంపించాయా..?
"అది ఒక రకమైన ఎలక్ట్రిక్ వార్‌ఫేర్ లేదా రేడియో సిగ్నళ్లను అడ్డుకునే పరికరం అయి ఉంటుందని నేను భావిస్తున్నా. బహుశా ఇది విధ్వంసరహిత యాంటీ శాటిలైట్ ఆయుధం కావచ్చు" అని బీబీసీ రేడియో 4 టుడే కార్యక్రమంలో బ్లెడిన్ బోవెన్ చెప్పారు.
ఇప్పటికే ఇలాంటి ఆయుధాలు భూమిపై ఉన్నాయని, ఇవి శాటిలైట్ సమాచార వ్యవస్థను దెబ్బతీస్తాయని చెప్పారు. " రేడియో లింక్స్‌ను దెబ్బ తీస్తే శాటిలైట్ ఎందుకూ పనికిరాకుండా పోతుంది" అని అన్నారు.
అంతరిక్షంలో శిథిలాలను సృష్టించి, విధ్వంసానికి కారణమయ్యే మరింత ప్రమాదకరమైన ఆయుధం కూడా అయిఉండొచ్చనే అవకాశాన్ని బోవెన్ తోసిపుచ్చలేదు.
"ఇది కైనటిక్ కిల్ వెహికల్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అంటే అది శకలాలను విడుదల చేసి, ప్రత్యర్థి ఉపగ్రహాన్ని ఢీ కొట్టి నాశనం చేయగలదు" అని ఆయన అన్నారు.
"ఉపగ్రహాలను చాలా దగ్గరగా గమనిస్తూ, వాటిని పట్టుకోగల ఆయుధం అయ్యే అవకాశం కూడా ఉంది" అని తెలిపారు.
రష్యా, చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు చెందిన ఇలాంటి ఆయుధాలు అంతరిక్షంలో ఉన్నాయో లేదో చెప్పడం కష్టం.
"చైనా, రష్యా కూడా ఇలాంటివి చేసినట్టు కనిపించింది" అని ఆర్‌యూఎస్ఐ మాజీ రీసెర్చ్ ఫెలో, 'స్టిఫ్టుంగ్ విసెన్‌షాఫ్ట్ ఉండ్ పొలిటిక్' (జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్) పరిశోధకురాలు జూలియానా సూస్ బీబీసీతో చెప్పారు.
"ఉదాహరణకు రష్యా అంతరిక్ష కక్ష్యలో మరో వస్తువును లక్ష్యంగా చేసుకునే కో-ఆర్బిటల్ ఆయుధాన్ని పరీక్షించినట్టు తెలియజేసే కొన్ని కార్యకలాపాలను చూశాం.
అంటే వాళ్లు కక్ష్యలోకి ఒక క్షిపణిని ప్రయోగించి పరీక్షించినట్టు కొన్ని సూచనలు కనిపించాయి. "
"ఇలాంటి ఇతర ఆయుధాలు కూడా ఉండొచ్చు. కానీ అమెరికా దగ్గరున్న ఆయుధం వివరాలు తెలియకుండా వాటితో పోల్చడం కష్టం" అని తెలిపారు.
అయితే అంతరిక్ష కక్ష్యలో ఆయుధాన్ని ఉంచడం అసాధారణంగా అనిపించొచ్చు. కానీ అమెరికా, అలాగే దాని ప్రత్యర్థులైన చైనా, రష్యా దగ్గర కూడా అంతరిక్షంలో లక్ష్యంగా చేసుకుని ప్రయోగించగల ఆయుధాలను కొంతకాలంగా పంపిస్తున్నాయి.

‘‘హంటర్ కిల్లర్ శాటిలైట్‌లు’’
అమెరికా ప్రకటనపై స్పందించిన చైనా అంతరిక్షంలో ఆయుధ పోటీ పెరుగుతుందని హెచ్చరించడాన్ని బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో బోవెన్ కొట్టిపారేశారు. చైనా స్పందనను గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉందని ఆయన అభివర్ణించారు.
"ఇప్పటికే ఇందులో వాళ్లు(చైనా, రష్యా) నిపుణులు... అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయంటే ఆ మాటల్లోని డొల్లతనం అర్థం చేసుకోవచ్చు" అని అన్నారు.
"అమెరికా, రష్యా, చైనా, భారత్ కూడా వివిధ శాటిలైట్ విధ్వంసక లేదా కౌంటర్ స్పేస్ ఆయుధాలు అభివృద్ధి చేశాయి. ఆయుధాలుగా ఉపయోగపడే ఆధునికమైన సాంకేతికతను రష్యా, చైనా అంతరిక్షంలోకి పంపించాయి" అని ఆయన వెల్లడించారు.
వాస్తవంగా పదేళ్ల నుంచి అంతరిక్షంలో చైనా, రష్యా చాలా విన్యాసాలు చేస్తున్నాయి. వీటిని రెండెజౌస్ అండ్ ప్రాక్సిమిటీ ఆపరేషన్స్ (ఆర్‌పీవోలు)అని పిలుస్తారు. అంటే పాశ్చాత్య దేశాల ఉపగ్రహాలకు చాలా దగ్గరగా తమ ఉపగ్రహాలను తీసుకెళ్లడం.
"ఈ ఆర్పీవోలు హంటర్ కిల్లర్ ఉపగ్రహాలుగా మారగలవు. అంటే శాటిలైట్‌ను ఢీ కొట్టి లేదా కక్ష్య నుంచి బయటకు నెట్టివేసి నాశనం చేయగలవు" అని లండన్‌లోని కింగ్స్ కాలేజీలో రష్యన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ రీడర్ అయిన డాక్టర్ రాడ్ థోర్న్‌టన్ బీబీసీకి తెలిపారు.

‘అంతరిక్షంలో భారీ వ్యర్థాలు పేరుకుపోయే ప్రమాదం’
స్పేస్ టగ్ సామర్థ్యం ఉన్న ఉపగ్రహాన్ని చైనా ప్రదర్శించిందని బోవెన్ తెలిపారు. "అంటే చైనా ప్రయోగించిన ఈ అంతరిక్ష వాహనం ప్రత్యర్థుల ఉపగ్రహాన్ని పట్టుకొని వేరే కక్షలో పెట్టేయగలదు" అని వివరించారు.
దీన్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. పని చేస్తున్న ఉపగ్రహాలను కక్ష్య నుంచి తప్పించడం ఒకటి. సానుకూలంగా ఆలోచిస్తే అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగించే అవకాశం ఉందని చెప్పారు.
కొన్నిరకాల అంతరిక్ష ఆయుధాలు భారీ మొత్తంలో అంతరిక్ష వ్యర్థాలను సృష్టించే ప్రమాదముంది.
"2007లో చైనా నిర్వహించిన ప్రత్యక్ష ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరీక్షల వంటివల్ల చాలా కాలంపాటు కక్ష్యలో భారీ సంఖ్యలో శిథిలాలు పేరుకుపోతాయి" అని కింగ్స్ కాలేజీలో అంతరిక్ష భద్రత, ఆయుధీకరణ నిపుణుడైన డాక్టర్ మార్క్ హిల్బోర్న్ చెప్పారు.
దానికి సంబంధించిన శిథిలాలు ఇంకా కక్ష్యలో ఉన్నాయని, ఇవి ఇప్పటికీ ప్రమాదకరమేనని సూస్ అభిప్రాయపడ్డారు.
‘‘నష్టం కలిగించడానికి పెద్ద పెద్ద లోహపు ముక్కలు కావాల్సిన పని లేదని, కక్ష్యలో వస్తువులు ప్రయాణించే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న ప్లాస్టిక్ ముక్క కూడా ప్రమాదకరంగా మారుతుంది’’ అని ఆమె అన్నారు.

అణు ముప్పు
అంతరిక్ష ఆయుధాలు, ఉపగ్రహాల విషయంలో రష్యాకు ఉన్న లోటును రష్యా క్షిపణి సామర్థ్యం భర్తీ చేస్తుందని థోర్న్‌టన్ అన్నారు.
"రష్యా దగ్గర భూఆధారిత క్షిపణులు ఉన్నాయి. వాటిని భూమి నుంచి ప్రయోగించి తక్కువ భూ కక్ష్యలోని ఉపగ్రహాలను ఢీకొట్టవచ్చు. అలాగే వారి దగ్గర విమానాల ద్వారా చాలా ఎత్తు నుంచి ప్రయోగించగల ఏఎస్ఏటీ (ఎయిర్ లాంచ్డ్ యాంటీ శాటిలైట్) క్షిపణులు కూడా ఉన్నాయి " అని ఆయన చెప్పారు.
" నాటో దగ్గర తమకంటే మెరుగైన, ఎక్కువ సామర్థ్యంగల ఉపగ్రహాలు చాలా ఉన్నాయన్నది రష్యా ఆలోచన. అందుకే యుద్ధ రంగంలో వాటితో సమానంగా పోటీ పడాలన్న ఉద్దేశంతో ఏఎస్ఏటీ ఆయుధాలపై రష్యా భారీగా ఖర్చు చేస్తోంది’’ అని థోర్న్‌టోన్ చెప్పారు.
థోర్న్‌టన్ మరో ఆందోళనకరమైన విషయాన్ని కూడా చెప్పారు. ‘‘చివరి ప్రయత్నంగా రష్యా అణ్వాయుధాలను కూడా అంతరిక్షంలో ప్రయోగించగలదు. అప్పుడు ఏర్పడే ఈఎంపీ ( అణు విద్యుదయస్కాంత పల్స్) పేలుడు ప్రభావం విస్తృత ప్రాంతంలో రక్షణ వ్యవస్థలు లేని ఏ ఉపగ్రహాన్నయినా నాశనం చేస్తుంది" అని చెప్పారు.

‘యుద్ధం జరిగేది అంతరిక్షంలో మాత్రమే కాదు’
అయితే అంతరిక్షంలో అణు సంఘర్షణ జరిగే అవకాశం ఎంత ఉంటుందంటే భూమిపై కూడా అణు ఘర్షణ జరుగుతున్న పరిస్థితుల్లోనే అది జరిగే అవకాశముంటుంది.
" అక్కడ ఏం జరగకపోవచ్చు, ఏమైనా జరగొచ్చు. అంతరిక్షంలో జరిగే పరిణామాలు భూమిపై జరిగే పరిణామాలకు భిన్నంగా ఉండవు'' అని బోవెన్ అన్నారు.
అంతరిక్షంలో ఉపయోగించే ఆయుధాలు చాలాకాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు అమెరికా ఎందుకు ఇలాంటి ప్రకటన చేసింది? ఇది సాంకేతికంగా అంత పెద్ద పరిణామంకాదని, కేవలం రాజకీయ, వ్యూహాత్మక సంకేతం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
ఇది చైనాలో జరుగుతున్న పరిణామాలకు అమెరికా ప్రతి స్పందన కావచ్చని బోవెన్ అభిప్రాయపడుతున్నారు.
"30 ఏళ్లుగా చైనా తన సైనిక సామర్థ్యాన్ని ఆధునీకరిస్తోంది. అంతరిక్షంలోకి భారీగా మిలటరీ శాటిలైట్స్‌ను పంపింది. అమెరికా సైన్యాన్ని వెంబడించి, దెబ్బ తీయడానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకుంది" అని ఆయన తెలిపారు.
''అంతరిక్ష ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అమెరికాకు ఇప్పుడు మరిన్ని కారణాలున్నాయి. అమెరికా మాదిరిగానే చైనా కూడా అంతరిక్షంపై తీవ్రంగా ఆధారపడటం వల్ల కొన్ని బలహీనతలు ఉన్నాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితి ఒక విచిత్రమైన అసమతుల్యతను సృష్టించినట్టు కనిపిస్తోంది.
చైనా, అమెరికాతో పోలిస్తే రష్యా దగ్గర చాలా తక్కువ ఉపగ్రహాలు ఉన్నందున ఏ అంతరిక్ష యుద్ధంలోనైనా రష్యాయే విజేత అవుతుందని థోర్న్‌టన్ అభిప్రాయపడ్డారు. అలాంటి యుద్ధంలో అంతరిక్షంలోకి ప్రయోగించే క్షిపణులు, ఉపగ్రహాలను వాటి కక్ష్య నుంచి తప్పించేందుకు లేదా వాటిని నాశనం చేసేందుకు రూపొందించిన ఉపగ్రహాలు, భూమి నుంచి ప్రయోగించే లేజర్లు ఉంటాయని ఆయన చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























